• facebook
  • whatsapp
  • telegram

టెన్త్ ఎఫ్ఏ-1 మార్కుల అప్‌లోడ్‌కు ఆదేశాలు

ఏప్రిల్ 26 లోపు పూర్తి‌ చేయాలన్న ప్రభుత్వం 

ఈనాడు, హైదరాబాద్‌: పదో తరగతి వార్షిక పరీక్షలను రద్దు చేయడంతో అంతర్గత పరీక్షలుగా పిలిచే ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌-1(ఎఫ్‌ఏ-1) మార్కులపై ప్రభుత్వ పరీక్షల విభాగం దృష్టి సారించింది. ప్రధానోపాధ్యాయులు ఏప్రిల్‌ 26లోగా తమ వెబ్‌సైట్‌ ద్వారా మార్కులను అప్‌లోడ్‌ చేయాలని ఆ విభాగం సంచాలకుడు సత్యనారాయణరెడ్డి డీఈవోలను ఆదేశించారు. మొత్తం 5.21 లక్షల మంది పరీక్షల రుసుం చెల్లించారు. అందులో దాదాపు 4,500 మంది గతంలో తప్పిన వారున్నారు.

పరీక్షలు రాయకుంటే ఎలా?

ఫిబ్రవరి 1 నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభించినప్పుడు పిల్లలు పాఠశాలలకు రావాలా? వద్దా? అన్నది ఐచ్ఛికమని, ఆన్‌లైన్‌లో కూడా చదువుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. దాంతో పదో తరగతి విద్యార్థులు కొందరు బడులకు రాలేదు. ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటూ పాఠశాలల్లో చదువుకునే వారు కూడా చాలా మంది హాజరుకాలేదు. ఈ పరిస్థితుల్లో ఎంత మంది ఎఫ్‌ఏ-1 రాశారు? ఎంత మంది రాయలేదో గణాంకాలు వస్తే... అప్పుడు రాయని వారికి ఏం చేయాలన్న దానిపై పరిష్కారం వెతకాలని అధికారులు భావిస్తున్నారు. గ్రేడ్లకు ఎఫ్‌ఏ-1 మార్కులను ప్రామాణికంగా తీసుకుంటే పరీక్షలు రాయని వారికి కనీస మార్కులు ఇచ్చి పాస్‌ చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పదో తరగతి పరీక్షలు రద్దు చేసిన సీబీఎస్‌ఈ మార్కులు/గ్రేడ్ల కేటాయింపు విధానాన్ని చూసి తుది నిర్ణయం తీసుకుంటామని ఒక అధికారి తెలిపారు. ఎఫ్‌ఏ-1 మార్కుల ఆధారంగా టెన్త్‌ ఫలితాలను ప్రకటించే విషయాన్ని పరిశీలించాలని తెలంగాణ స్టేట్‌ గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజభాను చంద్రప్రకాశ్‌, రాజ గంగారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.

Updated Date : 17-04-2021 13:14:30

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం