• facebook
  • whatsapp
  • telegram

ప్రముఖ వర్సిటీల్లో పీజీ

సీయూఈటీ పీజీ ప్రకటన వివరాలుపోస్టు గ్రాడ్యుయేషన్‌ (పీజీ) చదువులకు దేశంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ముఖ్యమైనవి. ఈ సంస్థల్లో అవకాశం వచ్చినవారు మేటి భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చు. బోధన, వసతి, సౌకర్యాలు.. అన్నీ ఇక్కడ మెరుగ్గా ఉంటాయి. ఒకే పరీక్షతో ఈ సంస్థల్లోని సీట్లకు పోటీ పడే అవకాశం వచ్చింది. కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్టు (సీయూఈటీ)లో మెరిస్తే దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల్లో చదువుకోవచ్చు. ఇటీవలే సీయూఈటీ పీజీ ప్రకటన వెలువడింది! 


సీయూఈటీ పరీక్షలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహిస్తుంది. ఇందులో సాధించిన స్కోరుతో కేంద్రీయ విశ్వవిద్యాలయాలతోపాటు కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తోన్న విద్యాసంస్థలు, రాష్ట్రీయ విశ్వవిద్యాలయాలు, డీమ్డ్‌ యూనివర్సిటీలు, ప్రైవేటు విద్యా సంస్థల్లోనూ చదువుకోవచ్చు. ఫిజిక్స్, పొలిటికల్‌ సైన్స్‌.. కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్‌.. ఎకనామిక్స్, ఇంగ్లిష్‌.. ఇలా విద్యార్థులు చేరాలనుకున్న విభాగంలో పరీక్ష రాసి, దేశవ్యాప్తంగా ఆ సబ్జెక్టులో ఉన్న సీట్లకు పోటీపడవచ్చు. 


తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తొలి ప్రాధాన్యమిచ్చే హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని పీజీ సీట్లన్నీ సీయూఈటీతోనే భర్తీ చేస్తారు. ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ- హైదరాబాద్, సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ- విజయనగరం, ఏపీ సెంట్రల్‌ యూనివర్సిటీ- అనంతపురంలో ప్రవేశానికి ఈ స్కోరే ప్రామాణికం. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ- న్యూదిల్లీ, బెనారస్‌ హిందూ యూనివర్సిటీ- వారణాశి, పాండిచ్చేరి యూనివర్సిటీ, జామియా మిల్లియా ఇస్లామియా.. ఇలా జాతీయ స్థాయిలో పేరున్న సంస్థలన్నీ దాదాపు ఈ స్కోరుతోనే అవకాశం కల్పిస్తున్నాయి. సీయూఈటీ సన్నద్ధతతోనే రాష్ట్రీయ విశ్వవిద్యాలయాలు పీజీ ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి పరీక్షను ఎదుర్కోవచ్చు. 


విద్యార్హత 

ఇప్పటికే డిగ్రీ పూర్తిచేసుకున్నవారు, ప్రస్తుతం చివరి ఏడాది కోర్సుల్లో ఉన్న విద్యార్థులు సీయూఈటీ పీజీకి దరఖాస్తు చేసుకోవచ్చు. పలు కోర్సులకు ఏదైనా డిగ్రీ సరిపోతుంది. మిగిలినవాటికి డిగ్రీలో సంబంధిత కోర్సు చదవడం తప్పనిసరి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లోని బులిటెన్, ఎఫ్‌ఏక్యూస్‌ పూర్తిగా చదివి వివరాలు నింపాలి.


పరీక్ష ఇలా 

పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. మొత్తం 75 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 105 నిమిషాలు. మూడు షిఫ్టుల్లో పరీక్ష జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి 10:45, మధ్యాహ్నం 12:45 నుంచి 2:30, సాయంత్రం 4:30 నుంచి 6:15 వరకు నిర్వహిస్తారు. ప్రశ్నలు ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటాయి. భాషలు, సాహిత్యం ప్రశ్నపత్రాలు సంబంధిత భాషలోనే వస్తాయి. ఎంటెక్, మరికొన్ని పరీక్షలు మాత్రం ఇంగ్లిష్‌లోనే నిర్వహిస్తారు. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు. తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు.


సన్నద్ధత 

సబ్జెక్టుల వారీ సిలబస్‌ వివరాలు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. శ్రద్ధగా గమనించాలి. 

సిలబస్‌లోని పాఠ్యాంశాలను డిగ్రీ పుస్తకాల నుంచి అధ్యయనం చేయాలి. 

మూడేళ్ల డిగ్రీ పాఠ్యపుస్తకాల్లోని ప్రాథమికాంశాలను ప్రాధాన్యంతో చదవాలి. అనువర్తనం, ముఖ్యాంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. 

పాఠ్యాంశాలు చదవడం పూర్తయిన తర్వాత పాత సీయూఈటీ ప్రశ్నపత్రాలను గమనించాలి. ప్రశ్నలు తీరు, పాఠ్యాంశాలకు లభిస్తోన్న ప్రాధాన్యం తెలుసుకోవాలి. సన్నద్ధతను అందుకు అనుగుణంగా మార్చుకోవాలి.   

గతంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు పీజీ ప్రవేశానికి నిర్వహించిన ప్రశ్నపత్రాలు సీయూసీటీని ఎదుర్కోవడానికి ఉపయోగపడతాయి. 

సైన్స్, మాథ్స్‌ సబ్జెక్టుల్లో పరీక్షలు రాస్తున్నవారు ఐఐటీలు నిర్వహించే జామ్‌ పాత ప్రశ్నపత్రాలను అధ్యయనం చేయడం మేలు చేస్తుంది.  

పరీక్షకు ముందు కనీసం ఐదు మాక్‌ టెస్టులు రాసి, ఫలితాలు విశ్లేషించుకుని, సన్నద్ధత కొనసాగిస్తే మేటి సంస్థలో సీటు పొందవచ్చు.


ముఖ్య సమాచారం..

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: జనవరి 24 వరకు స్వీకరిస్తారు. 

దరఖాస్తు ఫీజు: (రెండు టెస్ట్‌ పేపర్ల వరకు) జనరల్‌ అభ్యర్థులకు రూ.1200. ఓబీసీ - ఎన్‌సీఎల్‌/జనరల్‌-ఈడబ్ల్యూఎస్‌లకు రూ.1000, ఎస్సీ/ ఎస్టీ/ థర్డ్‌ జండర్‌లకు రూ.900, దివ్యాంగులైతే రూ.800. అదనపు టెస్ట్‌ పేపర్లు (ప్రతి పేపర్‌కు) జనరల్‌ అభ్యర్థులు రూ.600, మిగిలినవాళ్లు రూ.500 చెల్లించాలి. (దరఖాస్తు ఫీజుకు జనవరి 25 వరకు అవకాశం ఉంది)

పరీక్షలు: మార్చి 11 నుంచి 28 వరకు రోజూ 3 షిఫ్టుల్లో నిర్వహిస్తారు. 

పరీక్ష కేంద్రాలు: రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అన్ని ముఖ్య ప్రాంతాల నుంచీ పరీక్ష రాసుకోవచ్చు. ఏపీలో 29, తెలంగాణలో 11 ప్రాంతాల్లోని వివిధ కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. 

ఈ-అడ్మిట్‌ కార్డ్‌: అడ్మిట్‌కార్డ్‌ను ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. పరీక్ష కేంద్రం, తేదీ, షిఫ్ట్‌/టైమ్‌కు సంబంధించిన వివరాలన్నీ అందులో ఉంటాయి. 

వెబ్‌సైట్‌: https://pgcuet.samarth.ac.in/


ఇవీ మార్పులు

గత ఏడాదితో పోలిస్తే ఈసారి పరీక్షలో చాలా మార్పులు చేశారు. ఇవన్నీ విద్యార్థులకు మేలు చేసేవే.

ప్రశ్నల సంఖ్యను 100 నుంచి 75కి కుదించారు. 

పరీక్ష వ్యవధి పావు గంట తగ్గింది. (రెండు గంటల నుంచి గంటా ముప్పావు)

గత పరీక్షల్లో.. జనరల్‌ ఇంగ్లిష్, జనరల్‌ అవేర్‌నెస్, మ్యాథమెటికల్‌ ఆప్టిట్యూడ్, అనలిటికల్‌ స్కిల్స్‌ల్లోనూ ప్రశ్నలు వచ్చేవి. ఈసారి వాటిని తొలగించారు. ప్రశ్నలన్నీ దాదాపు పరీక్ష రాస్తున్న సబ్జెక్టు నుంచే వస్తాయి. మేనేజ్‌మెంట్‌ (ఎంబీఏ), అనుబంధ కోర్సులకు దరఖాస్తు చేసుకున్నవారికే జనరల్‌ ప్రశ్నపత్రం ఉంటుంది. 

రెండుకు బదులు మూడు షిఫ్టుల్లో పరీక్షలు ఉంటాయి.


ఇవీ కోర్సులు 

ఎంఏ: తెలుగు, ఇంగ్లిష్, హిందీ, కన్నడ, ఉర్దూ, సంస్కృతం, బెంగాళీ, ఏన్షెంట్‌ ఇండియన్‌ హిస్టరీ కల్చర్‌ అండ్‌ ఆర్కియాలజీ, జాగ్రఫీ, స్టాటిస్టిక్స్, మ్యాథ్స్, హోం సైన్స్, లింగ్విస్టిక్స్, నేపాలీ, అరబిక్, ఫ్రెంచ్, జర్మన్, మరాఠీ, పర్షియన్, రష్యన్, చైనీస్, ఫిలాసఫీ, ఆర్ట్‌ హిస్టరీ, పాళీ, ఎడ్యుకేషన్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్, సోషియాలజీ, సైకాలజీ, సోషల్‌ వర్క్, ఆంత్రొపాలజీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, కాన్‌ఫ్లిక్ట్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ డెవలప్‌మెంట్, ఇంటిగ్రేటెడ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, సోషల్‌ ఎక్స్‌ క్లూజన్‌ అండ్‌ ఇన్‌క్లూజివ్‌ పాలసీ, ఎనర్జీ ఎకనామిక్స్, హెరిటేజ్‌ మేనేజ్‌మెంట్, మాస్‌ కమ్యూనికేషన్, మ్యూజియాలజీ.   


ఎమ్మెస్సీ: ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బోటనీ, కంప్యూటర్‌ సైన్స్, జాగ్రఫీ, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, సైకాలజీ, హోం సైన్స్, బయో కెమిస్ట్రీ, టెక్‌ జియో ఫిజిక్స్, జియాలజీ, హెల్త్‌ స్టాటిస్టిక్స్, అగ్రికల్చర్, డైరీ టెక్నాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్, అప్లయిడ్‌ మైక్రో బయాలజీ, స్టాటిస్టిక్స్‌ అండ్‌ కంప్యూటింగ్, మ్యాథ్స్‌ అండ్‌ కంప్యూటింగ్, కంప్యుటేషనల్‌ సైన్స్‌ అండ్‌ అప్లికేషన్స్, ఫోరెన్సిక్‌ సైన్స్, అగ్రో ఫారెస్ట్రీ, సాయిల్‌ వాటర్‌ కన్జర్వేషన్, ఫుడ్‌ టెక్నాలజీ, ప్లాంట్‌ బయోటెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్‌ టెక్నాలజీ.


ఎంఎఫ్‌ఎ: పెయింటింగ్, అప్లయిడ్‌ ఆర్ట్స్, ప్లాస్టిక్‌ ఆర్ట్స్, పోటరీ అండ్‌ సిరామిక్స్, టెక్స్‌టైల్‌ డిజైన్‌.  


ఎంపీఏ: వోకల్‌ మ్యూజిక్, డ్యాన్స్‌. 


ఎంబీఏ: ఫారిన్‌ ట్రేడ్, రిస్క్‌ అండ్‌ ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్, అగ్రి బిజినెస్‌.


మాస్టర్‌ ఆఫ్‌ వొకేషన్‌: రిటైల్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్, హాస్పిటాలిటీ అండ్‌ టూరిజం మేనేజ్‌మెంట్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, మెడికల్‌ లేబొరేటరీ అండ్‌ టెక్నాలజీ.


ఎంఎడ్, ఎంఎడ్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్, ఎంఎల్‌ఐఎస్సీ, మాన్యుస్క్రిప్టాలజీ అండ్‌ పాలియోగ్రఫీ, ఎంపీఈడీ, ఎల్‌ఎల్‌ఎం, ఎంసీఏ, ఎంకాం, టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్, కార్పొరేట్‌ కమ్యూనికేషన్‌ మేనేజ్‌మెంట్, పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిలేషన్స్, మాస్టర్‌ ఆఫ్‌ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌..  ఇలా పీజీలో ఉండే అన్ని కోర్సులూ అందుబాటులో ఉన్నాయి. కొన్ని సంస్థలు ఎల్‌ఎల్‌ఎం, ఎంటెక్, ఎంఎడ్, ఎంఏ/ఎమ్మెస్సీ-బీఎడ్‌ కోర్సులూ అందిస్తున్నాయి.


సీయూఈటీలో సాధించిన స్కోరుతో ప్రవేశం పొందగోరే విశ్వవిద్యాలయానికి విడిగా దరఖాస్తు చేసుకోవాలి. కొన్ని కోర్సులను ఎంఏ/ఎమ్మెస్సీ రెండు డిగ్రీలతోనూ అందిస్తున్నారు.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఇవి పాటిస్తే.. సర్కారు నౌకరీ!

‣ ఎన్‌టీఆర్‌ఓలో సైంటిస్ట్‌ కొలువులు

‣ మార్పు స్వాగతించు.. విజయం సాధించు!

‣ ఐటీ కొలువు.. ఇలా సులువు!

‣ కొత్త ఏడాది.. కొంగొత్త అవకాశాలు

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Whataapp, Telegram, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 02-01-2024


 

ప్రవేశ పరీక్షలు

మరిన్ని