• facebook
  • twitter
  • whatsapp
  • telegram

తీర‌ద‌ళంలో ఆఫీస‌ర్ కొలువు

కోస్ట్‌గార్డ్ క‌మాండెంట్ ఆఫీస‌ర్ ప్ర‌క‌ట‌న విడుద‌ల 
 

ఉత్సాహవంతులైన గ్రాడ్యుయేట్ల కోసం భారతీయ తీరదళం ఎదురుచూస్తోంది. పురుషుల నుంచి అసిస్టెంట్‌ కమాండెంట్‌ ఉద్యోగానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎంపికైతే నేరుగా గ్రూప్‌-ఎ గెజిటెడ్‌ ఆఫీసర్‌ పోస్టు సొంతం చేసుకోవచ్చు. వీరికి ఉద్యోగం, బాధ్యతలు, వేతనం.. అన్నీ ఉన్నతస్థాయిలో ఉంటాయి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్టుల ద్వారా నియామకాలు చేపడతారు. 
 

జనరల్‌ డ్యూటీ విభాగంలో భర్తీ చేసే ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అకడమిక్‌ మెరిట్‌ ఆదారంగా తగిన అర్హతలు ఉన్నవారికి స్టేజ్‌-1 పరీక్ష నిర్వహిస్తారు. ప్రాథమిక ఎంపికలో భాగంగా మెంటల్‌ ఎబిలిటీ టెస్టు/ కాగ్నిటివ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు, పిక్చర్‌ పర్సెప్షన్‌ అండ్‌ డిస్కషన్‌ టెస్టు (పీపీ అండ్‌ డీటీ) ఉంటాయి. ఆప్టిట్యూడ్‌ టెస్టు ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలు వస్తాయి. పీపీ అండ్‌ డటీ కోసం ఆంగ్లం లేదా హిందీలో మాట్లాడాలి. ఇందులో భాగంగా ఏదైనా చిత్రాన్ని చూపించి వ్యాఖ్యానించమంటారు. స్టేజ్‌ -1లో ఎంపికైనవారికి స్టేజ్‌-2 నిర్వహిస్తారు. ఇందులో సైకలాజికల్‌ పరీక్షలు, గ్రూప్‌ టాస్క్, ఇంటర్వ్యూ ఉంటాయి. స్టేజ్‌-2లోనూ ఎంపికైనవారికి మెడికల్‌ పరీక్షలు నిర్వహించి తుది నియామకాలు చేపడతారు. ఉద్యోగానికి ఎంపికైనవారి వివరాలు మే, 2021లో కోస్టు గార్డు వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు. వీరికి జూన్‌ ఆఖరు నుంచి ఇండియన్‌ నేవల్‌ అకాడెమీ (ఐఎన్‌ఏ), ఎజిమలలో శిక్షణ ప్రారంభమవుతుంది. 
 

ఉద్యోగంలో...
విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారిని అసిస్టెంట్‌ కమాండెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఈ సమయంలో రూ.56,100 మూలవేతనం చెల్లిస్తారు. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు ఉంటాయి. వీరు తక్కువ వ్యవధిలోనే డెప్యూటీ కమాండెంట్, కమాండెంట్‌ హోదాలు పొందవచ్చు. భారత సముద్రతీరాన్ని కాపాడటం వీరి ప్రాథమిక విధి. ప్రమాదంలో చిక్కుకున్న మత్స్యకారులనూ రక్షించాలి. కింది స్థాయి ఉద్యోగులకు దిశానిర్ద్దేశం చేయాలి. 
 

వీటిని తీసుకెళ్లాలి...
ప్రిలిమినరీ పరీక్షలకు వెళ్లినప్పుడే అడ్మిట్‌ కార్డు ప్రింటవుట్లు రెండు తీసుకుని వాటికి కలర్‌ పాస్‌పోర్టు పరిమాణం ఫొటోలు జతచేయాలి. 10, 12 (ఇంటర్‌), డిగ్రీ ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, ఏదైనా ఒక గుర్తింపు పత్రం, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ సర్టిఫికెట్లు తీసుకెళ్లాలి. పరీక్షకు ఆరు నెలల ముందు తీసుకున్న క్యారక్టర్‌ సర్టిఫికెట్, నీలం రంగు బ్యాక్‌ గ్రౌండ్‌తో ఉన్న ఇటీవల తీసుకున్న 12 పాస్‌పోర్టు పరిమాణం ఉన్న ఫొటోలు తీసుకెళ్లాలి. సర్టిఫికెట్లను పరిశీలించి పరీక్ష అనంతరం తిరిగి ఇచ్చేస్తారు. సర్టిఫికెట్లు లేకుండా పరీక్షకు అనుమతించరు. 
 

విద్యార్హత, వయసు ఇలా...
పోస్టు: అసిస్టెంట్‌ కమాండెంట్‌ (గ్రూప్‌-ఎ గెజిటెడ్‌ ఆఫీసర్‌) జనరల్‌ డ్యూటీ (పురుషులు)
అర్హత: కనీసం 60శాతం అగ్రిగేట్‌ మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. ఇంటర్మీడియట్లో మ్యాథమేటిక్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టులను చదివి ఉండడం తప్పనిసరి. అలాగే వీటిలోనూ 60 శాతం మార్కులు ఉండాలి. 
వయసు: అభ్యర్థులు జులై 1, 1996 - జూన్‌ 30, 2000 మధ్య జన్మించి ఉండాలి. ఈ రెండు తేదీలనూ పరిగణనలోకి తీసుకుంటారు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి. అభ్యర్థులు 157 సెం.మీ. ఎత్తు, దానికి తగ్గ బరువు ఉండాలి. 
 

ఏ తేదీల్లో?
ఖాళీలు: 25. వీటిలో ఎస్సీలకు 5, ఎస్టీలకు 14, ఓబీసీలకు 6 కేటాయించారు. 
ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభ తేదీ: 21.12.2020
దరఖాస్తు చివరితేది: 27.12.2020  
ప్రవేశపత్రాలు: జనవరి 6 నుంచి 10 వరకు కోస్టుగార్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.
పరీక్ష తేదీ: స్టేజ్‌-1 ప్రాథమిక పరీక్షలు జనవరి 10, 2021 - ఫిబ్రవరి 10, 2021 లోగా ఎప్పుడైనా ఉండవచ్చు.
పరీక్ష కేంద్రాలు: ముంబయి, చెన్నై, కోల్‌కతా, నోయిడా. 
వెబ్‌సైట్‌: https://www.joinindiancoastguard.gov.in/
 

Posted Date : 15-12-2020 .

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌