• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ప్ర‌భుత్వ ఉద్యోగ సాధ‌న‌కు ప‌న్నెండు సూత్రాలు

మెల‌కువ‌లు పాటిస్తే విజ‌యం

కలలు అందరికీ ఉంటాయి. కొంతమందే సాకారం చేసుకోగలుగుతారు. ప్రభుత్వ సర్వీసును సాధించిన అభ్యర్థుల వెనుక ఉన్న కృషి ఎలాంటిది? అపజయం పొందిన అసంఖ్యాక అభ్యర్థుల్లో కనిపించే లోపాలు ఏమిటి? ఎలాంటి మెలకువలు అనుసరిస్తే లక్ష్యాన్ని చేరుకోవచ్చు? 

పోటీ పరీక్షల్లో పాల్గొని ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకునే అభ్యర్థులు కింద పేర్కొన్న మెలకువలను వివిధ దశల్లో పాటించినప్పుడే అంతిమ ఫలితం ఆశించిన రీతిలో ఉంటుంది.

విధి నిర్వహణలో ప్రజాసేవకు అవకాశంతో పాటు సామాజిక గుర్తింపు, ఉద్యోగ భద్రత, మెరుగైన జీవనం.. ఇవన్నీ ప్రభుత్వ కొలువు ద్వారా సాధ్యమవుతాయి. అందుకే  సాధారణ విద్యార్థుల నుంచి ప్రతిభావంతులైన అభ్యర్థుల వరకూ సర్కారీ కొలువులను పొందాలనే లక్ష్యం నిర్దేశించుకుంటున్నారు. 

కరోనా నేపథ్యంలో.. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోవడం.. ఉపాధి కల్పనలో విఫలమవడం...అందులోనూ అత్యధిక జనాభా ఉన్న భారతదేశంలో ప్రైవేటు రంగం ఉద్యోగకల్పనలో నీరసించిపోవడం మొదలైన అంశాల నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశలు పెంచుకునే నిరుద్యోగుల సంఖ్య మూడింతలు పెరిగిందని చెప్పవచ్చు.      

మనదేశంలో పదో తరగతి చదివిన విద్యార్థుల నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసుకునే విద్యార్థుల వరకూ వివిధ రకాలైన ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్‌ బోర్డ్, స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్, యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్, బ్యాంకింగ్‌ నియామక సంస్థలు, ఉపాధ్యాయ నియామక సంస్థలు, పోలీస్‌ నియామక సంస్థలు మొదలైనవి లక్షల ఉద్యోగాల్లో సరైన అభ్యర్థులను ఎంపిక చేసుకునేందుకు కసరత్తు చేస్తూ ఉంటాయి.

పోటీ పరీక్షల్లో నెగ్గాలంటే.. బట్టీ పట్టే తత్వం పనికిరాదు. సిలబస్‌లోని అంశాలను ఫ్యాక్ట్స్‌ ఆధారంగానే కాకుండా వివిధ కోణాల్లో చదవాలి.

అభ్యర్థులు సొంత విశ్లేషణలను పెంచుకోవాలి. బహుముఖ కోణాల్లో తయారైతే సిలబస్‌లోని అంశాలపై సమగ్ర అవగాహన ఏర్పడుతుంది.

1. ఉద్యోగం పొందడానికి తొలి సోపానం.. ఏ ఉద్యోగానికి ఒక వ్యక్తి సరిపోతారనే నిర్ణయమని చెప్పవచ్చు. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ లాంటి పోలీస్‌ ఉద్యోగాలకు శారీరక దార్ఢ్యంతో పాటు ఆంగ్ల భాషా పరిజ్ఞానం, అంకగణిత, రీజనింగ్‌ సామర్ధ్యాలు మొదలైనవి ఉండాలి. బ్యాంకింగ్‌ ఉద్యోగాలకు క్లరికల్‌ నిపుణత ఉండాలి. గ్రూప్స్,  యూపీఎస్సీ పరీక్షలకు వివిధ సబ్జెక్టులపై పట్టుతో పాటు సామాజిక, రాజకీయ, ఆర్థికశాస్త్ర, సాంకేతిక అవగాహన ఉండాలి. అందువల్ల అభ్యర్థులు ఎవరినో చూసి ఒక పోటీ పరీక్షకు పోటీపడే బదులు తాము దేనికి అర్హులవుతారో సరిగా పరిశీలించుకుని తమ సామర్ధ్యాలను బట్టి పోటీ పరీక్షలు ఎంచుకుంటే విజయానికి చేరుకునేందుకు తొలి అడుగు వేసినట్లు అవుతుంది.

2. ఏ పరీక్షలకు పోటీ పడాలో హేతుబద్ధ నిర్ణయం తీసుకున్న తరువాత సంబంధిత పరీక్షల సిలబస్‌ క్షుణ్ణంగా చదవాలి. మార్కెట్లో దొరికే ఏదో ఒక పుస్తకాన్ని చదివినట్లయితే సిలబస్‌లోని అన్ని అంశాలూ సమర్థంగా ప్రిపరేషన్‌కి సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. ‘సిలబస్‌ను సరిగ్గా అర్థం చేసుకుంటే సగం విజయం సాధించినట్లే ’ అనే సూక్తి ప్రకారం సిలబసులోని అంశాలన్నింటి పైనా, వాటిమధ్య ఉండే అంతర్గత సంబంధాల పైనా సరైన అవగాహన ఏర్పరచుకుంటే పోటీ పరీక్షల గెలుపునకు రెండో మెట్టు పడినట్లే. 

3. సన్నద్ధత ప్రారంభించకముందే- నిర్ణయించుకున్న పరీక్షకు సంబంధించిన గత ప్రశ్నపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. నమూనా ప్రశ్నపత్రాలు కూడా పరిశీలించాలి. తద్వారా ప్రశ్నల తీరుతెన్నులతో పాటు కఠినత్వం, మార్కుల వెయిటేజి, దృష్టి కేంద్రీకరించాల్సిన పాఠ్యాంశాలపై అవగాహన ఏర్పడుతుంది. పాఠాలు క్షుణ్ణంగా చదివి ప్రశ్నలకు సమాధానం ఇవ్వచ్చు. దానివల్ల సన్నద్ధత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ప్రిపరేషన్‌కు ముందు ప్రశ్నపత్రాలు చదవటం వల్ల సిలబస్‌లోని అంశాలతో పటిష్ఠమైన సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చు.

4. ప్రిపరేషన్‌ను ప్రారంభించే ముందు, వివిధ దశల్లో ప్రేరణ, మార్గదర్శకత్వాలను పొందాలి; సమస్యలను అధిగమించాలి. ఇందుకు తప్పనిసరిగా ఉద్యోగాలు పొందిన వ్యక్తులను గానీ మంచి గురువులను కానీ ఎంపిక చేసుకోవాలి. ఇది విజయానికి దోహదపడే మరో సోపానం అని చెప్పవచ్చు. సరైన మెంటర్‌షిప్‌తో అద్భుతాలు సాధించవచ్చు. అందువల్ల ఈ పోటీ ప్రపంచంలోకి అడుగుపెట్టే అభ్యర్థులు తప్పనిసరిగా సరైన సూచనలు ఇచ్చే అనుభవమున్న మెంటర్స్‌ను ఎంపిక చేసుకోవాలి. 

5. పోటీ పరీక్షల్లోకి అడుగు పెట్టేముందే ఆ పరీక్షలకు తగిన సమయం కేటాయించేందుకు సరైన సమయ ప్రణాళిక రూపొందించుకోవాలి. పరీక్షలో విజయం సాధించేందుకు ఎన్ని సంవత్సరాలు పడతాయనే విషయంపై నిర్దిష్ట నిర్ణయాలు ఉండాలి. ఏదో ఒక ప్రయత్నం చేద్దామని వచ్చేవారు ఆ ప్రయత్నం చేయకుండా వేరే పని చేసుకోవటం మేలైన నిర్ణయం. పరీక్ష సన్నద్ధతకు తగిన సమయం కేటాయించలేని పరిస్థితి ఉంటే ఆ పరీక్షలు వదిలివేయడం ఉత్తమం. సివిల్‌ సర్వీస్‌ పరీక్ష రాసేందుకు కనీసం మూడు సంవత్సరాల సమయం నిర్దేశించుకోవాలి. అలాగే పరీక్ష తీరుతెన్నులను బట్టి ఎంత సమయం పడుతుందనే విషయంపై అవగాహన పెంచుకోవడం ద్వారా ఉద్యోగ ప్రస్థానానికి సరైన మార్గాన్ని ఏర్పరచుకోవచ్చు.

6. కుటుంబం స్థితిగతులు అభ్యర్థులు ఉద్యోగ సాధనపై తప్పనిసరి ప్రభావాన్ని చూపుతాయి. కుటుంబ సభ్యుల నుంచి వచ్చే సహకారం అభ్యర్థులపై సగం భారాన్ని తగ్గిస్తుంది. కుటుంబంలో అభ్యర్థికి ఉండే స్థానాన్ని బట్టి కుటుంబానికి ఇవ్వగలిగింది ఏంటి, కుటుంబం నుంచి పొందగలిగింది ఏమిటి అనే అవగాహన ఏర్పడితే రాబోయే ప్రతిబంధకాలను దాటి అంతిమంగా ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా మహిళా అభ్యర్థుల వైవాహిక జీవితం వారి విజయ ప్రస్థానంపై  ప్రభావం చూపుతుంది. లక్షల మంది పోటీపడే ఈ పరీక్షల్లో విజయం సాధించేందుకు కుటుంబ సభ్యుల సహకారం కీలక పాత్ర పోషిస్తుందని గ్రహించి తగిన ఏర్పాట్లు చేసుకోవాలి.

7. అభ్యర్థులు పోటీ పరీక్షల్లో పాల్గొనేటప్పుడు... ప్రిపరేషన్‌కి అయ్యే వ్యయం...అందుకు అవసరమైన వనరులు సమకూర్చుకోవటంపై స్పష్టత ఉండాలి. చాలామంది పోటీ పరీక్షల కదనంలోకి దిగిన తర్వాత ఆర్థిక పరమైన ఒత్తిడి వల్ల పరీక్షపై సరైన దృష్టి నిలపలేక అపజయం పొందుతారు. 

8. శారీరక, మానసిక దృఢత్వాల పాత్ర చాలా ఎక్కువ. పరీక్ష సన్నద్ధతలో ఎదుర్కొనే ఒత్తిడి వల్ల అభ్యర్థులు శారీరకంగా మానసికంగా అనేక సందర్భాల్లో సమానంగా పోటీ పరీక్షలను ఎదుర్కోలేరు. మధ్యంతరంగా విరమించుకుంటుంటారు. అందువల్లనే అభ్యర్థులు సబ్జెక్టుల్లో ప్రిపరేషన్‌తో పాటు రోజుకు కనీసం 30- 40 నిమిషాల పాటు శారీరక పటుత్వాన్ని పెంచుకునేందుకు కృషి చేయాలి. మానసికపరమైన రుగ్మతలు ఏర్పడకుండా ధ్యానం, సంగీతం మొదలైనవాటి ద్వారా మానసిక బలాన్ని పెంచుకోవాలి. శారీరక, మానసిక బలాలు పెరిగినప్పుడు అభ్యర్ధుల గ్రహణ సామర్థ్యం, జ్ఞాపక శక్తి బాగా పెరిగినట్లు శాస్త్రీయ పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అందువల్ల సరైన ప్రణాళికలతో శారీరక మానసిక బలాన్ని పెంచుకునే ప్రయత్నం మొత్తంగా ప్రభుత్వ ఉద్యోగం పొందే ప్రిపరేషన్‌లో అంతర్భాగమే.

9. నిరంతర అధ్యయనం- విజయాన్ని సాధించే మరో కిటుకు. విజేతలందరిలో గమనించదగ్గ అంశం ఏమిటంటే- వారు విజయం పొందేందుకు ఒక ప్రయత్నం చేసి వదిలి వేయకపోవటం. అపజయాలు ఎదురైనా విజయాన్ని సాధించేందుకు నిరంతరం కృషి చేస్తూనే ఉండాలి. నోటిఫికేషన్‌ వచ్చినప్పుడు చదవటం, నోటిఫికేషన్‌ లేకపోతే వేరే అంశాలపై దృష్టిని నిలపడం వంటి లక్షణాలు విజేతల్లో కనిపించవు. అందువల్ల పోటీపరీక్షల్లో ఉద్యోగం సాధించే క్రమంలో లక్ష్యమే శ్వాసగా కొనసాగుతున్నప్పుడు అంతిమ విజయం తథ్యం. 

10. ప్రభుత్వ పోటీపరీక్షల్లో దిగువ స్థాయి ఉద్యోగాలు మినహాయిస్తే.. అత్యధిక పోటీ పరీక్షలు అభ్యర్థి సమగ్ర జ్ఞానాన్ని పరిశీలించేవిగా ఉంటాయి. అందువల్ల అభ్యర్థులు బట్టీ పట్టే తత్వాన్ని వదులుకుని సిలబస్‌లోని అంశాలను ఫ్యాక్ట్స్‌ ఆధారంగానే కాకుండా వివిధ కోణాల్లో చదివే లక్షణాల్ని అలవర్చుకోవాలి. సొంత విశ్లేషణలను పెంచుకోవాలి. సొంత దృక్పథం ఉండాలి. పరిశోధనా లక్షణాల్ని అలవర్చుకుని వివిధ కోణాల్లో తాత్విక చింతన పెంచుకోవాలి. ఇలా బహుముఖ కోణాల్లో తయారైతే సిలబస్‌లోని అంశాలపై సమగ్ర అవగాహన ఏర్పడుతుంది. ఈ సమగ్ర అవగాహన ఉంటే  ప్రశ్నలు ఏ రూపంలో వచ్చినా అభ్యర్థులు ఎదుర్కోగలుగుతారు.

11. అకడమిక్‌ పరీక్షలకూ, పోటీ పరీక్షలకూ మధ్య చాలా తేడా ఉంటుంది. అకడమిక్‌ పరీక్షల్లో నిర్దిష్ట పుస్తకాలకు ప్రాధాన్యం ఉంటుంది. దాని నుంచే ప్రశ్నలు వస్తాయి. ఆ పుస్తకంలో ఉన్న విషయాన్ని రాస్తే మంచి మార్కులు కూడా వస్తాయి. అందువల్ల అలాంటి పుస్తకాలు బట్టీ పట్టినా సరిపోతుంది. కానీ పోటీ పరీక్షల్లో కేవలం రిఫరెన్స్‌ పుస్తకాలు ఇస్తారు గానీ వాటి నుంచి ప్రశ్నలు రావాల్సిన అవసరం ఏమీ లేదు. మార్కెట్లో దొరికే పుస్తకాల నుంచి కూడా ప్రశ్నలు రాకపోవచ్చు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక పుస్తకాల నుంచి కావాల్సిన సమాచారాన్ని సంపూర్ణంగా తయారు చేసుకోవటం అభ్యర్థుల బాధ్యత.

12. అంతిమంగా...ప్రభుత్వ ఉద్యోగాల పోటీపరీక్షల్లో విజయం సాధించాలంటే ముందస్తుగా అనేక అంశాల్లో సంపూర్ణమైన అవగాహన పెంచుకోవాలి. శారీరక, మానసిక సమస్యలతో పాటు ఆర్థిక మద్దతునూ, కుటుంబ ప్రోత్సాహాన్నీ పొందినప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలరు.


 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కెరియర్‌ మెరిసే‘లా’!

‣ మనసు తెలిసి... కలిసి మెలిసి!

Posted Date : 29-09-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌