• facebook
  • twitter
  • whatsapp
  • telegram

పీఎన్‌బీలో 1,025 కొలువులు

* పరీక్ష, ఎంపిక విధానం వివరాలు

ఉన్నత విద్యావంతులకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ) ఆహ్వానం పలుకుతోంది. ఈ సంస్థ 1025 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. వీటిలో వెయ్యి క్రెడిట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలున్నాయి. పరీక్ష, ఇంటర్వ్యూలతో నియామకాలుంటాయి. ఎంపికైనవారు సుమారు రూ.70వేల వేతనంతో కెరియర్‌ ప్రారంభించవచ్చు! 


దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 25.

పరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు.

వెబ్‌సైట్‌: www.pnbindia.in/


ప్రత్యేక సేవల నిమిత్తం బ్యాంకులు విడిగా ప్రకటనలు విడుదల చేస్తుంటాయి. ఇందుకోసం భిన్న విద్యార్హతలు అవసరమవుతాయి. ఇటీవల వెలువడిన క్రెడిట్‌ ఆఫీసర్స్‌ నోటిఫికేషన్‌ ఆ తరహాదే. కొన్ని విభాగాల్లో ఉన్నత విద్య అభ్యసించినవారు వీటికి అర్హులు. 


ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి 2 గంటలు. మొత్తం 150 ప్రశ్నలు వస్తాయి. వీటికి 200 మార్కులు. పరీక్ష రెండు భాగాలుగా ఉంటుంది. పార్ట్‌-1లో రీజనింగ్‌ 25, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 25, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 50 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. తప్పు సమాధానానికి పావు మార్కు తగ్గిస్తారు. పార్ట్‌-2లో ప్రొఫెషనల్‌ పరిజ్ఞానాన్ని తెలుసుకోవడానికి 50 ప్రశ్నలు వస్తాయి. ఒక్కో ప్రశ్నకు 2 చొప్పున వీటికి వంద మార్కులు. తప్పు సమాధానానికి అర మార్కు తగ్గిస్తారు. 


ఇంటర్వ్యూకి..

అభ్యర్థులు ప్రతి విభాగంలోనూ అర్హత మార్కులు పొందడం తప్పనిసరి. పార్ట్‌-1లోని అంశాల వారీ అర్హత మార్కులు పొంది, మొత్తం పరీక్షలోనూ నిర్దేశిత కటాఫ్‌ కంటే ఎక్కువ మార్కులు వస్తేనే పార్ట్‌-2 మూల్యాంకనం చేస్తారు. అర్హత, కటాఫ్‌ మార్కులను బ్యాంకు నిర్ణయిస్తుంది. పార్ట్‌-1లో అర్హత సాధించి, పార్ట్‌-2లో మెరిట్‌లో నిలిచినవారికి ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. దీనికి 50 మార్కులు. ఇందులో అర్హత పొందాలంటే ఎస్సీ, ఎస్టీలు 45 శాతం (22.5) మార్కులు సాధించాలి. మిగిలినవారికి 50 శాతం (25) మార్కులు రావాలి. ఇలా అర్హులైనవారి జాబితాకు వారు పార్ట్‌-2లో పొందిన మార్కులు కలిపి మెరిట్, రిజర్వేషన్‌ ప్రకారం ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. 


ఆర్థిక వ్యవహారాలు

క్రెడిట్‌ ఆఫీసర్‌ హోదాతో విధుల్లో చేరినవారు బ్యాంకు ఆర్థిక వ్యవహారాలు చూసుకుంటారు. రుణాల మంజూరీలో వీరి సేవలు కీలకం. వీరికి రూ.36,000 మూల వేతనం లభిస్తుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర ప్రోత్సాహకాలతో సుమారు రూ.70 వేల వేతనం అందుకోవచ్చు. విధుల్లో చేరినవారు మూడేళ్లు కొనసాగడం తప్పనిసరి. ఇందుకోసం రూ.లక్ష విలువైన ఒప్పంద పత్రం సమర్పించాలి. క్రెడిట్‌ ఆఫీసర్, బ్యాంకు పీవో రెండూ సమాన హోదా (స్కేల్‌-1) ఉద్యోగాలే. స్పెషలిస్టు సేవల నిమిత్తం వీరిని బ్యాంకు కార్యకలాపాల్లో వినియోగిస్తారు. వీరు మూడేళ్ల అనుభవంతో ఇతర బ్యాంకుల్లో స్కేల్‌-2 క్రెడిట్‌ ఆఫీసర్‌ ప్రకటన వెలువడినప్పుడు దరఖాస్తు చేసుకుని తక్కువ వ్యవధిలోనే మెరుగైన స్థాయికి చేరుకోవచ్చు. 

పోస్టు: ఆఫీసర్‌ క్రెడిట్‌

ఖాళీలు: 1000. వీటిలో యూఆర్‌ 400, ఓబీసీ 270, ఈడబ్ల్యుఎస్‌ 100, ఎస్సీ 152, ఎస్టీ 78 ఉన్నాయి.

విద్యార్హత: సీఏ లేదా సీఎంఏ(ఐసీడబ్ల్యుఏ) లేదా సీఎఫ్‌ఏ(యూఎస్‌ఏ) లేదా ఫైనాన్స్‌ ముఖ్య స్పెషలైజేషన్‌గా రెండేళ్ల ఎంబీఏ/పీజీడీఎం కోర్సులో 60 శాతం మార్కులు పొందాలి. పార్ట్‌ టైం, దూరవిద్య, కరస్పాండెంట్‌ విధానంలో చదివినవారికి అవకాశం లేదు. 

వయసు: జనవరి 1, 2024 నాటికి 21 నుంచి 28 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో మినహాయింపు లభిస్తుంది. 

ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.59. మిగిలిన అందరికీ రూ.1180.


ప్రశ్నలు ఈ అంశాల్లో... 

రీజనింగ్‌: డైరెక్షన్లు, బ్లడ్‌ రిలేషన్లు, కోడింగ్‌-డీకోడింగ్, సిలాజిజం, డేటా సఫిషియన్సీ, ఇన్‌పుట్‌-అవుట్‌పుట్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్, పజిల్స్, స్టేట్‌మెంట్లు... వీటిని బాగా చదవాలి. 


ఇంగ్లిష్‌: రీడింగ్‌ కాంప్రహెన్షన్, ఫ్రేజ్‌ రీ అరేంజ్‌మెంట్, వర్డ్‌ రీ అరేంజ్‌మెంట్, వర్డ్‌ యూసేజ్, సెంటెన్స్‌ బేస్డ్‌ ఎర్రర్స్, స్పెలింగ్‌ ఎర్రర్, ఫ్రేజ్‌ రీప్లేస్‌మెంట్, ఇడియమ్స్‌ అండ్‌ ఫ్రేజెస్, సెంటెన్స్‌ రీ అరేంజ్‌మెంట్, వన్‌ వర్డ్‌ ఇన్ఫరెన్స్‌ అంశాల్లో ప్రశ్నలుంటాయి. 


క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: నంబర్‌ సిస్టం, సింప్లిఫికేషన్, పర్సంటేజ్, రేషియో అండ్‌ ప్రపోర్షన్, సగటు, కాలం-పని, కాలం-వేగం-దూరం, లాభ-నష్టాలు, బారువడ్డీ, చక్రవడ్డీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్, సంభావ్యత, ప్రస్తారాలు-సంయోగాలు. 


పార్ట్‌-2: బిజినెస్‌ ఫైనాన్స్, బ్యాంకింగ్‌ అండ్‌ ట్రేడ్‌ ఫైనాన్స్, ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్, క్వాంటిటేటివ్‌ ఫైనాన్స్, మ్యాథమెటికల్‌ ఫైనాన్స్, క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్, ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్, ప్రాజెక్ట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్, అగ్రి బిజినెస్‌ ఫైనాన్స్‌ అంశాలను బాగా అధ్యయనం చేస్తే ఎక్కువ మార్కులు పొందవచ్చు. ఆర్థిక సంస్థలు, రిజర్వ్‌ బ్యాంకు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తాజా మార్పులు, భారత్‌పై దాని ప్రభావం, ఫైనాన్స్‌లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ పాత్ర, డిజిటల్‌ పేమెంట్స్, ఫైనాన్షియల్‌ మార్కెట్స్, ఫైనాన్షియల్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్, బడ్జెట్, ఇన్‌ఫ్లేషన్, పీపీపీ, అకౌంటింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్లు, గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ మార్కెట్లు, ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ బాగా చదవాలి. 


ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ - ప్రసన్న చంద్ర, ఎకనామిక్‌ సర్వే, ఆర్‌బీఐ వెబ్‌సైట్, ఫైనాన్షియల్‌ న్యూస్‌ పేపర్లు, ఆర్థిక నివేదికలు సన్నద్ధతలో ఉపయోగం. 

పరీక్షలో విజయానికి పార్ట్‌-2 ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ మార్కులే కీలకం. ఇందులో 50 ప్రశ్నలకు వంద మార్కులు. గరిష్ఠ మార్కులు పొందినవారిదే అంతిమ విజయం. అందువల్ల ఫైనాన్స్‌ అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇందుకోసం పాఠ్యపుస్తకాలను లోతుగా అధ్యయనం చేయాలి. 


 సన్నద్ధత ఎలా?

ఇప్పటికే బ్యాంకు పరీక్షలకు సిద్ధమవుతున్నవారిలో ఈ పోస్టుకు అవసరమైన విద్యార్హతలుంటే విజయవంతులవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. 
వెయ్యి ఖాళీలు ఉన్నాయి. ప్రత్యేక విద్యార్హతలు తప్పనిసరి. అందువల్ల పోటీ కొంత తక్కువగానే ఉంటుంది. సబ్జెక్టుపై గట్టి పట్టు ఉన్నవారు ఈ పరీక్షలో గట్టెక్కడానికి అవకాశం ఎక్కువ. 
 ప్రిలిమ్స్, మెయిన్స్‌.. ఇలా రెండు దశలు లేవు. అలాగే డిస్క్రిప్టివ్‌ పరీక్షా లేదు. ఇవన్నీ అభ్యర్థులకు మేలు చేసేవే. 
 రీజనింగ్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్‌.. విభాగాల్లో ప్రశ్నలు ఐబీపీఎస్‌ పీవో స్థాయిలోనే ఉంటాయి. అదే సిలబస్‌తో ఈ పరీక్షకోసమూ సన్నద్ధం కావచ్చు. ఈ ప్రశ్నలు ప్రిలిమ్స్‌ స్థాయిలో కాక మెయిన్‌ స్థాయిలో ఉంటాయని భావించి, సాధన చేయాలి. 
 పరీక్షలో విజయానికి పార్ట్‌-2 ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ మార్కులే కీలకం. ఇందులో 50 ప్రశ్నలకు వంద మార్కులు. గరిష్ఠ మార్కులు పొందినవారిదే అంతిమ విజయం. అందువల్ల ఫైనాన్స్‌ అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇందుకోసం పాఠ్యపుస్తకాలను లోతుగా అధ్యయనం చేయాలి. 
 పార్ట్‌-1లో విజయానికి ముందుగా విభాగాల్లోని అంశాల వారీ మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి. ఆ తర్వాత వీలైనన్ని మాక్‌ టెస్టులు రాయాలి. ఫలితాలు విశ్లేషించుకుని, సన్నద్ధత మెరుగుపరచుకోవాలి. 
 ఐబీపీఎస్‌ పీవో, ఎస్‌బీఐ పీవో పాత ప్రశ్నపత్రాలు, మాదిరి ప్రశ్నపత్రాల సాధన పార్ట్‌-1కు ఉపయోగమే.  
 రుణాత్మక మార్కులు ఉన్నాయి కాబట్టి తెలియని వివదిలేయాలి. 


మరింత సమాచారం... మీ కోసం!

‣ ఈ నైపుణ్యాలే ఫ్రెషర్లకు ధీమా!

‣ జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకుందాం ఇలా..

‣ ట్రెండింగ్‌ విద్యావిధానం.. టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్‌ లెర్నింగ్‌!

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ ఆరు మెట్లతో ఆఫర్‌ లెటర్‌ అందుకోండిలా!

‣ వాయిదా వేస్తే.. వెనుకపడ్డట్లే!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

Posted Date : 20-02-2024 .

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

విద్యా ఉద్యోగ సమాచారం