• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మీకున్నాయా ఈ నైపుణ్యాలు?

కార్పొరేట్ కొలువుల‌కు ఎంతో ముఖ్యం

కార్పొరేట్‌ కంపెనీలో ఉద్యోగం! ఇది ఎంతోమంది కల. అది నెరవేరాలంటే అదనపు నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన అవసరమెంతో ఉంది. ఆసక్తి ఉంటే వీటిని కాలేజీ రోజుల నుంచే నేర్చుకోవచ్చు. సులభంగా కార్పొరేట్‌ కొలువుల్నీ సాధించవచ్చు.  

నిజానికి తరగతి గదిలో నాలుగ్గోడల మధ్యా నేర్చుకునేదీ, కార్పొరేట్‌ సంస్థలు కోరుకునేవీ వేర్వేరుగా ఉంటాయి. ఈ రెండింటి మధ్యా ఉండే వ్యత్యాసాన్ని పూరించాలంటే కాలేజీ స్థాయి నుంచే విద్యార్థులు కొన్ని నైపుణ్యాలను ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరమెంతో ఉంది. 

కొత్త సాంకేతిక పరిజ్ఞానం, చట్టాలు ఆర్థికవ్యవస్థలో వచ్చే ఆటుపోట్లు, మారే వినియోగదారుల అభిరుచులు, రాజకీయ పరిణామాలు... ఇవన్నీ కార్పొరేట్‌ సంస్థల మీదా ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే అనేక సంస్థలు ఉద్యోగ నియామకాల సమయంలో అదనపు నైపుణ్యాలున్న అభ్యర్థులకే ప్రాధాన్యమిస్తున్నాయి. సమాచార నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు, సమయపాలన, బృందంతో కలసి పనిచేయడం, లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, ఒత్తిడి నియంత్రణ సామర్థ్యం వీటన్నింటినీ పరిశీలిస్తున్నాయి. కొన్ని కాలేజీలు ప్రత్యేక కార్యక్రమాల ద్వారా వీటిని విద్యార్థులకు నేర్పిస్తున్నాయి కూడా. ఆసక్తి ఉంటే కాలేజీ రోజుల నుంచే ఈ నైపుణ్యాలను అందిపుచ్చుకోవచ్చు.

సమాచార నైపుణ్యం

ఈ నైపుణ్యం కోసం ముందుగా ఎదుటివారు చెప్పేది శ్రద్ధగా వినడాన్ని అలవాటు చేసుకోవాలి. గొప్ప వక్తలందరూ మంచి శ్రోతలేననే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మాటలు, లెటర్లు, ఈమెయిల్స్‌ ద్వారా మీ భావాల్ని ఇతరులకు అర్థమయ్యేలా సమర్థంగా చెప్పగలగాలి. భావోద్వేగాలను ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి. అలాగే శరీరభాషకూ ప్రాధాన్యమివ్వాలి. ఉదాహరణకు మర్యాదగా మాట్లాడుతూనే ఇష్టమొచ్చినట్టుగా అటూఇటూ కదిలారనుకోండి. ఎదుటివారికి అప్పటివరకు మీ మీద ఉన్న సదభిప్రాయం కాస్తా పోతుంది. ఒక అంశాన్ని ఎంచుకుని దాని గురించి స్పష్టంగా, వివరంగా స్నేహితుల ముందు మాట్లాడటాన్ని అలవాటు చేసుకోవాలి. ఇలాచేస్తే మీకుండే సంకోచం, బిడియం మెల్లగా తొలగిపోతాయి. ఆ తర్వాత మీరు మాట్లాడిన విధానం ఎలా ఉందనే విషయాన్ని స్నేహితులను అడిగి తెలుసుకోవచ్చు. దీనివల్ల ఏమైనా లోపాలున్నా వాటిని సరిదిద్దుకోవచ్చు.

నాయకత్వ లక్షణాలు

నాయకత్వం వహించేవారికి క్రమశిక్షణ ఎంతో ముఖ్యం. అది ఉంటేనే బృందాన్నీ సమర్థంగా ముందుకు నడిపించగలుగుతారు. తనకు కేటాయించిన పనులను చేస్తూనే కొత్త బాధ్యతలను తీసుకోవడానికీ వెనకాడకూడదు. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోగలగాలి. తన ప్రవర్తనతో ఇతరులకు ఆదర్శంగా నిలవాలి. ఎదుటివారి సమస్యలను విని అర్థంచేసుకునే నేర్పూ ఉండాలి. 

చదువుకునే రోజుల నుంచీ నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవచ్చు. విద్యార్థులు ఎదుర్కొంటోన్న వివిధ సమస్యలను ప్రిన్సిపల్‌ దృష్టికి తీసుకెళ్లవచ్చు. ఆర్థిక సమస్యల కారణంగా ఫీజు కట్టడానికి ఇబ్బందిపడుతోన్న స్నేహితులకు సహాయం అందించవచ్చు. ఒక్కరూ చేయడం కాకుండా నలుగురినీ ఒప్పించి చేయడం వల్ల సహాయ కార్యక్రమాలను విస్తరించవచ్చు కూడా. ఈ దిశగానూ స్నేహితులను నడిపించవచ్చు.

కలిసి పనిచేయడం

బృందంలో ఒకరిగా పనిచేయాలంటే అందరితో కలిసిమెలిసి పనిచేసే నైపుణ్యం ఉండాలి. ఇతరులతో తమ ఆలోచనలను స్వేచ్ఛగా పంచుకోవాలి. ఏమైనా సమస్యలు ఎదురైనా నలుగురితో కలిసి చర్చించి పరిష్కరించుకునే చొరవ ఉండాలి. 
కాలేజీ రోజుల నుంచే బృందంగా ఏర్పడి చదువుకోవడం, సందేహాలను నివృత్తి చేసుకోవడం, వర్తమానాంశాలను చర్చించుకోవడం.. లాంటివి చేయాలి. దీంతో నలుగురితో కలిసి పనిచేయడానికి కాలేజీ రోజుల్లోనే పునాది పడుతుంది. ఈ నైపుణ్యం ఉద్యోగ సాధనలో ఎంతో ఉపయోగపడుతుంది. 

సమయపాలన

ఉద్యోగంలో ఉన్నతిని సాధించాలంటే నేర్చుకోవాల్సిన నైపుణ్యాల్లో అతి ముఖ్యమైంది ఇది. నిర్ణీత సమయం లోపల పని పూర్తిచేయాలనే నియమాన్ని తప్పనిసరిగా పెట్టుకోవాలి. అన్ని పనులనూ ఒక్కసారే చేయాలని తాపత్రయపడకుండా ప్రాథమ్యాలను గుర్తించి పనులను ఎంచుకోవాలి. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే పనులను త్వరగా పూర్తిచేసే అవకాశం ఉంటుంది. ఆ దిశగా నైపుణ్యాలను పెంచుకోవాలి. 

ఒక్కో సబ్జెక్టుకూ ప్రత్యేకంగా కొంత సమయాన్ని కేటాయించి చదవడం అలవాటు చేసుకోవాలి. ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు నిర్ణీత సమయం లోపల పూర్తిచేయాలనే నిబంధన పెట్టుకోవాలి. లేకపోతే అది కొన్ని రోజులపాటు కొనసాగుతూనే ఉంటుంది.

లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం

లక్ష్యం ఎప్పుడూ స్పష్టంగా ఉండాలి. నిర్ణీత సమయం లోపల లక్ష్యాన్ని సాధించాలనే నియమం పెట్టుకోవాలి. ముందుగా స్పల్పకాలిక లక్ష్యాలు, ఆ తర్వాత దీర్ఘకాలిక లక్ష్యాలను పెట్టుకోవాలి. అవి ఆచరణ సాధ్యంగా ఉండేలా చూసుకోవాలి. 

లక్ష్యసాధన అనేది విద్యార్థులకు ఎంతో అవసరమైన నైపుణ్యం. పరీక్షల ముందు ఫలానా సమయానికల్లా సబ్జెక్టులను పూర్తిచేయాలనే లక్ష్యాన్ని సాధారణంగా పెట్టుకుంటారు కదా. ఇది నిర్ణీత సమయం లోపల పని పూర్తిచేయాలనే లక్ష్యానికి పునాదిలా పనిచేస్తుంది. అలాగే ఒక లక్ష్యాన్ని చేరుకోగానే కొత్త లక్ష్యాన్ని ఏర్పాటుచేసుకోవడమూ ముఖ్యమే. 

ఒత్తిడి నియంత్రణ

ఎక్కువ ఒత్తిడికి గురిచేస్తోన్న అంశాలను గుర్తించాలి. రిలాక్స్‌ కావడానికి మీ కోసం మీరు కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. ప్రతి చిన్న విషయానికీ ఒత్తిడికి గురికాకుండా నియంత్రించుకునే సామర్థ్యం ఉండాలి. దీంతో పనులను వేగంగా పూర్తిచేయగలుగుతారు. 

పరీక్షల సమయంలో సాధారణంగా చాలామంది విద్యార్థులు ఒత్తిడికి గురవుతుంటారు. పక్కా ప్రణాళికను రూపొందించుకుని ప్రతి సబ్జెక్టుకూ నిర్ణీత సమయాన్ని కేటాయించడం ద్వారా దీన్ని సులువుగా నియంత్రించవచ్చు. ఇలా చేయడం వల్ల ఉద్యోగ జీవితంలోనూ ఏ పనికి ఎంత సమయాన్ని వెచ్చించాలనే విషయంలో ఒక అవగాహన వస్తుంది. 
 

Posted Date : 16-06-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌