• facebook
  • twitter
  • whatsapp
  • telegram

UBI: స్పెషలిస్టులకు యూనియన్ బ్యాంకు స్వాగతం!

347 ఖాళీల‌ భ‌ర్తీకి ప్ర‌క‌టన‌ విడుదల

వినియోగదారుడికి అందించే సేవలను సులభతరం చేయడంతోపాటు, లావాదేవీలను మరింత సౌకర్యవంతం చేయడానికి బ్యాంకులు స్పెషలిస్ట్ ఆఫీసర్లను నియమిస్తాయి. రిస్క్‌, సివిల్‌ఇంజినీరింగ్‌, ఆర్కిటెక్చర్‌, ఎలక్ట్రికల్‌ఇంజినీరింగ్‌, ప్రింటింగ్‌టెక్నాలజీ, ఫొరెక్స్‌ త‌దిత‌ర విభాగాలకు సంబంధించి వీరు విధులు నిర్వ‌ర్తిస్తారు. ఈ మేర‌కు ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(యూబీఐ) 2021-22 ఆర్థిక సంవత్సరానికి స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 

పోస్టుల వారీగా ఖాళీలు..

మొత్తం 347 పోస్టులున్నాయి. వీటిలో సీనియర్‌మేనేజర్ (రిస్క్‌)- 60, మేనేజర్‌ (రిస్క్‌)- 60, మేనేజర్ (సివిల్‌ఇంజినీర్‌)- 7, మేనేజర్ (ఆర్కిటెక్ట్‌)- 7, మేనేజర్ (ఎలక్ట్రికల్‌ఇంజినీర్‌)- 2, మేనేజర్ (ప్రిటింగ్‌టెక్నాలజిస్ట్‌)- 1 మేనేజర్ (ఫొరెక్స్)- 50, మేనేజర్ (చార్టర్డ్‌అకౌంటెంట్‌)- 14, అసిస్టెంట్‌మేనేజర్ (టెక్నికల్‌ఆఫీసర్‌)- 26, అసిస్టెంట్‌మేనేజర్ (ఫారెక్స్‌)- 120 పోస్టులు కేటాయించారు. 

అర్హత ప్రమాణాలు..

సీనియర్ మేనేజర్ (రిస్క్‌) పోస్టుల కోసం దరఖాస్తులు చేసే అభ్యర్థులు గ్లోబల్ అసోసియేషన్ ఆఫ్ రిస్క్ (GARP) నుంచి ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్‌మెంట్‌లో సర్టిఫికేషన్/ ప్రైమా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ప్రొఫెషనల్ రిస్క్ మేనేజ్‌మెంట్ సర్టిఫికేషన్ కలిగి ఉండాలి/ CFA ఇన్‌స్టిట్యూట్‌నుంచి చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ (CFA) గుర్తింపు పొందాలి/ సీఏ/ సీఎంఏ (ఐసీడబ్ల్యూఏ)/ సీఎస్‌/ ఎంబీఏ (ఫైనాన్స్‌)/ పీజీడీఎం (ఫైనాన్స్‌) స్పెషలైజేషన్‌ ఉత్తీర్ణత సాధించాలి. కనీసం గణితం/ స్టాటిస్టిక్స్ / ఎకనామిక్స్‌లో మాస్టర్ డిగ్రీ కలిగిన అభ్యర్థులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. దాంతోపాటు ఫైనాన్షియల్‌ఇన్‌స్టిట్యూషన్స్‌/ రేటింగ్‌ఏజెన్సీలు/ బ్రోకరేజీ సంస్థల్లో క్రెడిట్‌రిస్క్‌, రిస్క్‌మోడలింగ్‌ వ్యవహారాలకు సంబంధించి కనీసం 5 ఏళ్లు పని అనుభవం త‌ప్ప‌నిస‌రి.

మేనేజర్‌ (రిస్క్‌, సివిల్‌ ఇంజినీర్‌/ ఆర్కిటెక్ట్‌/ ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌/ ప్రింటింగ్‌ టెక్నాలజీ/ ఫొరెక్స్‌/ చార్టర్డ్‌అకౌంటెంట్‌/ టెక్నికల్‌ ఆఫీసర్‌/ ఫొరెక్స్‌) పోస్టులో మేనేజర్‌ (రిస్క్‌) అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి సీనియర్‌మేనేజర్‌ (రిస్క్‌) పోస్టుకు తగిన అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి. ఇతర స్పెషలైజేషన్‌కు దరఖాస్తు చేస్తున్న వారు డిగ్రీ(ఆర్కిటెక్చర్‌), ఆటోక్యాడ్‌, బీఈ/ బీటెక్‌(ఎలక్ట్రికల్‌ఇంజినీరింగ్‌, ప్రింటింగ్‌టెక్నాలజీ), ఇంజినీరింగ్‌డిగ్రీ (సివిల్‌/ ఎలక్ట్రికల్‌/ మెకానికల్‌/ ప్రొడక్షన్‌/ మెటలర్జీ/ ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రానిక్స్‌అండ్‌ టెలికమ్యునికేషన్‌/ సీఎస్‌/ ఐటీ తదితరాలు), ఎంబీఏ/ పీజీడీబీఏ/ పీజీడీబీఎం/ పీజీపీఎం/ పీజీడీఎం (ఫైనాన్స్‌/ అంతర్జాతీయ బిజినెస్‌/ ట్రేడ్‌ఫైనాన్స్‌)లో అర్హత సాధించాలి. సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 3 ఏళ్లు పని అనుభవం అవసరం.

అసిస్టెంట్‌మేనేజర్‌ (ఫారెక్స్‌) పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గ్రాడ్యుయేషన్‌, ఎంబీఏ/ పీజీడీబీఏ/ పీజీడీబీఎం/ పీజీపీఎం/ పీజీడీఎం (ఫైనాన్స్‌/ అంతర్జాతీయ బిజినెస్‌/ ట్రేడ్‌ఫైనాన్స్‌)లో అర్హత సాధించాలి.

అభ్యర్థులు రెండు లేదా అంతకంటే ఎక్కువ స్పెషలైజేషన్‌లో ఉత్తీర్ణత సాధిస్తే సంబంధిత ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే సమయంలో దానికి తగిన వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. 

ఎంపిక విధానం ఇలా...

అభ్యర్థుల ఎంపిక విధానం మూడు అంచెల్లో జరుగుతుంది. ఆన్‌లైన్‌లో రాతపరీక్ష ఉంటుంది. దీనిలో అర్హత సాధించిన వారికి పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులోనూ అర్హత సాధించిన వారిని బృంద చర్చలకు పిలుస్తారు. అనంతరం మెరిట్‌ ఆధారంగా తుది ఎంపికలు చేప‌డ‌తారు. 

దరఖాస్తు చేయండిలా..

అర్హులైన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు సెప్టెంబ‌ర్ 3, 2021 తుది గ‌డువు. ఇతరులు రూ.850 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. వివిధ పోస్టులను అనుసరించి ఆగస్టు 1, 2021 నాటికి కనిష్ఠ, గరిష్ఠ వయసు పరిమితిని విధించారు. దాని ప్రకారం సీనియర్‌మేనేజర్‌ పోస్టుకు కనీసం 30 నుంచి 40 ఏళ్లు, మేనేజర్‌ పోస్టుకు 25 నుంచి 35 ఏళ్లు, అసిస్టెంట్‌ మేనేజర్‌పోస్టుకు 20 నుంచి 30 ఏళ్లు మధ్య వయసు ఉండాలి. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయసు సడలింపు ఉంటుంది.

ఆన్‌లైన్‌పరీక్ష స్వరూపం

ఈ పరీక్షని మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. మొత్తం 4 విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. రీజనింగ్ (50 ప్రశ్నలు, 25 మార్కులు), క్వాంటిటేటివ్‌ఆప్టిట్యూడ్‌ (50 ప్రశ్నలు, 50 మార్కులు), పోస్టుకి సంబంధించిని ప్రొఫెషనల్‌ నాలెడ్జ్ (50 ప్రశ్నలు, 100 మార్కులు), ఇంగ్లిష్‌ లాంగ్వేజ్ (50 ప్రశ్నలు, 25 మార్కులు) ఉంటాయి. పరీక్షా సమయం రెండు గంటలు. ప్ర‌శ్న‌ప‌త్రం ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో వ‌స్తుంది. ప‌రీక్ష‌లో రుణాత్మ‌క మార్కులుంటాయి. ప్రతి తప్పు సమాధానానికి నాలుగోవంతు మార్కు కోత విధిస్తారు. 

సిలబస్ 

రీజనింగ్: అభ్యర్థుల తార్కిక ఆలోచనా విధానానికి సంబంధించి సంఖ్యలు, డిజైన్ల మధ్య సంబంధాలను ఎలా అర్థం చేసుకుంటున్నారో చూస్తారు. కోడింగ్, డీ-కోడింగ్, అనాలజీ, సిరీస్, డైరెక్షన్స్, సీటింగ్ అరెంజ్ మెంట్స్, రక్తసంబంధాలు, ర్యాంకింగ్, పజిల్స్, ఆల్ఫాబెట్ టెస్ట్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. వీలైనంత సాధన చేస్తే ఎక్కువ మార్కులు సొంతం చేసుకోవచ్చు. 

ఇంగ్లిష్ లాంగ్వేజ్: అభ్యర్థికి ఆంగ్లభాషపై ఉన్న పరిజ్ఞానాన్ని పరిశీలిస్తారు. రీడింగ్ కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్, సెంటెన్స్ అరేంజ్‌మెంట్స్‌, సెంటెన్స్ కరెక్షన్స్, జంబుల్డ్ సెంటెన్స్ అంశాల నుంచి ప్ర‌శ్న‌లు అడుగుతారు. గ్రామర్ రూల్స్, ఒకాబులరీ, యాంటనిమ్స్, సిన‌నిమ్స్ ఉంటాయి. గ్రామ‌ర్ నియ‌మాలు తెలిస్తే ప్రశ్నలకు సులభంగా సమాధానాలను గుర్తించవచ్చు. 

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: సమస్యలను పరిష్కరించడంలో సామర్థ్యం, అంకెలు, సంఖ్యలపై పట్టు, గణిత నైపుణ్యాలను పరిశీలిస్తారు. ప్రతిరోజూ సాధన చేస్తేనే ఇందులో సఫలమవుతారు. గణితంలో కీలక భావనలైన కూడికలు, తీసివేతలు, భాగహారాల వంటి వాటిపై పట్టు సాధించాలి. నిష్పత్తులు, శాతాలు, వర్గమూలాలు, ఘనమూలాలు, లాభ-నష్టాలు, కాలం-పని, కాలం-దూరం మొదలైన అంశాలను ప్రాథమిక స్థాయి నుంచి ప్రాక్టీస్ చేయాలి. సమాధానాలను గుర్తించడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. మిగతా వాటిని త్వరగా పూర్తి చేసి దీనికి ఎక్కువ సమయాన్ని కేటాయించాలి.  

ప్రిప‌రేష‌న్ ఇలా..

బ్యాంకు సంబంధ పరీక్షల్లో వేగం, కచ్చితత్వం చాలా ముఖ్యం. నిర్ణీత సమయంలో అధిక ప్రశ్నలను సాధించడం అవసరం. అందుకే ప్రశ్నలను వేగంగా సాధించగలిగే సామర్థ్యాన్ని అల‌వర్చుకోవాలి. ఇది సాధన వల్లనే సాధ్యమవుతుంది. వేగంతో పాటు కచ్చితత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలి. నిరంతర సాధన వల్ల పెన్ను ఉపయోగించకుండా కొన్ని ప్రశ్నలకు జవాబులు సాధిస్తే ఇందులో నైపుణ్యం అలవడుతుంది. ప్ర‌శ్నల‌సాధ‌న‌కు షార్ట్ క‌ట్ మెల‌కువ‌ల‌ను నేర్చుకోవాలి. దీని ద్వారా స‌మ‌యాన్ని ఆదా చేసుకోవ‌చ్చు.

జీతభత్యాలు..

సీనియర్‌మేనేజర్‌ఉద్యోగులకు రూ.63,840 నుంచి రూ.78,230 వరకు ఉంటుంది. మేనేజర్‌కు రూ.48,170 నుంచి రూ.69,810 వరకు చెల్లిస్తారు. అసిస్టెంట్‌మేనేజర్ ఉద్యోగులకు రూ.36,000 నుంచి రూ.63,840 వేతనం అందుతుంది. 

వెబ్‌సైట్‌: https://www.unionbankofindia.co.in/
 

Posted Date : 14-08-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌