• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఆతిథ్య‌మే ఉద్యోగం!

ఇంటర్‌తో బీఎస్సీ హాస్పిటాలిటీ, హోటల్ అడ్మినిస్ట్రేషన్లో ప్రవేశాలు

అర్హత పరీక్షకు ఎన్‌టీఏ నోటిఫికేషన్ విడుదల

ఎలాంటి తాయిలాలకు త‌లొగ్గ‌నివారు కూడా ఒక్కోసారి రుచిక‌ర‌మైన భోజ‌నం పెడితే దారికొస్తార‌నేది ముమ్మాటికీ నిజమే. పాక‌శాస్త్రానికి అంత‌టి చ‌రిత్ర ఉంది. వంట‌లు ఎవ‌రైనా చేయ‌గ‌ల‌రు..అయితే దానికి అనుభ‌వంతో కూడిన నిపుణ‌త తోడైతే మ‌రింత రుచి చేరుతుంది. అందుకే ఇటీవ‌ల కాలంలో హోట‌ల్ మేనేజ్‌మెంట్ కోర్సుకు డిమాండ్ ఏర్ప‌డింది.   ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ సంస్థల్లో హోట‌ల్ మేనేజ్‌మెంట్ కు సంబంధించిన కోర్సుల‌ను చేయ‌డానికి 2021 ఏడాదికి ఎన్‌టీఏ నోటిఫికేషన్ విడుద‌ల చేసింది. 

హోట‌ల్‌ మేనేజ్‌మెంట్ కోర్సులో ప‌లు ‘ఆతిథ్య‌’ విభాగాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇది ఎన్నో రకాల కోర్సులతో ఎంతో మందికి ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తోంది. ఇంటర్ చేస్తే చాలు ఆతిథ్య రంగంలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరే అవకాశం ఉంటుంది. అన్ని గ్రూపుల విద్యార్థులూ బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సుల్లో చేరవచ్చు. ఇందులో భాగంగా తమకు నచ్చిన స్పెషలైజేషన్ ఎంచుకోవచ్చు. అనంతరం ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందవచ్చు లేదా ఈ రంగంలోనే ఉన్నత విద్యను కొనసాగించవచ్చు. ఐటీసీ, ఒబెరాయ్ వంటి కార్పొరెట్ సంస్థలు యూజీ, పీజీ, పీడీ డిప్లొమాలను ఉచితంగా అందించి, ఉద్యోగాలిస్తున్నాయి. ఆతిథ్యంలో యూజీ స్థాయిలో బీఎస్సీ, బీబీఎంలతోపాటు సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులను వివిధ సంస్థలు అందిస్తున్నాయి. యూజీలో ఫ్రంట్ ఆఫీస్, ఫుడ్ అండ్ బేవరేజెస్, హౌస్ కీపింగ్, కిచెన్ స్పెషలైజేషన్లు ఉంటాయి.

తెలుగు రాష్ట్రాల్లో కోర్సు అందించే ఇన్‌స్టిట్యూట్స్‌

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బీఎస్సీ (హెచ్‌హెచ్ఏ) కోర్సు అందించేందుకు ఆరు ఇన్‌స్టిట్యూట్స్ సిద్ధంగా ఉన్నాయి. స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, తిరుపతి; డాక్టర్ వైఎస్ఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హోటల్ మేనేజ్‌మెంట్, హైదరాబాద్; ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, హైదరాబాద్; శ్రీశక్తి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, హైదరాబాద్; లియో అకాడమీ ఆఫ్ హాస్పిటాలిటీ, టూరిజం అండ్ మేనేజ్‌మెంట్, హైదరాబాద్; స్టేట్ ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, మెదక్ సంస్థ‌లు జేఈఈ స్కోర్ ద్వారా ప్రవేశం కల్పిస్తున్నాయి. 

ఉపాధికి కొదువ లేదు..

ఈ కోర్సులో చేరిన అభ్య‌ర్థుల‌కు ఉద్యోగావ‌కాశాల‌కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవ‌ని చెప్ప‌వ‌చ్చు. సంస్థ‌ల‌న్నీ జాతీయ స్థాయిలో పేరున్న‌వి కావ‌డం, ఉద్యోగ అవ‌స‌రాల‌కు అనుగుణంగా స‌మ‌గ్ర శిక్ష‌ణ ల‌భించ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఆతిథ్య‌, సేవారంగంలోని సంస్థ‌లు ప్రాంగ‌ణ నియామ‌కాల్లో దాదాపు విద్యార్థుంల‌ద‌రికీ అవ‌కాశం క‌ల్పిస్తున్నాయి. చ‌దువుకున్న కోర్సును బ‌ట్టి కిచెన్ మేనేజ్‌మెంట్, హౌస్ కీపింగ్ మేనేజ్‌మెంట్‌, ఫ్లైట్ కిచెన్స్‌/   ఆన్‌బోర్డ్ ఫ్లైట్ స‌ర్వీసెస్, వివిధ సేవాల ప‌రిశ్ర‌మ‌ల్లో గెస్ట్‌/క‌స్ట‌మ‌ర్ రిలేష‌న్ ఎగ్జిక్యూటివ్, ఫాస్ట్‌ఫుడ్ చెయిన్స్‌లో ఎగ్జిక్యూటివ్, క్యాట‌రింగ్ సంస్థ‌లు, ప‌ర్యాట‌క సంస్థ‌లు, కేంద్రాల్లో వివిధ ర‌కాల సేవ‌లు, బ‌హుళ‌జాతి కంపెనీల క్యాంటీన్లు, హోట‌ల్ మేనేజ్‌మెంట్ క‌ళాల‌శాలల్లో ఫ్యాక‌ల్టీ, సొంతంగా ఫుడ్ చెయిన్ ప్రారంభించడం.. త‌దిత‌ర అవ‌కాశాలు ద‌క్కుతాయి.

కోర్సు స్వరూపం 

బీఎస్‌సీ హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సు వ్యవధి మూడేళ్లు. మొత్తం 6 సెమిస్టర్లు ఉంటాయి. ఈ కోర్సును జనరిక్‌ తోపాటు శాకాహారుల కోసమూ అందిస్తున్నారు. ఇందులో భాగంగా వెజిటేరియన్‌ కోర్సు ఎంచుకున్నవారికి వెజ్‌ అంశాల్లో ప్రత్యేక తర్ఫీదు అందుతుంది. వీరు మాంసాహార వంటలను నేర్చుకోనవసరం లేదు. మూడేళ్ల యూజీ కోర్సులో మొదటి ఏడాది ఆతిథ్య రంగానికి చెందిన వివిధ అంశాలపై అవగాహన కల్గిస్తారు. హౌస్‌ కీపింగ్, ఫ్రంట్‌ అఫీస్, ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్, ప్రొడక్షన్‌/సర్వీసెస్‌ తదితర విభాగాల్లో ప్రాథమికాంశాలపై పరిజ్ఞానం కల్పిస్తారు. కోర్సు రెండో సంవత్సరంలో క్షేత్ర సాయిలో శిక్షణ ఉంటుంది. అంటే విద్యారులు పనిచేస్తూ నేర్చుకుంటారు. ఇందుకోసం విద్యా సంసలు ఏదైనా హోటల్‌ లేదా క్యాటరింగ్‌ సంసతో ఒప్పందం కుదుర్చుకుని శిక్షణ అందిస్తాయి. మూడో సంవత్సరంలో ఫైనాన్స్, బిజినెస్‌ ఎన్విరాన్‌మెంట్, స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌ అంశాల గురించి చదువుకుంటారు. హోటల్‌ అకౌంటెన్సీ, ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ క్వాలిటీ, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్, ఫెసిలిటీ ప్లానింగ్, ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్, టూరిజం మార్కెటింగ్‌ అండ్‌ టూరిజం మేనేజ్‌మెంట్‌ అంశాలనూ పూర్తిసాయిలో బోధిస్తారు. 

నోటిఫికేషన్ వివ‌రాలు..

ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ సంస్థల్లో హోట‌ల్ మేనేజ్‌మెంట్ కోర్సును చేయ‌డానికి ఎన్‌టీఏ 2021 ఏడాదికి నోటిఫికేషన్ విడుద‌ల చేసింది. ఆసక్తి ఉండి అర్హులైన అభ్యర్థులు ఈ ప్రవేశ పరీక్ష రాయొచ్చు. ఇందులో ర్యాంకు సాధిస్తే దేశంలోని హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాలల్లో 2021-22 అకడమిక్ ఏడాదిలో బీఎస్సీ (హాస్పిటాలిటీ, హోటల్ అడ్మినిస్ట్రేషన్) కోర్సు చేయవచ్చు.  

హోటల్ మేనేజ్‌మెంట్‌లో ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ సంస్థలు అఖిలభారత స్థాయిలో పేరుగాంచాయి. వీటి నిర్వహణకు కేంద్ర పర్యటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ (ఎన్సీహెచ్ఎంటీసీ)ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఎన్సీహెచ్ఎం-జేఈఈ ద్వారా బీఎస్సీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తుంది. 

అర్హత

ఇంటర్మీడియట్ (10+2)/ తత్సమాన ఉత్తీర్ణత సాధించివారందరూ ఈ పరీక్ష రాయడానికి అర్హులే. ప్రస్తుతం ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న వారు కూడా పరీక్ష రాయొచ్చు. జులై 1, 2021 నాటికి జనరల్, ఓబీసీ అభ్యర్థులకు గరిష్ఠ వయసు 25 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు గరిష్ఠ వయసు నిబంధన 28 ఏళ్ల వరకు ఉంది. 

ఎంపిక ఎలా?

దరఖాస్తు చేసుకున్న అర్హులైన అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) నిర్వహిస్తారు. ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా ఆల్ ఇండియా ర్యాంకు కేటాయిస్తారు. గ్రూపు డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ లాంటివేమీ లేకుండా కేవలం ర్యాంకు ఆధారంగానే ఇన్‌స్టిట్యూషన్లు ప్రవేశాలు కల్పిస్తాయి. అర్హత పరీక్షను మొత్తం 200 మార్కులకు మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో నిర్వహిస్తారు. ఇందులో ఐదు విభాగాల నుంచి ప్రశ్నలడుగుతారు. న్యూమ‌రికల్ ఎబిలిటీ అండ్ అనలిటికల్ ఆప్టిట్యూడ్(30), రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్(30), జనరల్ నాలెడ్జ్&కరెంట్ అఫైర్స్(30), ఇంగ్లిష్ లాంగ్వేజ్(60), ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్ నుంచి 50 ప్రశ్నలు ప్రశ్నలొస్తాయి. ప్రతి సరైన సమాధానికి నాలుగు మార్కులు ఉంటాయి. తప్పు సమాధానికి ఒక మార్కు కోత విధిస్తారు. పరీక్ష సమయం మూడు గంటలు.

దరఖాస్తు విధానం

అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష రుసుముగా జనరల్/ఓబీసీ వారు రూ.1000, జనరల్‌, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.700, ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీలు, ట్రాన్స్‌జెండ‌ర్లు రూ.450 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుకు జూన్ 20, 2021 చివ‌రి తేదిగా ఉంది. 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు

గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ కరీంనగర్.

అభ్యర్థుల కోసం టెస్ట్ ప్రాక్టీస్ సెంటర్లు

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌పై అవగాహన కల్పించేలా దేశవ్యాప్తంగా అభ్యర్థుల కోసం టెస్ట్ ప్రాక్టీస్ సెంటర్లు (టీపీసీ) ఏర్పాటు చేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఎన్టీఏను ఆదేశించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అభ్యర్థుల కోసం ఏర్పాటు చేయాలని సూచించింది. ఈమేరకు ఎన్టీఏ టీపీసీలను ఏర్పాటు చేయనుంది. అభ్యర్థులు తమ పేర్లను ఎన్టీఏ వెబ్‌సైట్లో రిజిస్టర్ చేసుకుంటే, తమకు సమీపంలోని టీపీసీలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌పై అవగాహన పెంచుకోవచ్చు. 

సన్నద్ధత ఇలా..

ఎన్సీహెచ్ఎం-జేఈఈ పరీక్ష సన్నద్ధతకు ముఖ్యంగా గత ప్రశ్నపత్రాలను పరిశీలించాలి. దీని ద్వారా ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో ఒక అవగాహన ఏర్పడుతుంది. మోడల్ పేపర్ల ప్రాక్టీస్, వాస్తవ పరీక్షలో అభ్యర్థులు కొన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తే తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సాధించుకునే అవకాశం ఉంటుంది. ప్రశ్నపత్రంలో ఇచ్చిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడం కష్టం. అందుకే ఏ ప్రశ్నలను ముందు వరుసలో సమాధానాలు గుర్తించగలమో వాటినే ఎంచుకోవాలి. ప్రశ్నకి సమాధానం గుర్తించలేకపోయినా, వచ్చిన ఆన్సర్ ఆప్షన్లలో లేకపోయినా, ప్రశ్న చదివినప్పుడు అర్థం కాకపోయినా, ఆయా ప్రశ్నలను విడిచి వేరే ప్రశ్నను ఎంచుకోవాలి. ఒకే ప్రశ్నకు ఎక్కువ సమయం వృథా చేయకూడదు. రోజూ ఒక మాదిరి ప్రశ్నపత్రం చేయడం అలవాటు చేసుకోవాలి. అభ్యర్థులు బలహీనంగా ఉన్న అంశాలపై ఎక్కువ ప్రశ్నలు సాధన చేస్తూ మెరుగుపర్చుకోవాలి.

న్యూమ‌రికల్ ఎబిలిటీ అండ్ అనలిటికల్ ఆప్టిట్యూడ్

ఈ విభాగంలో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, అరిథ్‌మెటిక్, నంబర్ సిస్టమ్, స్కేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్, సింప్లిఫికేషన్, వేరియేషన్, రేషియో అండ్ ప్రపొర్షన్, ఆవెరేజ్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, పర్సెంటేజ్ క్యాలిక్యులేషన్, ప్రాఫిట్‌అండ్ లాస్, క్లాక్స్ అండ్ క్యాలెండర్‌ల‌కు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు.

రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్

అనలిటికల్ రీజనింగ్, డైరెక్షన్ అండ్ డిస్టన్స్, లైనియర్ అరెంజ్‌మెంట్స్‌, నంబర్ సిరీస్, మ్యాట్రిక్స్ అరెంజ్‌మెంట్స్, బ్లడ్ రిలేషన్షిప్ టెస్ట్ టాపిక్స్ ఉంటాయి. నమూనా ప్రశ్నలను వీలైనంత సాధన చేయండి. ఈ విభాగంలో అధిక మార్కులు సాధించడానికి ఇదొక్కటే మార్గం. ఈ ప్రశ్నలను ఎంత బాగా పరిష్కరిస్తే అంత మంచి స్కోరు సాధించవచ్చు. 

ఇంగ్లిష్ లాంగ్వేజ్

ఇంగ్లిష్ గ్రామర్ నియ‌మాలు తెలిస్తే సమాధానాలు సులువుగా గుర్తించవచ్చు. వీటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. సెంటెన్స్ అరెంజ్‌మెంట్స్‌, సెంటెన్స్ క‌రెక్ష‌న్ల ప్ర‌శ్న‌లు ఈ నియమాలపై ఆధారపడి ఉంటాయి. ఒకాబులరీ, యాంటనిమ్స్, సిననిమ్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థులకు ముఖ్యంగా కావాల్సిన లక్షణం- తక్కువ సమయంలో ఇచ్చిన సమాచారాన్ని చదివి, అందులో ముఖ్యమైన లేదా అవసరమైన సమాచారాన్ని గుర్తుంచుకోవడం. కాంప్రహెన్ష‌న్ ప్యాసెజ్‌ల‌లో ముందుగా ప్రశ్నలను చదివి, గుర్తుంచుకుని తరువాత ప్యాసెజీలో ఇచ్చిన సమాచారాన్ని చదివితే అవసరమైన సమాచారమేదో గుర్తించడం సులభమవుతుంది. ప్రతిరోజూ తప్పనిసరిగా ఆంగ్ల దినపత్రిక చదవాలి. 

జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్

చరిత్ర, భౌగోళిక, రాజకీయ, ఆర్థిక సంబంధిత అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. భారతదేశం, పొరుగు దేశాలకు సంబంధించిన ప్రశ్నలుంటాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలు, బడ్జెట్, భారతదేశం పాల్గొన్న సమ్మిట్స్, వాటి ముఖ్యాంశాలు, ఆయా దేశాలు, వాటి రాజధానులు, కరెన్సీ, ప్రధాన మంత్రులు, రాష్ట్రపతులు, యునెస్కో గుర్తించిన ప్రదేశాలపై పట్టు పెంచుకోవాలి. సంగీతం, నృత్యం, వార్తల్లోని వ్యక్తులు, స్పోర్ట్స్ సంబంధిత‌అంశాల్లో ప్రస్తుతం జరిగిన ఆటల్లో విజేతలు, పుస్తక రచయితలు, భారత్ ఆర్థిక రంగ విధానాల సంబంధిత సమాచారాన్ని సేకరించాలి. ప్రతిరోజూ తప్పనిసరిగా దినపత్రికలు చదవడం ద్వారా పరీక్షకు కావాల్సిన సమాచారాన్ని పొందవచ్చు. 

స‌ర్వీస్ సెక్టార్ ఆప్టిట్యూడ్‌

స‌ర్వీస్ సెక్టార్ ఆప్టిట్యూడ్ విభాగంలోని ప్ర‌శ్న‌లు ఆతిథ్య, సేవా రంగాల‌కు చెందిన‌విగా ఉంటాయి. ప్ర‌శ్న‌ను చ‌దివి, ఆలోచించి, విచ‌క్ష‌ణ‌తో స‌మాధానం గుర్తించాలి. హోట‌ల్ ప‌రిశ్ర‌మ‌, సేవా రంగాల‌పై క‌నీస అవ‌గాహ‌న పెంచుకుంటే ఎక్కువ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు రాయవ‌చ్చు.

వెబ్‌సైట్‌: https://nchmjee.nta.nic.in/
 

Posted Date : 21-02-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌