• facebook
  • whatsapp
  • telegram

జేఈఈ మెయిన్‌ ఛాయిస్‌ ప్రశ్నల్లో తప్పులు

ఫలితాల్లో జాప్యం  

‣​​​​​​​ ఏటా గందరగోళమే అంటున్న విద్యార్థులు

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా పరిస్థితుల్లో విద్యార్థులకు వెసులుబాటు ఇచ్చేందుకు జేఈఈ మెయిన్‌ ప్రశ్నల్లో ఇచ్చిన ఛాయిస్‌ ప్రశ్నలు జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ)కి చుక్కలు చూపించాయి. ఛాయిస్‌ ఉన్న సెక్షన్‌-బి ప్రశ్నపత్రాల్లో తప్పులు రావడంతో ఫలితాలను ఎలా వెల్లడించాలో అర్ధంకాక జాప్యం జరిగినట్లు నిపుణులు భావిస్తున్నారు. ‘కనీసం ఫలితాలు ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పలేరా?’ అని పలువురు విద్యార్థులు ట్విటర్‌లో ఎన్‌టీఏను ప్రశ్నించడం గమనార్హం. ఏటా ఫలితాల వెల్లడిపై గందరగోళం ఎందుకు జరుగుతుందో కేంద్ర ప్రభుత్వం చూడాలని కోరుతున్నారు.

ఏటా పరేషాన్‌...

జేఈఈ మెయిన్‌ ఫలితాలపై జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) తీరు దేశవ్యాప్తంగా విద్యార్థులను పరేషాన్‌కు గురి చేస్తోంది. ఏటా ఇదే పరిస్థితి తలెత్తుతోంది. మార్చి 15 నుంచి రెండో విడత ఆన్‌లైన్‌ పరీక్షలున్నా ఫిబ్రవరి పరీక్షల స్కోర్‌ ఎప్పుడు వెల్లడిస్తారో ఎన్‌టీఏ ప్రకటించలేదు. మొత్తానికి మార్చి 7న‌ రాత్రి 11 గంటల తర్వాత తుది ‘కీ’ విడుదల చేయడంతో ఏ క్షణంలోనైనా స్కోర్‌ కూడా ప్రకటిస్తుందని లక్షల మంది ఆశగా ఎదురుచూశారు. చివరకు మార్చి 8న‌ రాత్రి 9 గంటలకు వెల్లడించారు.

ఎక్కడొచ్చిందీ సమస్య?

మెయిన్‌ ప్రశ్నపత్రంలో గణితం, భౌతిక, రసాయన శాస్త్రాలు ఉండగా.. ఒక్కో సబ్జెక్టుకు 30 ప్రశ్నలు చొప్పున 90 ప్రశ్నలు ఇచ్చారు. ఒక్కో సబ్జెక్టులో రెండు సెక్షన్లు ఉన్నాయి. ప్రతి సబ్జెక్టులో ‘బి’ సెక్షన్‌లో 10 ప్రశ్నల్లో ఏవైనా 5 ప్రశ్నలకు సమాధానం గుర్తించాలి. మిగిలినవి ఛాయిస్‌ కింద వదిలేయవచ్చు. ఉదాహరణకు ఫిబ్రవరి 24వ తేదీ 2వ స్లాట్‌ గణితంలోని రెండు ప్రశ్నలు, 26వ తేదీ మొదటి స్లాట్‌ గణితంలో ఒక ప్రశ్నలో తప్పులు దొర్లడంతో వాటిని తొలగించారు. సాధారణంగా ఆ ప్రశ్నలకు ఒక్కో దానికి 4 మార్కులు చొప్పున ఆయా స్లాట్లలో హాజరైన వారందరికీ బోనస్‌ మార్కులు కలుపుతారు. అయితే ఆ ప్రశ్నలను ఛాయిస్‌లో వదిలేసి గణితంలో 100కి 100 మార్కులు సాధించిన విద్యార్థులకు అదనంగా కలిసే మార్కుల వల్ల 100కి 108 వచ్చే ప్రమాదం ఉంది. అలాగని తొలగించిన తప్పు ప్రశ్నలను మాత్రమే ఎంచుకొని ఏదో ఒక ఇష్టం వచ్చిన జవాబులు రాసిన విద్యార్థులకు మార్కులు కలిపితే.. వాటి సాధన కోసం కుస్తీ పట్టి తమ విలువైన సమయాన్ని వృధా చేసుకున్న విద్యార్థులు అన్యాయంగా మార్కులు కోల్పోతారు. అయితే 100 మార్కులకు బదులు 108 గరిష్ఠ మార్కులకు గణితం ప్రశ్నపత్రాన్ని తీసుకున్నప్పుడు కొంత మేర న్యాయం జరిగినా, అన్ని స్లాట్ల (మొత్తం ఆరు)ను కలిపి ర్యాంకులు కేటాయించేటప్పుడు అది ఇతర స్లాట్ల వారికి ఎంతో కొంత నష్టమేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

తప్పులే...తప్పులు

ప్రాథమిక ‘కీ’లో పేర్కొన్న జవాబులను తుది ‘కీ’ కి వచ్చే సరికి మార్చారు. 24వ తేదీన నాలుగు ప్రశ్నలకు ‘కీ’ మార్చారు. గణితంలో రెండు ప్రశ్నలను తొలగించారు. 25న నాలుగు ప్రశ్నలకు ‘కీ’ మార్చగా...భౌతికశాస్త్రంలో ఒక దాన్ని తొలగించారు. 26వ తేదీన రసాయనశాస్త్రంలో నాలుగు ప్రశ్నల ‘కీ’, భౌతికశాస్త్రంలో మూడింటి ‘కీ’ని మార్చారు.  ఇంకా ఆ రోజు గణితం, భౌతికశాస్త్రంలో ఒక్కో ప్రశ్నను తొలగించారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 09-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.