• facebook
  • whatsapp
  • telegram

AP EAPCET: ఏపీ ఈఏపీసెట్‌కు సర్వం సిద్ధం

* విద్యార్థులకు ముఖ్య సూచనలివే..

* ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి
 


ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్‌ గురువారం (మే 16) నుంచి ప్రారంభమవుతుందని, ఇందుకు సర్వం సిద్ధం చేసినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి తెలిపారు. నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. అభ్యర్థులు మెహందీ పెట్టుకుంటే బయోమెట్రిక్‌కు ఇబ్బందులు రావొచ్చని, అభరణాలతోపాటు ఎలక్ట్రానిక్‌ పరికరాలనూ పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోరని తెలిపారు. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘‘ఏపీ ఈఏపీసెట్‌ మే 16 నుంచి 23 వరకు జరుగుతుంది. బైపీసీ విద్యార్థులకు 16, 17 తేదీల్లో నాలుగు విడతలుగా.. ఎంపీసీ వారికి 18 నుంచి 23 వరకు తొమ్మిది విడతల్లో పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి విడత, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మరో విడత ఉంటుంది. ఈ సారి మొత్తం 3,61,640 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా 142 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నాం. హాల్‌టికెట్‌ వెనుక భాగంలో పరీక్ష కేంద్రానికి చేరుకోవడానికి రూట్‌ మ్యాప్‌ ఇచ్చాం’’ అని తెలిపారు.

నంద్యాలలో పరీక్ష కేంద్రాల మార్పు

నంద్యాలలో పరీక్ష కేంద్రాలను మార్పు చేసినట్లు హేమచంద్రారెడ్డి వెల్లడించారు. మొదట ఆర్‌జీఎంఐటీ, శాంతిరామ్‌ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించగా.. వాటిల్లో ఈవీఎంలను భద్రపరచడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ రెండు కళాశాలల్లో కేంద్రాలున్న వారికి శ్రీరామకృష్ణ డిగ్రీ, పీజీ కళాశాల, ఎస్‌వీఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పాత కేంద్రాలతో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్న వారు కొత్త హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. సమావేశంలో జేఎన్‌టీయూ కాకినాడ ఉపకులపతి ప్రసాదరాజు, ఉన్నత విద్యామండలి వైస్‌ ఛైర్మన్లు రామమోహనరావు, ఉమామహేశ్వరీదేవి, కార్యదర్శి నజీర్‌ అహ్మద్, ప్రవేశ పరీక్షల ప్రత్యేక అధికారి సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు. 
 

Published Date : 15-05-2024 20:20:44

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం