• facebook
  • whatsapp
  • telegram

విజయానికి నైపుణ్యాలే సోపానాలు!

ధోరణి గుర్తిస్తే కెరియర్‌ అధిరోహణే



ఇంతకు ముందెన్నడూ లేనంతగా 2024 సంవత్సరంలో ఉద్యోగ కల్పనతో పాటు నైపుణ్యాల జోరు, హోరు ఉంటాయని నిపుణుల అంచనా. విద్యార్థులూ, నిరుద్యోగ యువతతో పాటు యువ ఉద్యోగులు వివిధ రంగాల్లో మారుతున్న ధోరణి (ట్రెండ్‌) గుర్తించాలి. మినహాయింపు లేకుండా సామర్థ్యాలు పెంచుకునేందుకు సంసిద్ధం కావాలి. నేర్చుకోవాలన్న జ్ఞాన తృష్ణను జ్వలింపజేసుకుంటే అవకాశాలను అందిపుచ్చుకునేందుకు నైపుణ్యాలే సోపానాలవుతాయి!


కొత్త సంవత్సరంలో ఉద్యోగ ప్రపంచంపై గంపెడు ఆశలతో యువత ఉత్కంఠగా నిరీక్షిస్తోంది. ఒక్క ఉద్యోగ అవకాశం సఫలమైతే జీవితం మలుపు తిరుగుతుందని ఫ్రెషర్లు ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ఉద్యోగంలో ఒక మెట్టు పైకి ఎక్కిస్తుందని యువ ఉద్యోగులు ఆశిస్త్తున్నారు.


కలలూ, ఆశలూ అయాచితంగా నెరవేరవు. స్వప్నాల సాకారానికి కొత్త అవకాశాలపై చైతన్యం కలగడం మొదటి మెట్టు. దాని సాధనకు నిరంతర శ్రమ.. తర్వాతి సోపానం. మరి...నూతన సంవత్సరంలో ఉద్యోగ ప్రపంచం ఎటువైపు పయనిస్తోంది? అపార అవకాశాల పుష్పక విమానాన్ని నడిపే చోదకశక్తులేమిటి? అవకాశాల వెనుకున్న నైపుణ్యాల ఇంధనమేంటి? ఇవన్నీ పరిశీలిద్దాం. 


ఈ చైతన్యం మనలో ప్రదీప్తమైతే...ఆ దిశగా కదిలి దశ మార్చుకునే సంకల్పం అంతరాంతరాళాల్లో అంకురిస్తుంది. ఆపై అది బలంగా మనసు లోతుల్లోనుంచి బాహ్య ప్రపంచ అవకాశాలు అందుకునేందుకు విస్ఫోటమైతే  విజయ సంకేతాలు ప్రస్ఫుటమవుతాయి.


సాంకేతికతకే అగ్రస్థానం

నాలుగైదు దశాబ్దాలుగా బహుముఖ జీవన రంగాలను ప్రభావితం చేసి.. ప్రతిఫలాలనందిస్తున్న సాంకేతికతే 2024 సంవత్సరాన్ని ఏలనున్నది. తొలిదశలో కంప్యూటర్ల వినియోగాన్ని తడబడుతూ ఆమోదించిన పారిశ్రామిక, సేవారంగాలు, కొద్దికాలంలోనే దాని సౌలభ్యానికీ, ప్రయోజనాలకూ ఫిదా అయ్యాయి. ఆపై కంప్యూటరీకరణ అన్ని రంగాలనూ కమ్మేసింది. అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలను అలవర్చుకుంటే ప్రస్తుత ఉద్యోగ ప్రపంచంలో అద్భుతంగా వెలుగొందవచ్చు. ఈ అవసరాన్ని ఆలస్యంగా గుర్తిస్తే ఎక్కాల్సిన నైపుణ్యాల రైలు ఉద్యోగ జీవితకాలం లేటు అవుతుంది! 


అల్గారిదమ్స్‌ ఆధారంగా సాఫ్ట్‌వేర్‌ విప్లవం వచ్చాక కంప్యూటర్ల వినియోగం రిటైల్‌ వ్యాపారం నుంచి అంతరిక్ష యానం వరకూ పాకిపోయింది. సకల రంగాల్లో సాంకేతిక వినియోగం సర్వవ్యాప్తమైంది. దేశవ్యాప్తంగా ఈ నైపుణ్యాలను అలవర్చుకున్న అరకోటి మందికి ఈ రంగం ఉద్యోగాలు కల్పించి శైశవ దశలో ఉన్న సేవారంగానికి అమృతకలశం అందించింది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ), ఐటీ ఆధారిత భారత నిపుణులు సాధించిన విజయాలూ ప్రపంచ దేశాలను అబ్బురపరచాయి.


కంపెనీలు ఎప్పుడూ తమ ఆదాయాలను పెంచుకొని, వ్యయాన్ని తగ్గించుకునే పనిలో ఉంటాయి. వందమంది కంప్యూటర్‌ ఉద్యోగులు పనిచేసే దగ్గర ఒకరు, వేయిమంది చేయాల్సిన పనులను చక్కబెట్టేందుకు పట్టుమని పదిమంది నడిపేలా కార్పొరేట్‌ రంగం ఆటోమేషన్‌ మీట నొక్కింది. దానితో ‘కీ’ బోర్డు ఆపరేట్‌ చేస్తే మహద్భాగ్యంగా భావించే రోజులు పోయాయి. అటువంటి సాధారణ పనులన్నింటినీ సాఫ్ట్‌వేర్లతో సరిపెట్టే నైపుణ్యాలున్న నిపుణులు పరమపద సోపానపటంలో పెద్ద నిచ్చెన ద్వారా పైకి ఎగబాకుతున్నారు. ఈ ధోరణి గ్రహించక కొత్త నైపుణ్యాలు అలవర్చుకోవడానికి మొరాయిస్తే పటంలో పామునోట పడక తప్పదు.


శరవేగంగా మార్పులు

జెండా నాటినట్టుగానో.. నిటారుగా నిలబడ్డ కొండలాగానో మార్పు స్థిరంగా ఉండదు. మార్చు చైతన్య శీలం. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగ ప్రపంచంలోనూ శరవేగంగా మార్పులొస్తున్నాయి. ప్రపంచంలో వస్తున్న మార్పులను


ఎప్పటికప్పుడు పసిగడుతూ అందుకు అనుగుణంగా స్పందిస్తున్న వాణిజ్యరంగం ఏయేటికా యేడు వికసిస్తోంది. తన ఉద్యోగులనూ ఇందుకు తగ్గట్టు ప్రోత్సహిస్తోంది. అంతర్గతంగా పోటీ వాతావరణం సృష్టిస్తోంది. దీంతో సాంకేతికంగా, వ్యక్తిత్వపరంగా అగ్రగణ్యులుగా ఉన్నవారికే అవకాశాలు లభిస్తున్నాయి.


అవకాశాల వెల్లువ వేటిలో?

ఈ కోణంలో చూసినప్పుడు కొన్ని రంగాలు 2024లో ప్రవర్థమానంగా వెలుగొందుతాయి. కొత్త సంవత్సరంలో ఉద్యోగాల కల్పవృక్షాలుగా నిలుస్తాయి. అయితే నైపుణ్యాల పోటీకి తట్టుకొని ముందుకు రాగలిగినవారే దీని కింద సేద తీరవచ్చు.


సృష్టికి ప్రతిసృష్టిగా అభివర్ణించే కృత్రిమ మేధ (ఏఐ) ప్రభంజనం విస్తరిస్తోంది. గత నాలుగేళ్లనుంచి 270 శాతం వృద్ధి సాధించిన ఏఐ.. ‘కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారా?..అందలం ఎక్కిస్తా’నని యువతకు సవాలు విసురుతోంది. ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌ రెండూ కవల పిల్లలే. మాతృక కంప్యూటర్‌ రంగం. నాస్‌కామ్‌ అంచనా ప్రకారం రాబోయే రెండేళ్లలో మన ఐటీ పరిశ్రమ ఆదాయానికి ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌ ద్వారా 120 నుంచి 150 బిలియన్‌ డాలర్లు సమకూరుతాయి. అందుకే ఏఐ- ఎం.ఎల్‌. నైపుణ్యాలు ఒడిసి పట్టుకున్నవారికి కంపెనీలు వెంటనే పట్టం కడతాయి.


సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, క్లౌడ్‌ కంప్యూటింగ్, రోబోటిక్స్‌- ఆటోమేషన్‌ రంగాలు ఇప్పటికే నిపుణులతో కుదురుకున్నా, వినూత్నంగా ఆలోచిస్తూ, రెండు మూడు నైపుణ్యాల సంగమంతో ముందుకొచ్చే యువతకు స్వాగతం పలుకుతున్నాయి. ఈ రంగాల్లో కొత్తగా ప్రవేశించిన కంపెనీలు ఉద్యోగ కల్పన విషయంలో దూకుడుగా ఉన్నాయి.


ఆరోగ్య సేవల రంగం (హెల్త్‌కేర్‌  పరిశ్రమ) కొవిడ్‌ తర్వాత బాహుబలిగా నిలిచింది. దేశానికి ఆదాయం, యువతకు ఉద్యోగాలు కల్పిస్తోంది. 2016 నుంచి ఏటా 22 శాతం వృద్ధితో ఎదుగుతున్న ఆరోగ్యసేవల రంగం గత ఏడాది 372 బిలియన్‌ డాలర్లను ఆర్జించింది. గత కొన్నేళ్ల నుంచి ఏటా 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తోంది. హెల్త్‌కేర్‌ రంగంలో కృత్రిమ మేధ, రోబోటిక్స్‌ల వినియోగంతో  ఈ తరహా నిపుణులను ఈ రంగం స్వాగతిస్తోంది.


బహుముఖాల్లో విస్తరిస్తున్న ఈ-కామర్స్‌ రంగం కల్పిస్తున్న ఉద్యోగావకాశాలను తలచుకుంటే ఈ రంగంలో మరెంతగా అవకాశాలున్నాయోనన్న ఆశలు రేకెత్తుతాయి. ఆసోచామ్‌ లెక్కల ప్రకారం ప్రస్తుతం 3.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్న ఈ-కామర్స్‌ రంగం.. ఏఐ, రోబోటిక్స్, డ్రోన్‌ వంటివాటిలో సాంకేతిక వినియోగ నిపుణుల కోసం ఎదురుచూస్తోంది.


గ్రీన్‌ ప్ల్లానెట్‌ దిశగా అడుగులు వేయాలన్నది ప్రపంచదేశాల ఆకాంక్ష. పర్యవసానంగా వాతావరణ మార్చు (క్లైమాటిక్‌ చేంజ్‌), పర్యావరణ పరిరక్షణ (ఎన్విరాన్‌మెంట్‌ ప్రొటెక్షన్‌) రంగాలు ఉద్యోగాల రీత్యా సుసంపన్నం అవుతున్నాయి. ఈ రంగాల్లో సాంకేతికత వినియోగంతో నూతన నైపుణ్యాల ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి.


2024లో ఇంకా ప్రవర్థమానమయ్యేవి- సైబర్‌ సెక్యూరిటీ, ఎడ్యుకేషన్, రెన్యూవబుల్‌ ఎనర్జీ, డేటా అనాలిసిస్, మేనేజ్‌మెంట్, డిజిటల్‌ మార్కెటింగ్, మీడియా మేనేజ్‌మెంట్‌. ఈ రంగాల్లో సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ఫలితంగా నైపుణ్యాలున్న యువత కోసం అవకాశాలు సిద్ధంగా ఉన్నాయి.


-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ ప్రముఖ వర్సిటీల్లో పీజీ

‣ వండర్‌ కెరియర్‌.. విజువల్‌ అనలిటిక్స్‌

‣ ఇవి పాటిస్తే.. సర్కారు నౌకరీ!

‣ ఎన్‌టీఆర్‌ఓలో సైంటిస్ట్‌ కొలువులు

‣ మార్పు స్వాగతించు.. విజయం సాధించు!

‣ ఐటీ కొలువు.. ఇలా సులువు!

‣ కొత్త ఏడాది.. కొంగొత్త అవకాశాలు

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Whataapp, Telegram, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 03-01-2024


 

నైపుణ్యాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం