• facebook
  • whatsapp
  • telegram

భవిష్యత్తు.. ఈ 12 టెక్నాలజీలదే!

అద్భుత కెరియర్‌కు సూచనలుఅత్యాధునిక సాంకేతిక ప్రపంచం ఆవిష్కరణలూ, పురోగతితో సందడి చేస్తోంది. ఈ కొత్త సంవత్సరంలో ప్రధానంగా 12 టెక్నాలజీలు భవిష్యత్తును మార్చగల సత్తా ఉన్నవని అంచనాలు వెలువడుతున్నాయి. వ్యక్తిగత అభిరుచి, ఆసక్తులను బట్టి ఈ అంశాలను నేర్చుకోవడానికి సంసిద్ధమై ఆచరణలో పెడితే కెరియర్‌ను అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చు! 


ఏఐ, జెన్‌ ఏఐ

కృత్రిమ మేధ (ఏఐ) ప్రయోజనం కేవలం ఆటోమేషన్‌కే పరిమితమైనది కాదు. అంతకంటే మించినది. ఆటోమేషన్‌ భాగంగా ఉన్న మేధనే కృత్రిమ మేధ అంటున్నాం. 2024లో మాత్రమే కాదు, 2030 వరకూ.. ఇంకా అంతకంటే ఎక్కువ కాలమే మనతో ఉంటుంది. ఆధునిక కాలంలో సంస్థలు ఏఐని స్వీకరించి, అనుసరించడం తప్పనిసరి అయిపోయింది. ఇది పనులను వేగవంతం చేయడమే కాకుండా మన జీవితాన్ని సులభతరం కూడా చేస్తూ వస్తోంది. ఇప్పుడు జెన్‌ ఏఐ కూడా తోడవడం వల్ల పనుల్లో వేగం, సౌలభ్యం మరింత పెరిగే అవకాశం ఏర్పడింది. అయితే- జీవితంలో ప్రతిదీ కృత్రిమ మేధ, దాని ప్రత్యామ్నాయాలు కానవసరం లేదని గుర్తుంచుకోవాలి.  

ఏఐలో నైపుణ్యం పెంచుకోవాలనుకునే విద్యార్థులు, నిపుణుల కోసం చాలా వనరులు లభిస్తున్నాయి. 

ఉదా: https://cloud.google.com/blog/, https://www.deeplearning.ai/courses/


జీనోమిక్స్‌  

2030 నాటికి- అంతకుముందు కూడా చాలామంది వ్యక్తిగత వైద్యుల సేవలకు మొగ్గు చూపుతారని అంచనా. వ్యక్తిగతంగా పెరుగుతున్న అవసరాలు, వ్యక్తిగతీకరించిన సూచనలు భవిష్యత్తును నడిపిస్తాయి. జీనోమిక్‌ సీక్వెన్సింగ్‌ అనేది వ్యక్తిగతీకరించిన వైద్య సేవలకు మార్గం సుగమం చేస్తూ అందుబాటులోకి వస్తోంది.


క్వాంటమ్‌ కంప్యూటింగ్‌

గొప్ప భవిష్యత్తును అనుభవించాలనుకుంటే, క్వాంటమ్‌ గురించి ఆలోచించాల్సిందే. ఇదో విప్లవాత్మకమైన సాంకేతికత. ప్రస్తుతం అత్యంత శక్తిమంతమైన క్లాసికల్‌ కంప్యూటర్‌లకు కూడా అందుబాటులో లేని సంక్లిష్ట సమస్యల పరిష్కారం క్వాంటమ్‌ మెకానిక్స్‌ శక్తి మూలంగా సుసాధ్యమవుతుంది. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌... ఔషధాల ఆవిష్కరణ నుంచి మెటీరియల్‌ సైన్స్‌ వరకూ వివిధ రంగాల్లో అభివృద్ధిని తీసుకువచ్చి శాస్త్రీయ పురోగతిని వేగవంతం చేస్తుంది.


డిజిటల్‌ కవలలు

డిజిటల్‌ ట్విన్స్‌ (డీటీ) కొత్తగా కనిపించవచ్చు కానీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇది వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌) కంటే మించి పనిచేసే పద్ధతుల్లో ఒకటి. డిజిటల్‌ కవలలను ప్రిడిక్టివ్‌ మెయింటెనెన్స్‌కూ, ఆప్టిమైజ్‌ ఆపరేషన్లకూ, సిబ్బందికి సురక్షితమైన అనుకరణ (సిమ్యులేటెడ్‌) వాతావరణంలో శిక్షణ ఇవ్వడానికీ కూడా ఉపయోగించవచ్చు.


6 జీ నెట్‌వర్క్స్‌

ఇప్పటికే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో మెరుగైన అంతర్జాల (ఇంటర్నెట్‌) సదుపాయం అందుబాటులోకి వచ్చింది. మరోపక్క జీ టెక్నాజీ సిరీస్‌ కొనసాగుతోంది. గ్రామాలు, మారుమూల ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్‌ నాణ్యత విస్తరిస్తోంది. 6 జీ రాకతో అనూహ్యమైన వేగం, తక్షణ కనెక్టివిటీ సాధ్యమవుతుంది. మొత్తం సినిమాలను సెకన్ల వ్యవధిలో డౌన్‌లోడ్‌ చేయడం, కాలయాపన లేకుండా నిరంతర వర్చువల్‌ రియాలిటీని అనుభవించడం, రోబోలను రియల్‌ టైమ్‌లో ఎక్కడినుంచి అయినా నియంత్రించడం లాంటివి ఊహించుకోండి. 6 జీ పరిశ్రమలను విప్లవాత్మకంగా మారుస్తుంది. డిజిటల్‌ ప్రపంచంతో మన పరస్పర చర్యలను కొత్తగా నిర్వచిస్తుంది. 


రోబోటిక్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌ (ఆర్‌పీఏ)

కృత్రిమ మేధతో కూడిన ఆర్‌పీఏలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. పునరావృతమయ్యే పనులు రోబోటిక్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌ ద్వారా ఎక్కువగా ఆటోమేట్‌ అవుతాయి. దీనివల్ల మనుషులు సృజనాత్మక, వ్యూహాత్మక కార్యాలపై అధికంగా దృష్టిపెట్టటానికి వీలవుతుంది. వ్యాపార కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికీ, ఉత్పాదకతను పెంచడానికీ, ఖర్చులను తగ్గించడానికీ ఆర్‌పీఏను ఉపయోగించటం పెరుగుతుంది.


స్మార్ట్‌ పరికరాలు  

చేతిలో మొబైల్‌ ఉండి.. క్లిక్‌ చేస్తే చాలు, అన్నీ అందుబాటులోకి వస్తున్నాయి. ఉపయోగించే పరికరాలు మునుపెన్నడూ లేనంత తెలివిగా మారుతున్నాయి. భవన నిర్మాణాల గమనం స్మార్ట్‌ హోమ్‌ల దిశగా సాగుతోంది. ఆకర్షణీయమైన స్మార్ట్‌ హోమ్‌లు, స్మార్ట్‌ పరికరాలు అధిక భద్రతతో మన భవిష్యత్తును సురక్షితంగా ఉండేలా చేస్తున్నాయి.


డేటాఫికేషన్‌ 

డేటాఫికేషన్‌ అంటే.. మన ఆలోచనలూ.. ఇంటర్నెట్‌ హబ్‌లో చూసే ఫలితాలూ. సోషల్‌ మీడియా కార్యకలాపాల నుంచి ఆరోగ్య ట్రాకర్ల వరకూ మన జీవితంలోని ప్రతి అంశమూ డేటాగా రూపొందుతుంది. వినియోగదారుల అభిరుచులనూ, ఇష్టాలనూ విశ్లేషించి తమ ఆఫర్‌లను వ్యక్తిగతీకరించడానికి 2024లో కంపెనీలు డేటాను మరింత సమర్థంగా ఉపయోగించుకుంటాయి. ఏ ఒక్క వినియోగదారుని కూడా వదులుకోకూడదనే సంస్థల ప్రధాన లక్ష్యం.. డేటాఫికేషన్‌ మూలంగా సాధ్యమవుతుంది. 


3డీ ప్రింటింగ్‌ 

3డీ ప్రింటింగ్‌ వర్క్‌షాప్‌లకు మీరు వెళ్లారా? ఇలాంటి కార్యక్రమాలకు హాజరవటం, ఈ ఉత్పత్తులను రూపొందించే ల్యాబ్‌లను చూడటం వల్ల అవగాహన పెరుగుతుంది. ఈ సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా ఇది రోగులకు ఎనలేని సహాయం చేస్తోంది. కస్టమ్‌ ప్రోస్తటిక్స్‌ నుంచి సంక్లిష్టమైన పారిశ్రామిక భాగాల వరకూ ప్రతిదీ ముద్రించడం సాధ్యపడుతోంది. 2024లో ఈ సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా వివిధ డొమైన్‌లలోకి వెళ్తుందని ఆశించవచ్చు


డిజిటల్‌ ట్రస్ట్‌ అండ్‌ సెక్యూరిటీ 

వర్తమాన డిజిటల్‌ ప్రపంచంలో ఎవరికైనా భద్రత, గోప్యత ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. దేన్ని నమ్మాలి, దేన్ని విశ్వసించకూడదునే అంశాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ లింక్‌లు, స్కామ్‌లు పెరుగుతుండటంతో సురక్షిత లావాదేవీల కోసం సైబర్‌ సెక్యూరిటీ, బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీల్లో పురోగతిని ఆశించవచ్చు. పక్షపాత రాహిత్యం, పారదర్శకతల కోసం ఎథికల్‌ ఏఐ ఫ్రేమ్‌వర్క్స్‌ను వినియోగించవచ్చు.


ఎక్స్‌టెండెడ్‌ రియాలిటీ (ఎక్స్‌ఆర్‌)

ఎక్స్‌ఆర్‌ అనేది విద్య, వినోదరంగాల్లో గొప్ప సాంకేతికత. 2024లో ఇది ఈ రెండు రంగాల్లో  ప్రేక్షకులకు చేరువయ్యేలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఎక్స్‌టెండెడ్‌ రియాలిటీ అత్యుత్తమ సేవలను ప్రపంచం ఇంకా చూడవలసే ఉంది. వచ్చే రోజుల్లో దీన్ని సంపూర్ణంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. 


న్యూ ఎనర్జీ సొల్యూషన్స్‌

ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో సుస్థిర లక్ష్యాలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. 2024లో వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా పోరాటం ప్రాధాన్యాంశం అవుతుంది. ఫ్యూజన్‌ పవర్, అధునాతన సోలార్‌ ప్యానెల్‌లు, సమర్థŸమైన శక్తి నిల్వ వ్యవస్థలు లాంటివాటికి ప్రాముఖ్యం పెరుగుతుంది. పునరుత్పాదక ఇంధన సాంకేతికతల్లో పురోగతులుంటాయి.  


ఇవన్నీ 2024లో తమ హవా చూపే ఆకర్షణీయమైన సాంకేతికతలు. అయినప్పటికీ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ప్రతిచోటా ఉంటుంది. ఇది ఖరీదైనదిగా అనిపించినా భవిష్యత్తులోనూ దాని ప్రాముఖ్యం కొనసాగుతుంది. డిజిటల్‌ ప్రపంచంలో బ్లాక్‌చెయిన్, ఫిన్‌టెక్‌లు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి.   
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ రైల్వే కోర్సులు.. అపార అవకాశాలు

‣ విజయానికి నైపుణ్యాలే సోపానాలు!

‣ వండర్‌ కెరియర్‌.. విజువల్‌ అనలిటిక్స్‌

‣ ఇవి పాటిస్తే.. సర్కారు నౌకరీ!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Whataapp, Telegram, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 09-01-2024


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌