• facebook
  • whatsapp
  • telegram

NITW: నిట్‌ వరంగల్‌లో నాలుగు కొత్త కోర్సులు  

* 100 ఎకరాల స్థలం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి వినతి

ఈనాడు, వరంగల్‌: వరంగల్‌ ‘జాతీయ సాంకేతిక విద్యాసంస్థ’ (నిట్) పెరుగుతున్న ఉద్యోగ వనరులను దృష్టిలో పెట్టుకొని మరో నాలుగు కొత్త బీటెక్‌ కోర్సులకు రూపకల్పన చేస్తోంది. బీటెక్‌లో గతేడాది వరకు ఎనిమిది కోర్సులు ఉండేవి. ఈసారి కొత్తగా ‘మ్యాథమెటిక్స్‌ అండ్‌ కంప్యూటింగ్‌ ఇంజినీరింగ్‌’ కోర్సులో విద్యార్థులకు ప్రవేశాలు కల్పించింది. దీనికి తోడు వచ్చే విద్యా సంవత్సరం నుంచి టెక్స్‌టైల్‌ ఇంజినీరింగ్‌, రైల్వే, అగ్రి ఇంజినీరింగ్‌, బీఆర్క్‌ కోర్సులను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం నిట్ క్యాంపస్‌ 247 ఎకరాల్లో విస్తరించి ఉంది. పెరుగుతున్న పరిశోధనల స్థాయి, కొత్త కోర్సుల భవనాల నిర్మాణం కోసం నిట్‌ క్యాంపస్‌లో స్థలం కొరత సమస్య అధికంగా ఉంది. క్యాంపస్‌ విస్తరణకు మరో వంద ఎకరాల భూమి కావాలని, వరంగల్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారి 163 పక్కన తమకు స్థలం కేటాయించాలని కోరుతూ నిట్ ఆచార్యుల బృందం ఇటీవల హనుమకొండ కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌కు లేఖ అందజేసింది.
 

ఈ కోర్సులే ఎందుకంటే?


నిట్ వరంగల్‌ కొన్నేళ్లుగా పరిశోధన, ప్రాంగణ నియామకాలపై దృష్టి సారించింది. ఇప్పటికి వందకు పైగా పేటెంట్లు నిట్కు దక్కాయి. ఏటా కనీసం అయిదు నుంచి పది ఆవిష్కరణలకు మేధోహక్కులు వచ్చేలా పరిశోధన స్థాయిని పెంచారు. వరంగల్‌లో దేశంలోనే పెద్దదైన కాకతీయ మెగా జౌళి పార్కు నిర్మాణంలో ఉంది. దీనికి కేంద్ర ప్రభుత్వం ‘పీఎంమిత్ర’ పథకాన్ని మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో నిట్లో టెక్స్‌టైల్‌ ఇంజినీరింగ్‌ కోర్సు వస్తే విద్యార్థులకు మెరుగైన ఉద్యోగావకాశాలు ఉంటాయని ఆచార్యులు భావిస్తున్నారు. కాజీపేటలో రూ.500 కోట్లతో రైల్వే శాఖ నెలకొల్పుతున్న పీవోహెచ్‌ పరిశ్రమకు గతేడాది ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. దీనికి అనుసంధానంగా ఉండేలా రైల్వే ఇంజినీరింగ్‌ కోర్సు, వరి, పత్తి, మొక్కజొన్న పంటల్ని ఉమ్మడి వరంగల్‌లో గణనీయంగా సాగు చేస్తున్న క్రమంలో అగ్రి ఇంజినీరింగ్‌ కోర్సులతో పాటు, బీటెక్‌ ఆర్కిటెక్చర్‌ను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. నిట్ రూర్కెలా క్యాంపస్‌ 640, నిట్ ట్రిచి 800 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. వాటికన్నా ముందు ప్రారంభమైన వరంగల్‌ నిట్కు మాత్రం ప్రస్తుతం ఉన్న స్థలం సరిపోవడం లేదని డైరెక్టర్‌ ఆచార్య బిద్యాధర్‌ సుబుద్ధి తెలిపారు.
 




మరింత సమాచారం... మీ కోసం!

‣ త్రివిధ దళాల్లో ఉన్నత ఉద్యోగాలు

‣ ప్రాథమ్యాల ఎంపికతో ప్రయోజనం!

‣ బీమా సంస్థలో కొలువులు

‣ డిగ్రీతో 444 కేంద్ర కొలువుల భర్తీ

‣ పరీక్షల్లో మార్కులు సాధించాలంటే?

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 03-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.