• facebook
  • whatsapp
  • telegram

జనవరి 2 నుంచి ఇంటర్‌ కళాశాలలు!

ఈనాడు, హైదరాబాద్‌:  వచ్చే జనవరి 2వ తేదీ నుంచి రాష్ట్రంలో జూనియర్‌ కళాశాలలను తెరవాలని విద్యాశాఖ భావిస్తున్నట్లు తెలిసింది. జేఈఈ మెయిన్‌ తేదీలు కూడా వెల్లడికావడంతో కనీసం మూడు నెలల తరగతి గది బోధన ఉండాలని అధికారులు భావించి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. అంతేకాకుండా ప్రయోగ పరీక్షల విషయంలో కొంత వెసులుబాటు ఇవ్వాలని, ప్రశ్నపత్రాల్లో కొంత ఛాయిస్‌ పెంచాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. జేఈఈ మెయిన్‌ తేదీలు వెల్లడించిన నేపథ్యంలో ఇంటర్‌ విద్యాశాఖ కమిషనర్‌ జలీల్ డిసెంబ‌రు 17న అన్ని జిల్లాల ఇంటర్‌ విద్యాశాఖ అధికారులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణ, హాజరుపై ఆరా తీశారు. ఈసారి పరీక్షల సందర్భంగా భౌతిక దూరం పాటించాల్సి ఉన్నందున కళాశాలల సందర్శించి తప్పనిసరిగా అవసరమైన వసతులపై నివేదిక ఇవ్వాలని ప్రాంతీయ ఇంటర్‌ విద్య అధికారులకు సూచించారు. డిగ్రీతో సంబంధం ఉన్న అంశాలను కచ్చితంగా ప్రాక్టికల్స్‌ చేయించాలని, మిగిలిన వాటిని తొలగించవచ్చన్న సూచనలు వచ్చినట్లు తెలిసింది.

* తక్షణమే తెరవాలి
ఇంటర్‌ కళాశాలలను తెరవడానికి ఆలస్యం చేయకుండా తక్షణమే పూనుకోవాలని, లేకుంటే ప్రభుత్వ కళాశాలల్లో చదివే పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్పొరేట్‌, ప్రైవేట్‌ కళాశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులు జరుగుతున్నాయని, ఇక ఆలస్యం చేస్తే జాతీయ, రాష్ట్ర ప్రవేశ పరీక్షల్లో ప్రభుత్వ విద్యార్థులు బాగా వెనకబడతారని ఆయన తెలిపారు.  ఏపీలో ఇప్పటికే 38 పనిదినాల్లో తరగతులు జరిగాయన్నారు.

Published Date : 18-12-2020 11:41:01

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం