• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఒకేసారి ఎన్నో లక్ష్యాలు...చేరుకోవడం సాధ్యమే! 

ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని... ఎంతో కష్టపడి దాన్ని సాధించినవాళ్లను చూసే ఉంటారు. అలాకాకుండా కొంతమంది ఒకేసారి బహుళ లక్ష్యాలు పెట్టుకుంటారు. ఇలా చేయడం తప్పేమీ కాదుగానీ.. వాటిని సాధించే క్రమంలోనే కొన్ని పొరపాట్లూ చేస్తుంటారు. వాటిని సరిదిద్దుకుంటే ఒకేసారి ఎన్నో లక్ష్యాలను సాధించగలుగుతారు.

రిషీ పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేస్తూనే బ్యాంక్, స్టాఫ్‌ సెలక్షన్, యూపీఎస్సీ పరీక్షలకూ సిద్ధమవుతున్నాడు. అంటే సమయాన్ని ఏమాత్రం వృథా చేయకుండా ఒకేసారి నాలుగు విధాలుగా ప్రయత్నిస్తున్నాడు. డిగ్రీ తర్వాత ఉన్నత విద్యను కొనసాగిస్తూనే పోటీ పరీక్షలకూ చదువుతున్నాడు. అయితే ఒకేసారి ఎక్కువ లక్ష్యాలు పెట్టుకోవడం వల్ల అప్పుడప్పుడూ విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నాడు. అన్నింటిలోనూ విఫలమైతే ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందోనని సందేహిస్తున్నాడు. ఇలాంటి ప్రతికూల ఆలోచనలు లేకుండా అనుకున్నది సాధించాలంటే కొన్ని విషయాలను గమనించాలి. 

గడువు తప్పనిసరి

కొంతమంది ఒకేసారి వివిధ లక్ష్యాలను పెట్టుకుంటారు. కానీ వాటిని నిర్ణీత కాలంలో చేరుకోవాలనే గడువును మాత్రం పెట్టుకోరు. దీంతో సంవత్సరాల తరబడి ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటారు. దీనివల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. లక్ష్యంతోపాటుగా ఎంతకాలం లోపల దాన్ని సాధించగలరనే నియమాన్నీ పెట్టుకోవాలి. అనుకున్న సమయం లోపల దాన్ని సాధించలేకపోతే కొత్త గడువునూ పెట్టుకోవచ్చు. అయితే దాన్నే అలవాటుగా మార్చుకుని వాయిదాలు వేసుకుంటూ వెళ్లకూడదు.

ప్రతి పరీక్షా ప్రత్యేకమే: పోటీ పరీక్షలన్నింటికీ ఒకేలాంటి సిలబస్‌ ఉండదు. డిగ్రీలో చదివిన సబ్జెక్టులు ఒకటైతే.. పోటీ పరీక్షల్లో రాయాల్సిన సబ్జెక్టులు మరో రకంగా ఉండొచ్చు. అంటే ప్రతి పరీక్షకూ ప్రత్యేకంగా సిద్ధంకావాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు ప్రతి పరీక్షకు ఒక గడువును పెట్టుకుని చదివితే ఇబ్బంది ఉండదు. ప్రతి పరీక్షను పూర్తి సన్నద్ధతతో రాసే అవకాశం ఉంటుంది. అలాకాకుండా తేదీ దగ్గర పడిన తర్వాత చదవడం మొదలుపెడితే ఏ పరీక్షకూ న్యాయం చేయలేకపోవచ్చు. 

అభిరుచికి అద్దంపట్టేలా: మొక్కుబడిగా లేదా బలవంతాన లక్ష్యాలను నిర్దేశించుకోకూడదు. మీరు నిర్దేశించుకునే లక్ష్యాలు ఎప్పుడూ మీ అభిరుచులకు అద్దంపట్టేలా ఉండాలి. స్నేహితులు లేదా బంధువులు పోటీ పరీక్షలో విజయం సాధించగానే వారిని చూసి అలాంటి లక్ష్యాన్నే నిర్దేశించుకోకూడదు. దీంతో ఆచరణలో విఫలమయ్యే ప్రమాదం ఉంటుంది. అలాకాకుండా మీకిష్టమైన లక్ష్యాన్నే పెట్టుకుంటే దాని సాధనకు అన్ని రకాలుగా శ్రమపడగలుగుతారు. అలా పడ్డ శ్రమ కూడా మీకు కష్టంగా, భారంగా అనిపించదు. అంటే లక్ష్య సాధనకు ఎంతో ఇష్టంగా కష్టపడతారన్నమాట. 

రాసి పెట్టుకోవాలి: నిర్దేశించుకున్న లక్ష్యాలను ఒకచోట రాసి పెట్టుకోవాలి. వాటిని అప్పుడప్పుడూ చూసుకోవడం వల్ల సమయాన్ని వృథా చేయలేరు. మధ్యలో పొరపాటున ఎప్పుడైనా దారి తప్పినా.. అవి మీకు కర్తవ్యాన్ని గుర్తుచేస్తాయి. అలాగే వాటిని పేపరు మీద రాసుకుని ఎక్కడో కంటికి కనిపించని చోట దాచేయకూడదు. రోజూ మీ కంటికి కనిపించేలా ఎక్కడైనా అతికించుకుంటే ఫలితం ఉంటుంది.  

మార్పులూ చేర్పులూ: లక్ష్యాలను సాధించే క్రమంలో కొన్ని అవాంతరాలూ ఎదురుకావచ్చు. అలాంటప్పుడు వాటిని చేదించే క్రమంలో కొన్ని మార్పులూ, చేర్పులూ చేసుకోవాలి. ఒక్కోసారి పోటీ పరీక్షల తేదీలు మారిపోవచ్చు. అలాంటప్పుడు మీరు రూపొందించుకున్న ప్రణాళికను కూడా మార్చుకోవాలి. ఏడాది ప్రారంభంలో వేసుకున్న ప్రణాళికతోనే సంవత్సరాంతం వరకు గడిపేస్తానంటే కుదరదు. ఎప్పటికప్పుడు మార్పులూ, చేర్పులూ చేసుకోవాలి. ఈ క్రమంలో ఒక్కోసారి మీరు బాగా అలసిపోవచ్చు. అయినా సన్నద్ధతను వాయిదా వేయకూడదు. అలాగే ఎప్పుడైనా వైఫల్యం ఎదురైనా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. 

ఊహించుకోవాలి: ఎంత గొప్ప లక్ష్యమైనా ముందుగా పుట్టేది ఊహల్లోనే. ఒక ఇంజినీర్‌ ఎంత భారీ ప్రాజెక్టు నిర్మించినా.. దాని రూపం ముందుగా అతడి ఆలోచనల్లోనే ఆవిష్కృతమవుతుంది. ఒక వ్యాపారి తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎంత పెద్దగా విస్తరించినా.. దాని తొలి రూపం అతడి ఊహల్లోనే రూపుదిద్దుకుంటుంది. నిజానికి లక్ష్య సాధనకు ప్రాణం పోసేవి ఈ ఊహలే. అందుకే మీరు అనుకున్న లక్ష్యాలను సాధించినట్టుగా.. అందరూ మిమ్మల్ని అభినందిస్తున్నట్టుగా ఒక్కసారి ఊహించుకోండి. ఇలా చేయడం వల్ల తగిన ప్రేరణతో వాటి సాధనకు కృషిచేయగలుగుతారు. 

అడుగు ముందుకు: లక్ష్య సాధన దిశగా ఒక్కో అడుగూ ముందుకేయాలి. రోజూ ఎంతోకొంత పురోభివృద్ధిని సాధించాలి. ప్రతిరోజూ ఆ రోజు మొత్తంలో నేర్చుకున్న కొత్త విషయాలను ఒకసారి మననం చేసుకోవాలి. ‘వేయి అడుగుల ప్రయాణమైనా.. మొదలయ్యేది ఒక్క అడుగుతోనే’ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సరైన దిశలో, క్రమపద్ధతిలో వేసే ప్రతి అడుగూ లక్ష్య సాధనకు మరింత చేరువ చేస్తుంది.
 

Posted Date : 23-12-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌