• facebook
  • whatsapp
  • telegram

తెలుగు మాధ్యమంలోనే టీవీ పాఠాలు

* ప్రభుత్వ పాఠశాలల్లో 38 శాతం ఆంగ్ల మాధ్యమం విద్యార్థులే
ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 3-10 తరగతులకు సెప్టెంబరు 1వ తేదీ నుంచి టీవీల ద్వారా ప్రసారం చేసే పాఠాలు తెలుగు మాధ్యమంలోనే ఉండనున్నాయి. దూరదర్శన్‌ యాదగిరి, టీశాట్‌ విద్య ఛానెళ్లలో ఏ రోజు ఏ తరగతికి ఏ పాఠం ప్రసారమవుతుందో సెప్టెంబరు 14వ తేదీ వరకు కాలపట్టికను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. అవి కేవలం తెలుగు మాధ్యమం పాఠశాలలే. మరి ఆంగ్ల మాధ్యమం విద్యార్థుల సంగతేమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 1-10 తరగతులు చదివే విద్యార్థుల్లో దాదాపు 38 శాతం మంది ఆంగ్ల మాధ్యమం వారున్నారు. డిజిటల్‌ పాఠాలను ప్రైవేట్‌ పాఠశాలల్లో చదివే విద్యార్థులూ వినియోగించుకోవచ్చని చెబుతున్నా వాటిల్లో 97 శాతం మంది ఆంగ్ల మాధ్యమం విద్యార్థులే కావడం గమనార్హం. కాకపోతే తెలుగు, ఆంగ్లం, హిందీ భాషా సబ్జెక్టుల పాఠాలు ఏ మాధ్యమం వారైనా ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. ఇక సమస్య అంతా సైన్స్‌, సాంఘిక శాస్త్రం, గణితం సబ్జెక్టులతోనే.. ఆంగ్ల మాధ్యమంలోనూ పాఠాలు ప్రసారం చేయాలని సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయ సంఘం(ఎస్‌జీటీయూ) ఇప్పటికే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి విన్నవించింది. ప్రస్తుతం తెలుగు మాధ్యమం పాఠాలను విజయవంతం చేయాలని, వాటి ఫలితాలను బట్టి ఆంగ్లంలోనూ ప్రసారం చేస్తామని మంత్రి చెప్పినట్లు ఎస్జీటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరివేద మహిపాల్‌రెడ్డి ‘ఈనాడు’కు తెలిపారు. దీనిపై విద్యాశాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ ఇప్పటికే ఆంగ్ల మాధ్యమంలో మోడల్‌ పాఠశాలలు యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా పాఠాలను అందిస్తున్నాయని, వాటిని వినియోగించుకోవాలన్న ఆలోచన కూడా ఉందన్నారు. టీశాట్‌లోని రెండో ఛానెల్‌ అయిన నిపుణలో ప్రత్యక్ష(లైవ్‌) పాఠాలను కూడా ఆంగ్లంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.

 

Published Date : 31-08-2020 10:14:54

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం