• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Employment: ఉపాధి అవకాశాల ఆన్‌లైన్‌ క్రీడారంగం

భారత్‌లో అభివృద్ధి దిశగా అడుగులు
మొబైల్‌ గేమ్స్‌ బాలల చదువు సంధ్యలను, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంటే, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ గేమ్స్‌ అనేకమంది జూదరుల ప్రాణాలు తీస్తున్నాయి. అందుకే అంతర్జాలంలో, మొబైల్‌ ఫోన్లలో ఆడే డిజిటల్‌ క్రీడలకు చెడ్డపేరు వచ్చింది. ఈ పరిస్థితిలో ‘యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, గేమింగ్‌, కామిక్స్‌ (ఏవీజీసీ)’ రంగం గురించి మొట్టమొదటిసారిగా ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లో ప్రస్తావించడంతో గేమింగ్‌ రంగంపై ఆసక్తి పెరిగింది. ఏవీజీసీ రంగానికి పుష్కలంగా ఉపాధి అవకాశాలను కల్పించే సామర్థ్యం ఉన్నందువల్ల దాన్ని ప్రోత్సహించడానికి ఒక ప్రత్యేక కార్యాచరణ బృందాన్ని నెలకొల్పనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. త్వరలో 5జీ వేలం ప్రక్రియను ప్రారంభించనున్నట్లు కూడా ఆమె బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించిన నేపథ్యంలో- 5జీతో ఏవీజీసీ రంగానికి సరికొత్త సాంకేతిక ఊపు, వేగం సమకూరతాయంటున్నారు. 2025కల్లా ఒక్క గేమింగ్‌ పరిశ్రమ ఆదాయమే రూ.29 వేల కోట్లకు చేరి, ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మందికి ఉపాధి కల్పిస్తుందని అంచనా. మరోవైపు, వస్తుసేవల పన్ను (జీఎస్టీ) మండలి తరఫున మంత్రుల బృందం ఆన్‌లైన్‌ గేమ్స్‌కు పన్ను రేట్లు నిర్ధారించే పనిలో ఉంది.
వినోదమా, జూదమా? 
మొబైల్‌, ఆన్‌లైన్‌ గేమ్స్‌లో వినోద అంశాలు, జూద క్రీడల మధ్య తేడాను గుర్తించే విషయంలో సామాన్యులే కాదు- ప్రభుత్వాలూ తికమక పడుతున్నాయి. ఉదాహరణకు పోకర్‌నే తీసుకుంటే, అది కేవలం పేకాట మాత్రమే కాదు- వ్యూహ రచన, ఎత్తుకుపైఎత్తులు వేయడం అందులో అంతర్భాగం. ‘చదరంగంలో ఎదుటి వ్యక్తి బలం మన కళ్లముందు బల్ల మీదే కనబడుతుంది. కానీ, ఆ వ్యక్తి మనసులో ఏముందో, తదుపరి ఎత్తు ఏమిటో మనం పసిగట్టలేం. అలా పసిగడితే గెలుపు మనదే. పోకర్‌లో ఎదుటి వ్యక్తి బలమేమిటో మనకు తెలియదు. అతడు వేసే పేక ముక్కను చూసి అతడి ఎత్తు ఏమిటో తెలుసుకుంటాం’ అంటూ దీనిపై ఒక గూఢచారి సంస్థ అధిపతి ఇచ్చిన వివరణ ఇక్కడ ప్రస్తావనార్హం. అందుకని, పోకర్‌ వ్యూహరచనకు తోడ్పడే క్రీడ. యుద్ధంలోనే కాకుండా వ్యాపార వ్యవహారాల్లో నెగ్గుకురావడానికీ వ్యూహమే కీలకం. దీనిలో రాణించడానికి అత్యాధునిక గేమ్‌ సిద్ధాంతం, గణాంక శాస్త్ర ప్రావీణ్యం కావాలి. కేరళలోని ఐఐఎం-కోళికోడ్‌లో వ్యాపార పోటీ వ్యూహాలను నేర్పించేందుకు పోకర్‌ సిద్ధాంతాన్ని బోధిస్తున్నారు. అమెరికాలో విఖ్యాత ఎంఐటీకి చెందిన స్లోన్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో కూడా పోకర్‌ను ఒక కోర్సుగా అందిస్తున్నారు. ఆన్‌లైన్‌ పోకర్‌ను డబ్బు కోసం కాకుండా నైపుణ్య క్రీడగానూ ఆడుతూ టోర్నమెంట్లు నిర్వహిస్తున్నారు. ప్రపంచ సిరీస్‌ పోకర్‌ పోటీలో పతకంగా ఒక కంకణాన్ని పొందిన తొలి మహిళగా భారత్‌కు చెందిన నికితా లూథర్‌ పేరు గడించారు. అంతర్జాతీయ కంపెనీ పోకర్‌ స్టార్స్‌ తన బ్రాండ్‌ ప్రతినిధిగా భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీని నియమించుకుంది. ఆన్‌లైన్‌ పోకర్‌ను బెట్టింగ్‌ క్రీడగా ఆడినప్పుడు మాత్రం ఇబ్బందులు తప్పవు. ఆన్‌లైన్‌ రమ్మీ మరో ప్రాణాంతక జూద క్రీడ. తమిళనాడులో ఆన్‌లైన్‌ రమ్మీలో లక్షల రూపాయలు పోగొట్టుకుని చాలామంది ఆత్మహత్యలకు ఒడిగట్టారు. గుంటూరు జిల్లా బాపట్లలో ఒక బ్యాంకు అటెండర్‌ రమ్మీ ఆడటానికి లాకర్‌ నుంచి రూ.2.36 కోట్ల విలువైన బంగారు నగల చోరీకి పాల్పడ్డాడు. ఇలాంటి ఉదంతాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళలు ఆన్‌లైన్‌ పోకర్‌ను జూదంగా పరిగణించి నిషేధించాయి. దీన్ని గేమింగ్‌ కంపెనీలు, అఖిల భారత గేమింగ్‌ సమాఖ్య (ఏఐజీఎఫ్‌) తమిళనాడు, కర్ణాటక హైకోర్టులలో సవాలు చేశాయి. మద్రాసు హైకోర్టు నిషేధాన్ని కొట్టివేయగా, కర్ణాటక హైకోర్టు సైతం ఆన్‌లైన్‌ గేమింగ్‌ నిషేధం కుదరదని స్పష్టం చేసింది. క్రీడల్లో నగదు బహుమతి వద్దనడం రాజ్యాంగ విరుద్ధమంటూ మద్రాసు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ నిషేధాన్ని తిరస్కరించింది.
విధివిధానాలు అవసరం
మొత్తం మీద గేమింగ్‌ పరిశ్రమ మీద అయోమయం నెలకొన్నమాట నిజం. దీన్ని తొలగించడానికి స్పష్టమైన వర్గీకరణలు, క్రీడా విధివిధానాలను నిర్దేశించాలి. అన్ని ఆన్‌లైన్‌ క్రీడలు జూదం కావని, వాటిలో నైపుణ్య క్రీడలూ ఉన్నాయని గ్రహించకుండా గంపగుత్తగా నిషేధించడం సరికాదని అఖిల భారత గేమింగ్‌ సమాఖ్య పేర్కొంది. ఏదిఏమైనా మొబైల్‌, ఆన్‌లైన్‌ గేమ్స్‌ బాలలను పెడదోవ పట్టించకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవలసిందే. ప్రతి గేమ్‌కూ వయోపరిమితి నిర్దేశించాలి. తల్లిదండ్రుల అనుమతితోనే బాలబాలికలు నైపుణ్యానికి పదునుపెట్టే గేమ్స్‌ ఆడేలా నియంత్రించాలి. పిల్లలు మొబైల్‌ గేమ్స్‌కు ఉపక్రమించేటప్పుడు తల్లిదండ్రుల ఫోన్లకు ఓటీపీ వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవడం కొంతమేర మెరుగైన పద్ధతి. ప్రభుత్వమూ గేమింగ్‌ నియంత్రణ సంస్థను నెలకొల్పడం ద్వారా అన్ని రకాల ముందుజాగ్రత్త చర్యలూ తీసుకోవాలి. కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ రంగం వృద్ధికి ఇతోధిక కృషి జరపాల్సిన అవసరం ఉంది.
కామిక్స్‌తో కనకవర్షం
భారత్‌లో యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ (వీఎఫ్‌ఎక్స్‌) రంగ వ్యాపార పరిమాణం 2024కల్లా సుమారు మూడు లక్షల కోట్ల రూపాయల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా. ఈ రంగం 75 వేల నుంచి 1.20 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తుందని బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌, భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ)ల సంయుక్త నివేదిక అంచనా వేస్తోంది. హైదరాబాద్‌లో గత మూడేళ్లలో 10 కొత్త వీఎఫ్‌ఎక్స్‌ కంపెనీలు, 45 గేమింగ్‌ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించాయి. టీవీలో ఒకప్పుడు ‘శక్తిమాన్‌’ సూపర్‌ హీరో సీరియల్‌, ఇటీవలి కాలంలో ‘ఛోటా భీమ్‌’ కొంటె బొమ్మల (కార్టూన్‌) సీరియల్‌ బహుళ ప్రాచుర్యం పొందడం భారత్‌లో కామిక్స్‌కు ఉన్న గిరాకీకి నిదర్శనం. వీటికన్నా ముందే చందమామ, అమర్‌ చిత్ర కథ భారతీయ ఇతివృత్తాలతో బొమ్మల కథలను రూపొందించి ఆబాలగోపాలాన్ని అలరించాయి. వాటికి డిజిటల్‌ హంగులు అద్ది మొబైల్‌ గేమ్స్‌గా, కామిక్స్‌ పుస్తకాలుగా, టీవీ సీరియళ్లుగా చిత్రించి దేశవిదేశ మార్కెట్లను విస్తరించుకోవడానికి ఏవీజీసీ కార్యాచరణ బృందం తగిన విధానాన్ని సూచించాలి. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఏవీజీసీ రంగాన్ని ఒక పరిశ్రమగా గుర్తించడానికి నిరాకరిస్తున్న సమయంలో ఆర్థిక మంత్రి నిర్మల చేసిన ప్రకటనను ఈ రంగంలోని అంకుర సంస్థలు స్వాగతిస్తున్నాయి. ముఖ్యంగా గేమింగ్‌పై దాదాపు అన్ని రాష్ట్రాలూ నియంత్రణలనో, నిషేధాన్నో విధించిన దృష్ట్యా- కేంద్రం తమను ప్రోత్సహించాలని నిర్ణయించడం ఎంతో హర్షణీయమని సంబరపడుతున్నాయి.

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chat and Google News

Posted Date : 17-02-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌