• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Consultancies: నకిలీ పట్టాలు.. విదేశాల్లో కొలువులు

ప్రముఖ వర్సిటీల ఇంజినీరింగ్, డిగ్రీ సర్టిఫికేట్లు
రూ.75 వేలకే ఇస్తున్న కన్సల్టెన్సీలు 

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికాలో ఎంఎస్‌ చేయాలా?.. లండన్‌ యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించాలా?.. సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో కొలువులు కావాలా?. ఇచ్చేస్తామంటూ కొందరు అక్రమార్కులు విద్యార్థులు.. ఉద్యోగార్థులను నమ్మించి రూ.లక్షల్లో తీసుకుని విదేశాలకు పంపుతున్నారు.. విదేశీ యూనివర్సిటీలు, కార్పొరేటు సంస్థలకు అనుమానాలు రాకుండా ప్రముఖ వర్సిటీల్లో చదివినట్టు... తక్కువమార్కులు వచ్చినవారికి ఎక్కువ మార్కులు వచ్చినట్టు నకిలీ పట్టాలు, మార్కుల జాబితాలు తయారు చేస్తున్నారు. 
హాలోగ్రామ్‌ మాయ.. ఆన్‌లైన్‌లో ధ్రువీకరణ..
విదేశీ వర్సిటీలు, కంపెనీల్లో కొలువులు ఇప్పిస్తామంటూ అక్రమాలు చేస్తున్న కన్సల్టెన్సీలు అక్కడి విశ్వవిద్యాలయాలు, కార్పొరేటు కంపెనీలను మాయచేసేందుకు నకిలీ సర్టిఫికేట్లను అసలైన పట్టాల్లా తయారు చేస్తున్నారు. వీసా సేవల కన్సల్టెన్సీలతో అక్రమార్కులు సత్సంబంధాలు నిర్వహిస్తుండడంతో ఎక్కడా అనుమానాలు రావడం లేదు.  ః పట్టాలను తయారు చేసేటప్పుడు అప్పట్లో ఉన్న ఉపకులపతుల పేర్లు తెలుసుకుని సంతకాలు పెడుతున్నారు. హాలో గ్రాములూ తయారు చేస్తున్నారు. ః ఎలాంటి అర్హతలు లేకుండా విదేశాల్లో చదివేందుకు వెళ్లేవారికి ఒక ధర, ఇంజినీరింగ్, డిగ్రీల్లో తక్కువ మార్కులు వచ్చినవారి మార్కుల జాబితాల్లో ఎక్కువ వేసి మరో ధర వసూలు చేస్తున్నారు. ః క్యూబెజ్‌ కన్సల్టెన్సీ యజమాని నవీద్‌ యూకేలోని టీసైడ్, బ్లాక్‌పూల్, అమెరికాలోని షిల్లర్, కంకోర్డియా విశ్వవిద్యాలయాల్లో చదివేందుకు వీలుగా విద్యార్థులకు నకిలీ పట్టాలను తయారుచేసి పంపాడు. వరంగల్‌లోని వేర్వేరు కన్సల్టెన్సీలు నిర్వహిస్తున్న రవి అవినాశ్, శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు ఎక్కువగా ఐరోపాలోని వేర్వేరు దేశాలకు విద్యార్థుల్ని పంపించారు. ః హైదరాబాద్, వరంగల్‌ నుంచి నకిలీ పట్టాలతో వెళ్లిన విద్యార్థులు ఇంకా చదువుకుంటుండగా... సుమారు 500మంది వేర్వేరు సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో పనులు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. వారి వివరాలను సేకరిస్తున్నారు.

Posted Date : 19-01-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌