• facebook
  • whatsapp
  • telegram

Results: పదిలో.. 86.69% ఉత్తీర్ణత

* బాలికలు 89.17%, బాలురు 84.32% పాస్‌

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో 86.69% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 6,16,615 మంది పరీక్షలకు హాజరు కాగా, వీరిలో 5,34,574 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలుర కంటే బాలికలే మంచి ఫలితాలు సాధించారు. బాలికలు 2,69,307 (89.17%), బాలురు 2,65,267 (84.32%) మంది పాసయ్యారు. గతేడాదితో పోల్చితే ఉత్తీర్ణత శాతం 14.43% పెరిగినా, కరోనాకు ముందు 2019 ఫలితాలతో పోల్చి చూస్తే 8.19% తగ్గింది. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డితో కలిసి పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేశ్‌కుమార్‌ విజయవాడలో ఏప్రిల్‌ 22న విడుదల చేశారు. మార్కుల జాబితాలను నాలుగు రోజుల్లో ఆన్‌లైన్‌లో ఉంచనున్నారు. పాఠశాలలు విద్యార్థుల ర్యాంకులను ప్రకటించకూడదని, అందుకోసమే తాము మార్కులు వెల్లడించలేదని స్పష్టంచేశారు. ఫెయిల్‌ అయిన విద్యార్థులకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అండగా నిలవాలని, వారిని నిందించొద్దని కోరారు. 13 మంది అంధ విద్యార్థులు ఆన్‌లైన్‌లో సహాయకులు లేకుండా పరీక్ష రాశారని పేర్కొన్నారు. విద్యా సంవత్సరం ఈనెల 23తో ముగుస్తుండగా, అంతకంటే ముందుగానే ఫలితాలు ఇవ్వడం ఇదే మొదటిసారని సురేశ్‌కుమార్‌ తెలిపారు.

అత్యధికం ఫస్ట్‌ క్లాస్‌లోనే!

ఈసారి ఎక్కువ మంది విద్యార్థులు మొదటి శ్రేణిలోనే పాసయ్యారు. అంటే 600 మార్కులకు 360కి పైగా సాధించారు. రాష్ట్ర సగటు ఉత్తీర్ణత 86.69% కాగా, ప్రథమ శ్రేణిలో 69.26%, ద్వితీయ శ్రేణిలో 11.87%, తృతీయ శ్రేణిలో 5.56% మంది చొప్పున పాసయ్యారు.

తెలుగు మాధ్యమంలో 1,61,881 మంది రాయగా, 1,15,060 (71.08%), ఆంగ్ల మాధ్యమంలో 4,50,304 మందికి 4,15,743 (92.32%) మంది ఉత్తీర్ణులయ్యారు.

రాష్ట్రవ్యాప్తంగా 2,803 పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత నమోదు కాగా, 17 బడుల్లో సున్నా ఫలితాలొచ్చాయి. ప్రైవేటులో 13, ఎయిడెడ్‌లో 3, ఒక ప్రభుత్వ పాఠశాల నుంచి ఒక్కరూ పాస్‌ కాలేదు.

సబ్జెక్టుల వారీగా చూస్తే తెలుగులో 96.47%, హిందీ-99.24%, ఆంగ్లం-98.52%, గణితం-93.33%, సామాన్యశాస్త్రం-91.29%, సాంఘిక శాస్త్రంలో 95.34% మంది ఉత్తీర్ణులయ్యారు. సామాన్యశాస్త్రంలో ఎక్కువ ఫెయిలయ్యారు.

ఏపీ రెసిడెన్షియల్‌ సొసైటీ విద్యాసంస్థలు, బీసీ సంక్షేమ పాఠశాలలు 98.43% ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలవగా, ప్రభుత్వ బడులు 74.40%, పురపాలక పాఠశాలలు 75.42%, జిల్లా పరిషత్తు పాఠశాలలు 79.38% ఉత్తీర్ణత నమోదు చేశాయి.

22 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫీజు 

ఫెయిల్‌ అయిన విద్యార్థుల కోసం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను మే 24 నుంచి జూన్‌ 3 వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు ఫీజును విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఏప్రిల్‌ 23 నుంచి 30లోపు చెల్లించాలి. రూ.50 అపరాధ రుసుముతో మే 1 నుంచి 23 వరకు చెల్లించవచ్చు.

జవాబు పత్రాల రీ-కౌంటింగ్‌, రీ-వెరిఫికేషన్‌ కోసం ఏప్రిల్‌  23 నుంచి 30లోపు ఫీజు చెల్లించాలి. ప్రధానోపాధ్యాయుడి ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ఒక్కో పేపర్‌ రీ-కౌంటింగ్‌కు రూ.500, రీ-వెరిఫికేషన్‌కు రూ.వెయ్యి చొప్పున చెల్లించాలి.

పరీక్ష ఫీజు సమర్పించే సమయంలో మైగ్రేషన్‌ సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు డిజిటల్‌ సంతకం చేసిన సర్టిఫికెట్‌ను పొందేందుకు సంబంధిత ప్రధానోపాధ్యాయులను సంప్రదించాలి. వీటిని మరో 4 రోజుల్లో వెబ్‌సైట్‌లో ఉంచుతారు.

పదో తరగతి పరీక్షల ఫలితాల్లో వరుసగా రెండో ఏడాదీ పార్వతీపురం మన్యం జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఈ జిల్లా నుంచి గతేడాది 87.47% విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, ఈసారి 96.37% మంది పాసయ్యారు. ఆ తర్వాత ద్వితీయ, తృతీయ స్థానాల్లో శ్రీకాకుళం (93.35%), వైయస్‌ఆర్‌ (92.10%) జిల్లాలు ఉన్నాయి. చివరి మూడు స్థానాల్లో అనంతపురం (80.93%), ఏలూరు (80.08%), కర్నూలు (62.47%) నిలిచాయి. గతేడాది నంద్యాల జిల్లాది అధమ స్థానం కాగా, ఈసారి కర్నూలు జిల్లా వంతైంది. పైగా చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న ఏలూరు జిల్లాతో పోల్చినప్పుడు కర్నూలు ఉత్తీర్ణత సుమారు 18% తేడా ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం... మీ కోసం!

‣ కోచింగ్‌ లేదు... డెయిలీ టార్గెట్స్‌ పూర్తీచేశా!

‣ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!

‣ బొగ్గు గనుల్లో కొలువులు

‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!

‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 23-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.