• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Education: బడి మానేసి చాకిరి ఊబిలోకి...

అర్ధాంతరంగా ఆగుతున్న చదువులు
విద్యార్థి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దడంలో విద్య పాత్ర ఎనలేనిది. దేశీయంగా వందశాతం అక్షరాస్యత సాధించాలని ప్రభుత్వాలు సంకల్పిస్తున్నాయి. నేటికీ భారత్‌లో 28.4శాతం విద్యార్థులు పాఠశాల స్థాయిలోనే చదువు మానేస్తున్నారు. కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన విద్యపై ఏకీకృత జిల్లా సమాచార వ్యవస్థ (యూడైస్‌ ప్లస్‌) నివేదిక 2020-21 ఈ మేరకు చేదు నిజాలు వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిది, పది తరగతుల్లో అత్యధికంగా డ్రాపౌట్లు నెలకొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 14.8శాతం, తెలంగాణలో 12.3శాతం విద్యార్థులు అర్ధాంతరంగా బడికి దూరమవుతున్నారు. డ్రాపౌట్లలో బాలుర సంఖ్య అధికంగా ఉంటోంది. భారత్‌లో పిల్లలు అర్ధాంతరంగా చదువు మానేయడానికి తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి ప్రధాన కారణం. కనీసం పూట గడవని స్థితి నుంచి భారత్‌ చాలావరకూ బయటపడినా, పిల్లలను చదివించే స్తోమత లేని తల్లిదండ్రులు నేటికీ పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఫలితంగా ఎంతోమంది పిల్లలు కుటుంబానికి ఆర్థికంగా ఆసరాగా నిలిచేందుకు పాఠశాల స్థాయిలోనే చదువుకు స్వస్తి చెబుతున్నారు.
త్రిపుర, సిక్కిం, నాగాలాండ్‌, మేఘాలయ, మధ్యప్రదేశ్‌, అస్సాం, అరుణాచల్‌ ప్రదేశ్‌లలో డ్రాపౌట్ల సంఖ్య అధికంగా ఉన్నట్లు యూడైస్‌ నివేదిక తెలిపింది. దేశ రాజధాని దిల్లీలోనూ 20శాతానికి పైగా పిల్లలు మధ్యలోనే చదువు ఆపేస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. కేవలం    1.5శాతం డ్రాపౌట్లతో పంజాబ్‌లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. ముఖ్యంగా పంజాబ్‌లో వందశాతం బాలికలు పాఠశాల విద్య పూర్తిచేయడం హర్షణీయం. చండీగఢ్‌, కేరళ, మణిపుర్‌, తమిళనాడులలోనూ డ్రాపౌట్లు తక్కువగా ఉన్నాయి. దేశంలో ప్రాథమిక స్థాయినుంచి సెకండరీ విద్యదాకా 91.4శాతం విద్యార్థులు చదువు కొనసాగిస్తున్నారు. సీనియర్‌ సెకండరీ పూర్తయ్యేసరికి అది 71.6 శాతానికి తగ్గిపోతోంది. చదువు మానేసిన పిల్లలు చేతివృత్తులు, వ్యవసాయం, గాజుల తయారీ, ఇతరత్రా పనుల్లో బాలకార్మికులుగా చేరిపోతున్నారు.
‣ అటవీ గ్రామీణ ప్రాంతాల్లో డ్రాపౌట్లు త్రిపుర, నాగాలాండ్‌, సిక్కిం, మేఘాలయలో ఎక్కువగా ఉన్నాయి. యునెస్కో నిర్దేశం ప్రకారం సీనియర్‌ సెకండరీ విద్యలో ప్రతి 26 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. భారత్‌లో సగటున ప్రతి 47 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు మాత్రమే పనిచేస్తున్నారు. ధనిక దేశాల్లో పాఠశాల స్థాయిలో 14 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు చొప్పున ఉన్నారు. పేద దేశాల్లో మాత్రం సగటున ప్రతి 34 మంది పిల్లలకు ఒక ఉపాధ్యాయుడే విధులు నిర్వర్తిస్తున్నారు. భారత్‌లో 1.10 లక్షల ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో పనిచేసే ఉపాధ్యాయులు సెలవు పెట్టినప్పుడు, బోధనేతర విధులకు వెళ్ళినప్పుడు- ఆ బడులు మూతపడాల్సిందే.
‣ గత పదేళ్లలో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు పెరిగినా, అవి పూర్తిస్థాయిలో లేవు. దేశంలోని 15 లక్షల పాఠశాలల్లో పనిచేసే కంప్యూటర్ల సంఖ్య 5.5 లక్షలు మాత్రమే. కొవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో డిజిటల్‌ బోధన ప్రాధాన్యం సంతరించుకుంది. డిజిటల్‌ విద్యావిధానానికి ప్రభుత్వాలు ఎంతగా ప్రయత్నించినా దానికి సంబంధించిన సామగ్రిని పాఠశాలలకు అందించడంలో వెనకబడ్డాయి. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా డిజిటల్‌ బోధనలో ఉపాధ్యాయులకు సరైన నైపుణ్యాలు నేర్పడంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. తెలుగు రాష్ట్రాల్లో కొంతకాలంగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు పెరిగినా, ఉపాధ్యాయుల కొరత వెంటాడుతోంది.
‣ విద్యార్థిని బహుముఖ ప్రజ్ఞాశాలిగా తీర్చిదిద్దాలని నూతన జాతీయ విద్యావిధానం అభిలషిస్తోంది. మూడు దశాబ్దాల క్రితం అన్ని పాఠశాలల్లో డ్రాయింగ్‌, క్రాఫ్ట్‌, డ్రిల్‌ ఉపాధ్యాయులు ఉండేవారు. నేటి పాఠశాల విద్యలో వారికి ప్రాధాన్యం తగ్గిపోవడం విచారకరం. ఆడుతూ పాడుతూ చదువు నేర్పించే ఫిన్లాండ్‌- పాఠశాల విద్యలో గణనీయమైన ఫలితాలు సాధిస్తోంది. అక్కడ పాఠశాల విద్య ఆరేళ్ల వయసులో ప్రారంభమవుతుంది. దేశీయంగా అంగన్‌వాడీల్లో పూర్వ ప్రాథమిక విద్య మంచి ఫలితాలు ఇస్తున్నప్పటికీ అందులో పనిచేసే ఉపాధ్యాయులకు సరైన శిక్షణ అందించాల్సిన అవసరం ఉంది. కొవిడ్‌ కారణంగా ఆదాయాలు తగ్గిపోవడంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. అందుకు అనుగుణంగా బడుల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, ఉపాధ్యాయుల కొరతను తీర్చి, నాణ్యమైన ఆహ్లాదకరమైన విద్యను అందిస్తే డ్రాపౌట్లు తగ్గుతాయి. భారీగా ఫీజులు గుంజుతూ అరకొర చదువులతో పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ప్రైవేటు స్కూళ్లపైనా ప్రభుత్వాలు దృష్టి సారించాలి. దేశ భవిష్యత్తును నిర్దేశించే పిల్లల చదువు విషయంలో పాలకుల అలక్ష్యం భావి ప్రగతికే తీవ్ర విఘాతం.

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chat and Google News

Posted Date : 18-04-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌