• facebook
  • whatsapp
  • telegram

Job: ఆ ఉద్యోగులను 27 వరకు తొలగించొద్దు

ఈనాడు, అమరావతి: గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ (27/2018) ప్రధాన పరీక్ష మాన్యువల్‌ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయన్న కారణంతో పరీక్షను రద్దు చేసి, తాజాగా నిర్వహించాలని హైకోర్టు సింగిల్‌ జడ్జి వెలువరించిన తీర్పుతో ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చిన 167 మందికి హైకోర్టు ధర్మాసనం తాజా ఉత్తర్వులతో తాత్కాలిక ఊరట లభించింది. తదుపరి విచారణ ( మార్చి 27) వరకు వారిని ఉద్యోగాల నుంచి తొలగించొద్దని ధర్మాసనం స్పష్టం చేసింది. గ్రూప్‌-1 వ్యవహారంతో ముడిపడిన అప్పీళ్లపై విచారణను  మార్చి 27కి వాయిదా వేసింది. ఈ నోటిఫికేషన్‌ ఆధారంగా ఉద్యోగాలు పొందిన వారి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తాత్కాలిక ఉత్తర్వులిస్తున్నట్లు పేర్కొంది. ఏపీపీఎస్సీ అప్పీల్‌తో పాటు ఎంపికైన ఉద్యోగులు కొందరు, సింగిల్‌ జడ్జి తీర్పులోని కొంతభాగంపై అభ్యంతరంతో ఎంపికకాని అభ్యర్థులు వేసిన అప్పీళ్లను కలిపి  మార్చి 27న విచారణ చేస్తామని ప్రకటించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి, జస్టిస్‌ ఎన్‌.హరినాథ్‌లతో కూడిన ధర్మాసనం మార్చి 21న ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. సింగిల్‌ జడ్జి తీర్పులోని ఏ అంశం జోలికీ ధర్మాసనం వెళ్లలేదు.

2018 నాటి గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ఆధారంగా ఏపీపీఎస్సీ నిర్వహించిన ప్రధాన పరీక్ష (మెయిన్స్‌) జవాబుపత్రాల మాన్యువల్‌ మూల్యాంకనంలో (చేతితో దిద్దడం) అవకతవకలు చోటు చేసుకున్నాయని హైకోర్టు సింగిల్‌ జడ్జి మార్చి 13న కీలక తీర్పు ఇచ్చారు. రెండోసారి, మూడోసారి చేపట్టిన మాన్యువల్‌ మూల్యాంకనాలు చట్టవిరుద్ధమన్నారు. ప్రధాన పరీక్షకు అర్హులుగా పేర్కొంటూ 2022 మే 26న ఏపీపీఎస్సీ జారీ చేసిన జాబితాను రద్దు చేశారు. తాజాగా ప్రధాన పరీక్ష నిర్వహించాలని, ఎంపిక ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ఏపీపీఎస్సీని ఆదేశించారు.

సింగిల్‌ జడ్జి తీర్పును సవాలు చేస్తూ ఏపీపీఎస్సీతో పాటు ఎంపికై.. ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న కొందరు ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు.  మార్చి 21న జరిగిన విచారణలో ఏపీపీఎస్సీ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌ఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపించారు. సింగిల్‌ జడ్జి తీర్పుపై ఇరుపక్షాలూ అసంతృప్తిగా ఉన్నాయన్నారు. 2022 మే 26న ఏపీపీఎస్సీ జారీ చేసిన ప్రధాన పరీక్ష అర్హుల జాబితాను సింగిల్‌ జడ్జి రద్దు చేయడంతో ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న 167 మంది తమ కొలువులను కోల్పోవాల్సి వస్తుందన్నారు. వారికి రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులివ్వాలని కోరారు.

ఎంపికకాని అభ్యర్థుల తరఫున (సింగిల్‌ జడ్జి వద్ద పిటిషనర్లు) సీనియర్‌ న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌, న్యాయవాది జొన్నలగడ్డ సుధీర్‌ తదితరులు వాదనలు వినిపించారు. సింగిల్‌ జడ్జి తీర్పులో కొంతభాగంపై తమకూ అభ్యంతరం ఉందన్నారు. ఈ వ్యవహారంపై తాము అప్పీళ్లు దాఖలు చేశామన్నారు. మొదటిసారి చేసిన మాన్యువల్‌ మూల్యాంకనాన్ని సింగిల్‌ జడ్జి రద్దు చేయడం సరికాదని తెలిపారు. మొదటిసారి మాన్యువల్‌ మూల్యాంకనంలోని ఫలితాల ఆధారంగా అర్హులను గుర్తించాలని కోరారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన కారణాన్ని సాకుగా చూపుతూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును అమలు చేయలేమనే కొత్త వాదనను ఏపీపీఎస్సీ తెరమీదకు తెస్తోందన్నారు. సింగిల్‌ జడ్జి తీర్పుపై స్టే విధిస్తే అప్పీళ్లలో విచారణ తీవ్ర జాప్యమయ్యే అవకాశం ఉందన్నారు. ఈ వ్యవహారంతో ముడిపడి ఉన్న అప్పీళ్లన్నింటిపై వచ్చే వారం సమగ్ర విచారణ జరపాలని కోరారు. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులివ్వొద్దని అభ్యర్థించారు. తాము కోర్టు ధిక్కరణ కేసులు దాఖలు చేయబోమన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. ప్రధాన పరీక్ష అర్హుల జాబితాను సింగిల్‌ జడ్జి రద్దు చేసిన కారణంగా ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారిపై తక్షణ ప్రభావం చూపుతుందని అభిప్రాయపడింది. అప్పీళ్లపై విచారణను మార్చి 27న చేపట్టనున్న నేపథ్యంలో అప్పటి వరకు ఉద్యోగులను తొలగించొద్దని స్పష్టం చేసింది.


మరింత సమాచారం... మీ కోసం!

‣ జీవ శాస్త్రాల్లో కొలువుకు విస్తృత అవకాశాలు

‣ కొత్త అవకాశాలకు.. జెన్‌ ఏఐ!

‣ మార్కులకు పరిష్కారం.. పునశ్చరణే!

‣ ఐటీ, కార్పొరేట్‌ రంగాల్లో రాణిద్దాం ఇలా..

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 22-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.