• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Online Education: ఉన్నత చదువుల ఆన్‌లైన్‌ బాట

పటిష్ఠ ప్రణాళికతో మేలిమి ఫలితాలు
నానాటికీ అందివస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తరగతి గది అభ్యసన-బోధన రూపు మార్చుకొంటోంది. రాబోయే రోజుల్లో గురుముఖంగా సాగే బోధన పాఠశాల విద్యకే పరిమితమై పై చదువుల్లో ఆన్‌లైన్‌ ప్రాధాన్యం పెరగనుంది. సాంఘిక, వాణిజ్య, న్యాయ శాస్త్రాల కోర్సుల బోధన పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ-ప్రయోగశాలల ఏర్పాటుతో ఆన్‌లైన్‌లో సైన్స్‌ కోర్సుల బోధనకు ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యను సాంకేతికత సాయంతో విద్యార్థి ముంగిట సౌకర్యవంతంగా అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడుతున్నాయి. ప్రస్తుతం విశ్వవిద్యాలయాలకే పరిమితమైన ఆన్‌లైన్‌ కోర్సులను దేశంలో ఎంపిక చేసిన 900 స్వయం ప్రతిపత్తి కళాశాలలకు విస్తరిస్తున్నట్లు విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యూజీసీ) ఇటీవల ప్రకటించింది.
బోధన-అభ్యసనలో రేడియో పాత్ర దాదాపుగా ముగిసి, టెలివిజన్‌ అవసరం ఇంకా కొనసాగుతోంది. కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చాక అంతర్జాలం సాయంతో మాసివ్‌ ఓపెన్‌ ఆన్‌లైన్‌ కోర్సులు రంగ ప్రవేశం చేశాయి. ఆన్‌లైన్‌ విద్య క్రమంగా ప్రజాదరణ పొందుతున్న సమయంలో కొవిడ్‌ మహమ్మారి దాని ప్రాముఖ్యాన్ని మరింతగా పెంచింది. చాలా దేశాలు సాంకేతికతకు పదును పెట్టి ఆన్‌లైన్‌ కోర్సులను ప్రోత్సహించడం మొదలుపెట్టాయి. ఆన్‌లైన్‌ విద్యలో విశ్వవ్యాప్తంగా అమెరికా తరవాత ఇండియా రెండో స్థానంలో నిలుస్తోంది. రాబోయే రోజుల్లో ఆన్‌లైన్‌ విద్యను మరింత ప్రోత్సహించడానికి డిజిటల్‌ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు కేంద్రం ఇటీవల ప్రకటించింది
‣ ఇండియాలో పేరుగడించిన విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ఆన్‌లైన్‌ కోర్సులను యూజీసీ ప్రోత్సహిస్తోంది. 2035 నాటికి ఉన్నత చదువుల్లో స్థూల ప్రవేశ నిష్పత్తి 50 శాతానికి చేరాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఆన్‌లైన్‌ కోర్సుల్లో సీట్ల విషయంలో పరిమితి ఉండదు. 12వ తరగతి పూర్తిచేసి కళాశాలలకు వెళ్ళి చదువుకోలేని వేలమంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి పట్టా అందుకునేంత వరకు అంతా ఆన్‌లైన్‌ విధానంలోనే సాగనుంది. నిపుణులు తయారు చేసిన నాణ్యమైన పాఠ్యసామగ్రితోపాటు ఉత్తమ ఉపాధ్యాయుల బోధనలు వీడియోల రూపంలో ఎప్పటికప్పుడు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. ఆన్‌లైన్‌ కోర్సుల ద్వారా పొందే డిగ్రీలు సంప్రదాయ విద్యతో సమాన ప్రాధాన్యం కలిగి ఉంటాయని యూజీసీ వెల్లడించింది. దీన్నిబట్టి భవిష్యత్తులో ఈ కోర్సులకు మంచి ఆదరణ ఉంటుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
‣ ఆన్‌లైన్‌లో సైన్స్‌ పాఠాల బోధనకోసం ఈ-ప్రయోగశాలల వినియోగానికి కసరత్తు జరుగుతోంది. ఉత్తమ విశ్వవిద్యాలయాలు, పరిశోధనాసంస్థల ప్రయోగశాలలకు ఆన్‌లైన్‌ తరగతులను అనుసంధానిస్తారు. విద్యార్థులకు డిజిటల్‌ గ్రంథాలయాలు సైతం అందుబాటులో ఉంటాయి. బోధన మాధ్యమంగా ఆంగ్లంతో పాటు స్థానిక భాషలకూ అవకాశం దక్కుతుంది. పాఠ్యాంశాలు, అభ్యసన ఫలితాలు, క్రెడిట్‌ విధానం వంటివి సంప్రదాయ కోర్సులతో సమానంగా ఉంటాయి. అంతర్జాలంలో జరిగే పరీక్షల్లో అవకతవకలకు ఆస్కారం లేకుండా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ అన్ని చర్యలూ తీసుకుంటుంది. ఆన్‌లైన్‌ విధానంలో మెషీన్‌ లెర్నింగ్‌, డేటాసైన్స్‌, కృత్రిమ మేధ, ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ వంటి కోర్సులకు మంచి ఆదరణ లభిస్తుందని అంచనా వేస్తున్నారు.
‣ దేశీయంగా విద్యుత్తు సరఫరా కొంత మెరుగ్గా ఉన్నా- నెట్‌ వేగం శ్రీలంక, పాకిస్థాన్‌, నేపాల్‌ల కన్నా తక్కువగానే ఉందన్నది కాదనలేని సత్యం. ఉపాధ్యాయులకు ఆన్‌లైన్‌ బోధనలో సరైన శిక్షణ సైతం లేదు. ఈ అంశాలపై పాలకులు ముందుగా దృష్టి సారించాలి. కేవలం తరగతి గదులకు రాలేనివారికే కాకుండా ఉపాధ్యాయుల కొరత ఉన్న విద్యాలయాలకు సైతం ఆన్‌లైన్‌ బోధనను విస్తరించడం గురించీ ఆలోచించాలి. సువిశాల భారతదేశంలో లక్షల సంఖ్యలో విద్యార్థులను ఒక్క డిజిటల్‌ విశ్వవిద్యాలయం పర్యవేక్షించడం కష్టతరం. అందువల్ల ఉత్తర, దక్షిణ, ఈశాన్య ప్రాంతాలకు కనీసం మూడు డిజిటల్‌ వర్సిటీలు అవసరం. ప్రత్యక్ష బోధనలో సైతం చాలామంది విద్యార్థులు ప్రమాణాలు అందుకోలేకపోతున్నారని ‘అసర్‌’ నివేదిక తెలియజేస్తోంది. పస లేని విద్యను అందించి పట్టాలు చేతికందిస్తే నష్టమే అధికంగా ఉంటుంది. ఆన్‌లైన్‌ విద్యలో నాణ్యతకోసం జాతీయ, రాష్ట్ర విద్యా పరిశోధనా మండళ్లు, అఖిల భారత సాంకేతిక విద్యామండలి, విశ్వవిద్యాలయాలు సరైన ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉంది. వాటిని సమగ్రంగా అమలు జరిపినప్పుడే పటిష్ఠమైన ఆన్‌లైన్‌ విద్య సాకారమవుతుంది.

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chat and Google News

Posted Date : 10-03-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌