• facebook
  • whatsapp
  • telegram

పేరున్న సంస్థల్లో పీజీ.. పరీక్ష ఒకటే! 

సీయూఈటీ పీజీ - 2022 నోటిఫికేషన్‌ విడుదల

జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన విద్యాసంస్థల్లో పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సులు చదవడానికి ప్రవేశమార్గం సులువైంది. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఒకే పరీక్షతో చదువుకునే అవకాశం వచ్చింది. ఇందుకోసం కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌- పోస్టుగ్రాడ్యుయేట్‌ (సీయూఈటీ పీజీ - 2022) రాయాలి. ఈ పరీక్షను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహిస్త్తోంది. ఇటీవల ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఆ వివరాలు చూద్దాం...

దేశంలో ప్రముఖ విద్యా సంస్థలెన్నో ఉన్నాయి. వాటిలో కేంద్రీయ విశ్వవిశ్వవిద్యాలయాలు ముఖ్యమైనవి. గత ఏడాది వరకు పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఇవన్నీ ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించేవి. దీంతో విద్యార్థులు ప్రతి సంస్థకూ విడిగా దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. పెద్ద మొత్తంలో దరఖాస్తు ఫీజు చెల్లించి, పలు ప్రాంతాలకు వెళ్లి పరీక్షలు రాయాల్సి వచ్చేది. ఆ ఇబ్బందులు ఈ ఏడాది నుంచి తొలగిపోయాయి. దీంతో డబ్బుతోపాటు, సమయం ఆదా అవుతుంది. ఒకే పరీక్షతో అన్ని సంస్థల్లోని సీట్లకూ పోటీ పడవచ్చు. 

జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ, బెనారస్‌ హిందూ యూనివర్సిటీ, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ, పాండిచ్చేరి యూనివర్సిటీ, ఏపీ సెంట్రల్‌ యూనివర్సిటీ... ఇలా పలు సంస్థల్లో చదవడానికి సీయూఈటీ స్కోరే ప్రామాణికం. తాజా నోటిఫికేషన్‌తో దేశవ్యాప్తంగా మొత్తం 42 సంస్థలు పీజీ కోర్సుల్లోకి ప్రవేశం కల్పిస్తున్నాయి. వీటిలో 35 కేంద్రీయ, 6 స్టేట్, ఒక డీమ్డ్‌ విశ్వవిద్యాలయం ఉన్నాయి. ఇప్పటికే డిగ్రీ పూర్తిచేసుకున్నవారు, ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సుల్లో ఉన్న విద్యార్థులు సీయూఈటీ రాసుకోవచ్చు. పలు కోర్సులకు ఏదైనా డిగ్రీ సరిపోతుంది. మిగిలినవాటికి డిగ్రీలో సంబంధిత కోర్సు చదివినవారై ఉండాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో సమాచారం పూర్తిగా చదివి దరఖాస్తు నింపాలి. 

పరీక్షలో ఏముంటాయి?

కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఆధారంగా దరఖాస్తుదారుల్లో అర్హులను ఎంపిక చేస్తారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు. రెండు షిఫ్టుల్లో పరీక్ష జరుగుతుంది. షిఫ్ట్‌-1లో 10 నుంచి 12 గంటల వరకు, షిఫ్ట్‌-2లో 3 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తారు. 

ప్రశ్నలు ఇంగ్లిష్, హిందీ భాషల్లో (భాష, సాహిత్య పేపర్లు తప్ప) ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో పార్ట్‌-ఎ, పార్ట్‌-బి అనే రెండు విభాగాలు ఉంటాయి. పార్ట్‌-ఎ 25, పార్ట్‌-బిలో 75 ప్రశ్నలు వస్తాయి. పార్ట్‌-ఎలో జనరల్, పార్ట్‌-బిలో సంబంధిత సబ్జెక్టు ప్రశ్నలు వస్తాయి. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు ఉంటాయి. తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు. 

ఎంఏ/ఎమ్మెస్సీ కోర్సులకు సంబంధించి పార్ట్‌-ఎలో ఇంగ్లిష్, జనరల్‌ అవేర్‌నెస్, మ్యాథమేటికల్‌ ఆప్టిట్యూడ్, ఎనలిటికల్‌ స్కిల్స్‌ల్లో ప్రశ్నలు వస్తాయి. ఆయా సబ్జెక్టులవారీ పార్ట్‌-బి సిలబస్‌ వివరాలు ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. డిగ్రీ పాఠ్యాంశాల నుంచే పార్ట్‌-బి ప్రశ్నలు అడుగుతారు. అందువల్ల వాటిని బాగా చదువుకుంటే ఎక్కువ మార్కులు పొందవచ్చు. 

ఇవీ కోర్సులు

ఎంఏ/ ఎమ్మెస్సీ: ఇంగ్లిష్, యోగ, నానోసైన్స్, మ్యాథమేటిక్స్, మ్యూజిక్, స్పోర్ట్స్‌ సైకాలజీ, బయాలజీ, డ్యాన్స్, జాగ్రఫీ, ఎలక్ట్రానిక్స్‌ డిజైన్‌ అండ్‌ టెక్నాలజీ, స్టాటిస్టిక్స్, ఫైన్‌ ఆర్ట్స్, ఆంత్రొపాలజీ, ఎకనామిక్స్, మ్యూజియాలజీ, ఓషన్‌ అండ్‌ అట్మాస్ఫియరిక్‌ సైన్సెస్, పబ్లిక్‌ హెల్త్, కంప్యూటర్‌ అప్లికేషన్స్, జియోఇన్పర్మాటిక్స్, క్రిమినాలజీ అండ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్, హిస్టరీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, ఎకనామిక్స్, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్‌ సైన్స్, తెలుగు, హిందీ... ఇలా పీజీలో ఉండే అన్ని కోర్సులూ అందుబాటులో ఉన్నాయి. ఇవేకాకుండా కొన్ని సంస్థలు ఎల్‌ఎల్‌ఎం, ఎంటెక్, ఎంఎడ్, ఎంఏ/ ఎమ్మెస్సీ-బీఎడ్‌ కోర్సులు అందిస్తున్నాయి.

దరఖాస్తుకు చివరి తేది: 18.06.2022

దరఖాస్తు ఫీజు: (మూడు టెస్ట్‌ పేపర్ల వరకు) జనరల్‌ అభ్యర్థులకు రూ.800. ఓబీసీ - ఎన్‌సీఎల్‌/ జనరల్‌-ఈడబ్ల్యూఎస్‌లకు రూ.600, ఎస్సీ/ ఎస్టీ/ థర్డ్‌ జండర్‌లకు రూ.550, పీడబ్ల్యూబీడీలకు రూ.500. అదనపు టెస్ట్‌ పేపర్లు (ప్రతి పేపర్‌కు) జనరల్‌ అభ్యర్థులైతే రూ.200 చెల్లించాలి. మిగిలినవారికిది రూ.150.

పరీక్ష తేదీలు: వెల్లడించాల్సి ఉంది

పరీక్ష కేంద్రాలు: రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ముఖ్యప్రాంతాలన్నింటిలోనూ కేంద్రాలున్నాయి. ఏపీలో 29, తెలంగాణలో 23 చోట్ల ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. 

ఇ-అడ్మిట్‌ కార్డ్‌: అడ్మిట్‌కార్డ్‌ను ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. పరీక్ష కేంద్రం, తేదీ, షిఫ్ట్‌/టైమ్‌కు సంబంధించిన వివరాలన్నీ దీంట్లో ఉంటాయి. ఎప్పుడు అడ్మిట్‌కార్డ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలనే విషయాన్ని వెబ్‌సైట్‌లో తెలియజేస్తారు. పరీక్ష సమయానికి 2 గంటల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. అడ్మిట్‌కార్డ్, ఫొటో ఐడీలేని అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. 

వెబ్‌సైట్‌: https://cuet.nta.nic.in/
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పర్యాటకంలో బీబీఏ, ఎంబీఏ

‣ లెఫ్టినెంట్‌ అవుతారా?

‣ పట్టపగ్గాల్లేని రాజకీయ ఫిరాయింపులు

‣ సుదృఢ బంధమే ఉభయతారకం

‣ ఉచిత యాప్‌లతో చదివేసుకోండి!

Posted Date: 31-05-2022


 

ప్రవేశ పరీక్షలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌