• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సన్నద్ధత స్థాయి పెంచే..  శారీరక కసరత్తు

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ లాంటి ఉద్యోగ పరీక్షల్లో దేహ దార్ఢ్యం అంతర్భాగం. కానీ సివిల్స్, గ్రూప్స్, బ్యాంకింగ్, కేంద్రప్రభుత్వ నియామక పరీక్షల్లో దీనికి పెద్ద ప్రాధాన్యం ఉండదు. అయితే ఉన్నత స్థాయి పరీక్షల టాప్‌ ర్యాంకర్లలో చాలామంది వ్యాయామానికి కొంత సమయం కేటాయించినవారేనని గమనించాలి! ఎందుకంటే... శారీరక కసరత్తు పోటీ పరీక్షల సన్నద్ధత స్థాయిని పెంచుతుంది!

శారీరక వ్యాయామం వల్ల జీవక్రియల్లో పెరిగే చురుకుదనం పరోక్షంగా వ్యక్తుల గ్రహణశక్తినీ, జ్ఞాపకశక్తినీ పెంచుతుంది. ఉత్సాహకర వాతావరణాన్ని కల్పిస్తుంది. దానివల్ల ప్రిపరేషన్‌ స్థాయి చాలా మెరుగవుతుంది. అందుకే సరైన ప్రణాళికతో ఉండే అభ్యర్థులు తమ ప్రిపరేషన్లో భాగంగా శారీరక కసరత్తులకు సమయం కేటాయిస్తారు. పోటీ పరీక్షల అభ్యర్థులు పాటించదగ్గవంటూ నిపుణులు సూచిస్తున్న ముఖ్యమైన వ్యాయామాలను తెలుసుకుందాం. 

చక్కని మార్గం...నడక

జీవక్రియలను ఉత్తేజపరిచి ఉత్సాహభరితమైన అధ్యయన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకునేందుకు నడక ఒక చక్కని మార్గం. ప్రతిరోజూ కనీసం 30 నుంచి 45 నిమిషాలు నడిస్తే శారీరక కదలికలు, రక్తప్రసరణ మెరుగువుతాయి. ప్రిపరేషన్‌ సమయం ఫలవంతమయ్యే అవకాశం ఏర్పడుతుంది. గదిలోనో, డాబాపైనో తిరుగుతూ చదవటం ఒక మార్గం అయితే నేరుగా రోడ్డుపై, పార్కుల్లో ప్రత్యేక సమయం కేటాయించి తిరగటం మరో దారి. నడక కోసం ఇంత సమయాన్ని కేటాయిస్తే సన్నద్ధత సమయం తగ్గిపోతుందని ఆందోళన చెందనక్కర్లేదు. తక్కువ సమయంలో ఎక్కువ విషయాలను అధ్యయనం చేయగలుగుతాం కాబట్టి నడక కోసం వెచ్చించే సమయం ప్రిపరేషన్‌ సమయాన్ని పొదుపు చేస్తుందని గుర్తించాలి. ఓ చిట్కా ఏమిటంటే.. పోటీ పరీక్షకు సంబంధించిన కంటెంటును మొబైల్‌ ఫోన్‌లో నిక్షిప్తం చేసుకుని వింటూ నడక కొనసాగించవచ్చు. యూట్యూబ్, ఆన్‌లైన్‌ కోచింగ్‌ ద్వారా లభించే పాఠాలను కూడా వింటూ అధిక ప్రయోజనాన్ని పొందవచ్చు. కరెంట్‌ అఫైర్స్‌ లాంటి వాటిని వినేందుకు  ఈ నడక సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. నడుస్తూ ఆహ్లాదకరమైన సంగీతాన్ని వింటే మానసిక ప్రశాంతత లభిస్తుంది. తద్వారా గ్రహణ శక్తి మెరుగవుతుంది.

కళ్ల సంరక్షణ

గంటల తరబడి చదివే క్రమంలో కళ్లు బాగా అలసిపోతాయి. కంటి సమస్యల వల్ల తలనొప్పి, ఇతరత్రా శారీరక సమస్యలూ రావొచ్చు. దీంతో అభ్యర్థి ఏకాగ్రత దెబ్బతింటుంది. విసుగొచ్చి చదవాలన్న ఆసక్తి లోపిస్తుంది. అంతిమంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యం నుంచి పక్కకు తొలగే ప్రమాదం ఏర్పడవచ్చు. అందుకే రోజుకు కనీసం పది నిమిషాలు కంటి ఎక్సర్‌సైజులు చేయాలి.

ప్రాణాయామాలు 

లక్ష్యాన్ని నిర్దేశించుకున్నపుడు, చేరుకునే క్రమంలో భావోద్వేగాలు సహజం. వీటి తీవ్రత ఎక్కువయితే మానసిక స్థితి దెబ్బతింటుంది. పోటీ పరీక్షల అభ్యర్థులకూ ఇది వర్తిస్తుంది. అనేక సందర్భాల్లో మానసిక ఒత్తిళ్లు ఏర్పడి, అవి తీవ్రమై నిరాశా నిస్పృహలకు దారి తీయవచ్చు. ఇది ప్రిపరేషన్‌ తీరును దెబ్బతీస్తుంది. ఇది జరగక్కుండా ఉండేందుకు వివిధ రకాల ప్రాణాయామాలను సాధన చేయటం మేలు. పోటీ పరీక్షల అభ్యర్థులు ప్రశాంతంగా కూర్చుని నాడీ శోధన ప్రాణాయామం, కపాలభాతి ప్రాణాయామం, అవకాశం ఉంటే ఇతర ప్రాణాయామాలను చేస్తే శారీరక మానసిక రుగ్మతలు తొలగుతాయి. రోజూ పది నిమిషాల సాధన ద్వారా 10 గంటల అధ్యయనానికి కావలసిన శక్తిని పొందవచ్చని అంచనా.

యోగాసనాలు

పోటీ పరీక్షల అభ్యర్థులకు ప్రధానంగా కావలసినవి- ఏకాగ్రత, జ్ఞాపకశక్తి. ఈ రెండింటినీ పెంపొందించేందుకు సంతులనాసనం, ఏకపాద ప్రణామాసనం, వీరాసనం, శశాంకాసనం మొదలైనవి ఉపకరిస్తాయి. మొదటిసారి సరైన గురువుల ఆధ్వర్యంలో ప్రారంభించి, తర్వాత వ్యక్తిగతంగా సాధన చేసుకోవచ్చు. యూట్యూబ్‌లో లభిస్తున్న వీడియోల్లో ఉపయోగకరమైనవాటిని గ్రామీణ ప్రాంత అభ్యర్థులు వినియోగించుకోవచ్చు. వీటి సాధనకు ప్రత్యేకంగా శిక్షణ పొందాల్సిన అవసరం లేదు.


1. కళ్ళు నెమ్మదిగా ఎడమ నుంచి కుడికీ, కుడినుంచి ఎడమకీ జరపాలి. వీలైనంత ఎక్కువగా కంటి చివర్లకు జరపాలి. ఎప్పుడు ఖాళీ దొరికినా ఈ ఎక్సర్‌సైజ్‌ చేయవచ్చు. దీనికి రెండు- మూడు నిమిషాల సమయం కేటాయిస్తే మంచిది.

2. పైకీ కిందకీ నెమ్మదిగా సాధన చేయాలి. తల కదలకుండా కంటి పాప మాత్రమే పైకి కిందకీ జరగాలి. తల కదిలినట్లయితే ఎటువంటి ప్రయోజనమూ ఉండదు.

3. సవ్య, అపసవ్య దిశల్లో (క్లాక్‌ వైజ్‌- యాంటీ క్లాక్‌ వైజ్‌) కంటి పాపలను నెమ్మదిగా తిప్పాలి. క్లాక్‌వైజ్‌లో పది సార్లు, యాంటీ క్లాక్‌వైజ్‌లో మరో పదిసార్లు తిప్పితే రక్త ప్రసరణ జరగటమే కాక కటక సమస్యల నియంత్రణకు వీలుంటుంది.

4. కనురెప్పలను వేగంగా మూయాలి, తెరవాలి. దీనివల్ల కళ్లు విశ్రాంతి పొందుతాయి.

5. కంటిపాపలు రెండిటినీ ముక్కు వైపు వీలైనంతగా తెచ్చుకోవాలి. దీనివల్ల ఏకాగ్రత శక్తి పెరుగుతుంది. చాలా కంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.

6. కంటి కుడి, ఎడమ మూలలకు కంటిపాపలను కదపాలి. దీని ద్వారా కంటి కండరాలు శక్తిమంతంగా తయారవుతాయి. ఫలితంగా విసుగు, తలనొప్పి లాంటివి తొలగుతాయి.
 

Posted Date : 02-11-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌