• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Govt Jobs: 6 విభాగాలు 60 ర‌కాల‌ ఉద్యోగాలు

పట్టు సాధిస్తే.. భవిత పదిలం

న్యూస్‌టుడే, ఆగిరిపల్లి

పట్టభద్రులైన యువత ప్రభుత్వ ఉద్యోగానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈక్రమంలో పోటీ విపరీతంగా పెరిగిపోయినా.. ఒక్కసారి కొలువు సాధిస్తే ఏ ఇబ్బంది లేకుండా జీవించవచ్చు.. సమాజంలో కూడా పేరు ప్రఖ్యాతలు పొందొచ్చనే ఆలోచనతో సర్కారు ఉద్యోగానికే ఆసక్తి చూపుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. కొందరు లక్ష్యానికి చేరువవుతుండగా.. మరికొందరికి సరైన మార్గనిర్దేశం, అవగాహన లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ఈ ఏడాదికి సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఈనేపథ్యంలో కేవలం ఆరు సబ్జెక్టులపై పట్టు సాధిస్తే సుమారు 60కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమై లక్ష్యం చేరుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఆ సబ్జెక్టులు కీలకం.. 

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విద్యకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ఇక్కడే అనేక కళాశాలలు ఉన్నాయి. వీటితోపాటు కోచింగ్‌ సెంటర్లకు కొదవలేదు. పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకునేందుకు పెద్దఎత్తున ఇక్కడికి వస్తుంటారు. రైల్వే, బ్యాంకింగ్, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్, బీమా సంస్థలు, ఎఫ్‌సీఐ, ఇంటెలిజెన్స్‌ బ్యూరో తదితర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే నోటిఫికేషన్లకు సిద్ధమవుతుంటారు. ఇప్పటికే స్టాఫ్‌ సెలక్షణ్‌ కమిషన్‌ ఈ ఏడాదికి సంబంధించిన ఉద్యోగాల క్యాలెండర్‌ను విడుదల చేసింది. త్వరలో బ్యాంకు కొలువలకు నోటిఫికేషన్‌ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే కేవలం ఆరు విభాగాల్లో పట్టు సాధిస్తే సరిపోతుందని అంటున్నారు. వీటిలో ప్రధానంగా రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీషు, జనరల్‌ అవేర్‌నెస్, వర్తమాన అంశాలు, కంప్యూటర్‌ పరిజ్ఞానంపై ప్రశ్నలు ఉంటాయంటున్నారు. 

ఒక్క ఉద్యోగం ఉన్నా నాదే అనుకోవాలి..

నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత పోటీ పరీక్షలకు ఎక్కువ మందికి సిద్ధమవుతుంటారు. అది సరైన విధానం కాదు. ఉద్యోగాలకు ప్రకటన ఎప్పుడు విడుదల చేసినా నేను కొలువు సాధిస్తాను అనేలా ముందు నుంచే ప్రిపేర్‌ కావాలి. ఉద్యోగాలు తక్కువ ఇస్తున్నారు అని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. ఒక్క ఉద్యోగం ఉన్నా అది నాకే అన్నట్లు భావించి ప్రణాళిక ప్రకారం చదివాలి. న్యూమరికల్‌ ఎబిలిటీ, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ (వ్యాపార గణితం), డేటా ఎనాలసిస్‌ సంబంధించిన అంశాలు పరీక్షల్లో ప్రధానం. 8, 9, 10 తరగతుల్లో నేర్చుకున్న అంశాలే ఎక్కువ. తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలు చేయగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. ప్రాక్టీస్‌ చేయడంతో అర్థమెటిక్‌ సులువవుతుంది.- కె.శ్రీధర్, అర్థమెటిక్‌ నిపుణుడు

రెండేళ్ల సాధనలో మూడు కొలువులు

నా పేరు మూడెడ్ల శిరీష, నాన్న రవి వ్యవసాయం చేస్తారు. అమ్మ పద్మావతి గృహిణి. బీటెక్‌ (ఈఈఈ) 2018లో పూర్తి చేశాను. తల్లిదండ్రులు, బంధువుల ప్రేరణతో ప్రభుత్వ కొలువు సాధించాలని ప్రయత్నాలు మొదలు పెట్టాను. రెండేళ్ల పాటు ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఇటీవల ఎస్‌బీఐ జూనియర్‌ అసోసియేట్, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో ఆఫీసర్‌ స్కేల్‌-1 ఆఫీసర్, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో ఆఫీస్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు సాధించాను.

ప్రైవేటు ఉద్యోగం వదిలి.. కొలువుదీరి 

నా పేరు మద్దాల ఈవ, నాన్న జోసఫ్‌ పాస్టర్, అమ్మ కటాక్షం గృహిణి. ఇంట్లో ముగ్గురం అమ్మాయిలమే. నేనే ఆఖరు. బీటెక్‌ (ఈఈఈ) 2016లో పూర్తి చేశాను, ఆ తర్వాత మూడేళ్లు ప్రైవేటు ఉద్యోగం చేశాను. ఎలాగైనా ప్రభుత్వ కొలువు సాధించాలని ఉన్న జాబ్‌ను వదిలేసి సాధన ప్రారంభించా. తొలి ఏడాది ఒక్క పరీక్షలో కూడా ఉత్తీర్ణత పొందలేదు. అయినా నిరుత్సాహ పడలేదు. ఆ తర్వాతి ఏడాది ఎస్‌బీఐ జూనియర్‌ అసోసియేట్, కర్ణాటక వికాస్‌ గ్రామీణ బ్యాంక్‌లో ఆఫీసర్‌ స్కేల్‌-1, ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌లో ఆఫీస్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు వచ్చాయి. మాక్‌టెస్టులు ఎక్కువ సాధన చేయడంతో ప్రశ్నలను వేగంగా అర్థం చేసుకుని కొలువు సాధించా.

కృష్ణా-గుంటూరు జిల్లాల్లో పట్టభద్రులు..

డిగ్రీ, ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు  35,000

ప్రాంగణ ఎంపికల్లో కొలువు సాధిస్తున్నవారు 10000

ఉన్నత చదువులకు వెళ్తున్నవారు 5000

ప్రభుత్వ ఉద్యోగా కోసం శిక్షణ తీసుకుంటున్నవారు 20000

Posted Date : 04-01-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌