• facebook
  • twitter
  • whatsapp
  • telegram

అవుతారా.. ఐబీ ఆఫీస‌ర్‌?

2000 ఇంటెలిజెన్స్ అధికారుల ఖాళీలు, క‌నీస అర్హ‌త ఏదైనా డిగ్రీ 

తీవ్రవాదం,  వీఐపీలకు భద్రతపరమైన అంశాలు, నక్సల్స్ కదలికలు, మాదక ద్రవ్యాల సరఫరా తదితర కార్యకలాపాల గురించి ఇంటలిజెన్స్ బ్యూరో (ఐబీ) ముందే హెచ్చరించినట్లు తరచూ వార్తలు వస్తుంటాయి. ఇవన్నీ ఆ విభాగానికి ఎలా తెలుస్తాయి అనుకుంటున్నారా? రాష్ట్రాలు, జిల్లాలు, ప్రాంతాల వారీగా విస్తరించిన నెట్ వర్క్ ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండి ఆ సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి చేరవేస్తుంటుంది. అందుకోసం ఎందరో సిబ్బంది పని చేస్తుంటారు. దేశ అంతర్గత భద్రతలో వీరు కీలకపాత్ర పోషిస్తుంటారు. అలాంటి సాహసోపేతమైన విధుల నిర్వహణ పట్ల ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. భార‌త ప్ర‌భుత్వానికి చెందిన హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటలిజెన్స్ బ్యూరో దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్య‌లో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటలిజెన్స్ ఆఫీసర్ (ఏసీఐఓ) గ్రేడ్-2/ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఐబీ- జ‌న‌ర‌ల్ సెంట్ర‌ల్ స‌ర్వీస్ విభాగం గ్రూపు-సి (నాన్ గెజిటెడ్‌, నాన్ మినిస్టీరియ‌ల్‌) కింద 2000 ఖాళీల్లో నియామకాలకు ప్రక్రియ ప్రారంభించింది.

పోస్టులు-జీత‌భ‌త్యాలు

మొత్తం 2000 పోస్టులు ఉన్నాయి. అందులో జ‌న‌ర‌ల్ కేట‌గిరి‌కి 989, ఈడ‌బ్ల్యూఎస్‌కు 113, ఓబీసీకి 417, ఎస్సీకి 360, ఎస్టీకి 121 పోస్టులు కేటాయించారు. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు లెవ‌ల్-7 పేక‌మిష‌న్ కింద నెల‌కు రూ.44,900 నుంచి 1,42,400 వ‌ర‌కు వేత‌నం అందుతుంది. జీతంతో పాటు ఇత‌ర అల‌వెన్సులూ ఉంటాయి. 

గ్రేడ్-2 ఏసీఐఓలుగా చేరినవారు మూడు లేదా నాలుగేళ్ల అనుభవంతో గ్రేడ్-1 ఏసీఐఓగా పదోన్నతి పొందుతారు. పదేళ్ల సర్వీసు పూర్తయితే డిప్యూటీ సెంట్రల్ ఇంటలిజెన్స్ ఆఫీసర్లు అయ్యే అవకాశం ఉంది. 25-30 సంవత్సరాల అనుభవం సంపాదించిన తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రమోషన్ పొందవచ్చు. అనంత‌రం జాయింట్ డిప్యూటీ డైరెక్ట‌ర్‌గానూ స్థానం సంపాదించ‌వ‌చ్చు. రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) వంటి అత్యున్నత సంస్థల్లో సేవలు అందించే అవకాశాలూ ఈ అభ్యర్థులకు దక్కవచ్చు. 

ఎవరు అర్హులు?

గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేష‌న్/ త‌త్స‌మాన ప‌రీక్ష‌లో ఉత్తీర్ణ‌త సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 27 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. కంప్యూటర్ ప‌రిజ్ఞానం ఉండాలి. ఎస్సీ/ ఎస్టీల‌కు అయిదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు, డిపార్ట్‌మెంట‌ల్ ఉద్యోగులకు, క్రీడాకారుల‌కు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఉంది. ‌

ద‌ర‌ఖాస్తు విధానం

అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ జ‌న‌వ‌రి 09,2021. జ‌న‌ర‌ల్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ కేట‌గిరిల‌కు చెందిన పురుషులు ప‌రీక్ష రుసుం రూ.100తోపాటు రిక్రూట్‌మెంట్ ప్రాసెసింగ్ ఛార్జీలు రూ.500 క‌లిపి మొత్తం రూ.600 ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్య‌ర్థులు, ఇత‌ర కేట‌గిరిల‌కు చెందిన మ‌హిళ‌లు ప‌రీక్ష రుసుం మిన‌హాయించి రిక్రూట్‌మెంట్ ప్రాసెసింగ్ ఛార్జీలు రూ.500 చెల్లిస్తే స‌రిపోతుంది. ఎస్‌బీఐ చ‌లానా ద్వారా చెల్లించే అభ్య‌ర్థుల‌కు జ‌న‌వ‌రి 12, 2021 వ‌ర‌కు గ‌డువు ఉంది. 

ఎంపిక ఎలా? 

అభ్య‌ర్థుల‌ను రాతప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దీనిలో టైర్‌1, టైర్‌2, టైర్‌3 లెవ‌ల్స్ ఉంటాయి. టై‌ర్‌1లో 100 మార్కుల‌కు ఆబ్జెక్టివ్ ప‌ద్ధ‌తిలో ఆన్‌లైన్‌లో రాత‌ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. ఇందులో జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, న్యూమ‌రిక‌ల్/ అన‌లిటిక‌ల్‌/ లాజిక‌ల్ ఎబిలిటీ అండ్ రీజ‌నింగ్, ఇంగ్లిష్‌, జ‌న‌ర‌ల్ స్ట‌డీస్ స‌బ్జెక్టుల నుంచి 20 ప్ర‌శ్న‌ల చొప్పున అడుగుతారు. ఒక్కో ప్ర‌శ్న‌కు ఒక మార్కు. ఇందులో రుణాత్మ‌క మార్కులు ఉంటాయి. ప్ర‌తి త‌ప్పు స‌మాధానికి 1/4 మార్కులు కోత విధిస్తారు. ప‌రీక్షా స‌మ‌యం ఒక గంట‌(60 నిమిషాలు). ఈ ప‌రీక్ష‌లో జ‌న‌ర‌ల్ కేట‌గిరి అభ్య‌ర్థుల‌కు 35, ఓబీసీ/ ఈడ‌బ్ల్యూఎస్ వారికి 34, ఎస్సీ/ ఎస్టీల‌కు 33 మార్కుల‌కు మించి వ‌స్తేనే టైర్‌2కు అర్హ‌త ల‌భిస్తుంది. ఇక్క‌డ నోటిఫికేష‌న్‌లోని మొత్తం ఖాళీలకు ప‌దింత‌ల మందిని టైర్‌2 ప‌రీక్ష‌కు షార్ట్‌లిస్టింగ్ చేస్తారు.‌‌

టైర్2 డిస్క్రిప్టివ్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో పేప‌ర్‌పై ప‌రీక్ష‌రాయాలి. మొత్తం 50 మార్కుల‌కు ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. అడిగిన అంశంపై 30 మార్కుల‌కు వ్యాసం రాయాల్సి ఉంటుంది. ఇంగ్లిష్ కాంప్ర‌హెన్ష‌న్ అండ్ ప్రిస్సీస్ రైటింగ్‌కు 20 మార్కులు కేటాయించారు. ప‌రీక్షా స‌మ‌యం ఒక గంట‌(60 నిమిషాలు). టైర్‌1, టైర్‌2లో అర్హ‌త సాధించిన వారిలో ఖాళీల సంఖ్యకు అయిదింత‌ల మందిని టైర్‌3కి ఎంపిక చేస్తారు.  

టైర్‌3లో 100 మార్కుల‌కు ఇంట‌ర్వ్యూ ఉంటుంది. ఇందులో అర్హ‌త సాధించిన వారికి చివ‌ర‌గా వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించి శిక్ష‌ణ‌కు ఎంపిక చేస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్షా కేంద్రాలు

తెలంగాణ‌: హైద‌రాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్‌.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌: గుంటూరు, కాకినాడ‌, క‌ర్నూలు, నెల్లూరు, రాజ‌మండ్రి, తిరుప‌తి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం. అభ్య‌ర్థులు గ‌రిష్ఠంగా మూడు ప‌రీక్షా కేంద్రాలు ఎంపిక చేసుకోవ‌చ్చు.

వెబ్‌సైట్: www.mha.gov.in లేదా www.ncs.gov.in 

సన్నద్ధత ఎలా?

టైర్‌-1 పరీక్ష అభ్యర్థులు ముందుగా సిలబస్‌ పరిశీలించాలి. దాని ప్రకారం చదవాల్సిన అంశాలతో ప్రణాళిక తయారు చేసుకోవాలి.

పూర్వపు ప్రశ్నపత్రాలు పరిశీలిస్తే, పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో అర్థమవుతుంది. పరీక్ష పరంగా ఏ స్థాయిలో ఉన్నారో అవగతమవుతుంది.

పరీక్ష సిలబస్, పూర్వపు ప్రశ్నపత్రాలు పరిశీలించి అభ్యర్థులు తమ సొంత సన్నద్దతా ప్రణాళిక రూపొందించుకోవాలి.

జనరల్‌ అవేర్‌నెస్, జనరల్‌ స్టడీస్‌ను పరిశీలిస్తే గత ప్రశ్నపత్రాల ఆధారంగా ప్రశ్నల స్థాయి కొంత సులభంగా, మరికొంత మధ్యస్థంగా ఉంది. 

ఈ విభాగంలో ముందుగా సామాజిక అధ్యయనాలు, ఆర్థిక శాస్త్రంలోని అంశాలు, భౌగోళికం, చరిత్ర, సైన్స్‌లపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. 

ప్రశ్నలు అభ్యర్థుల మేధాశక్తిని పరిశీలించేవిగా ఉంటాయి. 

భావనలతోపాటు వాస్తవాలను గుర్తుపెట్టుకోవడం ముఖ్యం.

పరిమాణాత్మక సామర్థ్యం, అదే విధంగా సంఖ్య, విశ్లేషణాత్మక, తార్కికం (రీజనింగ్‌) విషయంలో పూర్వపు ప్రశ్నపత్రాల ఆధారంగా ఇందులో ప్రశ్నలు మధ్యస్థంగా ఉంటాయని చెప్పవచ్చు.

ఈ రెండు విభాగాల సన్నద్ధతలో ముందుగా గణితంలోని ప్రాథమికాంశాలను పూర్తిస్థాయిలో సాధన చేయాలి.

ప్రాథమికాంశాలపై పట్టు సాధించిన తర్వాత సాధారణ, క్లిష్టమైన ప్రశ్నల సాధనకు సమయం కేటాయించాలి. 

ప్రశ్నలు అభ్యర్థుల ఆలోచనశక్తిని పరీక్షించే విధంగా ఉంటాయి. 

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లో ముఖ్యంగా సంఖ్య వ్యవస్థ, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్, సరళీకరణ, లాగరిథమ్స్, సగటు, సమయం- పని, సమయం- వేగం-దూరం, శాతాలు, లాభం, నష్టంపై ప్రశ్నలు, ప్రస్తారాలు- సంయోగాలు, సంభావ్యత; వయసుకు సంబంధించిన ప్రశ్నలు, సింపుల్‌ అండ్‌ కాంపౌండ్‌ ఇంట్రస్ట్‌ అంశాలపై దృష్టి పెట్టాలి. 

రీజనింగ్‌ విభాగంలో వెర్బల్, నాన్‌ వెర్బల్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ముఖ్యంగా డెసిషన్‌ మేకింగ్, తీర్పులు, వెన్‌ రేఖాచిత్రాలు, రక్త సంబంధాలు, దిశలు, అంకగణిత రీజనింగ్, క్లాసిఫికేషన్, నంబర్‌ సిరీస్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్, సారూప్యతలు, వర్గీకరణ అదేవిధంగా సిరీస్‌ కంప్ల్లీషన్, ఆల్ఫాన్యూమరిక్‌ నంబర్‌ టెస్టు, పజిల్స్‌పై ఎక్కువ దృష్టి సారించాలి. ఈ విభాగంలో అదనపు సాధనకు ఎస్‌ఎస్‌సీ ప్రశ్నపత్రాలు సాధన చేయవచ్చు.

ఆంగ్లభాష విషయానికివస్తే ఇది అభ్యర్థుల కచ్చితమైన కమ్యూనికేషన్‌ నైపుణ్యం, ఆంగ్లభాష ప్రావీణ్యంపై గల సాధారణ సామర్థ్యాలను పరీక్షించే విధంగా ఉంటుంది. ఆలోచనలు, అభిప్రాయాలు వ్యక్తీకరించడానికి ఆంగ్లం చాలా ముఖ్యం. 

ఈ విభాగంలో ముఖ్యంగా వ్యాకరణం, పదజాలం, విశ్లేషణాత్మక నైపుణ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

వ్యాసం, ఇంగ్లిష్‌  

టైర్‌ 2 పరీక్షలో అడిగే వ్యాసం ద్వారా అభ్యర్థుల పరిశోధన, విశ్లేషణాత్మక ఒప్పించే నైపుణ్యాలను అంచనా వేస్తారు.

ఇందులో అభ్యర్థుల రచనా నైపుణ్యాలు, తెలివితేటలు, పరిశోధనా నైపుణ్యాలు, క్లిష్టమైన ఆలోచనలు, ఆలోచనా శక్తి, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను పరీక్షిస్తారు. 

ప్రెసీ అనేది సొంత పదాలతో రాత పూర్వక రచన ద్వారా సంక్షిప్తీకరించడం. 

ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌ అభ్యర్థి జ్ఞానం, నైపుణ్యాలు, అనుభవాలను ఒక క్రమ పద్ధతిలో అభివృద్ధి చేయడానికి దోహదపడుతుంది. వీటికి సాధన అవసరం.

రిఫరెన్స్‌ పుస్తకాలు 

లూసెంట్‌ జీకే

ఐబీ ఏసీఐఓ గైడ్‌: ఆర్‌ గుప్త

ఐబీ ఏసీఐఓ పేపర్‌ 1, పేపర్‌ 2 జీకేపీ

ఐబీ ఏసీఐవో గ్రేడ్‌ 2: అరిహంత్‌

ఆబ్జెక్టివ్‌ ఇంగ్లిష్‌: ఆర్‌ఎస్‌ అగర్వాల్‌

రెన్‌ అండ్‌ మార్టిన్‌ హైస్కూల్‌ ఇంగ్లిష్‌ గ్రామర్‌ బుక్‌

Posted Date : 19-12-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌