• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఊరించే ఆటలే ఉపాధికి బాటలు!

ఆన్‌లైన్‌ గేమింగ్‌లో ఎన్నో అవకాశాలు 


గేమింగ్‌ పరిశ్రమ సరికొత్త అవకాశాలతో యువతను ‘రా.. రమ్మ’ని పిలుస్తోంది. ఈ నేపథ్యంలో కేవలం ఆన్‌లైన్‌ గేమ్స్‌తో కాలం గడిపేయకుండా అసలు గేమ్స్‌ తయారుచేసే సంస్థల్లో ఉండే ఉపాధి అవకాశాల గురించి తెలుసుకుందాం. నయా అవకాశాలతో దూసుకెళ్లే ఈ రంగంపై యువత దృష్టి పెడితే ఇష్టమైన రంగంలో స్థిరపడ్డామన్న తృప్తీ, మంచి ఆదాయం వస్తుందన్న సంతృప్తీ.. రెండూ ఏకకాలంలో సాధించుకోవచ్చు! కావాల్సిందల్లా ఆసక్తితో సరైన మార్గదర్శకత్వంతో ముందుకు సాగడమే!   

భారతీయ గేమింగ్‌ పరిశ్రమ శరవేగంతో విస్తరిస్తూ 2021 నాటికి 10 వేల కోట్ల రూపాయల స్థాయికి చేరుకుంటుందని ఓ అంచనా. దేశ జనాభాలో 75 శాతానికి పైగా 45 సంవత్సరాల్లోపు వయసు వారుండడం, వారిలో అధిక శాతం మంది ఇంటర్నెట్‌ను వాడుతూ ఉండడం గేమింగ్‌ పరిశ్రమకు కలిసి వస్తున్న అంశాలు. గత ఆర్నెల్ల కాలంలో దేశంలోని వాణిజ్య కార్యకలాపాలెన్నో స్తంభించిపోయినా ఈ పరిశ్రమ మాత్రం దూసుకుపోతూవచ్చింది. లాక్‌డౌన్‌ కాలంలో కాలక్షేపం కోసం ఆడే ఆటలకు గిరాకీ పెరిగిపోయింది.  ఆన్‌లైన్‌ ఆటలు ఆడేవారిలో 60 శాతానికి పైగా 18 నుంచి 24 సంవత్సరాల వయసువారు. వారిలో కూడా 70 శాతం వరకూ అబ్బాయిలు, 30 శాతం అమ్మాయిలు ఉన్నట్టు ఒక సర్వేలో తేలింది. ఇటీవల భారతప్రభుత్వం చైనాకు సంబంధించిన పబ్జీ సహా చాలా యాప్స్‌ను నిషేధించింది. ఆ సందర్భంలో ప్రధాని మోదీ ‘ఇప్పుడిక భారతీయ గేమింగ్‌ పరిశ్రమ ముందుకు రావలసిన సమయం ఆసన్నమైంది’ అంటూ పిలుపునిచ్చారు. ఇది మన గేమింగ్‌ పరిశ్రమకు ఊపునిచ్చే అంశమే.  గేమింగ్‌ లోకంలో ఎంతో విస్తారమైన అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వాటిని అందిపుచ్చుకునేందుకు సిద్ధమైపోవచ్చు. కోర్సుల విషయానికి వస్తే.. జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న విజువల్‌ ఆర్ట్స్‌ డిగ్రీ కళాశాలల్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

డిగ్రీ కాలేజీల్లో అందిస్తోన్న కోర్సులివీ..
బి.ఎ. ఆనర్స్‌- గేమ్‌ ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌ (నాలుగేళ్ల కోర్సు)
బీఎస్సీ ఆనర్స్‌- కంప్యూటర్‌ సైన్స్, గేమ్‌ డెవలప్‌మెంట్‌ (నాలుగేళ్ల కోర్సు)
బి.ఎ. ఆనర్స్‌- యానిమేషన్‌ అండ్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ (మూడేళ్ల కోర్సు) 
ఆయా కళాశాలల వెబ్‌సైట్లలో మరింత సమాచారం లభిస్తుంది. ఇవేకాక, చాలా ప్రైవేటు సంస్థలు కూడా తక్కువ వ్యవధిలో ఉండే కోర్సులను అందిస్తున్నాయి. 3డి యానిమేషన్‌ కోర్సులు చేసినవారు కూడా గేమింగ్‌ పరిశ్రమలోకి ప్రవేశించవచ్చు. 

గేమింగ్‌ స్టూడియోలో... 
గేమింగ్‌ స్టూడియోలోకి వెళ్లి..  అక్కడ ఎవరెవరు ఏమేం పనులు చేస్తుంటారు... తెలుసుకుందాం...గేమ్స్‌ తయారీలో ప్రధానంగా 2 విభాగాలుంటాయి. గేమ్‌ ఆర్ట్‌, గేమ్‌  ప్రోగ్రామింగ్‌.ఈ విభాగాల్లోని వారే కాకుండా... గేమ్స్‌ పబ్లిషర్, గేమ్స్‌ ప్రొడ్యూసర్, కమ్యూనిటీ మేనేజర్, ఈ-స్పోర్ట్స్‌ ప్రొడ్యూసర్, లీడ్‌ గేమ్స్‌ డిజైనర్, గేమ్‌ ప్లే డిజైనర్, లెవెల్‌ డిజైనర్, రైటర్, యూఎక్స్‌ డిజైనర్‌ కూడా ఉంటారు. 

గేమ్‌  ప్రోగ్రామింగ్‌ విభాగం

గ్రాఫిక్స్‌ ప్రోగ్రామర్‌
గేమ్‌ను చూడచక్కగా మెరుగులు దిద్దేది గ్రాఫిక్స్‌ ప్రోగ్రామర్లే. ఉదాహరణకు మంట, నీరు, చర్మం.. ఇలా ఏది తీసుకున్నా అత్యంత సహజసిద్ధంగా అవి మన కళ్ల ముందు ఉన్నట్టు తీర్చిదిద్దేది వీళ్లే. గేమ్‌ వేగం, ఆడే తీరుకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా  ఆర్ట్‌ వర్క్‌కు గ్రాఫిక్స్‌ జోడిస్తారు. రెండరింగ్, ఆప్టిమైజేషన్, మాథ్స్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ పని చేయాల్సి ఉంటుంది. బలమైన కోడ్స్‌ రాయగలగడం వీరికి ఉండాల్సిన మరో కీలకమైన అర్హత. గేమ్స్‌ ను కంప్యూటర్, మొబైల్స్, ట్యాబ్స్‌ వంటి వేర్వేరు ప్లాట్‌ఫార్మ్స్‌పై ఆడే క్రమంలో ఎదురయ్యే సాంకేతిక అవరోధాలపై వీరికి అవగాహన అవసరం. 

ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ (ఏఐ) ప్రోగ్రామర్‌
గేమ్‌కు సంబంధించిన మెదడును సృష్టించేది ఏఐ ప్రోగ్రామర్లే. గేమ్‌లో ప్లేయర్‌ నియంత్రణలో ఉండని క్యారెక్టర్‌లను ‘నాన్‌ ప్లేయబుల్‌ క్యారెక్టర్‌’ (ఎన్‌పీసీ) అంటారు. ప్లేయర్‌ వేసే సవాళ్ళకు ఇవి ఎప్పుడు, ఎలా స్పందించాలి? అనేది ఏఐ ప్రోగ్రామింగ్‌ కోడ్‌తో నిర్ణయమవుతుంది. ఎన్‌పీసీలు కూడా ఆలోచించేలా, ఉద్వేగాలను వ్యక్తీకరించేలా ప్రోగ్రామింగ్‌లో అనుమతులు ఇస్తారు. అంటే ప్రోగ్రామింగ్‌ నైపుణ్యం ఉండటం వీరికి ఉండాల్సిన అర్హత అన్నమాట. కొంగొత్త కోడ్‌ లాంగ్వేజ్‌లపై అవగాహన ఉండాలి. కంప్యూటర్, మొబైల్స్, ల్యాప్‌టాప్‌ తరహా వివిధ మాధ్యమాల్లో ఏఐ ఏ రకంగా పనిచేస్తుంది? అనేది గుర్తెరిగి పని చేయాలి.ఏ పాత్ర ఎలా ప్రవర్తిస్తుంది? దాని మనస్తత్వం ఏమిటి? అనే అంశాల ఆధారంగా ఏఐ కోడింగ్‌ చేయడమనేది మరో కీలకాంశం.

గేమ్‌ ప్లే ప్రోగ్రామర్‌
గేమ్‌లోని క్యారెక్టర్ల మధ్య పరస్పర చర్యలకు సంబంధించిన కోడింగ్‌ రాసేది గేమ్‌ ప్లే ప్రోగ్రామరే. ఉదాహరణకు గేమ్‌లోని రెండు పాత్రలు యుద్ధం చేసుకుంటాయని లీడ్‌ డిజైనర్‌ కోడ్‌ రాస్తే.. అది జరిగేలా చేసేది, కమాండ్స్‌ ఇచ్చేది మాత్రం గేమ్‌ ప్లే ప్రోగ్రామరే. వీళ్లు లెవెల్‌ డిజైనర్లతో కలిసి సమన్వయంతో పనిచేస్తారు. గేమ్‌లో ఏ క్యారెక్టర్‌ .. ఏ సమయంలో ఎక్కడ.. ఎలా స్పందించాలి? ఎలాంటి ప్రతిచర్య జరపాలి? అనేది కోడింగ్‌ ద్వారా నిర్ణయించేది గేమ్‌ ప్లే విభాగమే. గేమ్‌ ఆడే క్రమంలో బగ్స్‌ ఎదురుకాకుండా వాటిని ఫిక్స్‌ చేసేది కూడా వీరే. బగ్స్‌ బారిన పడకుండా గేమ్‌లోని అన్ని రకాల కోడింగ్‌లను మేళవించే సామర్థ్యం ఉండడం అవసరం.

గేమ్‌ ఆర్ట్‌ విభాగం కాన్సెప్ట్‌ ఆర్టిస్టు
కాన్సెప్ట్‌ ఆర్టిస్టుల పాత్ర గేమ్స్‌ రూపకల్పనలో కీలకమైనది. గేమ్‌ ఎలా కనిపిస్తుంది? గేమ్‌ శైలి ఏమిటి? అనేది పూర్తిగా అతడి సృజనాత్మకత పైనే ఆధారపడి ఉంటుంది. ముందుగా గేమ్‌లోని పరిసరాలను, ప్లేయర్‌ క్యారెక్టర్లను, వారి శత్రువులను గీయాల్సి ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రతి ఆర్ట్‌ వర్క్‌కు వాళ్ళు దారి చూపించే చుక్కాని లాంటి వాళ్ళు. కాన్సెప్ట్‌ను ఆకళింపు చేసుకొని దాన్ని ప్రతిబింబించే డ్రాయింగ్‌ను చేతితో వేయగలగడం వీరికి ఉండాల్సిన ముఖ్యమైన నైపుణ్యం. ఫ్యాంటసీ, సైన్స్‌ ఫిక్షన్, కార్టూన్‌ ఇలా ఏదైతే ఆ నేపథ్యానికి సరితూగేలా డ్రాయింగ్‌ వేసే నైపుణ్యం అవసరం. గేమ్‌ ఆడే క్రమంలో గేమర్‌ పొందే అనుభూతి ఎలా ఉంటుంది .. మార్కెట్‌ లో ఏ తరహా గేమ్‌లకు ఎలాంటి క్రేజ్‌ ఉంది..అనే వివరాలపై అవగాహన, నిరంతర ఆసక్తి వీరికి ఉండాలి. 

3డీ మోడలింగ్‌ ఆర్టిస్ట్‌
గేమ్‌ లోని పాత్రలు (క్యారెక్టర్‌), ఆయుధాలు, వాహనాలు, ఫర్నిచర్, చెట్లు, రాళ్లు, గుట్టలు వంటి వాటిని 3డీలో తయారుచేసేది 3డీ మోడలింగ్‌ ఆర్టిస్టులే. వాళ్ళు నేరుగా.. లేదా కాన్సెప్ట్‌ ఆర్టిస్టు వేసిన 2డీ డ్రాయింగ్‌ ప్రాతిపదికగా వీటికి 3డీ రూపం ఇస్తారు. గేమ్‌ ప్రాజెక్టు అవసరాలకు అనుగుణంగా కొన్ని సందర్భాల్లో 3డీ మోడలింగ్‌ ఆర్టిస్టులు కొన్ని ప్రత్యేక విభాగాల చిత్రాలను మాత్రమే వేయాల్సి ఉంటుంది. అప్పుడు పని చేసే విభాగాన్ని బట్టి వారిని.. ఎన్విరాన్మెంట్‌ ఆర్టిస్ట్‌ లేదా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ లేదా వెహికిల్‌ ఆర్టిస్ట్‌ వంటి పేర్లతో పిలుస్తారు. 3డీ సాఫ్ట్‌వేర్‌లకు సంబంధించిన సరికొత్త పరిజ్ఞానం, టెక్నిక్‌లను ఉపయోగించి 3డి మోడల్స్‌ సృష్టించగలగడం వీరికి ఉండాల్సిన కీలకమైన నైపుణ్యం. ఎందుకంటే 3డీ లో తయారుచేసిన మోడల్స్‌ను వీరు గేమ్‌ ఇంజిన్‌లో ఇమిడేలా చేయాల్సి ఉంటుంది. సగటు గేమర్‌ గేమ్‌ ఆడుతున్నప్పుడు ఆయా క్యారెక్టర్‌ లేదా వాహనం కదలికలతో ఎలాంటి అనుభూతి పొందుతాడు అనేది వీళ్లు ఊహించగలగాలి.

3డీ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌
గేమ్‌లోని పాత్రలకు తుదిరూపునివ్వడం క్యారెక్టర్‌ డిజైనర్ల బాధ్యత. క్యారెక్టర్‌ స్వరూపానికి తుది మెరుగులద్దే పని కూడా వీరిదే. పాత్ర హావభావాలు, ముఖ కవళికలు, శరీర భాగాల కదలికలు సహజసిద్ధంగా కనిపించేలా తీర్చిదిద్దేది వీరే. పాత్ర ఎలా ఉండాలి? దాని శైలి ఎలా ఉంటే బాగుంటుంది? అనే దానిపై క్యారెక్టర్‌ డిజైనర్లు నిరంతరం అధ్యయనం చేస్తారు. ఇది పూర్తిగా వారి డ్రాయింగ్‌ నైపుణ్యాలపై ఆధారపడి ఉండే అంశం. క్యారెక్టర్లను కాగితంపైనో, డిజిటల్‌గానో గీయొచ్చు. వీరు ఒక్కో క్యారెక్టర్‌ కోసం ఎన్నో డిజైన్లు గీసి డైరెక్టర్‌కు చూపిస్తారు. తర్వాత డైరెక్టర్‌ ఇచ్చే సలహాలకు అనుగుణంగా వాటిలో మార్పులు, చేర్పులు చేస్తారు.

ఎన్విరాన్మెంట్‌ ఆర్టిస్ట్‌ 
గేమ్‌లోని పరిసరాల సృష్టికర్త. ఆఫీసు నుంచి అడవి దాకా, చిన్న గుట్టల నుంచి మహా పర్వతాల దాకా.. అడవుల నుంచి సముద్రాల దాకా ప్రతి దాన్నీ జీవకళ ఉట్టిపడేలా రూపమిచ్చేది ఇతడే. కాన్సెప్ట్‌ ఆర్టిస్టు తయారుచేసే 2డీ ఆర్ట్‌ను వీరు.. 3డీ రూపంలోని ఎన్విరాన్మెంట్‌గా మారుస్తారు. అవసరమైతే కొన్ని ఫొటోలు.. గ్రాఫిక్స్‌ను జోడిస్తారు. ఈక్రమంలో లెవెల్‌ డిజైనర్లు నిర్దేశించే గేమ్‌ ప్లే నిబంధనలకు లోబడి డిజైన్లను రూపొందిస్తారు. గేమ్‌లోని మిషన్‌కు అన్ని హంగులూ జోడిస్తారు. ప్రాథమిక దశలో వీరు గేమ్‌ ఇంజిన్‌కు సంబంధించిన సాంకేతిక అవరోధాల గురించి తెలుసుకుంటారు. గేమ్‌లో అనవసరమైన సాగదీత లేకుండా.. పోలిగాన్‌ కౌంట్‌ (తక్కువ ఫైల్‌ సైజు) వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ పని చేయాల్సిన అవసరాన్ని గ్రహిస్తారు. డ్రాయింగ్‌ నైపుణ్యంతో పాటు పరిసరాల రంగు, స్వరూపం, కాంతి, వాతావరణాలకు అనుగుణంగా కూర్పు ఎలా ఉండాలనేదానిపై వీరికి అవగాహన ఉండటం అత్యవసరం.

టెక్స్చరింగ్‌ ఆర్టిస్ట్‌
గేమ్‌ లోని వస్తువులు, పరిసరాలు, క్యారెక్టర్లకు అదనపు హంగులు జోడిస్తాడు. ఉదాహరణకు ఒక ఆయిల్‌ క్యాన్‌పై అది పాతది అనిపించేలా ఉండటం కోసం తుప్పు మరకలు జోడిస్తాడు. అవసరమైనప్పుడు ఒక వస్త్రాన్ని చిరిగినట్లు చూపిస్తాడు. కిటికీలపై ప్రతిబింబాలు పడేలా చేస్తాడు. ఈ మార్పులన్నీ సహజత్వం ఉట్టి పడేలా ఉంటాయి. దీంతో తాము కంప్యూటర్‌ ప్రపంచంలో గేమ్‌ ఆడుతున్నామనే విషయాన్ని గేమర్‌ మర్చిపోతాడు. ఇందుకోసం హ్యాండ్‌ పెయింటింగ్, ఫోటోలు, డిజిటల్‌-3డీ ఆర్ట్‌లు వాడతారు. తాము జోడించే ఎఫెక్ట్‌లు ఎలా పని చేస్తున్నాయో తెలుసుకునేందుకు మెటీరియల్స్, షేడర్స్, మ్యాపింగ్‌లను వాడతారు. మెటీరియల్స్‌ విభిన్న పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తాయి అనేది అర్థం చేసుకోగలగడం వీరికి ఉండాల్సిన కీలక నైపుణ్యాల్లో ఒకటి. 

యానిమేటర్‌..
2డీ, 3డీ ఆర్టిస్టులు తయారుచేసిన క్యారెక్టర్లకు యానిమేషన్‌తో జీవం పోసి, అవి కదిలేలా చేసేది ఇతడే. గేమ్‌ లోని క్యారెక్టర్లు, వాహనాల కదలికలను సృష్టించేది యానిమేటరే. గేమ్‌లోని పాత్రలకు వ్యక్తిత్వం, ఉద్వేగం, వాస్తవికత జోడించే కీలక పని ఇతనిదే. వీరికి ప్రోగ్రామింగ్‌పై, గేమ్‌ ఇంజిన్‌లపై మంచి అవగాహన ఉండాలి. వివిధ రకాల కదలికల కోసం విభిన్న భంగిమలను తయారుచేసి లైబ్రరీలో సేవ్‌ చేసి పెట్టుకుంటారు. ఆయా క్యారెక్టర్‌ల అవసరాలకు అనుగుణంగా వీటిని వాడుతారు. గేమ్‌ ప్లే ఇంటరాక్టివ్‌ గా ఉండేందుకు గేమ్‌ ఇంజిన్‌ను పూర్తిస్థాయిలో వాడుకుంటారు. పాత్ర కదలికలతో పాటు దాని ఉద్వేగాలు, హావభావాలు, ఆలోచనా ధోరణి ప్రతిబింబించేలా యానిమేషన్‌ చేయడం వీరి ప్రధాన విధి. గేమ్‌ను గేమర్‌ ఆడుతున్నప్పుడు ఎలాంటి అనుభూతి పొందుతాడు, క్యారెక్టర్ల కదలికలు ఎలా కనిపిస్తాయి అనేదానిపై వీరికి అవగాహన అవసరం. 

రిగ్గింగ్‌ ఆర్టిస్ట్‌ 
3డీ క్యారెక్టర్ల సృష్టికి మూలమైన ప్రాథమిక రూపురేఖలకు రిగ్గర్‌ జీవం పోస్తాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక క్యారెక్టర్‌కు సంబంధించిన డిజిటల్‌ స్కెలెటిన్‌ రూపకల్పన ఇతడి ప్రధాన పని. ఇతడు రూపొందించే  వాటిని రిగ్స్‌ (3డీ పప్పెట్స్‌) అంటారు. క్యారెక్టర్‌ హావభావాలు ఎలా ఉంటాయో నిర్ణయించేది ఇక్కడే. ఒక పిల్లి ఎలా నడుస్తుంది ? ఒక వ్యక్తి పాట పాడినప్పుడు అతడి ముఖం, నోరు ఎలా కనిపిస్తాయి? కనురెప్ప కదలికలు ఎలా ఉంటాయి? వంటివన్నీ నిర్ణయించేది రిగ్గింగ్‌ ఆర్టిస్టే. యానిమేటర్లు క్యారెక్టర్ల కదలికలను సృష్టించే క్రమంలో రిగ్గింగ్‌ ఆర్టిస్టులు సిద్ధం చేసిపెట్టిన రిగ్స్‌నే వాడతారు. మోడెలర్స్‌ తయారుచేసిన 3డీ మోడల్స్‌ను వాడి రిగ్స్‌ను రూపొందిస్తారు. క్యారెక్టర్‌లోని అన్ని శరీర భాగాలకు చెందిన హావభావాలను సిద్ధం చేస్తారు. ఒక క్యారెక్టర్‌ పాట పాడేటప్పుడు దాని నోరు, నాలుక, కళ్ళు, చెవులు, చేతులు, కడుపు కదలికలు ఎలా ఉండాలో అలా తీర్చిదిద్దుతారు. అంటే యానిమేషన్‌ ప్రాథమిక సూత్రాలపై అవగాహన ఉండటం ముఖ్యమన్న మాట. అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్, బ్లెండర్, సినిమా 4డీ, మాయా, మోషన్‌ బిల్డర్, రెండర్‌ మ్యాన్, ఎక్స్‌ఎస్‌ఐ, జీ బ్రష్, 3డీ ఎస్‌ మ్యాక్స్‌ వంటి ప్రోగ్రాంలను వాడే నైపుణ్యం వీరికి ఉండాలి. 

Posted Date : 16-09-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌