• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ప్రపంచాన్ని చుట్టేసి రావచ్చు!

మేటి అవకాశాలకు మర్చంట్‌ నేవీ 

ప్రపంచవ్యాప్తంగా సరకుల రవాణాలో సుమారు 90 శాతం జలమార్గం నుంచే జరుగుతోంది. ఇందుకోసం యాభై వేలకు పైగా వాణిజ్య నౌకలు సేవలు అందిస్తున్నాయి. ఇవి లక్షల టన్నుల బరువులను ఒక దేశం నుంచి మరో దేశానికి మోసుకెళ్తున్నాయి. వీటి రవాణాలో మానవ వనరుల సేవలే కీలకమవుతున్నాయి. వీరిని సుశిక్షితులుగా రూపొందించడానికి ఎన్నో కోర్సులూ, వాటిని అందించడానికి ప్రత్యేకమైన సంస్థలూ ఆవిర్భవించాయి. పదోతరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ విద్యార్హతలతో కోర్సులు పూర్తిచేసుకుని, మర్చంట్‌ నేవీలో మేటి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. 

ప్రపంచ వర్తకం మొత్తం షిప్పింగ్‌ పరిశ్రమ పైనే ఆధారపడి నడుస్తోంది. కూరగాయలు, కార్లు, రంగులు, రసాయనాలు, దుంపలు, దినుసులు, పప్పు, ఉప్పు, వీట్, మీట్‌... అన్నీ ఒకదేశం నుంచి మరో దేశానికి ఎగుమతి, దిగుమతి అవుతుంటాయి. వాటి రవాణా నిమిత్తం వివిధ రకాల ఓడలు ఉంటాయి. పదార్థం, స్వభావం బట్టి కార్గో, కంటెయినర్, బార్జ్, ట్యాంకర్లు, బల్క్‌ క్యారియర్లు, రెఫ్రిజిరేటర్‌ షిప్స్, రోల్‌ ఆఫ్, రోల్‌ ఆన్‌ షిప్పుల్లో వీటిని తరలిస్తారు. 

ప్రయాణికుల కోసమైతే పాసింజర్, క్రూయిజ్‌ షిప్‌లు ఉంటాయి. నౌక ఏ తరహాదైనప్పటికీ సరకు రవాణా, చేరవేతలో మర్చంట్‌ నేవీ సేవలే కీలకం. అందువల్లే ఈ కోర్సులు పూర్తి చేసుకున్నవారు ఆకర్షణీయ వేతనాలు, సౌకర్యాలతో మేటి అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. విధుల్లో భాగంగా వీరు ప్రపంచాన్ని చుట్టేసి రావచ్చు. కొన్ని నెలలపాటు కుటుంబానికి దూరంగా ఉండడం ఒక్కటే ప్రతికూలత. చిన్న వయసులోనే అధికవేతనంతో జీవితంలో స్థిరపడాలని ఆశించే యువకులు మర్చెంట్‌ నేవీని కెరియర్‌గా ఎంచుకుని ముందడుగు వేయవచ్చు. అర్హతలు, ఆసక్తి ప్రకారం కోర్సును ఎంచుకోవచ్చు.  

ఏయే కోర్సులు?

బీఎస్సీ: మారిటైమ్‌ సైన్స్, షిప్‌ బిల్డింగ్‌ అండ్‌ రిపేర్, నాటికల్‌ సైన్స్‌

బీటెక్‌: మెరైన్‌ ఇంజినీరింగ్, నేవల్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఓషన్‌ ఇంజినీరింగ్, ఓషన్‌ అండ్‌ హార్బర్‌ ఇంజినీరింగ్, నేవల్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఆఫ్‌షోర్‌ ఇంజినీరింగ్‌ 

బీబీఏ: షిప్పింగ్‌ మేనేజ్‌మెంట్, లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్, లాజిస్టిక్‌ రిటైల్‌ అండ్‌ ఈ- కామర్స్‌

ఎంబీఏ: పోర్ట్‌ అండ్‌ షిప్పింగ్‌ మేనేజ్‌మెంట్, ఇంటర్నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌ 

ఎల్‌ఎల్‌బీ: మారిటైమ్‌ లా

ఎమ్మెస్సీ: కమర్షియల్‌ షిప్పింగ్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ 

డిప్లొమా: నాటికల్‌ సైన్స్‌

పీజీ డిప్లొమా: మెరైన్‌ ఇంజినీరింగ్‌

ఎంటెక్‌: మెరైన్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, నేవల్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఓషన్‌ ఇంజినీరింగ్, డ్రెడ్జింగ్‌ అండ్‌ హార్బర్‌  ఇంజినీరింగ్‌. 

దేనికి ఎవరు అర్హులు? 

బీఈ/ బీటెక్‌ మెరైన్‌ ఇంజినీరింగ్‌ కోర్సు పూర్తి చేస్తే జూనియర్‌ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తించవచ్చు. పని అనుభవం, అంతర్గత పరీక్షల ద్వారా థర్డ్‌ ఇంజినీర్, సెకండ్‌ ఇంజినీర్, చీఫ్‌ ఇంజినీర్‌ స్థాయులకు వెళ్లే అవకాశం ఉంది! 

బీటెక్‌ మెరైన్‌ ఇంజినీరింగ్‌: ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్‌ పూర్తిచేసుకున్నవారు వివిధ సంస్థల్లో అందిస్తోన్న నాలుగేళ్ల బీఈ/ బీటెక్‌ మెరైన్‌ ఇంజినీరింగ్‌ కోర్సులో చేరడానికి అర్హులు. కోర్సు అనంతరం వీరు జూనియర్‌ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తారు. పని అనుభవం, అంతర్గత పరీక్షల ద్వారా థర్డ్‌ ఇంజినీర్, సెకండ్‌ ఇంజినీర్, చీఫ్‌ ఇంజినీర్‌ స్థాయులకు వెళ్తారు. నేవల్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఆఫ్‌షోర్‌ ఇంజినీరింగ్, పెట్రోలియం ఇంజినీరింగ్, మెకానికల్‌ ఇంజినీరింగ్, హార్బర్‌ అండ్‌ ఓషియన్‌ ఇంజినీరింగ్, సివిల్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసుకున్నవారికీ మర్చెంట్‌ నేవీలో అవకాశాలు ఉంటాయి. 

బీఎస్సీ నాటికల్‌ సైన్స్‌: ఇంటర్‌ ఎంపీసీ వారు ఈ కోర్సులో చేరవచ్చు. కోర్సు వ్యవధి మూడేళ్లు. దీన్ని పూర్తిచేసుకున్నవారు శిక్షణ అనంతరం నేవిగేషన్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించవచ్చు.

మెరైన్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా: ఈ కోర్సు వ్యవధి రెండేళ్లు. మెకానికల్, ఎలక్ట్రికల్, నేవల్‌ ఆర్కిటెక్చర్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ విభాగాల్లో ఎందులోనైనా మూడేళ్ల డిప్లొమా పూర్తిచేసినవారు ఈ కోర్సులో చేరవచ్చు. కోర్సు పూర్తయిన తర్వాత 6 నెలల శిక్షణ అనంతరం మెరైన్‌ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తించవచ్చు. 

జీపీ, డెక్, ఇంజిన్‌ రాటింగ్‌: జనరల్‌ పర్పస్‌ రాటింగ్‌ కోర్సు పదో తరగతి పూర్తిచేసుకున్న వారికోసం అందిస్తున్నారు. ఈ కోర్సు వ్యవధి 6 నెలలు. అనంతరం వీరు షిప్‌లో డెక్, ఇంజిన్‌ క్రూ విధులు నిర్వర్తించవచ్చు. డెక్‌ రాటింగ్‌ కోర్సు, ఇంజిన్‌ రాటింగ్‌ కోర్సు పేరుతో ప్రత్యేకంగానూ 6 నెలల వ్యవధితో కోర్సులు ఉన్నాయి. 

మారిటైమ్‌ కేటరింగ్‌/ సెలూన్‌ రాటింగ్‌ కోర్సు: నౌకల్లో క్యాటరింగ్‌ విభాగంలో సేవలకోసం ఈ కోర్సు చేయాలి. కొన్ని సంస్థలు ఇంటర్‌తో మరికొన్ని పదో తరగతితో అవకాశం కల్పిస్తున్నాయి. కోర్సు వ్యవధి 6 నెలలు. 

ఎన్‌సీవీ: నియర్‌ కోస్టల్‌ వోయేజ్‌ కోర్సు వ్యవధి 6 నెలలు. అనంతరం రెండేళ్ల ఆఫ్‌ షోర్‌ లేదా 18 నెలల దూరవిద్య విధానంలో శిక్షణ పూర్తిచేయాలి. పదో తరగతి విద్యార్హతతో అవకాశం ఉంటుంది.

ఎస్‌టీసీడబ్ల్యు: స్టాండర్డ్స్‌ ఆఫ్‌ ట్రెయినింగ్‌ అండ్‌ సర్టిఫికేషన్‌ ఆఫ్‌ వాచ్‌ కీపింగ్‌ (ఎస్‌టీసీడబ్ల్యు) శిక్షణ 4 మాడ్యూల్స్‌లో ఉంటుంది. పది, ఇంటర్‌ ఉత్తీర్ణులు కోర్సుల్లో చేరడానికి అర్హులు. పర్సనల్‌ సర్వైవల్‌ టెక్నిక్స్, ఫైర్‌ ప్రివెన్షన్‌ అండ్‌ ఫైర్‌ ఫైటింగ్, ఎలిమెంటరీ ఫస్ట్‌ ఎయిడ్, పర్సనల్‌ సేఫ్టీ అండ్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ... ఈ ప్రాథమిక కోర్సుల అనంతరం అడ్వాన్స్‌డ్‌ కోర్సులను పూర్తిచేసుకోవచ్చు. వీరు ఓడల్లో భద్రత సంబంధిత విధులు నిర్వర్తిస్తారు.

డిప్లొమా నాటికల్‌ సైన్స్‌: ఇంటర్‌ ఎంపీసీ పూర్తిచేసుకున్నవారు నాటికల్‌ సైన్స్‌ డిప్లొమా కోర్సులో చేరవచ్చు.

కమర్షియల్‌ డైవింగ్‌: వీరు నీటి లోపల విధులు నిర్వర్తిస్తారు. ఓడ కింది భాగంలో ఏవైనా అడ్డుపడితే తొలగించడం, వెల్డింగ్, కటింగ్‌..తదితర వ్యవహారాలు చూసుకుంటారు. ఈతలో ప్రావీణ్యం ఉండాలి. పదో తరగతి విద్యార్హతతో కోర్సులో చేరవచ్చు. రెండు నెలల్లో పూర్తవుతుంది. 

ఈటీవో: ఎలక్ట్రో టెక్నికల్‌ ఆఫీసర్‌ (ఈటీవో) కోర్సు పూర్తిచేసుకున్నవారు నౌకలోని ఎలక్ట్రికల్‌్, ఎలక్ట్రానిక్‌ పరికరాల నిర్వహణ, మరమ్మతులు చూసుకుంటారు. కోర్సు వ్యవధి 6 నెలలు. ఎలక్ట్రికల్‌్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ విభాగాల్లో ఎందులోనైనా డిప్లొమా పూర్తిచేసుకున్నవారు ఇందులో చేరవచ్చు. 

ఇవీ ఉద్యోగాలు

నౌకలకు సంబంధించి 3 విభాగాలు ఉంటాయి. అవి డెక్, ఇంజిన్, రాటింగ్‌. కెప్టెన్‌ పర్యవేక్షణలో నౌక నడుస్తుంది. ఇతడు డెక్‌ విభాగానికి చెందినవాడు. ఇతని తర్వాత చీఫ్‌ ఆఫీసర్, సెకండ్‌ ఆఫీసర్, థర్డ్‌ ఆఫీసర్‌ ఉంటారు. ఇంజిన్‌ విభాగం నుంచి చీఫ్‌ ఇంజినీర్, సెకండ్‌ ఇంజినీర్, థర్డ్‌ ఇంజినీర్, ఎలక్ట్రికల్‌ ఆఫీసర్‌ ఉంటారు. మిగతావారంతా సహాయక సిబ్బంది. వీరంతా రాటింగ్‌ విభాగంలోకి వస్తారు. 

ఓడ సవ్యంగా ముందుకు వెళ్లడానికి ఈ మూడు విభాగాల సమన్వయం కీలకం. డెక్‌ ఆఫీసర్లు నౌక సరైన మార్గంలో వెళ్లేలా చూసుకుంటారు. ఇంజినీర్లు ఇంజిన్‌ విభాగాన్ని పర్యవేక్షిస్తారు. రాటింగ్‌ సిబ్బంది మిగతా సహకార బాధ్యతలు నిర్వర్తిస్తారు. పెద్ద నౌకల్లో అన్ని విభాగాల్లోనూ కలుపుకుని వెయ్యికి పైగా సిబ్బంది ఉంటారు. వీరంతా షిఫ్టులవారీ విధులు నిర్వర్తిస్తుంటారు. 

మర్చంట్‌ నేవీలో తక్కువ విద్యార్హతతో చేరినప్పటికీ ప్రారంభంలోనే రూ.40,000 నుంచి రూ. 50,000 వేతనం లభిస్తుంది. ఇంజినీర్లు ప్రారంభంలో రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకు, రెండుమూడేళ్ల తర్వాత రూ. లక్షన్నరకు పైగా అందుకోవచ్చు. థర్డ్‌ ఆఫీసర్‌గా చేరినవారు కెప్టెన్‌ హోదా పొందడానికి 11 ఏళ్లు పడుతుంది. 

ప్రస్తుతం మర్చంట్‌ నేవీలో ఎల్‌ఎన్‌జీ క్యారియర్‌ విభాగం బాగా వృద్ధి చెందుతోంది. వేతనాలు సైతం పెద్ద మొత్తంలో అందుతున్నాయి. అలాగే ఎక్కువ మందికి సముద్రయానంపై ఆసక్తి పెరుగుతోంది. అందువల్ల క్రూయిజ్‌ షిప్‌లకు ఆదరణ లభిస్తోంది. భవిష్యత్తులో ఈ విభాగం విస్తరించడానికి అవకాశాలున్నాయి. 

ఏ విద్యా సంస్థలు?

భారత ప్రభుత్వానికి చెందిన డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ మెరైన్‌ షిప్పింగ్‌ ఆధ్వర్యంలో దేశంలో చాలా సంస్థలు మెరైన్‌ కోర్సులు అందిస్తున్నాయి. గుర్తింపు పొందిన సంస్థల, కోర్సుల వివరాలకు https://www.dgshipping.gov.in/ చూడవచ్చు. ఇంటర్నేషనల్‌ మారిటైమ్‌ ఆర్గనైజేషన్‌ (ఐఎంవో) నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం వీటిలో శిక్షణ అందిస్తారు.

షిప్పింగ్‌ మినిస్ట్రీ ఆధ్వర్యంలో చెన్నై ప్రధాన కేంద్రంగా 2008లో ఇండియన్‌ మారిటైమ్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. దీనికి ముంబయి, కోల్‌కతా, విశాఖపట్నం, కొచ్చిల్లో క్యాంపస్‌లు ఉన్నాయి. నౌకాయాన కోర్సులు, శిక్షణ, పరిశోధనలను ఈ విశ్వవిద్యాలయం పర్యవేక్షిస్తుంది. దీనికి అనుబంధంగా 18 సంస్థలు కోర్సులు అందిస్తున్నాయి. ఐఎంయూ సెట్‌లో చూపిన ప్రతిభతో ప్రవేశం లభిస్తుంది. ఈ ప్రకటన మార్చి/ఏప్రిల్‌లో వెలువడుతుంది. ఆగస్టులో కోర్సులు మొదలవుతాయి. పూర్తి వివరాలు https://www.imu.edu.in// లో లభిస్తాయి. 

కొన్ని విద్యాసంస్థలు ఐఐటీ-జేఈఈ ర్యాంకుతో బీటెక్‌ మెరైన్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల్లోకి తీసుకుంటున్నాయి. ఎన్నో ఇతర సంస్థలు పదో తరగతి విద్యార్హతతో సాధారణ ఉద్యోగాలు (రాటింగ్‌)కు సంబంధించిన కోర్సులు అందిస్తున్నాయి. వీటిలో ఎక్కడ చదువుకున్నప్పటికీ కోర్సు పూర్తయిన తర్వాత నౌకలో శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో స్టైపెండ్‌ చెల్లిస్తారు. 

Posted Date : 23-03-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌