• facebook
  • twitter
  • whatsapp
  • telegram

5జీ ఉద్యోగాలు రెడీ!

5జీ సాంకేతికత... ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న మాట.టెలికమ్యూనికేషన్స్‌ రంగంలో 5వ తరం సేవలుగా అభివర్ణిస్తున్న ఈ సాంకేతికత దేశంలో శరవేగంగా విస్తరిస్తోంది. ఎన్నో వింతలు.. విశేషాలతో మన ముంగిట్లోకి వచ్చింది. ఇదే సమయంలో ఈ రంగంలో కెరియర్‌ను తీర్చిదిద్దుకోవాలనుకునే యువత కోసం ఉపాధి అవకాశాలను మోసుకొస్తోంది. ఇప్పటికే ఉన్న ఉద్యోగులకు మెరుగైన మార్గాలుచూపడమే కాకుండా, కొత్తవారికీ అవకాశాలు కల్పించనుంది.

 

 

2జీ.. 3జీ.. 4జీ.. ఇలా ఇప్పటివరకు మనం విని ఉన్నాం. టెలికమ్యూనికేషన్స్‌ రంగంలో వాయిస్‌ సేవలు మొదలుకుని మొబైల్‌ డేటా వరకు ఆయా జనరేషన్‌(జీ) సేవలతో లబ్ధిపొందాం. ఇప్పుడు వర్చువల్‌గా మనిషిని ఇతర సాధనాలతో అనుసంధానం చేసేలా 5జీ సాంకేతికత వచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రంగాల్లో పెనుమార్పులకు కారణం కానుంది. అత్యధిక డేటా వేగంతో వినియోగదారులకు గరిష్ఠ ప్రయోజనాలతో సేవలు అందనున్నాయి. దీన్ని ఏ ఒక్క కంపెనీ ప్రత్యేకంగా ఆవిష్కరించకపోయినా.. ప్రాథమిక సాంకేతికతను అభివృద్ధి చేయడంలో క్వాల్‌కామ్‌ కంపెనీ ముఖ్యపాత్ర పోషించింది. ప్రపంచంలో తొలిసారిగా 2019 ఆరంభంలో 5జీ సేవలు అందుబాటులోకి రాగా.. ఇప్పటికే 60 దేశాల్లో వినియోగంలో ఉంది. ఇది ఆర్థోగొనల్‌ ఫ్రీక్వెన్సీ డివిజన్‌ మల్టీప్లెక్సింగ్‌(ఓఎఫ్‌డీఎం) విధానంలో పనిచేస్తుంది.

 

2.28 కోట్ల ఉద్యోగాలు 

రానున్న రోజుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై 5జీ సాంకేతికత చెరగని ముద్ర వేస్తుందని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది. వస్తు, సేవల రంగంలో 13.1 ట్రిలియన్‌ డాలర్ల (రూపాయల్లో అయితే 1 పక్కన 15 సున్నాలు చేర్చాలి) మార్కెట్‌ను ఇది ఆక్రమిస్తుందని నిపుణుల అంచనా. 

 

తరాల వారీగా సేవలు

1జీ: 1980ల్లో ప్రారంభమైంది. అనలాగ్‌ వాయిస్‌ సేవలు మాత్రమే అందించింది.

2జీ: 1990ల్లో అందుబాటులోకి వచ్చింది. డిజిటల్‌ వాయిస్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 

3జీ: 21వ శతాబ్దం ఆరంభంలో మొదలైంది. మొబైల్‌ డేటా సేవలు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. 

4జీ: 2010, ఆ సమయంలో అందుబాటులోకి వచ్చింది. మొబైల్‌ బ్రాండ్‌బ్యాండ్‌ రంగంలో సరికొత్త మార్పునకు నాంది పలికింది.

5జీ: మిగిలిన నాలుగు తరాల సేవల కంటే విభిన్నమైంది. కొత్త పద్ధతులు, విభిన్న సేవలు అందించేలా తీర్చిదిద్దారు. అత్యధిక వేగం.. ఉన్నత విలువలతో కూడిన విరామం లేని బ్రాడ్‌బ్యాండ్, కమ్యూనికేషన్‌ సేవలు అందిస్తుంది. ఉదాహరణకు 4జీ సాంకేతికతలో ఒక సినిమా డౌన్‌లోడ్‌ కావాలంటే కొన్ని నిమిషాల సమయం పట్టేది. ఇప్పుడు 5జీ సాంకేతికతతో రెప్పపాటులో అల్ట్రా హెచ్‌డీ సినిమాలను డౌన్‌లోడ్‌ చేసేయొచ్చు!

 

ఏయే రంగాల్లో కీలకం?

5జీ సాంకేతికత ప్రతి రంగంపైనా ప్రభావం చూపనుంది. ఆటోమొబైల్‌ రంగంలో పెనుమార్పులు తీసుకురానుంది. భద్రతతో కూడిన రవాణా వ్యవస్థ, రిమోట్‌ ప్రాంతాలకు ఆరోగ్యసేవలు, వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత వినియోగం, సరకు రవాణాలో డిజిటల్‌ సేవలు వంటి ఎన్నో అంశాల్లో కీలకం కానుంది. 

మొబైల్‌ బ్రాడ్‌బాండ్‌: స్మార్ట్‌ఫోన్లలో వినియోగిస్తున్న డేటా సేవలు గణనీయంగా మెరుగుపడనున్నాయి. వీఆర్, ఏఆర్‌ సాంకేతికతలో వేగం పెరగనుంది. ఎలాంటి అంతరాయాలు లేకుండా డేటా తక్కువ ధరకే అందుబాటులోకి రానుంది.

రిమోట్‌ ఆధారిత సేవలు: పరిశ్రమల్లో కీలకమైన పరికరాలు, సాంకేతికతను రిమోట్‌ కంట్రోల్‌ సాయంతో ఆపరేట్‌ చేసే వీలు కలగనుంది. కీలకమైన వసతులు, వాహనాలు, మెడికల్‌ సేవలను ఈ తరహాలో ఆపరేట్‌ చేయవచ్చు.

మరింతగా ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌: వర్చువల్‌ విధానంలో ఒకేసారి అనేక సెన్సర్లతో అనుసంధానమైన పనులు చేయవచ్చు.

 

కోర్సులు ఇలా

5జీ సాంకేతికతపై తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా వివిధ విద్యాసంస్థల్లో పీజీ డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఇవి దాదాపుగా ఆన్‌లైన్‌ కోర్సులే. కొన్ని బీటెక్‌ అర్హతతో చదివే వీలుండగా.. మరికొన్నిచోట్ల ఏదైనా డిగ్రీ అర్హతతో అందిస్తున్నారు.

ఐఐటీ రూర్కీలో ‘పీజీ సర్టిఫికెట్‌ ఇన్‌ 5జీ టెక్నాలజీ అండ్‌ ఐవోటీ’లో ఆరు నెలల కోర్సు ఆన్‌లైన్‌లో అందిస్తోంది. జులై నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ 6, 9 నెలల వ్యవధితో ‘పీజీ అడ్వాన్స్‌డ్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ 5జీ టెక్నాలజీ విత్‌ ఏఐ అండ్‌ క్లౌడ్‌’ పేరిట కోర్సులు అందిస్తోంది. 

హైదరాబాద్‌లోని ఐఐటీ నోకియా సాయంతో 5జీ నెట్‌వర్క్‌పై స్వల్పకాలిక కోర్సులు అందిస్తోంది.

ఐఐటీ దిల్లీ 5జీ-అప్లికేషన్స్‌ ఇన్‌ ఐవోటీ, ఏఐ పేరిట ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌ అందిస్తోంది. దీని కాల వ్యవధి 8 నెలలు.

ఐఐటీ మద్రాస్‌ ప్రవర్‌తక్‌ టెక్నాలజీస్‌ ఫౌండేషన్, మేగం సొల్యూషన్స్‌ సంయుక్తంగా ఆరు నెలల కోర్సు అందిస్తున్నాయి. 5జీ, ఐవోటీలో నెక్స్ట్‌ జనరేషన్‌ మొబైల్‌ వైర్‌లెస్‌ నెట్‌వర్క్స్‌ పేరిట కోర్సు అందుబాటులో ఉంది. బీటెక్, ఎంటెక్, ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్, పీహెచ్‌డీతోపాటు నిపుణులకూ అవకాశం కల్పిస్తున్నారు. 

ఎన్‌ఐఐటీ, నోకియా బెల్‌ ల్యాబ్స్‌ సంయుక్తంగా ఆన్‌లైన్‌లో ఆరు వారాల 5జీ ఫౌండేషన్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ అందిస్తున్నాయి.

 

మన దేశంలో దీని విలువ సుమారు రూ.3.26 లక్షల కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. రానున్న నాలుగైదేళ్లలో దేశంలో 2.28 కోట్ల ఉద్యోగాల కల్పన జరగనుంది.

పరికరాల తయారీ, నిర్వహణ, కంటెంట్‌ రూపకర్తలు, యాప్‌ డెవలపర్స్, వినియోగదారుల పరంగా ఉద్యోగాలు రానున్నాయి. వీటన్నింటిలో 5జీ ప్రమేయం ఉంటుంది.

 

- యార్లగడ్డ అమరేంద్ర, హైదరాబాద్‌
 

Posted Date : 09-06-2022 .

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌