• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మేనేజ్‌మెంట్ కోర్సుల‌కు ఉందిగా.. సీమ్యాట్‌!

2021కి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసిన ఎన్‌టీఏ

డిగ్రీ ఉంటే చాలు.. వ‌య‌సుతో సంబంధం లేదు

మీకు ఏదైనా బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉందా.. అయితే వ‌య‌సుతో సంబంధం లేకుండా సీమ్యాట్ ప్ర‌వేశ ప‌రీక్ష రాసి... మేనేజ్‌మెంట్ కోర్సుల్లో చేర‌వ‌చ్చు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూషన్ ల‌లో మేనేజ్‌మెంట్‌ కోర్సుల ప్రవేశాలకు 2021 విద్యాసంవ‌త్స‌రానికి ప్ర‌క‌ట‌న వెలువ‌‌డింది. ఏటా భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వశాఖ ఉన్నత విద్యా విభాగానికి చెందిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) కామన్ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్ టెస్ట్ (సీమ్యాట్) నిర్వహిస్తుంది. అభ్య‌ర్థులకు వ‌చ్చిన ర్యాంకు ఆధారంగా ఆయా ఇన్‌స్టిట్యూష‌న్లు మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తాయి. 

ఎవ‌రు అర్హులు: 
ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. 2021-22 విద్యాసంవత్సరం ప్రవేశాలు మొదలయ్యేనాటికి పరీక్షా ఫలితాలు వెలువడిన డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సీమ్యాట్-2021 పరీక్షకు వయసుతో సంబంధం లేదు.

పరీక్షా విధానం: 

కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్‌ టెస్ట్(సీబీటీ) ఉంటుంది. దీనికి 3 గంటల సమయం కేటాయించారు. 2021-22 విద్యాసంవత్సరానికి మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్షలో నాలుగు విభాగాలు ఉన్నాయి. అవి.. 

1) క్వాంటిటేటివ్ టెక్నిక్ అండ్ డాటా ఇంట‌ర్‌ప్రెటేష‌న్‌: 25 ప్ర‌శ్న‌లు- 100 మార్కులు

2) లాజికల్ రీజనింగ్: 25 ప్ర‌శ్న‌లు- 100 మార్కులు

3) లాంగ్వేజ్ కాంప్రిహెన్ష‌న్: 25 ప్ర‌శ్న‌లు- 100 మార్కులు

4) జనరల్ అవేర్‌నెస్‌: 25 ప్ర‌శ్న‌లు- 100 మార్కులు

ప్రశ్నాపత్రం ఇంగ్లిష్ మాధ్యమంలో ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది. ఇందులో 100 ప్రశ్నలుంటాయి, ఒక్కోదానికి 4 మార్కులు చొప్పున 400 మార్కులకు నిర్వహిస్తారు. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. అభ్యర్థులు సాధించే స్కోర్‌తో సీమ్యాట్-2021లో పాల్గొనే సంస్థలకు విడివిడిగా దరఖాస్తు చేసుకోవాలి.  అనంతరం పాల్గొనే ప్రతి సంస్థ వారి నిర్దిష్ట కట్ ఆఫ్ మార్కులను విడుదల చేస్తుంది. అర్హత సాధించిన అభ్యర్థలకు ఆయా ఇన్‌స్టిట్యూట్లు గ్రూప్ డిస్కషన్(జీడీ), పర్సనల్ ఇంటర్వ్యూ(పీఐ) నిర్వహిస్తాయి. అభ్యర్థి తుది ఎంపిక వీటిపైనే ఆధారపడి ఉంటుంది.

స‌న్న‌ద్ధ‌త ఇలా..

సీమ్యాట్ కోసం నిర్దిష్టమైన ప్రణాళికతో సిద్ధమవ్వాలి. గతేడాది ప్రశ్నాపత్రాలను పరిశీలిస్తే ఎలాంటి ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయో అవ‌గాహ‌న వ‌స్తుంది. మాక్ ప‌రీక్ష‌ల‌ను సాధ‌న చేస్తే ఉప‌యోగ‌క‌రం. మార్కెట్లో సీమ్యాట్‌కు సంబంధించిన పుస్తకాలు ల‌భిస్తాయి. అవి కొంత వ‌ర‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వాటిలోని ప్ర‌శ్న‌ల‌ను నిరంతర‌ సాధ‌న చేస్తే ప‌రీక్ష‌లో సుల‌భంగా స‌మాధానాల‌ను గుర్తించ‌వచ్చు. ప‌‌రీక్షలో నాలుగు విభాగాలు ఉంటాయి. వాటి గురించి క్లుప్తంగా..

1) క‌్వాంటిటేటివ్ టెక్నిక్స్ అండ్ డాటా ఇంట‌ర్‌ప్రెటేష‌న్.. స‌మ‌స్య‌ల‌కు సైద్ధాంతిక భావ‌న‌ల మేళ‌వింపు

ఇందులో ఆల్‌జీబ్రా, జీయోమెట్రీ, టైం-స్పీడ్‌-డిస్టెన్స్‌,  అలెగేష‌న్‌‌&మిక్స‌ర్స్‌, గ్రాఫ్‌, క్వాడ్రాటిక్ అండ్ లైనియ‌ర్ ఈక్వేష‌న్ వంటి ముఖ్య‌మైన టాపిక్స్ ఉంటాయి. ఈ విభాగం నుంచి 25 ప్ర‌శ్న‌లు అడుగుతారు. అవి ఆర్థ‌మెటిక్ కు చెందినవి. అలాగే డాటా ఇంట‌ర్‌ప్రెటేష‌న్ ప్ర‌శ్న‌లు పట్టికల రూపంలో ఉంటాయి. ఇందుకోసం గణిత అంశాలు, సూత్రాలపై ప‌ట్టు సాధించాలి. ఎక్కాలు గుర్తుంచుకోవ‌డంతోపాటు స్క్వేర్‌, స్క్వేర్ రూట్ మొద‌లైన వాటిని గుర్తుంచుకోవాలి. ప్రతి అంశాన్ని వివరంగా అధ్యయనం చేసి, నమూనా ప్రశ్నలను సాధన చేయాలి. సమస్యలకు సైద్ధాంతిక భావనలను ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకోండి.

2) లాజికల్ రీజనింగ్.. వీలైనంత సాధ‌న అవ‌స‌రం

ఈ విభాగంలో అనలిటిక‌ల్ రీజ‌నింగ్‌, లైనియ‌ర్ అరెంజ్‌మెంట్స్‌, నంబ‌ర్ సిరీస్‌, మ్యాట్రిక్స్ అరెంజ్‌మెంట్స్, బ్ల‌డ్ రిలేష‌న్‌షిప్ టెస్ట్ టాపిక్స్ ఉంటాయి. లాజికల్ రీజనింగ్ కోసం నమూనా ప్రశ్నలను వీలైనంత సాధ‌న చేయండి. ఈ విభాగంలో అధిక మార్కులు సాధించ‌డానికి ఇదొక్క‌టే మార్గం. ఈ ప్ర‌శ్న‌ల‌ను ఎంత బాగా ప‌రిష్క‌రిస్తే అంత మంచి స్కోరు సాధించ‌వ‌చ్చు. లాజికల్ రీజనింగ్ వెయిటేజీ ఇతర విభాగాల మాదిరిగానే ఉంటుంది. 

3) లాంగ్వేజ్ కాంప్రిహెన్ష‌న్‌.. పుస్త‌కాలు ఎంత చ‌దివితే అంత మంచిది

ఇందులో రీడింగ్ కాంప్రిహెన్ష‌న్, గ్రామ‌ర్‌, ఇంగ్లిష్ యూసెజ్ ఎర్ర‌ర్స్, పారాజుంబెల్స్ కు సంబంధించిన ప్ర‌శ్న‌లు అడుగుతారు. లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ విభాగంలో ఆరు ప్రశ్నలతో ఒక రీడింగ్ కాంప్రిహెన్ష‌న్ ప్యాసేజ్ ఇస్తారు. దాన్ని అర్థం చేసుకోవ‌డం సుల‌భ‌మే. ఈ విభాగంలో స్కోర్ చేయ‌డానికి క‌చ్చితంగా 8 నుంచి 10 ప్రశ్నలుండే ప్యాసేజ్‌ల‌పై దృష్టి సారించాలి. మిగ‌తా ప్ర‌శ్న‌లు పారా జంబుల్స్, ఖాళీలు పూరించ‌డం, ఇడియమ్స్, వాక్యనిర్మాణాల్లో దోషాల‌ను స‌రిదిద్ద‌డం వంటివి అడుగుతారు. లాంగ్వేజ్ కాంప్రిహెన్ష‌న్ విభాగానికి సిద్ధం కావ‌డానికి పుస్త‌కాల‌ను చ‌ద‌వ‌డం అలవాటు చేసుకోండి. ఎంత ఎక్కువగా చదివితే మీ పదజాలం, వ్యాకరణం, పఠన గ్రహణశక్తి అంత పెరుగుతుంది. 

4) జనరల్ అవేర్‌నెస్..  ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటూ ముందుకెళ్లాలి

ఎకాన‌మీ, బిజినెస్‌, వ‌ర‌ల్డ్‌, పాలిటిక్స్‌, స్పోర్ట్స్‌, క‌ల్చ‌ర్, సొసైటీకి సంబంధించి 25 ప్ర‌శ్న‌లుంటాయి. ఈ విభాగంలో నూరు శాతం మార్కులు సాధించాలంటే అభ్య‌ర్థులు క‌‌చ్చితంగా ‌జాతీయ‌, అంత‌ర్జాతీయ సంబంధ వ్య‌వ‌హారాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటూ ముందుకెళ్లాలి.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

ద‌ర‌ఖాస్తు రుముసు: జనరల్ పురుష అభ్యర్థులకు- రూ. 2000, జనరల్ స్త్రీ అభ్యర్థులకు- రూ.1000, ఇతర కేట‌గిరీల‌కు సంబంధించిన‌ స్త్రీ, పురుష అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు: 

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.12.2020

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 22.01.2021

పరీక్ష తేది: 2021 ఫిబ్రవరి 22, 27

వెబ్‌సైట్‌: https://cmat.nta.nic.in/

Posted Date : 25-12-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌