• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Research Students: పరిశోధక విద్యార్థుల్లో గుబులు

యూజీసీ భిన్న ప్రకటనలు
విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక వృత్తిని చేపట్టడానికి నెట్‌, సెట్‌, స్లెట్‌ పరీక్షలో ఏదో ఒకదానిలో ఉత్తీర్ణత లేదా డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ (పీహెచ్‌డీ) ఉండాలని విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) గతంలో నిబంధన విధించింది. ఆ తరవాత నెట్‌, సెట్‌, స్లెట్‌ ఉతీర్ణత సాధించినా పీహెచ్‌డీ తప్పనిసరి అని నియమం పెట్టింది. ప్రస్తుతం కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఔత్సాహిక, అనుభవపూర్వక పారిశ్రామిక నిపుణులను అధ్యాపకులుగా నియమించుకునేందుకు పీహెచ్‌డీ అవసరం లేదని యూజీసీ చెబుతోంది. దీనిపై ఇంకా అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. యూజీసీ వ్యాఖ్యలపై ప్రస్తుతం వాడివేడి చర్చలు సాగుతున్నాయి. పీహెచ్‌డీ పట్టాపై పూటకో మాట చెబుతూ దాని ఉనికిని ప్రశ్నార్థకంగా మారుస్తున్నారన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి.  
దశాబ్దాలుగా పాశ్చాత్య దేశాలు పారిశ్రామిక నిపుణులను అధ్యాపక ఉద్యోగాలకు స్వాగతిస్తూనే ఉన్నాయి. వారికి పీహెచ్‌డీ తప్పనిసరి అనే నిబంధన ఉంది. కేవలం పరిశోధన పత్రాల ప్రచురణల విషయంలోనే కొన్ని మినహాయింపులు ఇస్తున్నాయి. పీహెచ్‌డీ పూర్తి చేయాలంటే మూడు నుంచి అయిదేళ్ల కఠోర శ్రమ అవసరమవుతుంది. పీహెచ్‌డీ సీటు సంపాదించడం మొదలు- పరిశోధన, సెమినార్లలో ఉపన్యాసాలు, తమ పరిశోధన పత్రాలను పత్రికల్లో ప్రచురించడం... ఇలా అభ్యర్థులు ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటారు. ప్రస్తుతం యూజీసీ వ్యాఖ్యలు పరిశోధనలో నిమగ్నమైనవారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి.
‣ చాలా ఏళ్లుగా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో సరైన నియామకాలు జరగలేదు. వాటిలో నిపుణులైన అధ్యాపకులను కొలువుతీర్చాలనే సాకుతో అత్యున్నత పరిశోధన డిగ్రీతో పనిలేకుండా పారిశ్రామిక నిపుణులను నియమించుకోవాలనే ప్రతిపాదన పీహెచ్‌డీ అభ్యర్థుల మదిలో గుబులు పుట్టిస్తోంది. ప్రస్తుతానికి కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు సంబంధించి మాత్రమే వినిపిస్తున్న మినహాయింపులు తరవాతి కాలంలో ఇతర వర్సిటీలు, కళాశాలలకూ పాకుతాయని పీహెచ్‌డీ పట్టా అందుకున్నవారు ఆందోళన చెందుతున్నారు. నిజానికి పీహెచ్‌డీ అర్హత కలిగిన అధ్యాపకులు ఉంటేనే విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు అనుమతులు, న్యాక్‌ అక్రెడిటేషన్లు వంటివి దక్కుతున్నాయి. ఒకవేళ ఆచార్య పోస్టులకు పీహెచ్‌డీ అవసరం లేదన్న నిర్ణయం వెలువడితే, ఇప్పటికే పీహెచ్‌డీ పూర్తిచేసినవారికి ఆయా కళాశాలలు సరైన వేతనాలు చెల్లించకపోవచ్చు. ముఖ్యంగా ఏళ్ల తరబడి పరిశోధన కోసం తమ సర్వస్వం ధారబోసిన అభ్యర్థుల శ్రమ మొత్తం బూడిదలో పోసిన పన్నీరవుతుంది.  
‣ బోధనపై మక్కువ కలిగిన అధ్యాపకులు, మంచి పరిశోధకులు, నిపుణులైన శిక్షకులు ఉన్నత విద్యకు చాలా అవసరం. ప్రస్తుతం ఉన్నత స్థాయిలో పరిశ్రమ-విశ్వవిద్యాలయ అనుసంధాన విద్య చాలా అవసరం. ఇది విద్యార్థులకు పాఠాలు బాగా అర్థమయ్యేలా తోడ్పడుతుంది. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా వారిని తీర్చిదిద్దడానికి ఉపకరిస్తుంది. ఇలాంటి విద్యావిధానం ద్వారా పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ (పీజీ) స్థాయిలో మెరుగైన ఫలితాలను సాధించవచ్చు. ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఈ విషయంలో చాలా ముందున్నాయి. దేశీయంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలతో పాటు అన్ని వర్సిటీల్లోనూ ఇలాంటి విద్యావిధానాన్ని పాలకులు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. అప్పుడే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయి. క్షేత్రస్థాయి పరిస్థితులు విద్యార్థులకు తెలియకుండా, కేవలం తరగతి గదుల్లో పారిశ్రామిక నిపుణులు పాఠాలు చెప్పడంవల్ల అంతగా ప్రయోజనం ఉండదన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన కార్పొరేట్లు ఆయా దేశాల్లో ఉన్నత విద్యాసంస్థలను మేటిగా తీర్చిదిద్దేందుకు విరివిగా నిధులు సమకూరుస్తున్నాయి. ఈ జాబితాలో కొన్ని భారతీయ సంస్థలు సైతం కనిపిస్తాయి. ఇండియాలోనూ ఇలాంటి ప్రోత్సాహం దక్కాల్సిన అవసరం ఉంది.
‣ పీహెచ్‌డీ పట్టాతో పనిలేకుండా పారిశ్రామిక నిపుణులను అధ్యాపకులుగా నియమించుకునే పరిస్థితి వస్తే, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, కళాశాలలకే అధికంగా లబ్ధి చేకూరుతుంది. ఎందుకంటే ఆ సంస్థలు తమ సంస్థల్లో పనిచేసే నిపుణులను పాఠాలు చెప్పేందుకు ఆహ్వానిస్తాయి. దానివల్ల బోధనపై మక్కువతో ఏళ్ల తరబడి కష్టించి పీహెచ్‌డీ పట్టా అందుకున్న వారికి అవకాశాలు సన్నగిల్లుతాయి. పీహెచ్‌డీ పూర్తి చేసిన ఎంతోమంది విశ్వవిద్యాలయాల్లో నియామకాలకోసం నేడు పడిగాపులు కాస్తున్నారు. ఈ తరుణంలో సెంట్రల్‌ వర్సిటీల్లో ఆ అత్యున్నత డిగ్రీ నుంచి మినహాయింపువల్ల వారంతా తీవ్రంగా నష్టపోతారు. ఏది ఏమైనా అధ్యాపక నియామకాల్లో పీహెచ్‌డీ ప్రాధాన్యంపై ఒక స్పష్టత రావాల్సిన అవసరం ఉంది.    
- డాక్టర్‌ ఎం.చంద్రశేఖర్‌ (ఐపీఈలో సహాయ ఆచార్యులు)

Posted Date : 26-03-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌