• facebook
  • whatsapp
  • telegram

సార్వత్రిక విద్యకు ఎదురుచూపులే!

* ఈ విద్యాసంవత్సరంలో వెలువడని ప్రవేశాల ప్రకటన
న్యూస్‌టుడే-కరీంనగర్‌ విద్యావిభాగం : ఓపెన్‌ స్కూల్‌.. అర్ధాంతరంగా చదువు మానేసిన వారికి వరం.. ఉన్నత విద్యను తిరిగి కొనసాగించేందుకు గొప్ప అవకాశం.. ఈ ఏడాది పది, ఇంటర్‌ చదవాలనుకునే ఔత్సాహికులకు నిరాశే ఎదురవుతోంది. కరోనా ప్రభావం కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రవేశ ప్రకటన వెలువడలేదు. పాఠశాలలు, కళాశాలల స్థాయిలో ప్రవేశాలు ముగింపు దశకు చేరి ఆన్‌లైన్‌, డిజిటల్‌ పాఠాలు మొదలయ్యాయి. సార్వత్రిక విద్య ద్వారా విద్యార్హతలను పెంచుకోవాలనే ఆసక్తి చూపుతున్న వారికి మాత్రం నిరాశే మిగులుతుంది.
జిల్లాలో ఎందరికో ఉపయోగకరంగా...
2008-09లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సార్వత్రిక విద్య ద్వారా చదువును మధ్యలో మానేసిన వారు పది, ఇంటర్‌లను పూర్తి చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. 14 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయస్సు గల వారు వీటిల్లో చేరేందుకు అర్హులు. ఉత్తీర్ణత సాధించిన వారు రెగ్యులర్‌ చదువులకు సమానస్థాయిలో వారికి జారీ చేసిన సర్టిఫికెట్లను ప్రభుత్వం పరిగణిస్తోంది. ఉపాధి, ఉద్యోగావకాశాలను పొందేందుకు పలువురికి ఈవిధానం జిల్లాలో ప్రయోజనకరంగా నిలుస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జిల్లా విద్యాశాఖల ఆధ్వర్యంలో పదో తరగతి అధ్యయన కేంద్రాలు 32, ఇంటర్‌ అధ్యయన కేంద్రాలు 24 పనిచేస్తున్నాయి. వారాంతం, సెలవు దినాల్లో ప్రవేశాలు పొందిన వారికి తరగతులను నిర్వహిస్తూ స్టడీ మెటీరియల్‌ను అందిస్తున్నారు. గత మూడేళ్లలో సార్వత్రిక విద్య పది, ఇంటర్‌లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,900 మందికి పైగా ప్రవేశాలను పొందగా వారిలో మెజారిటీ అభ్యర్థులు ఉత్తీర్ణతను సాధించారు. గత ఏడాది పరీక్షలు రాసిన వారందరిని కరోనా కారణంగా ప్రభుత్వం ఉత్తీర్ణులుగా ప్రకటించడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పదో తరగతిలో 1877, ఇంటర్‌లో 2,206 మంది అభ్యర్థులు లాభపడ్డారు.
ప్రకటన కోసం నిరీక్షణ
ప్రతి ఏడాది అక్టోబరులో ప్రకటన వెలువడి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతుండగా, ఈసారి ఇప్పటి వరకు వెలువడకపోవడంతో ఔత్సాహికులు నిరాశ చెందుతున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ప్రవేశాల ప్రకటన ఉంటుందా? లేదా? అనే దానిపై కూడా విద్యాశాఖ స్పష్టతనివ్వడం లేదని ఆధ్యయన కేంద్రాల బాధ్యులు పేర్కొంటున్నారు.
 

Published Date : 08-12-2020 13:15:28

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం