• facebook
  • whatsapp
  • telegram

 APDSC: డీఎస్సీ ప్రిపరేషన్‌లో అభ్యర్థులు బిజీ బిజీ!

* కొత్త ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్ కోసం ఎదురుచూపులు

న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టర్‌: సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో డీఎస్సీ అభ్యర్థుల ఆశలు చిగురిస్తున్నాయి. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ప్రకటనపైనే తొలి సంతకం చేస్తానని ఎన్నికల ప్రచారంలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడమే ఇందుకు కారణం. దీంతో ఉపాధ్యాయ శిక్షణ పొంది.. ఉద్యోగాల ప్రకటన కోసం వేచి చూస్తున్న అభ్యర్థులు ఈ హామీ అమలుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఏ నలుగురు అభ్యర్థులు కలుసుకున్నా ప్రకటన ఎప్పుడు ఉండొచ్చు.. పోస్టులు ఎన్ని ఉంటాయి.. పరీక్షలు ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేస్తారా అని డీఎస్సీ అభ్యర్థులు నిరీక్షిస్తున్నారు.ఈనెల 12న ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉండటంతో ఆ రోజు ఎప్పుడెప్పుడు వస్తుందా? అని వారు చూస్తున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం తొలి సంతకం డీఎస్పీపైనే ఉంటుందనే ఆశతో ఉన్నారు. నోటిఫికేషన్‌ పక్కాగా ఉంటుందనే ధీమాతో కొందరు శిక్షణ కేంద్రాలకు పరులుగు తీస్తుంటే, మరి కొందరు ఇళ్ల వద్దే పరీక్షలకు సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే పలువురు దరఖాస్తు..

ఈ సంవత్సరం ఫిబ్రవరిలో వైకాపా ప్రభుత్వం అరకొర పోస్టులతో డీఎస్సీ ఇచ్చినా జిల్లాలో సుమారు 24 వేల మంది వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. టెట్, డీఎస్సీ పరీక్షలను వేరువేరుగా నిర్వహించేందుకు వైకాపా ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిలో టెట్‌ పరీక్ష మాత్రమే పూర్తి చేశారు. దాని నిర్వహణ కూడా అస్తవ్యస్తంగా ఉండటంతో పలువురు అభ్యర్థులు రాయలేక పోయారు. కొంత మందికి పరీక్ష కేంద్రాలు ఇతర రాష్ట్రాల్లో రావడం, సుదూర ప్రాంతాల్లో ఉన్న కళాశాలలు కేటాయించడం వంటి చర్యలు చేపట్టారు. దీంతో వేల మంది అభ్యర్థులు సకాలంలో పరీక్షకు హాజరు కాలేక పోయారు. ఇప్పటికే డీఎస్సీ పరీక్ష కోసం  దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేయాలా? అవసరం లేదా? అన్నదానికి ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్‌ వచ్చిన తరువాత స్పష్టత రానుంది. ఏది ఏమైనా చంద్రబాబు ప్రకటించే మెగా డీఎస్సీ కోసం నిరుద్యోగులు వేయి కళ్లతో ఆశగా నిరీక్షిస్తున్నారు.

అటకెక్కిన హామీ..

2019 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 5 లక్షల మంది డీఎస్సీ అభ్యర్థులు జగన్‌మెహన్‌రెడ్డి మాటలు నమ్మి అధికారం కట్టబెట్టారు. తీరా గద్దెనెక్కిన తరువాత ఆ ఊసే మరిచి నిరుద్యోగులను దగా చేశారు. నాలుగున్నర ఏళ్లు ఉలుకు పలుకు లేకుండా ఉన్న వైకాపా ప్రభుత్వం ఎన్నికల ముందు 6,100 పోస్టులతో ఉపాధ్యాయ నియామకం కోసం షెడ్యూల్‌ విడుదల చేశారు. పరీక్షల కోసం ఈ సంవత్సరం ఫిబ్రవరి 25 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. తరువాత పలు కారణాలతో తేదీలు మార్పు చేశారు. ఇంతలో ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో డీఎస్సీ వాయిదా పడింది.

దగా చేసిన జగన్‌ సర్కార్‌..

2014, 2018లో తెదేపా ప్రభుత్వం రెండు డీఎస్సీలకు ప్రకటనలిచ్చింది. 2014లో 10,313 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారు. 2018లో 7,902 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చినా కోర్టు కేసుల కారణంగా పెండింగ్‌ పడింది. దీనిపై అప్పట్లో ప్రతి పక్ష నేతగా ఉన్న తాజా మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి తెదేపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం చూపుతున్న ఖాళీలు చాలా తక్కువని, పాఠశాలలో రాష్ట్ర వ్యాప్తంగా 23 వేలకు పైగా ఖాళీలు ఉంటే కేవలం అరకొర పోస్టులతో డీఎస్సీ నిర్వహించి నిరుద్యోగలను మోసం చేస్తున్నారని బహిరంగ సభల్లో ఊకదంపుడు ప్రసంగాలు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఏటా జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌తోపాటు, డీఎస్సీ కూడా నిర్వహిస్తామని ఊదరగొట్టారు.


 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ నవోదయలో ఉపాధ్యాయ ఉద్యోగాలు

‣ బీటెక్‌లకు సైంటిస్టు కొలువులు

‣ ఉపాధికి డిప్లొమా మార్గాలు

‣ గురిపెట్టండి క్లర్కు కొలువుకు!

Published Date : 11-06-2024 10:57:09

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం