• facebook
  • whatsapp
  • telegram

పోలీసు శాఖల్లో 5.31 లక్షల ఉద్యోగాలు


 వెల్ల‌డించిన కేంద్ర హోంశాఖ 

దిల్లీ: దేశంలోని వివిధ రాష్ట్రాల పోలీసు శాఖల్లో దాదాపు 5.31లక్షల ఉద్యోగాల ఖాళీలు ఉన్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. అంతేకాకుండా కేంద్ర సాయుధ బలగాల్లో(సీఏపీఎఫ్‌) సుమారు 1.27లక్షల ఖాళీలు ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ పరిధిలోని పోలీసు పరిశోధన, అభివృద్ధి సంస్థ(బీపీఆర్‌డీ) డిసెంబ‌రు 29న  ఓ ప్రకటనలో తెలిపింది. 
బీపీఆర్‌డీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ‘దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 26.23 లక్షల పోలీసు ఉద్యోగాలు మంజూరు చేయగా.. 2020, జనవరి 1 నాటికి ప్రస్తుతం 20.90లక్షల మంది విధుల్లో ఉన్నారు. ఇంకా 5.31లక్షల పోస్టులు ఖాళీలు ఉన్నాయి. కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు 11.9 లక్షల పోస్టులు మంజూరు చేయగా, 2020 జనవరి 1 నాటికి 9.82 లక్షల ఉద్యోగాల భర్తీ చేపట్టారు. ఇంకా 1.27 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాగా 2019లో దేశవ్యాప్తంగా వివిధ పోలీసు శాఖల్లో మొత్తం 1.19లక్షల నియామకాలు జరిగాయి. కాగా దేశవ్యాప్తంగా 2.15లక్షల మంది మహిళా పోలీసులు ఉన్నట్లు బీపీఆర్‌డీ తెలిపింది. 

ఆంధ్రప్రదేశ్‌లో 14,341 పోస్టులు

‣ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే పనిభారం ఎక్కువ
‘డేటా ఆన్‌ పోలీస్‌ ఆర్గనైజేషన్స్‌’ నివేదికలో వెల్లడి

ఆంధ్రప్రదేశ్‌లో 14 వేల పైచిలుకు పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగం డిసెంబ‌రు 29న  విడుదల చేసిన ‘డేటా ఆన్‌ పోలీస్‌ ఆర్గనైజేషన్స్‌’ నివేదిక వెల్లడించింది. 2020 జనవరి 1నాటికి వివిధ రాష్ట్రాల్లో ఉన్న పోలీసు బలగాల స్థితిగతులను ఈ నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం రాష్ట్రానికి 73,894 పోలీసు పోస్టులు కేటాయించగా ప్రస్తుతం 59,553 మంది మాత్రమే పనిచేస్తున్నట్లు తేలింది. ఇంకా 14,341 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం పోలీసుల్లో మహిళలు 5.85% మంది మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న లెక్కలను బట్టిచూస్తే ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల సంఖ్య తక్కువగా ఉంది. ప్రతి లక్ష మందిని 85 మంది పోలీసులు పర్యవేక్షించాల్సి వస్తోంది. ఈ అంశంలో అత్యధిక పనిభారం ఉన్న రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానంలో నిలిచింది. ప్రతి లక్ష మందికి అతితక్కువ పోలీసులున్న రాష్ట్రాల్లో 6వ స్థానంలో నిలుస్తోంది. ఉన్నతస్థానాల్లో ఖాళీలు తక్కువగా ఉన్నప్పటికీ కిందిస్థాయికి వెళ్లే కొద్దీ ఖాళీల సంఖ్య పెరుగుతూ పోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేసే మొత్తం పోలీసుల్లో ఎస్సీలు 10,913 మంది, ఎస్టీలు 4,187 మంది, ఓబీసీలు 31,408 మంది ఉన్నారు. మొత్తం పోలీసుల్లో వీరి సంఖ్య 46,508 మేర ఉంది. ప్రస్తుతం పనిచేస్తున్న మొత్తం సిబ్బందిలో వీరి నిష్పత్తి 78.09%. మహిళలు 3,483 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మొత్తం పోస్టుల్లో వీరికి 33% రిజర్వేషన్లు ఉన్నప్పటికీ ప్రస్తుతం 5.85% మాత్రమే ప్రాతినిధ్యం ఉంది. ప్రతి మహిళా పోలీసు 7,516.22 మంది మహిళలను పర్యవేక్షించాల్సిన పరిస్థితి ఉంది. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇంత తక్కువ నిష్పత్తి లేదు.

తెలంగాణలో 29,492  పోస్టులు 

సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రిసెర్చ్‌ నివేదిక వెల్లడి

 తెలంగాణలో 29,492 పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగం డిసెంబ‌రు 29న విడుదల చేసిన ‘డేటా ఆన్‌ పోలీస్‌ ఆర్గనైజేషన్స్‌’ నివేదిక వెల్లడించింది. 2020 జనవరి 1 నాటికి వివిధ రాష్ట్రాల్లో ఉన్న పోలీసు బలగాల స్థితిగతులను ఈ నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం రాష్ట్రానికి 78,369 పోలీసు పోస్టులు కేటాయించగా ప్రస్తుతం 48,877 మంది మాత్రమే పనిచేస్తున్నట్లు తేలింది. ఇంకా 29,492 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న లెక్కల ప్రకారం.. తెలంగాణలో పోలీసుల సంఖ్య మధ్య స్థాయిలో ఉంది. సివిల్‌, డిస్ట్రిక్ట్‌ ఆర్మ్‌డ్‌, స్పెషల్‌ ఆర్మ్‌డ్‌, ఐఆర్‌బీ పోలీసులు కలిపి ప్రతి లక్షమందికి 113 మందిని కేటాయించారు. ఉన్నత స్థానాల్లో ఖాళీల సంఖ్య తక్కువగా ఉన్నా కిందిస్థాయికి వెళ్లే కొద్దీ అది పెరుగుతూపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేసే మొత్తం పోలీసుల్లో ఎస్సీలు 7,943 మంది, ఎస్టీలు 5,177 మంది, ఓబీసీలు 21,746 మంది ఉన్నారు. మొత్తం పోలీసుల్లో వీరిసంఖ్య 34,866 మేర ఉంది. మొత్తం పోలీసు సిబ్బందిలో మహిళలు 2,500 మంది మాత్రమే. అతి తక్కువ మహిళా పోలీసులు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటిగా తేలింది. ప్రస్తుతం ఒక్కో మహిళా పోలీసు 7,423 మంది మహిళలను పర్యవేక్షించాల్సి వస్తోంది. ఈ విషయంలో తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్‌ తర్వాతి స్థానంలో నిలుస్తోంది.
 

స్టడీమెటీరియల్  
అర్థ‌మెటిక్‌ జనరల్ సైన్స్
ఇంగ్లిష్ రీజ‌నింగ్‌, మెంట‌ల్ ఎబిలిటీ
భార‌త‌దేశ చ‌రిత్ర‌, సంస్కృతి, భార‌త జాతీయ ఉద్య‌మం భార‌త‌దేశ భౌగోళిక శాస్త్రం, రాజకీయ‌, ఆర్థిక వ్య‌వ‌స్థ‌
నమూనా ప్రశ్నపత్రాలు పాత ప్రశ్నపత్రాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 30-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.