• facebook
  • whatsapp
  • telegram

విజువల్‌ ఆర్ట్స్‌ కళాశాలల రుసుములకూ ఓ లెక్క

* యాజమాన్యాల ఇష్టారాజ్యానికి ఇక చెల్లు
* వార్షిక ఫీజులను నిర్ధారించనున్న టీఏఎఫ్‌ఆర్‌సీ


ఈనాడు, హైదరాబాద్‌: ఎప్పుడు ప్రవేశాలు జరుగుతాయో తెలియదు.. అర్హత నిబంధనలు ఎవరిష్టం వారివి.. రుసుములపై అసలే నియంత్రణ లేదు.. జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ విశ్వవిద్యాలయం(జేఎన్‌ఏఎఫ్‌ఏయూ) పరిధిలోని విజువల్‌ ఆర్ట్స్‌, డిజైన్‌ కళాశాలల్లో పరిస్థితి ఇదీ. అందుకే ఎంసెట్‌, ఇతర ఉన్నత విద్యా కోర్సుల మాదిరిగా వీటిలో ప్రవేశాలనూ గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఫీజులను నియంత్రించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. హైదరాబాద్‌లో పలు సంస్థలు యానిమేషన్‌, విజువల్‌ ఆర్ట్స్‌, ఫిల్మ్‌ తదితర వాటికి సంబంధించి బీఎఫ్‌ఏ పేరిట కోర్సులు అందిస్తుండటంతో ఏఐసీటీఈ అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వాటికి 2019-20 మూడేళ్ల బీఏ/బీఎస్‌సీ డిగ్రీ కోర్సులుగా అనుమతి ఇచ్చింది. వాటికి జేఎన్‌ఏఎఫ్‌ఏయూ అనుబంధ గుర్తింపు ఇచ్చింది. ఇలా.. మొత్తం 23 కళాశాలలున్నాయి. ఫీజుల విషయంలో కళాశాలల యాజమాన్యాలదే ఇష్టారాజ్యమైంది. ఓ కళాశాల ఏడాదికి రూ.4 లక్షల రుసుం వసూలు చేస్తోంది. ఈ క్రమంలో కోర్సులను బట్టి ఫీజు నిర్ధారించాలని నిర్ణయించిన విద్యాశాఖ ఆ బాధ్యతను తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టీఏఎఫ్‌ఆర్‌సీ)కి అప్పగించింది. ఆయా కళాశాలలు వార్షిక రుసుం ఎంత ఉండాలో కమిటీకి ప్రతిపాదించుకున్నాయి. కమిటీ వచ్చే సంవత్సరానికి(2021-22) ఫీజులు ఖరారు చేయనుంది.

ఇతర కోర్సుల తరహాలో నిబంధనలు
విధి విధానాల తయారుకు ప్రభుత్వం కమిటీని నియమించింది. ఆ కమిటీ పలు అంశాలపై నియమ నిబంధనలు రూపొందించనుంది. ప్రాథమికంగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇవీ కొన్ని నిబంధనలు..
* ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష(ఎంట్రన్స్‌) నిర్వహిస్తారు. అభ్యర్థుల ర్యాంకులను బట్టి కళాశాలలు, కోర్సులు ఎంచుకోవచ్చు.
* ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ తదితర వాటి మాదిరిగా సీట్ల భర్తీలో రిజర్వేషన్‌ అమలు చేస్తారు.
* 70 శాతం సీట్లను కన్వీనర్‌ కోటా కింద వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేస్తారు. మిగిలిన 30 శాతాన్ని యాజమాన్య కోటా కింద కేటాయిస్తారు.

Published Date : 30-12-2020 11:47:23

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం