• facebook
  • twitter
  • whatsapp
  • telegram

అటవీ పరిశోధన కోర్సుల్లో ప్రవేశాలు

* ఎఫ్‌ఆర్‌ఐడీయూలో పీజీ అడ్మిషన్‌ నోటిఫికేషన్‌


పర్యావరణ సమతుల్యానికి కీలకం అడవులే. ఉన్నవాటిని పరిరక్షించి, కొత్తగా వృద్ధి చేయడం, అటవీ ఉత్పత్తులకు విలువను జోడించడానికి నిపుణుల సేవలు తప్పనిసరి. ఇందుకోసం దేశంలో ప్రత్యేకంగా కొన్ని సంస్థల ఆధ్వర్యంలో కోర్సులు అందిస్తున్నారు. దేహ్రాదూన్‌లోని ఫారెస్ట్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అలాంటిదే. ఇక్కడ పలు పీజీ కోర్సులు నడుపుతున్నారు. వాటిలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది!


అడవులపై సమగ్ర అవగాహన కలిగించి, నైపుణ్యం ఉన్న మానవ వనరులను సమగ్రంగా తీర్చిదిద్దడానికి దేహ్రాదూన్‌లో ఎఫ్‌ఆర్‌ఐ నెలకొల్పి, కోర్సులు అందిస్తున్నారు. అలాగే అటవీ ఉత్పత్తులైన కలప మొదలైనవి సమర్థంగా ఉపయోగించడంపైనా మెలకువలు నేర్పుతున్నారు. వృక్ష సంపదను వృద్ధి చేయడానికి అనుసరించాల్సిన పద్ధతులు, విధానాలపై శిక్షణ ఇస్తున్నారు. ఈ కోర్సులు చదివినవారు సంబంధిత విభాగాల్లో అవకాశాలు అందుకుంటున్నారు. పరీక్షలో ప్రతిభతో ప్రవేశాలుంటాయి.


ఏ కోర్సు? ఎన్ని సీట్లు?

ఎమ్మెస్సీ ఫారెస్ట్రీ

సీట్లు: 43

అర్హత: బోటనీ/కెమిస్ట్రీ/జియాలజీ/మ్యాథ్స్‌/ఫిజిక్స్‌/జువాలజీ/అగ్రికల్చర్‌/ఫారెస్ట్రీ వీటిలో ఏదైనా ఒక సబ్జెక్టుతో బ్యాచిలర్‌ డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

కోర్సులో: అడవులను ఎలా పరిరక్షించాలి, ఎదురవుతోన్న ఇబ్బందులు, పట్టణాల్లో పచ్చదనం పెంచడం, వృక్షాలకు వచ్చే వ్యాధులు-నివారణ, అడవులను వృద్ధి చేయడమెలా..తదితర అంశాలను తెలుపుతారు. వీరికి ప్రభుత్వ సంస్థల్లో, ఎన్జీవోల్లో అవకాశాలుంటాయి.  


ఎమ్మెస్సీ వుడ్‌సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

సీట్లు: 43

అర్హత: 50 శాతం మార్కులతో ఎంపీసీ గ్రూపులో బీఎస్సీ లేదా బీఎస్సీ ఫారెస్ట్రీ ఉత్తీర్ణత

కోర్సులో: కర్ర/చెక్కను వివిధ ఉత్పత్తుల్లో, తయారీలో ప్రభావంతంగా ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకోవచ్చు. వృక్ష ధర్మాలు, కర్ర, చెక్కలను ఎలా పరిరక్షించాలో నేర్పుతారు. వీరికి చెక్క ఆధారిత తయారీ సంస్థల్లో అవకాశాలు లభిస్తున్నాయి. 


ఎమ్మెస్సీ ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌

సీట్లు: 43

అర్హత: 50 శాతం మార్కులతో బేసిక్‌/అప్లయిడ్‌ సైన్సెస్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ లేదా బీఎస్సీ ఫారెస్ట్రీ/అగ్రికల్చర్‌ లేదా బీఈ/బీటెక్‌ ఎన్విరాన్‌మెంట్‌ సైన్స్‌ చదివుండాలి. 

కోర్సులో: వీరు పర్యావరణ సమస్యలు, వాటిని అధిగమించే విధానాలపై దృష్టి సారిస్తారు. వాతావరణ మార్పులు, జీవ వైవిధ్యం, అటవీకరణ విధానాలను తెలుసుకుంటారు. ప్రపంచానికి ఎదురవుతోన్న పర్యావరణ సమస్యలకు పరిష్కారాలను అధ్యయనం చేస్తారు. వీరికి ప్రభుత్వ సంస్థలు, ఎన్జీవోలు, కార్పొరేట్‌ సంస్థల్లో అవకాశాలుంటాయి. 


ఎమ్మెస్సీ సెల్యులోజ్‌ అండ్‌ పేపర్‌ టెక్నాలజీ సీట్లు: 26

అర్హత: కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా సైన్స్‌ డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా 50 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌ కెమికల్‌/ మెకానికల్‌ ఇంజినీరింగ్‌. 

కోర్సులో: వృక్షాల నుంచి కాగితం తయారీకి సంబంధించిన విషయాలను వీరు అధ్యయనం చేస్తారు. సాంకేతికతను ఉపయోగించి, తక్కువ వృథాతో పెద్ద మొత్తంలో కాగితాన్ని ఎలా ఉత్పత్తి చేయవచ్చో తెలుసుకుంటారు. వీరికి కాగిత పరిశ్రమ, వస్తు తయారీ, ప్యాకింగ్‌ సంస్థల్లో అవకాశాలు ఉంటాయి. రెండో ఏడాది కోర్సులో భాగంగా వీరు సెంట్రల్‌ పల్ప్‌ అండ్‌ పేపర్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీపీపీఆర్‌ఐ), సహరాన్‌పూర్‌లో చదువుతారు. 

పై అన్ని కోర్సులకూ ప్రస్తుతం యూజీ చివరి ఏడాది చదువుతున్నవారూ అర్హులే. ఎస్సీ, ఎస్టీలైతే 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత సరిపోతుంది. ఒకటి కంటే ఎక్కువ కోర్సుల్లో చేరాలనుకున్నవారు కోర్సులవారీగా విడిగా దరఖాస్తు, ఫీజు చెల్లించాలి. పరీక్ష ఇలా..

ఆబ్జెక్టివ్‌ తరహాలో 200 ప్రశ్నలుంటాయి. వీటిని 4 విభాగాల్లో అడుగుతారు. పరీక్ష వ్యవధి 3 గంటలు. 

1. సైన్స్, సోషల్‌ సైన్స్‌లో ప్రాథమికాంశాల నుంచి 100 ప్రశ్నలు

2. అరిథ్‌మెటిక్, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీస్, కంప్యుటేషనల్‌ ఎబిలిటీ, క్వాంటిటేటివ్‌ రీజనింగ్, టేబుల్స్, గ్రాఫ్స్‌ ఇంటర్‌ప్రిటేషన్‌లో 40  

3. జనరల్‌ నాలెడ్జ్, కరంట్‌ అఫైర్స్‌ నుంచి 30  

4. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, కాంప్రహెన్షన్, వొకాబ్యులరీ, గ్రామర్, ఇడియమ్స్‌.. మొదలైనవాటి నుంచి 30 ప్రశ్నలు వస్తాయి. 

ప్రతి ప్రశ్నకూ 4 ఆప్షన్లు ఇస్తారు. వాటిలో సరైనది గుర్తించాలి. ప్రతి తప్పు సమాధానానికీ ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో నాలుగో వంతు తగ్గిస్తారు.


ముఖ్య వివరాలు

దరఖాస్తు: యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు వివరాలు నింపి, డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. రిజిస్ట్రార్, ఎఫ్‌ఆర్‌ఐ, దేహ్రాదూన్‌ పేరుతో రూ.1500 ఫీజు డీడీ జతచేసి పోస్టులో పంపాలి.

చిరునామా: రిజిస్ట్రార్, ఎఫ్‌ఆర్‌ఐ డీమ్డ్‌ టు బి యూనివర్సిటీ, దేహ్రాదూన్‌-248195 దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 8. 

ఆన్‌లైన్‌ రిమోట్‌ ప్రోక్టర్డ్‌ పరీక్ష తేదీ: మే 19.

వెబ్‌సైట్‌: http://fridu.edu.in/

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఈ నైపుణ్యాలే ఫ్రెషర్లకు ధీమా!

‣ జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకుందాం ఇలా..

‣ ట్రెండింగ్‌ విద్యావిధానం.. టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్‌ లెర్నింగ్‌!

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ ఆరు మెట్లతో ఆఫర్‌ లెటర్‌ అందుకోండిలా!

‣ వాయిదా వేస్తే.. వెనుకపడ్డట్లే!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

Posted Date : 15-02-2024 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌