• facebook
  • whatsapp
  • telegram

‘పది’లో సగం బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు?

* ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ యోచన
* ఇప్పటికే సబ్జెక్టు నిపుణుల అభిప్రాయాలను తీసుకున్న ఎస్‌సీఈఆర్‌టీ

ఈనాడు, హైదరాబాద్‌: ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో పదో తరగతి వార్షిక పరీక్షల ప్రశ్నపత్రాల విధానాన్ని మార్చాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. దీనిపై రకరకాల మార్గాలను వెతుకుతోంది. విద్యార్థులకు వెసులుబాటు ఇచ్చేందుకు బహుళ ఐచ్ఛిక ప్రశ్నలను పెంచడం, అర మార్కు బదులు ఒక మార్కు కేటాయించడం, వివరణాత్మక ప్రశ్నల్లో ఛాయిస్‌ అధికంగా ఇవ్వడం, ప్రశ్నల సంఖ్యను కుదించడం, ఒక సబ్జెక్టుకు రెండు పరీక్షలకు బదులుగా ఒక  పరీక్షే జరపడం లాంటి పలు ప్రత్యామ్నాయాలపై అధికారులు ఆలోచిస్తున్నారు. వాటిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సబ్జెక్టు నిపుణుల అభిప్రాయాలను కూడా రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) అధికారులు ఇప్పటికే అడిగినట్లు తెలిసింది. రెండు వారాల క్రితం ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులతోనే చర్చించినట్లు సమాచారం. విద్యా సంవత్సరం 220 రోజులు పనిచేయాల్సిన పాఠశాలలు ఇప్పటివరకు తెరుచుకోలేదు. ఆన్‌లైన్‌లోనే బోధన సాగుతోంది. మే నెలలో వార్షిక పరీక్షలు జరపాలన్నది ప్రభుత్వ యోచన. కనీసం 9, 10 తరగతుల విద్యార్థులకైనా సంక్రాంతి సెలవుల అనంతరం బడులు తెరిచి తరగతి గది బోధన అందించాలని భావిస్తోంది. అప్పటి నుంచి లెక్కించినా 100 రోజుల పనిదినాలే వస్తాయి. అందుకే వారిపై ఒత్తిడి పడకుండా చూడాలని అధికారులు చూస్తున్నారు. తల్లిదండ్రులు మాత్రం సీబీఎస్‌ఈ పరీక్షల తేదీలను ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5.30 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు.

ఇవీ కొన్ని వెసులుబాట్లు?

* ఇప్పటికే 30 శాతం సిలబస్‌ను పరీక్షలకు మినహాయించారు. పరీక్షల్లో ఆ సిలబస్‌ నుంచి ప్రశ్నలు రావు.

* హిందీ తప్ప మిగిలిన అయిదు సబ్జెక్టులకు ఇప్పటి వరకు రెండు పేపర్లు(పరీక్షలు) ఉంటాయి. ఈసారి అన్ని సబ్జెక్టులకూ ఒకే పరీక్ష జరపాలని యోచిస్తున్నారు. అప్పుడు ఆరు పరీక్షలవుతాయి. భౌతిక, జీవశాస్త్రాలకు వేర్వేరు పాఠ్య పుస్తకాలు ఉన్నందున పరీక్షలు కూడా విడివిడిగానే పెట్టాలన్న ప్రతిపాదన ఉంది. అదే జరిగితే ఏడు పరీక్షలవుతాయి. 

* ప్రస్తుతం ఒక్కో పరీక్షకు(40 మార్కులు) 2.45 గంటల సమయం ఇస్తున్నారు. ఒక్కటే పరీక్ష నిర్వహిస్తే 3 గంటలకు కుదించాలి. అందుకే ప్రశ్నల సంఖ్యను కుదించనున్నారు. 

* వివరణాత్మక ప్రశ్నల్లో ఛాయిస్‌ పెంచడంతో పాటు సగం మార్కులకు బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు ఇచ్చే దిశగా ఆలోచిస్తున్నారు. ఇలా చేస్తే కాపీయింగ్‌కు ఎక్కువగా అవకాశం ఉంటుందని, కాపీయింగ్‌ జరగకున్నా జరిగిందని ప్రచారం చేసే అవకాశం ఉందని అందువల్ల ప్రశ్నల్లో ఛాయిస్‌ ఎక్కువ ఇవ్వడమే మంచిదని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో బడులు తెరిచాక ఆయా పరిస్థితులను అంచనా వేసి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.  

స్టడీమెటీరియల్ 
తెలుగు హిందీ
ఇంగ్లిష్ గణిత శాస్త్రం
భౌతిక రసాయన శాస్త్రం జీవశాస్త్రం
సాంఘిక శాస్త్రం  
పాత ప్రశ్నపత్రాలు నమూనా ప్రశ్నపత్రాలు

Updated Date : 06-01-2021 11:04:33

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం