• facebook
  • whatsapp
  • telegram

వర్సిటీల్లో చివరి సెమిస్టర్‌ కౌంటరు దాఖలు చేయండి

* యూజీసీని ఆదేశించిన సుప్రీంకోర్టు
* 31న తదుపరి విచారణ

ఈనాడు, దిల్లీ : దేశంలోని విశ్వవిద్యాలయాలన్నీ సెప్టెంబరు 30 లోగా చివరి సెమిస్టర్‌ పరీక్షలు (ఫైనల్‌ పరీక్షలు) తప్పనిసరిగా పూర్తి చేయాలన్న మార్గదర్శకాలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై కౌంటరు దాఖలు చేయాలని విశ్వవిద్యాలయాల నిధుల సంఘాన్ని (యూజీసీ) సుప్రీంకోర్టు ఆదేశించింది. జులై 29 కల్లా కౌంటరు దాఖలు చేయాలని, 30 కల్లా పిటిషనర్లు దానిపై అభిప్రాయం చెప్పాలన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణ జులై 31కు వాయిదా వేసింది. యూజీసీ మార్గదర్శకాలను తమ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిలిపివేయాలని కోరుతూ 31 మంది విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డి, జస్టిస్‌ ఎంఆర్‌ షాలతో కూడిన ధర్మాసనం సోమవారం  విచారించింది. సీబీఎస్‌ఈ నమూనాను అవలంభించాలని, ఆ మార్కులతో సంతృప్తి చెందని వారికి తర్వాత ఎపుడైనా పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి వాదనలు వినిపిస్తూ.. కరోనా సంక్షోభంలోనూ పరీక్షలు నిర్వహించాలనుకోవడం సరికాదన్నారు. పలు రాష్ట్రాలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశాయని గుర్తు చేశారు. యూజీసీ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ... ఫైనల్‌ పరీక్షలు మాత్రమే నిర్వహిస్తామని చెబుతున్నామన్నారు. దేశవ్యాప్తంగా 818 విశ్వవిద్యాలయాలు ఉన్నాయని, వీటిలో 35 వర్సిటీలకు ఇంకా చివరి సంవత్సరం పరీక్షలు నిర్వహించే స్థాయి లేదన్నారు. 209 విశ్వవిద్యాలయాలు పరీక్షలు పూర్తిచేయగా, 394 వర్సిటీలు పరీక్షలు నిర్వహించే ప్రక్రియలో ఉన్నాయన్నారు. ‘‘విద్యార్థులు ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ లేదా రెండింటినీ కలిపి ఎంచుకొనే అవకాశం ఉంది. కేంద్ర హోంశాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మార్గదర్శకాల మేరకు సామాజిక దూరాన్ని కొనసాగిస్తూ ఒక గదిలో పది మంది విద్యార్థులు మాత్రమే పరీక్షలు రాస్తారు’’ అని తెలిపారు. పిటిషనర్ల తరఫు మరో న్యాయవాది అలోక్‌ శ్రీవాస్తవ వాదనలు వినిపిస్తూ.. కరోనా కేసులు వేల సంఖ్యలో నమోదవుతున్న నేపథ్యంలో యూజీసీ మార్గదర్శకాలపై స్టే ఇవ్వాలని కోరారు. అన్ని పిటిషన్లకు కలిపి ఒకే కౌంటరు దాఖలు చేయడానికి అనుమతి ఇవ్వాలని ధర్మాసనానికి తుషార్‌ మెహతా విజ్ఞప్తి చేశారు. దీంతో ఇదే అంశంపై దాఖలైన ఇతర పిటిషన్లను కూడా జత చేసిన ధర్మాసనం తదుపరి విచారణను జులై 31కి వాయిదా వేసింది.

Published Date : 28-07-2020 11:48:47

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం