• facebook
  • twitter
  • whatsapp
  • telegram

చివ‌రిద‌శ ప్రిప‌రేష‌న్ స‌రిగా సాగుతోందా?

తుది స‌న్న‌ద్ధ‌త‌కు నిపుణుల సూచ‌న‌లు

జాతీయ స్థాయి పరీక్ష.. ‘గేట్‌’ను ఇంజినీరింగ్‌లో పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలకు అఖిల భారత స్థాయిలో నిర్వహిస్తారు. దీనిలో సాధించిన ఉత్తమమైన స్కోరు సాంకేతిక విద్యకే కాకుండా అంతర్జాతీయంగా అత్యుత్తమ సంస్థల్లో ఉద్యోగావకాశాలకూ తోడ్పడుతుంది. వివిధ విభాగాలకు నిర్వహించే గేట్‌ - 2021కు 3-4 వారాల కాలవ్యవధి మాత్రమే ఉంది. ఈ తుది సమయంలోని సన్నద్ధత ఉత్తమ ర్యాంకుకు ఎంతో ముఖ్యం. మరి ఈ కీలక తరుణంలో మెలకువలతో ఎలా ప్రిపేరవ్వాలో చూద్దాం!

గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌) అభ్యర్థులు ఇప్పటికే సమగ్రంగా సిద్ధమై ఉంటారు. దీనికి మరికొంత తుది మెరుగులు దిద్దుకోవడానికి ఇప్పుడున్న సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. గేట్‌ స్కోరు ఆధారంగానే వివిధ ఐఐటీలు, ఐఐఎస్‌సీ బెంగళూరు, ఇతర విశ్వవిద్యాలయాల్లో ఎంఈ/ ఎంటెక్‌/ ఎంఎస్‌/ పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశంతోపాటు నెలవారీ రూ.12,400 ఉపకార వేతనం లభిస్తుంది. గేట్‌ స్కోరు ఆధారంగా వివిధ మహారత్న, మినిరత్న, ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. అందువల్ల గేట్‌ ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

ఏ విషయాల్లో జాగ్రత్తపడాలి?

గేట్‌ పరీక్షలో సిలబస్‌లో ఉన్న అన్ని సబ్జెక్టులకూ ప్రాధాన్యం లభిస్తుంది. అభ్యర్థులు ఏ సబ్జెక్టునూ నిర్లక్ష్యం చేయకుండా అన్నింటిలో ప్రతి అధ్యాయాన్నీ చదవాలి.

సృజనాత్మకంగా, పరిశోధనాత్మకంగా ఉన్న ప్రశ్నల కోసం మౌలికాంశాలను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి.

కొన్ని అధ్యాయాలు కఠినంగా ఉంటాయి. వీటిని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. అందువల్ల సబ్జెక్టు మీద పూర్తిగా పట్టు లేనివారు పరీక్ష సమయం చాలా దగ్గర పడినందున అలాంటివాటికి ఎక్కువ సమయం కేటాయించడం ఆచరణీయం కాదు. అందువల్ల వీటి సన్నద్ధతకు ఎక్కువ సమయం కేటాయించవద్దు.

కొన్ని ప్రశ్నలకు పూర్తిగా సమాచారం ఇవ్వరు. తార్కికంగా ఆలోచించి వాటికి సమాధానం రాబట్టాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రశ్నలు ప్రామాణిక గ్రంథాల్లోని అభ్యాస ప్రశ్నల్లో ఉంటాయి.

గత కొన్ని సంవత్సరాల నుంచి గేట్‌లో న్యూమరికల్‌ ప్రశ్నలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ ప్రశ్నల సమాధానాలు సమయపాలనను దృష్టిలో పెట్టుకుని తప్పక సాధన చేయాలి.

గేట్‌- 2021 పరీక్షలో కొత్తగా ప్రవేశపెట్టనున్న బహుళ ఎంపిక ప్రశ్నలపై (మల్టిపుల్‌ సెలెక్ట్‌ క్వశ్చన్స్‌) తగిన అవగాహనతో సాధన చేయాలి.

ఈ సంవత్సరం గేట్‌ను ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులూ రాయనున్నందున పోటీ పెరుగుతుందని మరవవద్దు.

రెండు పేపర్లలో ఈ పరీక్షను రాయదలచిన అభ్యర్థులు ఆ రెండో పేపరులోని అదనపు సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

గేట్‌కు దరఖాస్తు చేసుకున్న కామర్స్, ఆర్ట్స్‌ విద్యార్థులు అంటే బీఎస్‌సీ/ బీఏ విద్యార్థులు ఆ విభాగాల్లో గేట్‌ పరీక్షను మొదటిసారిగా నిర్వహిస్తున్నందున ఈ పరీక్షపై తగినంత అవగాహన పెంపొందించుకోవాలి.

గేట్‌ 2021 పరీక్ష సిలబస్‌లో కొత్తగా చేర్చిన అంశాలను కూడా దృష్టిలో ఉంచుకుని సాధన చేయాలి.

గతంలో అడగని అంశాలపై (అన్‌ ట్యాప్‌డ్‌ ఏరియాస్‌) శ్రద్ధ వహించాలి.

ధీమా వద్దు

ఈ సమయాన్ని పునశ్చరణ (రివిజన్‌) సమయంగా భావించవచ్చు.

ఇప్పటివరకూ సిద్ధమైన ప్రతి అంశాన్నీ తప్పనిసరిగా పునశ్చరణ చేయాలి.

అభ్యర్థులు ముందుగా తయారుచేసుకున్న షార్ట్‌నోట్స్‌ (చిన్న చిన్న పట్టికలు) ఈ పునశ్చరణలో సద్వినియోగం చేసుకోవాలి.

ఇప్పటివరకూ తయారైన కఠిన, క్లిష్టతరమైన అంశాలను మరోసారి మననం చేసుకోవాలి.

సబ్జెక్టుల వెయిటేజీ ఆధారంగా ముఖ్యమైన ఫార్ములాలు, కీలకాంశాలు ఈ సమయంలో వీలైనన్నిసార్లు సాధన చేయాలి.

పూర్వం చదివిన అంశాలు ‘గుర్తుంటాయిలే’ అనే ధీమాతో పునశ్చరణను విస్మరించకూడదు.

సాధారణ, కఠిన, క్లిష్టతరమైన అంశాలను అన్నింటినీ తప్పక పునశ్చరణ చేయాలి.

పరీక్ష కేంద్రంలో..

పరీక్షలో ప్రతి ప్రశ్నకూ సమాధానం రాయడం కష్టం. మూడు గంటల వ్యవధిలో ఎన్ని ప్రశ్నలు, ఏ ప్రశ్నలు రాస్తే ఎన్ని ఎక్కువ మార్కులు సాధిస్తారనేది నిర్ణయించుకోవాలి. సన్నద్ధత సమయంలో కూడా ఇదే సూత్రం పాటించాలి.

గ్రూప్‌-1లోని ఒక మార్కు ప్రశ్నలను త్వరగా పూర్తిచేయాలి. చాలావరకూ ఈ విభాగంలో థియరీకి సంబంధించిన మౌలికాంశాలపై ప్రశ్నలు వస్తాయి.

బహుళైచ్ఛిక ప్రశ్నల విషయంలో ఒక మౌలికాంశాన్ని, ఒక ఫార్ములాని విద్యార్థి ఎన్ని విధాలా తప్పు చేయొచ్చో ఎన్ని రకాల సమాధానాలు వస్తాయో ఊహించి ప్రశ్నపత్ర రూపకర్తలు ఆప్షన్లు ఇస్తారు. వచ్చిన సమాధానం కనపడగానే వెంటనే గుర్తించక ఒక క్షణం మిగతా ఆప్షన్లు కూడా పరిశీలించాలి.

ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి ప్రయత్నించామనేదానికంటే ఎన్నింటికి సరైన సమాధానాలు రాశామనేది ముఖ్యం.

ఏదో ఒక ప్రశ్న సమాధానానికి ఎక్కువ సమయం కేటాయించవద్దు. సమయపాలన చాలా ముఖ్యం.

‣ న్యూమరికల్‌ ప్రశ్నలకు సమాధానాలు దగ్గరిస్థాయిలో ఇవ్వొచ్చు. ఉదాహరణకు- సరైన సమాధానం 68.33 అనుకుందాం. 68.32 నుంచి 68.34 మధ్యలో సమాధానం రాసినా స్వీకరించి మార్కులు ఇస్తారు. ఈ విషయాన్ని పరీక్ష కేంద్రంలో మరవవొద్దు.

న్యూమరికల్‌ ప్రశ్నలు చేసేటపుడు రఫ్‌ పేపర్‌పై తగిన రీతిలో స్టెప్స్‌ రాసుకోవాలి. ఒకవేళ సమాధానం రాని పక్షంలో వీటిని మరోసారి పరిశీలించే అవకాశం ఉంటుంది. 

సాధారణ జాగ్రత్తలు

ఈ కీలక సమయంలో సమయ వృథాను నిరోధించాలి. కాలక్షేపానికి టీవీ, సినిమా, యూట్యూబ్‌ చూడటం, ఫేస్‌బుక్‌ వాడటం, వాట్సాప్‌ల్లో చాటింగ్‌లు మానేయడం ఎంతైనా మంచిది.

పరీక్ష సమయం దగ్గరపడుతున్నకొద్దీ విద్యార్థులు ఆందోళన, ఒత్తిడులకు గురవుతుంటారు. మనసును ప్రశాంతంగా ఉంచుకుని, రోజూ క్రమం తప్పకుండా కనీసం అరగంటైనా యోగా/ ధ్యానం/ చిన్నపాటి వ్యాయామం చేస్తే ఒత్తిడి నుంచి దూరం కావొచ్చు.

పరీక్ష ముగిసేవరకూ ఎవరితోనూ వాగ్వాదాలు చేయకూడదు.

పరీక్ష రాయడానికి ముందు ప్రశాంతత ముఖ్యం. సరిగా సిద్ధం కాలేదనో, మరో కారణం వల్లో ఆందోళన చెందవద్దు.

పరీక్ష కేంద్రానికి వెళ్లడానికి ముందు ఏమీ చదవకపోవడం మంచిది.

గేట్‌ హాల్‌ టికెట్లు పోస్టు ద్వారా పంపరు. సంబంధిత జోనల్‌ గేట్‌ వెబ్‌సైట్‌ నుంచి అభ్యర్థులు స్వయంగా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

ఉదయం, మధ్యాహ్నం రోజుకు రెండు సెషన్ల చొప్పున ఫిబ్రవరి 6, 7, 13, 14 తేదీల్లో గేట్‌ పరీక్ష నిర్వహించనున్నారు.

రుణాత్మక మార్కులు

పరీక్షలో రుణాత్మక మార్కులు ఉన్నందున కచ్చితంగా తెలిసిన సమాధానాలనే రాయాలి.

అంచనాతో జవాబులు గుర్తించడం ఒక్కోసారి నష్టాన్ని కలిగిస్తుంది.

న్యూమరికల్, బహుళ ఎంపిక ప్రశ్నలకు రుణాత్మక మార్కులు లేవు.

ఈ సమయంలో ఆన్‌లైన్‌లో నిర్వహించే మాదిరి (మాక్‌) గేట్‌ పరీక్షలను తప్పనిసరిగా రాయాలి.

ఆన్‌లైన్‌ నమూనా పరీక్షలు సాధనలోని నాణ్యతను తెలుసుకోవడానికి సహాయపడతాయి.

మాదిరి (మాక్‌) ప్రశ్నపత్రాలకు జవాబులు రాయడం వల్ల సమగ్ర అవగాహన లేని కొన్ని అంశాలను మెరుగుపరచుకునే వీలుంటుంది.

మాదిరి ప్రశ్నపత్రాలకూ, గత ప్రశ్నపత్రాలకూ జవాబులు రాసేటపుడు చేసిన తప్పిదాలను గుర్తించాలి; అవి పునరావృతం కాకుండా చూసుకోవాలి.

కొత్తగా ప్రవేశపెట్టిన బహుళ ఎంపిక ప్రశ్నల అవగాహనకూ, సాధనకూ ఈ మాదిరి పరీక్షలు ఎంతో ఉపయోగం.

వేటిపై ఎంత సమయం?

ఇప్పటివరకూ సాగించిన సన్నద్ధత ఒక ఎత్తు అయితే ఈ కీలక సమయంలో కొనసాగించే సాధన మరో ఎత్తు.

సమయం కొద్దిగా మాత్రమే ఉన్నందున తయారవటానికి కనీసం 9 నుంచి 10 గంటలు కేటాయించాలి.

ఈ ముఖ్య సమయంలో ఏ అంశాలకు ఎంత ప్రాధానం ఇవ్వాలో గ్రహించాలి. కొంతమంది అభ్యర్థులు ఈ సమయంలో ఇంతకుముందు చదవని కొత్త అంశాలపై, కఠినమైన అంశాలపై ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. అది ఈ సమయంలో ఆచరణీయం కాదు.

10% సమయం ప్రాథమిక అంశాలపై, 80% సమయం పరీక్షలోపు దృష్టిపెట్టాల్సిన అంశాలపై, చివరి 10% సమయం కఠినమైన అంశాలపై కేటాయించాలి.

సన్నద్ధతలో పరిమాణం కంటే నాణ్యత ఎంతో ముఖ్యం. చదివిన అంశాలను ముందుగా పూర్తిగా అర్థం చేసుకుని, ఆ అంశాల్లో ఎటువంటి ప్రశ్నలు అడిగినా సమాధానాలు రాసేవిధంగా ఉండాలి.

ప్రతి ఫార్ములాకు సంబంధించి ఒకటి లేదా రెండు న్యూమరికల్‌ ప్రశ్నలు అభ్యాసం చేయాలి.

అన్ని అంశాల్లో బహుళ ఎంపిక ప్రశ్నలను కూడా సాధన చేయాలి.

గత ప్రశ్నపత్రాలనుంచి దాదాపు 25 శాతం ప్రశ్నలు పునరావృతమవుతాయి. వీటి కోసం సుమారు 20 సంవత్సరాల ప్రశ్నపత్రాలు సాధన చేస్తే ఫలితం ఉంటుంది.

అభ్యర్థులు బృందాలుగా ఏర్పడి చదివి, ఒకరికొకరు చర్చించుకుంటూ చదివితే సందేహాల నివృత్తి సాధ్యమవుతుంది. అదేవిధంగా కొత్త అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. సమయం వృథా కాదు.

పాఠ్యపుస్తకాల్లోని సాల్వ్‌డ్, అన్‌సాల్వ్‌డ్‌ ప్రశ్నలను సాధన చేయాలి.

ప్రతిరోజూ రెండు సబ్జెక్టులు తీసుకోవాలి. నిత్యం మ్యాథ్స్, జనరల్‌ ఆప్టిట్యూడ్‌ సబ్జెక్టుల కోసం కొంత సమయం కేటాయించాలి.

Posted Date : 20-01-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌