• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఆద‌ర్శ విద్య‌లో.. అందుకోండి ప్ర‌వేశం!

ఇంట‌ర్‌లో చేరేందుకు చ‌క్క‌టి అవ‌కాశం

మెరిట్, రిజ‌ర్వేష‌న్ల ఆధారంగా ఎంపిక‌

ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ‌లో ఆద‌ర్శ పాఠ‌శాల‌/క‌ళాశాల‌ల‌కు ఉన్న ఆద‌ర‌ణ అంతా ఇంతా కాదు. విద్యాసంవ‌త్స‌రం ప్రారంభంలో ఆయా విద్యాసంస్థ‌ల ముందు త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌ను చేర్పించ‌డానికి వ‌రుస క‌డ‌తారు. అందుకు కార‌ణం లేక‌పోలేదు. కార్పొరేట్ పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల‌కు దీటుగా ఇక్క‌డ విద్య‌నందిస్తారు. స‌క‌ల వ‌స‌తులు క‌ల్పిస్తారు. సైన్స్‌, కంప్యూట‌ర్ ల్యాబ్‌లు, అధునాత‌న భ‌వ‌నాలు, ఆహ్లాద‌క‌ర‌మైన ప్రాంగ‌ణాలు ఆద‌ర్శాల ప్ర‌త్యేకం. అలాగే ప్ర‌వేశం పొందిన విద్యార్థుల నుంచి ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోరు. పైగా ఆంగ్ల మాధ్య‌మంలో బోధ‌న ఉంటుంది. 2021-22 విద్యాసంవ‌త్స‌రానికి సంబంధించి ఇంట‌ర్మీడియ‌ట్ మొద‌టి సంవ‌త్స‌రంలో ప్ర‌వేశాల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. 

రాష్ట్రంలోని 194 ఆద‌ర్శ పాఠ‌శాల‌/క‌ళాశాల‌లు పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు వ‌రంగా మారాయి. ప్ర‌తిభ ఉన్నా.. పైచ‌దువుల‌కు నోచుకోని ఎంతోమంది పిల్ల‌ల‌కు ఆద‌ర్శాలు బాస‌టగా నిలుస్తున్నాయి. ప‌దో త‌ర‌గ‌తిలో వారు సాధించిన ఫ‌లితాల‌తోపాటు రిజ‌ర్వేష‌న్ల‌ను బ‌ట్టి ప్ర‌వేశాలు క‌ల్పిస్తున్నారు. మ‌హిళా విద్యార్థుల‌కు సంబంధించి 170 ఆద‌ర్శ క‌ళాశాల‌ల్లో వ‌స‌తి కూడా క‌ల్పిస్తున్నారు. గ‌రిష్ఠంగా వంద‌మందికి ఈ అవ‌కాశం లభిస్తుంది. పూర్తి వివ‌రాలు ఇలా..

ఇదీ అర్హ‌త‌..

ఇటీవ‌ల వెలువ‌డిన ప‌దో త‌ర‌గ‌తి/ త‌త్స‌మాన ప‌రీక్ష‌లో ఉత్తీర్ణ‌త సాధించిన విద్యార్థులు ఆద‌ర్శ క‌ళాశాల‌లో ఇంట‌ర్ చ‌దివేందుకు అర్హులు. 

ఎంపిక ఇలా..

విద్యార్థులు సాధించిన అక‌డ‌మిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. రిజ‌ర్వేష‌న్లు వ‌ర్తిస్తాయి. 

ద‌ర‌ఖాస్తు విధానం

అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. అందుకు జులై 5, 2021 వ‌ర‌కు గ‌డువు ఉంది. ద‌ర‌ఖాస్తు చేసేట‌ప్పుడు ప‌దో త‌ర‌గ‌తి మార్కుల జాబితా, కుల ధ్రువప‌త్రం, ఆధార్ ప‌త్రాల‌ను జ‌త చేయాలి. మెరిట్‌, రిజ‌ర్వేష‌న్ల ప్రాతిప‌దిక జులై 10న విద్యార్థుల ఎంపిక ఉంటుంది. జులై 12న ధ్రువ‌ప‌త్రాల ప‌రిశీల‌న చేస్తారు. ఇంట‌ర్ బోర్డు ఆదేశాల ప్ర‌కారం త‌ర‌గ‌తులను ప్రారంభిస్తారు. 

రిజ‌ర్వేష‌న్ల కేటాయింపు ఇలా..

ఒక్కో ఆద‌ర్శ క‌ళాశాల‌లో ఇంట‌ర్ మొద‌టి సంవ‌త్స‌రం త‌ర‌గ‌తిలో 40 మందికి ప్ర‌వేశం క‌ల్పిస్తారు. ఇందులో ఎస్సీల‌కు 6, ఎస్టీల‌కు 2, బీసీల‌కు 12, ఓసీల‌కు గ‌రిష్ఠంగా 20 సీట్ల‌ను రిజ‌ర్వ్ చేశారు. అలాగే మొత్తం సీట్ల‌లో 33.33 శాతం సీట్ల‌ను అంటే 40లో 13 సీట్ల‌ను విద్యార్థినుల‌కు కేటాయిస్తారు. 

వెబ్‌సైట్‌: http://www.tsmodelschools.in/
 

Posted Date : 30-05-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌