• facebook
  • whatsapp
  • telegram

Telangana budget: విశ్వవిద్యాలయాలకు రూ.500 కోట్లే!

  •  అందులో రూ.200 కోట్లు ఓయూ, మహిళా వర్సిటీలకు..
  • మిగిలిన 10 వర్సిటీలకు రూ.300 కోట్లు
  • వసతుల లేమి వేధిస్తున్నా నిధుల కేటాయింపు నామమాత్రం
  • ఆచార్యుల ఖాళీల భర్తీ ఊసెత్తని సర్కారు
     


ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు లేవు. హాస్టళ్లు తగినన్ని లేవు. పాతబడిన భవనాలు ఎప్పుడు కూలిపోతాయో అన్న ఆందోళన విద్యార్థులను వెంటాడుతోంది. ప్రభుత్వాలు మాత్రం అభివృద్ధి పనులకు అరకొర నిధులు కేటాయించి చేతులు దులిపేసుకుంటున్నాయి. గత భారాస ప్రభుత్వం 2017-18లో ఎనిమిది విశ్వవిద్యాలయాలకు రూ.420 కోట్లు, 2018-19లో రూ.210 కోట్లు కేటాయించింది. అయితే వాటిలో విడుదల చేసింది మాత్రం సగానికి మించలేదు. గత ఏడాది(2023-24) బడ్జెట్‌లో భారాస ప్రభుత్వం రూ.500 కోట్లు ప్రతిపాదించినా వర్సిటీలకు అందింది దాదాపు శూన్యమే. తాజాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా ఉన్నత విద్యాశాఖ పరిధిలోని మహిళా వర్సిటీతో కలిపి.. 12 విశ్వవిద్యాలయాలకు రూ.500 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రతిపాదించింది. మహిళా వర్సిటీకి తాజా బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ విశ్వవిద్యాలయానికి గత ప్రభుత్వం కూడా 2022-23, 2023-24 బడ్జెట్‌లలో రూ.100 కోట్ల చొప్పున ఇవ్వనున్నట్లు చెప్పినా ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం గమనార్హం.
సదుపాయాలు సమకూరేదెలా?
రూ.500 కోట్లలో రెండు విశ్వవిద్యాలయాల(ఓయూ, మహిళా వర్సిటీ)కే రూ.200 కోట్లు కేటాయించారు. మిగిలిన 10 వర్సిటీలకు మిగిలేది రూ.300 కోట్లు.. అంటే ఒక్కోదానికి సగటున రూ.30 కోట్లు మాత్రమే. ఈసారైనా పూర్తిగా నిధులిస్తారా? అన్నది వేచిచూడాలి. 
కాకతీయ వర్సిటీ గ్రంథాలయంలో వసతులు లేవు. 
జేఎన్‌టీయూహెచ్‌ కింద సిరిసిల్ల, వనపర్తితోపాటు గత ఏడాది మొదలైన పాలేరు, మహబూబాబాద్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలకు శాశ్వత భవనాలు లేవు.  
వర్సిటీల్లో 1,800 బోధనా సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీ అంశాన్ని బడ్జెట్‌లో సర్కారు ప్రస్తావించలేదు.
 

Updated Date : 26-07-2024 14:11:59

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం