• facebook
  • whatsapp
  • telegram

TSPSC: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ రాజీనామా ఆమోదం

* త్వరలో కొత్త బోర్డు
* నిష్పక్షపాత దర్యాప్తు చేసి.. బాధ్యుల్ని కఠినంగా శిక్షించండి
* ప్రభుత్వానికి గవర్నర్‌ సూచన

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) ఛైర్మన్‌ బి.జనార్దన్‌రెడ్డి, సభ్యులు ఆర్‌.సత్యనారాయణ, కారం రవీందర్‌రెడ్డి, బండి లింగారెడ్డిల రాజీనామాలను గవర్నర్‌ తమిళిసై ఆమోదించారు. ప్రశ్నపత్రాల లీకేజీలో సిట్‌ దర్యాప్తును నిష్పక్షపాతంగా కొనసాగించాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ఛైర్మన్‌, ముగ్గురు సభ్యుల రాజీనామాలను ఆమోదించడంలో గవర్నర్‌ కార్యాలయం ఆలస్యం చేస్తోందన్నది తప్పుడు సమాచారమేనని స్పష్టం చేశారు. సీఎం కార్యాలయం నుంచి దస్త్రం అందిన ఒక్కరోజులో రాజీనామాలను ఆమోదించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు గవర్నర్‌ కార్యాలయం జనవరి 10న ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల రాజీనామాలు అందిన తరువాత పరిపాలనాపరమైన నిబంధనల మేరకు వాటి ఆమోదానికి దస్త్రం సిద్ధం చేయాలంటూ ప్రభుత్వానికి సమాచారం పంపించాం. న్యాయసలహా తీసుకోవడంతో పాటు ఈ అంశాన్ని సీఎం సమగ్రంగా పరిశీలించి దస్త్రాన్ని పంపించాలని సూచించాం. రాజీనామాలపై నిర్ణయం తీసుకోవడంలో ప్రస్తుతం కొనసాగుతున్న సిట్‌ దర్యాప్తు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాజీనామాలను పరిశీలించి, అడ్వొకేట్‌ జనరల్‌ సలహా తీసుకుంది. రాజీనామాల ఆమోదానికి సంబంధించిన దస్త్రాన్ని సీఎం ద్వారా గవర్నర్‌ కార్యాలయానికి జనవరి 9న పంపింది. రాజీనామాలను బుధవారం (జనవరి 10న) ఆమోదించాం. నిరుద్యోగ యువత ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని అన్ని రక్షణలు తీసుకుని రాజీనామాలు ఆమోదించామని రాష్ట్ర ప్రజలకు, నిరుద్యోగులకు రాజ్‌భవన్‌ హామీ ఇస్తోంది’’ అని గవర్నర్‌ కార్యాలయం పేర్కొంది.

ప్రశ్నపత్రాల లీకేజీలు.. నిర్వహణలో నిర్లక్ష్యం

టీఎస్‌పీఎస్సీ గతంలో జారీ చేసిన గ్రూప్‌-1, అసిస్టెంట్‌ ఇంజినీర్‌(ఏఈ), అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌(ఏఈఈ) పరీక్షల ప్రశ్నపత్రాలు లీకయ్యాయి. టీఎస్‌పీఎస్సీలో పనిచేసిన అసిస్టెంట్‌ సెక్షన్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌, నెట్‌వర్క్‌ ఎక్స్‌పర్ట్‌ రాజశేఖర్‌రెడ్డి కలిసి పెన్‌డ్రైవ్‌ ద్వారా ప్రశ్నపత్రాలను తస్కరించి.. బయటి వ్యక్తులకు విక్రయించారు. ప్రశ్నపత్రాలు లీకయినట్లు గుర్తించిన కమిషన్‌.. గ్రూప్‌-1 ప్రిలిమినరీ, ఏఈఈ, ఏఈ, డివిజనల్‌ అకౌంట్స్‌ అధికారుల(డీఏవో) పరీక్షలను రద్దు చేసింది. టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీయర్‌(టీపీబీవో), వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పరీక్షలను రీషెడ్యూలు చేసింది. మరోవైపు, ప్రశ్నపత్రాల లీకేజీపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్‌)ను ఏర్పాటు చేసింది. ప్రశ్నపత్రాలను నిందితులు పెన్‌డ్రైవ్‌ ద్వారా తస్కరించి విక్రయించారని సిట్‌ గుర్తించింది. వాటిని కొనుగోలు చేసిన 108 మందిని అరెస్టు చేసింది. ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసినవారిని పరీక్షలు రాయకుండా కమిషన్‌ డీబార్‌ చేసింది. మరోవైపు, ఈ ఏడాది జూన్‌లో గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను కమిషన్‌ నిర్వహించింది. దీనికి దాదాపు 2.33 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే ఈ పరీక్ష నిర్వహణలో లోపాలు జరిగాయని, బయోమెట్రిక్‌ హాజరు తీసుకోలేదంటూ హైకోర్టును కొందరు అభ్యర్థులు ఆశ్రయించారు. దీంతో ఆ పరీక్షను హైకోర్టు రద్దు చేసింది.

రాజీనామా చేసిన నెలరోజులకు ఆమోదం..

ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో కమిషన్‌ తీరుపై అభ్యర్థుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. టీఎస్‌పీఎస్సీ కార్యాలయం నుంచే ప్రశ్నపత్రాలను పెన్‌డ్రైవ్‌ ద్వారా తస్కరించినా గుర్తించడంలో విఫలమైందని, పటిష్ఠమైన కంప్యూటర్‌ వ్యవస్థ లేదన్న ఆరోపణలు వచ్చాయి. కమిషన్‌ ఛైర్మన్‌ను తొలగించి, బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేయాలని రాజకీయ పార్టీలు, నిరుద్యోగులు డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేయాలని జనార్దన్‌రెడ్డి నిర్ణయించుకున్నారు. డిసెంబరు 11న సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి తన నిర్ణయం తెలిపారు. అనంతరం తన రాజీనామా పత్రాన్ని రాజ్భవన్‌కు పంపించారు. ఆ తర్వాత మరో ముగ్గురు సభ్యులు ఆర్‌.సత్యనారాయణ, కారం రవీందర్‌రెడ్డి, బండి లింగారెడ్డి రాజీనామా చేశారు. దాదాపు నెల రోజులుగా ఈ రాజీనామాలపై ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. జనార్దన్‌రెడ్డి రాజీనామా ఆమోదం పొందకపోవడంతో కొత్త ఛైర్మన్‌ నియామకంపై సందిగ్ధత నెలకొనగా.. తాజాగా దానికి తెరపడింది. టీఎస్‌పీఎస్సీ పదవులకు తాము చేసిన రాజీనామాలను ఆమోదించిన గవర్నర్‌కు ఆర్‌.సత్యనారాయణ, కారం రవీందర్‌రెడ్డి, బండి లింగారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. గత రెండున్నరేళ్లుగా నిబంధనలకు లోబడి నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విధులు నిర్వహించామని వారు పేర్కొన్నారు.

త్వరలో కొత్త బోర్డు

ఈనాడు, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన దిశగా అడుగులు పడనున్నాయి. ఛైర్మన్‌తో పాటు ముగ్గురు సభ్యుల రాజీనామాల్ని గవర్నర్‌ ఆమోదించడంతో కొత్త బోర్డు ఏర్పాటు కానుంది. ఛైర్మన్‌తో పాటు పూర్తిస్థాయిలో సభ్యులను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. కొందరు ఐపీఎస్‌, ఐఏఎస్‌ అధికారులు, ప్రొఫెసర్ల పేర్లను పరిశీలిస్తోంది. వీలైనంత త్వరగా ఛైర్మన్‌తో పాటు సభ్యుల్ని నియమించే అవకాశాలున్నట్లు సమాచారం. ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యంతో టీఎస్‌పీఎస్సీ తీవ్ర విమర్శల పాలైంది. కొత్త బోర్డు ఏర్పాటు చేసిన తరువాతే పరీక్షలు నిర్వహించాలని అప్పట్లో నిరుద్యోగులు డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కొత్త సర్కారు కొలువుదీరడంతో కమిషన్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. విమర్శలకు తావు లేకుండా నిబంధనల మేరకు ఛైర్మన్‌, సభ్యులను నియమించనున్నట్లు తెలిసింది. టీఎస్‌పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు ఇతర రాష్ట్రాల పీఎస్సీల్లో అమలు చేస్తున్న మెరుగైన విధానాల్ని అధ్యయనం చేసేందుకు ఉన్నతాధికారుల బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.. ఇప్పటికే కేరళ పీఎస్సీని ఈ బృందం అధ్యయనం చేసింది. ముఖ్యమంత్రి స్వయంగా రాష్ట్ర అధికారులతో కలిసి యూపీఎస్సీ ఛైర్మన్‌ను కలిసి పోటీ పరీక్షల నిర్వహణ పారదర్శకంగా చేపట్టేందుకు సూచనలు కోరారు. అధ్యయన నివేదిక వచ్చిన అనంతరం కమిషన్‌లో పలు మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి.

షెడ్యూలు ప్రకటనకు, ఫలితాల వెల్లడికి బోర్డే కీలకం

టీఎస్‌పీఎస్సీకి నూతన బోర్డు ఏర్పాటైన తరువాత ఉద్యోగాల నియామక ప్రక్రియలో కదలిక రానుంది. గ్రూప్‌-2 పరీక్షలకు కొత్త తేదీల ఖరారుతో పాటు ఇప్పటివరకు పరీక్షల తేదీలు ప్రకటించని నోటిఫికేషన్లకు షెడ్యూలు ప్రకటించాలన్నా, పూర్తయిన పరీక్షల ఫలితాలు వెల్లడించాలంటే బోర్డు ఉండాలి. కమిషన్‌ నిబంధనల ప్రకారం ఏదైనా పరీక్ష నిర్వహణ తేదీ ఖరారు చేయాలన్నా.. ఉద్యోగ నోటిఫికేషన్‌ ఇవ్వాలన్నా.. పరీక్ష వాయిదా వేయాలన్నా.. ఫలితాలు వెల్లడించాలన్నా.. బోర్డుదే నిర్ణయాత్మక అధికారం. ప్రభుత్వ విభాగాల నుంచి వచ్చిన ఖాళీల భర్తీ ప్రతిపాదనలు, సర్వీసు నిబంధనలు, పొరపాట్లు.. ఇలాంటివన్నీ పరిశీలిస్తుంది. బోర్డు తీసుకున్న నిర్ణయాలను కార్యదర్శి అమలు చేస్తారు. కార్యదర్శి ఆదేశాల మేరకు కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తారు. టీఎస్‌పీఎస్సీ నిబంధనల ప్రకారం బోర్డులో ఛైర్మన్‌తో పాటు 11 మంది సభ్యులు ఉండాలి. ప్రస్తుతం ఇద్దరు సభ్యులు మాత్రమే ఉన్నారు. ఛైర్మన్‌ పదవి ఖాళీ అయింది. ఇద్దరు సభ్యులను పరిగణనలోకి తీసుకుంటే ఛైర్మన్‌తో పాటు తొమ్మిది మంది సభ్యుల్ని ప్రభుత్వం నియమించాల్సి ఉంది. మరోవైపు, కీలకమైన కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ పోస్టు ఖాళీగా ఉంది. యూపీఎస్సీ, ఇతర రాష్ట్రాల పీఎస్సీల్లో అమలు చేస్తున్న నియమావళి ప్రకారం కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ హోదాలో నియమితులయ్యే ఐఏఎస్‌ అధికారి స్థానిక రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయి ఉండకూడదు. అంటే తెలంగాణ వాస్తవ్యులు కాకూడదు. ఇతర రాష్ట్రాలకు చెందిన తెలంగాణ క్యాడర్‌ అధికారులు అయి ఉండాలి. గతంలో ఈ పోస్టులో నియమితులైన ఐఏఎస్‌ అధికారి సంతోష్‌ ఇటీవలే బదిలీపై జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా వెళ్లారు. అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది.


మరింత సమాచారం... మీ కోసం!

‣ భవిష్యత్తు.. ఈ 12 టెక్నాలజీలదే!

‣ రైల్వే కోర్సులు.. అపార అవకాశాలు

‣ విజయానికి నైపుణ్యాలే సోపానాలు!

‣ వండర్‌ కెరియర్‌.. విజువల్‌ అనలిటిక్స్‌

‣ ఇవి పాటిస్తే.. సర్కారు నౌకరీ!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 11-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.