• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Education: చదువంటే ఉత్సాహం లేదు!

విద్యార్థులపై కొవిడ్‌ ప్రభావం తీవ్రం రి తరగతి గదుల్లో విపరీత ధోరణితో ఇబ్బందులు
‘తరగతి గదిలో పాఠాలపై ఆసక్తి లేదు. చదువంటే ఉత్సాహం కనిపించడం లేదు. ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకున్న వారిలా ఉండడం. ఉన్నత లక్ష్యాల ఊసేలేదు.. ప్రస్తుతం ఇంజినీరింగ్, డిగ్రీ, ఇంటర్‌ అన్ని కళాశాలల్లోనూ ఎక్కువ మంది విద్యార్థుల పరిస్థితి ఇదే. కొవిడ్‌ కారణంగా రెండేళ్లకు పైగా ఇంటికే పరిమితమైన కాలేజీ విద్యార్థుల్లో ప్రస్తుతం మునుపటి ఉత్సాహం.. ఆసక్తి.. ఆశలు లేవు. వారి ప్రవర్తనలోనూ విపరీతమైన మార్పులు కనిపిస్తున్నాయి. ప్రతి నిమిషం స్మార్ట్‌ఫోన్‌ వైపే చూపులుంటున్నాయి. సామాజిక మాధ్యమాల వ్యామోహం చాలా ఎక్కువ పెరిగిపోయింది.’ 
విద్యార్థుల్లో పెరిగిపోయిన బద్ధకం.. నిరాశక్తిని పోగొట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేయాల్సి వస్తోంది. అయినా.. ఫలితం ఉండడం లేదని అధ్యాపకులు చెబుతున్నారు. దీంతో కొన్ని కళాశాలల్లో మానసిక, వ్యక్తిత్వ వికాస నిపుణులను ఏర్పాటు చేస్తున్నారు. 
‣ ప్రస్తుతం చాలామంది విద్యార్థులు సోషల్‌ మీడియాకు ఎంతలా బానిసలుగా మారిపోయారంటే.. ఒక్క క్షణం ఫోన్‌ లేకుండా ఉండలేని పరిస్థితికి వచ్చేశారు. కొన్ని కళాశాలల్లో ఒకవైపు అధ్యాపకులు పాఠాలు బోధిస్తుంటే.. మరోవైపు ఫోన్‌ను దొంగచాటుగా చూస్తూ ఆనందించే విద్యార్థులు పెరిగిపోయారు. కొవిడ్‌లో రెండేళ్లు స్మార్ట్‌ఫోన్లలోనే ఎక్కువ మంది సామాజిక మాధ్యమాల్లో వీడియోలు చూస్తూ గడిపేశారు. ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో తల్లిదండ్రులు కూడా విద్యార్థులపై పెద్దగా దృష్టి పెట్టలేదు. ప్రస్తుతం ఆ ప్రభావమే ఇంకా విద్యార్థులపై ఉంది.  
ఒంటరిగానే ఉండేందుకు ఆసక్తి..
ప్రధానంగా నలుగురితో కలిసే చొరవ తగ్గిపోయింది. ఎక్కువగా ఒంటరిగా ఉండేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. దీనివల్ల వారిలో ఆత్మన్యూనత పెరిగిపోతోంది. ఇది మరింత పెరిగితే.. భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలను కూడా అందిపుచ్చుకోవడం కష్టమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నలుగురితో కలిసి బృందంగా పనిచేసే స్వభావం లేకపోతే.. ప్రస్తుత కార్పొరేట్‌ యుగంలో ఉద్యోగం చేయడం అసాధ్యమని వారు సూచిస్తున్నారు. ప్రస్తుతం మానసిక, వ్యక్తిత్వ వికాస నిపుణుల వద్దకు తీసుకెళ్లి ఎక్కువ మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు కౌన్సెలింగ్‌లు సైతం ఇప్పిస్తున్నారు. 
ఆరోగ్యంపైనా.. 
కొవిడ్‌ రోజుల్లో సమయపాలన లేకుండా తినడం, నిద్ర కూడా సరిగా లేకపోవడంతో ప్రస్తుతం చాలామందిలో అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఎక్కువ మందిలో ఊబకాయం సమస్య కనిపిస్తోంది. చాలామంది తరగతి గదుల్లోనే పాఠాలు వినకుండా నిద్రలోనికి జారుకుంటున్నారు. గతంలోనూ ఇలాంటి విద్యార్థులున్నప్పటికీ.. ప్రస్తుతం వారి సంఖ్య రెట్టింపైందని అధ్యాపకులు చెబుతున్నారు. కొందరిలో జ్ఞాపకశక్తి తగ్గిపోయింది. పాఠాలు కూడా సరిగా వినకపోవడంతో అర్థంకాక.. చాలా ఇబ్బంది పడుతున్నారు. 
వినే సామర్థ్యం తగ్గిపోయింది: డాక్టర్‌ రమేష్‌ మేక, ప్రిన్సిపల్, పి.బి.సిద్ధార్థ కళాశాల
కొవిడ్‌కు ముందుతో పోలిస్తే విద్యార్థుల్లో తరగతి గదిలో వినే సామర్థ్యం పూర్తిగా తగ్గిపోయింది. వినడానికి కూడా ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. ఇంటిదగ్గరే ఎక్కువగా గడపడం వల్ల చాలామంది విద్యార్థుల్లో ఊబకాయం సమస్య కూడా కనపడుతోంది. ఏకాగ్రత కొరవడింది. ఒకపూట తరగతులు కుదురుగా వినలేకపోతున్నారు. ఇది వారి ప్రతిభా నైపుణ్యాలను దెబ్బతీస్తోంది. ఈ పరిస్థితులు మారే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. చేతి రాత దగ్గర నుంచి క్రమశిక్షణ వరకూ అన్నింటిలోనూ విద్యార్థుల్లో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది.

Posted Date : 23-07-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌