• facebook
  • twitter
  • whatsapp
  • telegram

2021లో అత్యధిక ఉద్యోగాలు ఐటీలోనే!

తర్వాతి స్థానాల్లో హెల్త్‌కేర్‌, ఈ-కామర్స్ 

సర్వే ఫలితాలు వెల్లడించిన  టైమ్స్ జాబ్ 

ఈ ఏడాది అత్యధిక ఉద్యోగాలు కల్పించే రంగంగా ఐటీ నిలవనుందని టైమ్స్ జాబ్ సర్వేలో తేలింది. అలాగే ఎక్కువ మంది వర్చువల్ విధానంలోనే పని చేయడానికి ఆసక్తి చూపుతున్నారని, భవిష్యత్తులోనూ ఇది కొనసాగుతుందని ప్రకటించింది. ఈ-రిక్రూట్మెంట్ పోర్టల్ టైమ్స్ జాబ్ వివిధ పారిశ్రామిక రంగాలు, అంకురాల్లో (స్టార్టప్) పనిచేస్తున్న 1,735 మంది మానవ వనరుల విభాగం (హెచ్ఆర్) అధికారులను సర్వే చేసింది. 2020లో హెచ్ఆర్ విధానాలు, 2021లో వారు ఎలాంటి నైపుణ్యాలు గలవారిని చేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారో తెలుసుకునేందుకు ఈ సర్వే చేపట్టింది. ఇందులో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.

ఇవీ వివరాలు..

సర్వేలో పాల్గొన్న చాలామంది (63శాతం) హెచ్ఆర్ మేనేజర్లు 2020లో తాము రచించిన నియామక ప్రణాళికలు అమలు చేయలేకపోయినట్లు అంగీకరించారు. మరో 26శాతం మంది నియామకాలు చేపట్టినట్లు పేర్కొన్నా.. అది కూడా తక్కువ సంఖ్యలో అని వెల్లడించారు. అత్యధిక మేనేజర్ల అభిప్రాయం ప్రకారం డిజిటల్ నైపుపుణ్యాలు గల వారికే డిమాండ్ ఉంది. ఇందులో డిజిటల్ మార్కెటర్లు(28శాతం), క‌ష్ట‌మ‌ర్ రిలేష‌న్‌షిప్ మేనేజ‌ర్స్‌(18శాతం) ఉద్యోగాలకు మొగ్గు చూపుతున్నారు. అలాగే వివిధ సంస్థల్లో ఇతర విభాగాలకు చెందిన ఉద్యోగాల కంటే బ్యాక్ ఎండ్ డెవలపర్స్(28శాతం), డేటా సైన్స్ & అనలిటిక్స్(22శాతం), సైబర్ సెక్యూరిటీ(16శాతం) ఉద్యోగాలకు కూడా డిమాండ్ ఉంది. 

అప్ స్కిల్లింగ్‌కు ప్రాధాన్యం

సంస్థలు తమ వద్ద పని చేసే ఉద్యోగుల వృత్తిపరమైన నైపుణ్యాలే కాకుండా టెక్నాలజీకి సంబంధించిన సామర్థ్యాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ అంశం సర్వేలో తొలిస్థానంలో ఉండగా.. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ రెండో స్థానంలో నిలిచింది. ఉద్యోగులు అదనపు నైపుణ్యాలు (అప్ స్కిల్లింగ్) నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాయి. అత్యధిక మంది ఉద్యోగులు (68శాతం) అదనపు నైపుణ్యాలను డిజిటల్ మార్కెటింగ్ (21శాతం), డేటా అనలిటిక్స్ (12శాతం)లో పొందేందుకు ఆసక్తి చూపుతున్నారని హెచ్ఆర్ మేనేజర్లు వివరించారు.

ఇంటి నుంచి పనికే మొగ్గు..

ఇంటి నుంచి పని చేసే సౌకర్యాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించాలని సర్వేలో పాల్గొన్న చాలామంది హెచ్ఆర్ మేనేజర్లు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతోపాటు వర్చువల్ వర్కింగ్ విధానం భవిష్యత్తులోనూ కొనసాగుతుందన్నారు. అయితే ఈ విధానం వల్ల మున్ముందు కొత్త నియామకాలపై ప్రభావం పడుతుందని వెల్లడించారు. మొత్తంగా సర్వే ప్రకారం 2021లో ఉద్యోగులను చేర్చుకోవడంలో ఐటీ తొలి స్థానంలో నిలవనుండగా.. రెండో స్థానంలో హెల్త్‌కేర్, మూడో స్థానంలో ఈ-కామర్స్ ఉంటుందని తేలింది.  

Posted Date : 20-03-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌