• facebook
  • twitter
  • whatsapp
  • telegram

జీవ ప్రపంచంలో వైవిధ్యం

     ఆర్.హెచ్. విట్టేకర్ 1969 లో 5 రాజ్యాల వర్గీకరణను ప్రతిపాదించారు. దీనిలో 4వ రాజ్యం ప్లాంటే. ఇందులో 'ఆకుపచ్చని, నిజకేంద్రకయుత' మొక్కలను చేర్చారు. అంతే కాకుండా, పరాన్నజీవి మొక్కలు (రఫ్లేషియా, ఓరోబాంకి, కస్కూట), కీటకాహారి మొక్కలను (నెపెంథిస్, డ్రసీరా ) కూడా ప్లాంటేలో చేర్చారు.

ప్లాంటే ప్రధాన లక్షణాలు
1. నిజకేంద్రకాలు
2.  స్వయం పోషితాలు
3.  కణ కవచంలో సెల్యులోజ్
4. నిల్వ ఆహార పదార్థం స్టార్చ్
5.  పోషక పదార్థాలను శోషణ విధానంలో గ్రహించడం
6. బహు కణనిర్మిత దేహం
7.  చలనరహితం
8.  నిర్దిష్టమైన లైంగికోత్పత్తి విధానం

 

ప్లాంటేలో ప్రధానంగా

1. పుష్పించని మొక్కలు
2. పుష్పించే మొక్కలు ఉన్నాయి.

పుష్పించని మొక్కలు (క్రిప్టోగామ్‌లు): వీటినే సిద్ధ బీజాల మొక్కలు (spore plants) అంటారు. వీటిలో విత్తనాలు ఏర్పడవు. సిద్ధబీజాల ద్వారానే వ్యాప్తి చెందుతాయి. వీటిని..
               శైవలాలు
               బ్రయోఫైటా
               టెరిడోఫైటా గా విభజించారు.


శైవలాలు (Algae - Linnaeus)

ఇవి థాలస్ ఉన్న ఆకుపచ్చని స్వయంపోషక, ఏకస్థితిక, నీటిలో పెరిగే మొక్కలు. వీటి దేహం వేరు, కాండం, పత్రాలుగా విభజన చెంది ఉండదు కాబట్టి దాన్ని థాలస్ అంటారు. శైవలాలు ఆవాసం, ఆకృతి, ప్రత్యుత్పత్తిలో అనేక వైవిధ్యాలను చూపుతాయి.
ఆవాసం: ఇవి మంచినీటిలో, నిలకడగా ఉండే, ప్రవహించే, సముద్రపు నీటిలో; తడి చెక్కలు, చెట్ల బోదలు, తడిరాళ్లు, ఇతర మొక్కలపైన; అరుదుగా జంతువుల మీద జీవిస్తాయి.

ఆకృతి, దేహ నిర్మాణం: ఇవి ఏకకణ నిర్మితాలు (కశాభ సహిత - క్లామిడోమోనాస్, కశాభ రహిత - క్లోరెల్లా).


   

 

క్లామిడోమోనాస్     


క్లోరెల్లా
సమూహంగా (వాల్వాక్స్, సెనిడిస్మస్), తంతురూపకం, శాఖారహితం (స్పైరోగైరా, జిగ్నిమా) శాఖాయుతం (కారా, యులోథ్రిక్స్). కొన్నింటిలో బృహత్ శరీరం లేదా దేహం ఉంటుంది (కెల్ప్‌లు). ఇవి సముద్రపు నీటిలో పెరుగుతాయి. శైవలాలను కణకవచం, వర్ణద్రవ్యాలు, నిల్వ ఆహారం అనే మూడు లక్షణాలను ఆధారంగా చేసుకుని 3 ప్రధాన తరగతులుగా విభజించారు.
           1. క్లోరోఫైసి
           2. ఫియోఫైసి
           3. రోడోఫైసి


క్లోరోఫైసి

ఇవి ఆకుపచ్చని శైవలాలు. అతిపెద్ద తరగతి. వీటి థాలస్‌లో అనేక వైవిధ్యాలుంటాయి. ఏకకణ నిర్మితం, కశాభ సహితం - క్లామిడోమోనాస్, ఏకకణ నిర్మితం, కశాభ రహితం - క్లోరెల్లా. సమూహం (సహనివేశం) - వాల్వాక్స్. తంతురూపక, శాఖా రహిత - స్పైరోగైరా, శాఖాయుతం - కారా.క్లోరెల్లా

కణకవచం: ప్రధానంగా సెల్యులోజ్, పెక్టిన్‌లతో ఉంటుంది.

వర్ణద్రవ్యాలు: క్లోరోఫిల్ 'ఎ' తో పాటు క్లోరోఫిల్ 'బి' ఉంటుంది. శైవలాల్లో క్లోరోఫిల్ 'బి' ఈ తరగతిలో మాత్రమే ఉంటుంది. వీటిలో కెరోటినాయిడ్‌లు కూడా ఉంటాయి.
హరిత రేణువులు: ఇవి వివిధ ఆకృతులను చూపుతాయి. గిన్నె (క్లామిడోమోనాస్), నక్షత్రం, H, బిళ్ల, రిబ్బన్, వల ఆకారాల్లో ఉంటాయి.
పైరినాయిడ్‌లు: హరితరేణువుల్లో పైరినాయిడ్లు ఉండటం క్లోరోఫైసి ప్రత్యేకత. పైరినాయిడ్‌లు పిండి పదార్థాలను నిల్వ చేస్తాయి.
శాఖీయోత్పత్తి: థాలస్ ముక్కలుగా విరగడం ద్వారా శాఖీయోత్పత్తి జరుగుతుంది. తంతువులోని ప్రతికణానికి విభజన చెందే శక్తి ఉండటమే దీనికి కారణం.
అలైంగికోత్పత్తి: గమన లేదా చలన సిద్ధబీజాల ద్వారా జరుగుతుంది.
లైంగికోత్పత్తి: లైంగికావయవాలు ఏకకణ నిర్మితాలు, కంచుక రహితం. సమసంయోగం, అసమ సంయోగం, క్రియాత్మక అసమ సంయోగం, అండ సంయోగం అనే నాలుగు రకాలుగా జరుగుతుంది.
సంయుక్త బీజంలో క్షయకరణ విభజన జరగడం వల్ల మొక్కలు ఏకస్థితిలో ఉంటాయి.


ఫియోఫైసి

ఇవి గోధుమ వర్ణశైవలాలు. ఎక్కువగా సముద్రపు నీటిలో పెరుగుతాయి. వీటిని కెల్ప్‌లు (Kelps) అంటారు.
థాలస్ నిర్మాణం: బహుకణ నిర్మితాలు, తంతురూపకం, బహు శాఖాయుతం, వీటిలో కొన్ని స్థూల శైవలాలు. అత్యధిక పరిమాణంలో పెరిగేవి కూడా ఉంటాయి. 

కెల్ప్‌లు (Kelps)

ఉదా: మాక్రోసిస్టిస్, లామినేరియా, ఫ్యూకస్ సర్గాసం, ఎక్టోకార్పస్, డిక్టియోటా.

             

  మాక్రోసిస్టిస్ - అతి పెద్ద శైవలం.

పోస్టెల్సియా - సీపామ్ (Seaplam)
సర్గాసం - గల్ఫ్‌వీడ్
                లామినేరియా - డెవిల్స్ ఆప్రన్.

కణకవచం: కణకవచంలో సెల్యులోజ్‌తోపాటు ఆల్జిన్ ఉండటం వీటి ప్రత్యేక లక్షణం. ఆల్జిన్ జిగురు పొరను ఏర్పరుస్తుంది. ఇది కొల్లాయిడల్ పదార్థం.
వర్ణద్రవ్యాలు: క్లోరోఫిల్ - ఎ, క్లోరోఫిల్ - సి, β - కెరోటిన్, ఫ్యూకోజాంథిన్ ఉంటాయి. ఇవి క్రొమాటోఫోర్‌లలో ఉంటాయి. ఫ్యూకోజాంథిన్ (గోధుమవర్ణం) ఎక్కువగా ఉండటం వల్ల ఈ శైవలాలు గోధుమ వర్ణంలో కనిపిస్తాయి.
నిల్వ ఆహార పదార్థం: మానిటాల్, లామినారిన్ అనే రూపాల్లో నిల్వ ఉంటుంది. ఈ రెండూ కార్బోహైడ్రేట్ల నుంచి ఏర్పడ్డాయి.
దేహ ప్రత్యేక నిర్మాణాలు: ఇవి ఆధారానికి స్టెప్ అనే కాడతో అంటుకుని ఉంటాయి. వీటిలో ఉన్న పత్రాల్లాంటి నిర్మాణాలను ఫ్రాండ్స్ అంటారు.
శాఖీయోత్పత్తి: ముక్కలుగా విరగడం ద్వారా జరుగుతుంది.
అలైంగికోత్పత్తి: గమన సిద్ధబీజాల ద్వారా జరుగుతుంది. ద్వికశాభాయుతం. కశాభాలు పార్శ్వ భాగాన ఉంటాయి. సిద్ధబీజాలు బేరిపండు ఆకారంలో ఉంటాయి. కశాభాలు అసమానం.
లైంగికోత్పత్తి: ఇది మూడు రకాలు. సమ సంయోగం, అసమ సంయోగం, అండ సంయోగం. ఎక్టోకార్పస్‌లో సమ సంయోగం, అసమ సంయోగం, సర్గాసంలో అండ సంయోగం కనిపిస్తుంది. ఫలదీకరణం నీటిలో అరుదుగా ప్రత్యేక నిర్మాణం (అండాశయంగా భావించాలి)లో జరుగుతుంది.
జీవితచక్రం: ఎక్టోకార్పస్‌లో ద్వయ ఏకస్థితికం, సర్గాసంలో ద్వయస్థితిక జీవితచక్రాలు ఉంటాయి.

రోడోఫైసి

ఇవి ఎరుపు రంగు శైవలాలు. ఎక్కువగా సముద్రపు నీటిలో పెరుగుతాయి. బట్రకోస్పెర్మం మంచినీటిలో నివసించే ఎర్రశైవలం. వెచ్చటి ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది.


బట్రకోస్పెర్మం                            

థాలస్: బహుకణ నిర్మితం, తంతురూపకం, బహుశ్రేణియుతం (పాలిసైఫోనియా), శాఖాయుతం. పార్ఫిరిడియం ఏకకణ నిర్మితం. ఇది నేలపై పెరుగుతుంది.
కణకవచం: సెల్యులోజ్‌తోపాటు పెక్టిన్, పాలిసల్ఫేట్ ఎస్టర్‌లు ఉంటాయి. గ్రాసిలేరియా, గెలీడియం కణకవచంలో అగార్ అగార్ ఉంటుంది. కాండ్రస్‌లో కారాగీనిన్ అనే పదార్థం ఉంటుంది. అగార్ అగార్, కారాగీనిన్ కొల్లాయిడల్ పదార్థాలు.

       పాలిసైఫోనియా

వర్ణద్రవ్యాలు: క్లోరోఫిల్ - ఎ తోపాటు క్లోరోఫిల్ - డి, β - కెరోటిన్, ఫైకోబిలిన్‌లు (R - ఫైకోఎరిథ్రిన్, R - ఫైకో సయానిన్) ఉంటాయి. R - ఫైకోఎరిథ్రిన్ (ఎరుపు), ఎక్కువగా ఉండటంవల్ల శైవలాలు ఎరుపు వర్ణంలో ఉంటాయి.
నిల్వ ఆహార పదార్థం: ఫ్లొరీడియన్ పిండిపదార్థం రూపంలో నిల్వ ఉంటుంది. ఇది గ్లైకోజన్, ఎమైలో పెక్టిన్‌లను పోలి ఉంటుంది.
శాఖీయోత్పత్తి: ముక్కలుగా విరగడం ద్వారా జరుగుతుంది.
అలైంగికోత్పత్తి: నిశ్చల సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది.
లైంగికోత్పత్తి: ఇది అండసంయోగం ద్వారా జరుగుతుంది. సంయోగ బీజాలు కశాభరహితంగా ఉండటం వీటి ప్రత్యేకత.

వీటి పురుష బీజాలను స్పెర్మాషియం అంటారు. స్త్రీ బీజాశయాన్ని కార్పోగోనియం అంటారు. ఫలదీకరణ తర్వాత స్వల్ప, సంక్లిష్టమైన మార్పులు ఉండటం వీటి ప్రత్యేకత.
జీవితచక్రం: పాలిసైఫోనియాలో ద్వయ ఏకస్థితికం, బట్రకోస్పెర్మంలో ఏకస్థితిక జీవితచక్రాలు ఉంటాయి.


బ్రయోఫైట్‌లు

* ఇవి థాలాయిడ్, ఆకుపచ్చని, ఏకస్థితిక, సంయోగబీజద, అత్యంత పరిణతి చెందిన, నాళికారహిత, పుష్పించని మొక్కలు. నేలమీద పెరిగిన మొదటి మొక్కలు ఇవే.
* ఆర్కిగోనియాలుండి, పిండాన్ని ధరించిన మొదటి మొక్కలు.
* ఇవి తేమ ఉన్న కొండల్లోని ప్రాంతాల్లో పెరుగుతాయి. అయితే వీటి ఫలదీకరణకు నీరు అవసరం కాబట్టి, బ్రయోఫైట్‌లను 'మొక్కల్లోని ఉభయ జీవులు' అంటారు. ఇవి ఆదిమ రకమైన నేలమీద పెరిగే మొక్కలు.

ఆవాసం: తడి, తేమ, చిత్తడి నేలలు, చెట్ల బోదెలు, సేంద్రియ పదార్థాలు, కాలిన నేలలు, తడి రాళ్ల మీద పెరుగుతాయి. మొక్కల జలాభావానుక్రమంలో బ్రయోఫైట్‌లు ప్రధాన పాత్ర వహిస్తాయి
ఆకృతి: వీటి దేహం థాలస్, శాఖాయుతం. లివర్‌వర్ట్‌లలో ద్విభాజీ శాఖీభవనం చెందుతాయి. మాస్‌లలో పత్రాల్లాంటి నిర్మాణాలుంటాయి. ఇవి నేలలో మూల తంతువులతో (ఏకకణ, లేదా బహుకణ నిర్మితం) స్థాపన చెందడంతో పాటు నీటిని, ఖనిజ లవణాలను శోషిస్తాయి.
ప్రత్యుత్పత్తి: మొక్కలు ఏకస్థితికం, సంయోగ బీజదాలు. ఇవి శాఖీయోత్పత్తి ద్వారా సంయోగ బీజదాలను ఉత్పత్తి చేస్తాయి.
లైంగికోత్పత్తి: మొదటిసారిగా మొక్కల్లో బహుకణ నిర్మిత, కంచుక సహిత లైంగికావయవాలు ఉంటాయి. పురుష బీజాశయాన్ని ఆంథరీడియం (గదాకారం), స్త్రీ బీజాశయాన్ని ఆర్కిగోనియం (కూజాకారం) అంటారు. పురుష బీజం ద్వికశాభాయుతం. ఫలదీకరణం అండ సంయోగం ద్వారా జరుగుతుంది (జాయిడోగమి). సంయుక్త బీజం సమవిభజన చెంది పిండంగా, ఆ తర్వాత సిద్ధబీజదంగా ఏర్పడుతుంది.
అలైంగికోత్పత్తి: సిద్ధబీజదం సంయోగం బీజదం పైన పెరుగుతూ అలైంగికోత్పత్తి చూపుతుంది. సిద్ధ బీజదంలో ఉన్న గుళికలో ఉండే సిద్ధబీజమాతృకణాలు క్షయకరణ విభజన చెంది, ఏకస్థితిక సిద్ధబీజాలను ఏర్పరుస్తాయి. అవి మొలకెత్తి సంయోగ బీజదాలను ఏర్పరుస్తాయి.
ఏకాంతర జీవిత దశలు: సంయోగ బీజదం లైంగికోత్పత్తి ద్వారా సిద్ధబీజదాన్ని ఏర్పరుస్తుంది. సిద్ధబీజదం అలైంగికోత్పత్తి ద్వారా తిరిగి సంయోగ బీజదాన్ని ఏర్పరుస్తుంది. ఈ విధంగా క్రమం తప్పకుండా జరుగుతుంది. సంయోగబీజదం, సిద్ధబీజదం ఒకేలా ఉండవు. కాబట్టి, వీటి జీవితచక్రంలో భిన్నరూప ఏకాంతర జీవిత దశలను చూడవచ్చు.
జీవిత చక్రం: ఏక ద్వయ స్థితికం.


బ్రయోఫైట్‌లను ప్రధానంగా 3 తరగతులుగా విభజిస్తారు.

1. హెపాటికాప్సిడా (లివర్‌వర్ట్‌లు)

ఉదా: రిక్సియా, మార్కంషియా
2. ఆంథోసిరటాప్సిడా (హార్న్‌వర్ట్‌లు)
ఉదా: ఆంథోసిరాస్
3. బ్రయాప్సిడా (మాస్‌లు)
ఉదా: ఫ్యునేరియా, పాలిట్రైకం డాసోనియా అతిపెద్ద మాస్

ఆర్థిక ప్రాముఖ్యం

వీటికి తక్కువ ఆర్థిక ప్రాముఖ్యం ఉంటుంది.
1. స్పాగ్నంను పీట్‌మాస్ అంటారు. దీని నుంచి ఏర్పడిన పీట్‌ను ఇంధనంగా వాడతారు.

2. స్పాగ్నంకు నీటిని నిల్వ చేసుకునే శక్తి ఉండటం వల్ల ప్యాకింగ్ మెటీరియల్‌గా ఉపయోగిస్తారు.
3. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీఫంగల్ పదార్థాలను ఉత్పత్తి చేయడంవల్ల కూడా స్పాగ్నంను ప్యాకింగ్ మెటీరియల్‌గా వాడతారు.
4. మాస్ మొక్కలు, లివర్‌వర్ట్‌లు నేలపైన చాపలా దగ్గర దగ్గరగా పెరగడం వల్ల మృత్తికాక్షయాన్ని తగ్గిస్తాయి.
5. జలాభావానుక్రమంలో మాస్‌లు పెరిగి రాతిని క్షయం చేయడం ద్వారా ప్రధాన పాత్ర వహిస్తాయి.


1. లివర్ వర్ట్స్ (హెపాటికాప్సిడా)
ఇవి ఆదిమ రకమైన బ్రయోఫైట్‌లు. వీటి దేహం థాలస్. ఇవి ద్విభాజీశాఖీభవనాన్ని చూపుతాయి. ఈ శాఖలు కాలేయం (లివర్) తిత్తులను పోలి ఉండటంవల్ల వీటిని లివర్‌వర్ట్స్ అంటారు.
ఉదా: రిక్సియా, మార్కంషియా

      
        మార్కంషియా                            రిక్సియా
ఉనికి: ఇవి తేమ, నీడ ఉన్న ప్రదేశాల్లో, బురద నేలలు, కాలువల తీరాలు, అడవుల్లోని చల్లటి ప్రదేశాల్లో పెరుగుతాయి. దగ్గర దగ్గరగా పెరిగి, మెత్తటి తివాచీలా కనిపిస్తాయి.


శాఖీయోత్పత్తి:
1. ముక్కలుగా విరగడం వల్ల జరుగుతుంది.
2. మార్కంషియాలో ప్రత్యేకమైన జెమ్మాల ద్వారా జరుగుతుంది. సంయోగ బీజదంలో లైంగికావయవాలు ఆంథరీడియాలు, ఆర్కిగోనియాలు ఉంటాయి. వృంతసహితం. కంచుకసహితం ఫలదీకరణం జాయిడోగామస్ అండ సంయోగం. సిద్ధబీజదానికి చెందిన గుళికలో ఇలేటర్‌లు ఉండటం వీటి ప్రత్యేకత.


2. హార్న్‌వర్ట్స్ (ఆంథోసిరటాప్సిడా)
వీటి సిద్ధబీజదం కొమ్ముల్లా సంయోగ బీజదాలపై పెరుగుతుంది. అందుకే వీటిని హార్న్‌వర్ట్‌లు అంటారు. వీటిలో సంయోగ బీజాశయాలు థాలస్‌లో దిగబడి ఉండటం, పరిణతి చెందిన ప్రత్యేక లక్షణం. సిద్ధబీజదంలో పాదానికి, గుళికకు మధ్య మధ్యస్థ విభాజ్య కణజాలం ఉంటుంది. గుళికలో అనృత ఇలేటర్‌లు ఉండటం ప్రత్యేక లక్షణం.

ఉదా: ఆంథోసిరాస్
 

3. బ్రయాప్సిడా (మాస్‌లు)

ఇవి పత్రసహిత బ్రయోఫైట్‌లు. వీటిలో సంయోగ బీజదం నిటారుగా పెరగడంవల్ల గామెటోఫోర్ అంటారు. లైంగికావయవాలను ఆంథరీడియోఫోర్, ఆర్కిగోనియోఫోర్‌లపైన చూడవచ్చు. లైంగికావయవాల మధ్య పారఫైస్‌లు ఉండటం వీటి ప్రత్యేకత.
లైంగికోత్పత్తిలో ఏర్పడిన సిద్ధబీజదంలో పాదం, కాడ, గుళిక ఉంటాయి.
సిద్ధబీజాల నుంచి ఏర్పడిన అల్పకాలిక, శైశవ దశను ప్రథమ తంతువు (ప్రోటోనిమా) అంటారు. ఇది మాస్‌ల ప్రత్యేక లక్షణం. ప్రథమ తంతువుపైన ఏర్పడిన మొగ్గల నుంచి గామెటోఫోర్‌లు ఉత్పత్తవుతాయి.
మాస్‌లను అత్యంత పరిణతి చెందిన బ్రయోఫైట్‌లుగా భావిస్తారు. వీటిలో సిద్ధబీజాల విడుదలకు తోడ్పడే ఆర్ద్రతాకర్షక శక్తి ఉన్న పరిముఖ దంతాలు, కాడ ఉండటం ప్రత్యేక లక్షణం. సిద్ధబీజదాలు విడుదల చెందడానికి నిర్ణీతమైన విధానం ఉండటం పరిణతి చెందిన లక్షణం.

ఉదా: ఫ్యునేరియా (Cord Moss) పాలిట్రైకం (Haircap Moss), స్పాగ్నం (Peat Moss).

టెరిడోఫైట్‌లు

ఇవి అత్యంత పరిణతి చెందిన క్రిప్టోగామ్‌లు. ఇవి ఆదిమ రకమైన మొదటి నాళికాసహిత మొక్కలు. మొదటిసారిగా నేలమీద పెరిగిన మొక్కలు. వీటిని మొక్కల్లోని సరీసృపాలు (బొటానికల్ స్నేక్స్) అంటారు.
వీటి దేహంలో వేరు, కాండం, పత్రాలు అనే నిర్మాణాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇవన్నీ గుల్మాలు, బహువార్షికాలు, ద్వయస్థితిక సిద్ధ బీజదాలు.

వేరువ్యవస్థ: అబ్బురపు వేరువ్యవస్థ.
కాండం : గుల్మాకారం, శాఖాయుతం.
పత్రాలు : సూక్ష్మ లేదా స్థూల పత్రాలు. స్థూల పత్రాలను ఫ్రాండ్‌లు అంటారు. ఫ్రాండ్‌లున్న మొక్కలను ఫెర్న్‌లంటారు.
అంతర్నిర్మాణం : నాళికా కణజాలం ఉండటం ప్రత్యకత. దారువులో దారునాళాలుండవు (సెలాజినెల్లా, ఈక్విజిటం తప్ప).

పోషక కణజాలంలో సహకణాలు, చాలనీనాళాలు ఉండవు. ద్వితీయాభివృద్ధి ఉండదు.


2. భిన్న సిద్ధబీజదాలు: సిద్ధబీజమాతృకణాలు 2 రకాలు.
1) స్థూల సిద్ధబీజ మాతృకణాలు 2) సూక్ష్మసిద్ధ బీజ మాతృకణాలు. అవి క్షయకరణ విభజన చెంది, స్థూల సిద్ధ బీజాలను, సూక్ష్మసిద్ధ బీజాలను ఏర్పరుస్తాయి. ఇవి మొలకెత్తి, ఏకలింగాశ్రయ సంయోగబీజదాలను ఏర్పరుస్తాయి. భిన్న సిద్ధబీజద విత్తనాన్ని ఏర్పరచడం ఒక ముఖ్యమైన ఘట్టం.        
ఉదా: సెలాజినెల్లా, మార్సీలియా.

            
సిద్ధబీజాశయ పత్రాలు: టెరిడోఫైట్‌ల ప్రత్యేక లక్షణం. ఫలవంతమైన పత్రాలు పృష్ఠతలంలో/ ఉదరతలంలో సిద్ధ బీజాశయాలను కలిగి ఉంటాయి. ఈ పత్రాలు స్ట్రోబిలస్ లేదా శంకువులను ఏర్పరుస్తాయి (సెలాజినెల్లా, లైకోపోడియం) లేదా విడివిడిగా ఉంటాయి (టెరిస్).
సిద్ధబీజాశయాలు: సిద్ధబీజాశయాలు ఒక సిద్ధబీజాశయ ఆరంభకణం నుంచి ఏర్పడితే ఆ విధానాన్ని లెప్టోస్పొరాంజియేట్ విధానం అంటారు. అనేక సిద్ధబీజాశయ ప్రారంభ కణాల నుంచి ఏర్పడితే యూస్పొరాంజియేట్ విధానం అంటారు.

ఫెర్న్‌ల ప్రత్యేకత: స్థూలపత్రాలున్న టెరిడోఫైట్‌లను ఫెర్న్‌లు అంటారు. వీటి పత్రాలను ఫ్రాండ్‌లు అంటారు. ఇవి లేతగా ఉన్నపుడు వలితకిసలయ విన్యాసాన్ని చూపుతాయి. పత్రాలు ద్విభాజీ వివృత ఈనెల వ్యాపనాన్ని చూపుతాయి. వీటిలో ఫలవంతమైన పత్రాలు ఉదరతలంలో సిద్ధబీజాశయ గుంపులను లేదా పుంజాలను (Sorus) ఏర్పరుస్తాయి. ఇది ఫెర్న్‌ల ప్రత్యేక లక్షణం.

వీటిని రక్షించడానికి ఇండూషియం అనే ప్రత్యేక నిర్మాణం ఉంటుంది. టెరిస్‌లో అనృత ఇండూషియం ఉంటుంది. ఇది సిద్ధబీజాశయ పత్రం అంచులు కిందికి వంగినప్పుడు ఏర్పడుతుంది. పత్రాలు రామెంటా (Ramenta)ను కలిగి ఉంటాయి. రామెంటా అంటే ఏకకణ లేదా ద్వికణ నిర్మిత గోధుమరంగు కేశాలు. ఇవి పత్రవృంతంపైన ఉంటాయి.
ప్రథమాంకురం: సిద్ధబీజాలు మొలకెత్తి ఏర్పరచిన సంయోగ బీజదాన్ని ప్రథమాంకురం అంటారు. ఇది ఆకుపచ్చటి, స్వయంపోషకం, అల్పకాలికం, నాళికారహితం, లైంగికోత్పత్తిలో పాల్గొని తిరిగి సిద్ధబీజదాన్ని ఏర్పరుస్తుంది. లైంగికావయవాలు బహుకణ నిర్మితం, కంచుక సహితం, వృంతరహితం, దిగబడి ఉంటాయి.
ఫలదీకరణం జాయిడోగామస్ అండ సంయోగం. బహుశైలికాయుత పురుష బీజాలుంటాయి. సంయుక్త బీజం నుంచి ఏర్పడిన పిండం సిద్ధబీజదాన్ని ఏర్పరుస్తుంది.

ఏకాంతర జీవిత దశలు: టెరిడోఫైట్‌లు సిద్ధబీజదాలు. ఇవి అలైంగికోత్పత్తిలో పాల్గొని సంయోగ బీజదాలను ఏర్పరచగా, అవి లైంగికోత్పత్తిలో పాల్గొని తిరిగి సిద్ధబీజదాన్ని క్రమం తప్పకుండా ఏర్పరుస్తాయి. సిద్ధబీజదం, సంయోగబీజదం ఒకదానికొకటి పోలి ఉండవు. కాబట్టి, టెరిడోఫైట్‌లు భిన్నరూప ఏకాంతర జీవితదశలను చూపుతాయి.
జీవితచక్రం: వీటిలో సిద్ధబీజదం ద్వయస్థితికం, బహువార్షికం, నాళికాసహితం, ప్రబలమైంది. దీని నుంచి ఏర్పడిన ప్రథమాంకురం ఏకస్థితికం, అల్పకాలికం, నాళికారహితం, ప్రబలమైంది కాదు. కాబట్టి టెరిడోఫైట్‌ల జీవితచక్రాన్ని ద్వయఏకస్థితికం అంటారు.

టెరిడోఫైట్‌ల వర్గీకరణ: వీటిలో 4 తరగతులు ఉంటాయి.
1. సిలోప్సిడా (ఉదా : సిలోటం)
2. లైకాప్సిడా (ఉదా : లైకోపోడియం)
3. స్పినోప్సిడా (ఉదా : ఈక్విజిటం)
4. టెరాప్సిడా (ఉదా : ఫెర్న్‌లు, టెరిస్)    


      లైకోపోడియం                               ఫెర్న్‌


         
వివృత బీజాలు (Gymnosperms)

ఇవి పుష్పించే మొక్కలు. వీటిలో నగ్న (ఫలకవచంతో కప్పకుండా) విత్తనాలు ఉంటాయి. అండాలు అండాశయంతో కప్పి ఉండవు కాబట్టి, నగ్న అండాలున్న మొక్కలను వివృత బీజాలు అంటారు. ఇవి పరిణతి చెందని పుష్పించే మొక్కలు.
ఆకృతి:  ఇవి బహువార్షిక వృక్షాలు. అరుదుగా పొదలు, అడవులను ఏర్పరుస్తాయి.
నిర్మాణం: ఇవి ద్వయస్థితికాలు, భిన్న సిద్ధబీజదాలు. వీటి దేహంలో వేరు, కాండం, పత్రాలు, పుష్పాలు అనే నాలుగు భాగాలుంటాయి.
వేరు వ్యవస్థ
తల్లివేరు వ్యవస్థ: కొన్ని మొక్కల్లో శిలీంద్ర మూలాలు ఉంటాయి. సైకాస్‌లో ప్రవాళాభ వేర్లు కనిపిస్తాయి. వీటిలో నాస్టాక్, అనబీనా అనే నీలి ఆకుపచ్చ శైవలాలుంటాయి.
కాండం: నిటారుగా, దృఢంగా, శాఖారహితం (సైకాస్) లేదా శాఖాయుతం (పైనస్, టాక్సస్, సిడ్రస్). పునర్‌వృద్ధిని చూపుతుంది.
పత్రాలు: పైనస్‌లో సూదుల్లా ఉంటాయి. సైకాస్‌లో పిచ్ఛాకార సంయుక్తం. నీటంలో సరళ పత్రాలు. సతతహరితం. ఎడారి మొక్కల లక్షణాలను చూపుతాయి. గింకోలో వివృత ద్విభాజీ ఈనెల వ్యాపనం ఉంటుంది. ఇది ఫెర్న్ మొక్కల లక్షణం. సైకాస్‌లో పత్రకాలు వలిత కిసలయ విన్యాసం (ఫెర్న్‌ల లక్షణం) చూపుతాయి. గింకో, సైకాస్‌లను బతికి ఉన్న శిలాజాలు అంటారు.
అంతర్నిర్మాణం: కాండం నిజ ప్రసరణ స్తంభాన్ని కలిగి ఉంటుంది. దారువులో దారు నాళాలుండవు (నీటంలో తప్ప). పోషక కణజాలంలో సహ కణాలుండవు. కొన్నింటిలో సహకణాలకు బదులు ఆల్బుమీన్ కణాలుంటాయి. చాలనీ నాళాలుండవు. ద్వితీయ వృద్ధి ఉంటుంది.
పుష్పాలు: ఏకలింగకాలు, వృంత రహితాలు, పరిపత్రరహితం (నగ్నపుష్పాలు). పురుష పుష్పంలో కేసరాలను సూక్ష్మసిద్ధ బీజాశయ పత్రాలంటారు. వీటిలోని సూక్ష్మ సిద్ధబీజ మాతృకణాలు క్షయకరణ విభజన చెందగా, సూక్ష్మసిద్ధబీజాలు (పరాగరేణువులు) ఏర్పడతాయి.
స్త్రీ పుష్పంలో ఫలదళాలను స్థూలసిద్ధబీజాశయ పత్రాలు అంటారు. ఇవి వివృతం అంటే.. మూసుకుని ఉంటాయి. అండకోశాన్ని ఏర్పరచవు. అండాలను అండాశయం కప్పివేయదు. కాబట్టి, అండాలు నగ్నం. పుష్పాలు కొన్ని మొక్కల్లో (సైకాస్, పైనస్) స్ట్రోబిలస్ లేదా శంకువులను ఏర్పరుస్తాయి. అండాలు నిర్వక్రం, ఏకకవచం. సైకాస్‌లో అతిపెద్ద అండం ఉంటుంది.

పరాగ సంపర్కం: వాయుపరాగ సంపర్కం, ప్రత్యక్ష పరాగ సంపర్కం, పరపరాగ సంపర్కం. స్త్రీ, పురుష పుష్పాలు ఒకే మొక్కపై (పైనస్) లేదా వేర్వేరు మొక్కలపై (సైకాస్) ఉంటాయి.

సంయోగ బీజదాలు: బాగా క్షీణించి ఉంటాయి. సైకాస్‌లో పురుష సంయోగ బీజదం ఆంథరీడియంను, స్త్రీ సంయోగ బీజదం ఆర్కిగోనియంను కలిగి ఉండటం ఆదిమ లక్షణం. స్త్రీ సంయోగ బీజదం పూర్తికాలం అండంలోనే ఉండిపోవడంవల్ల విత్తనం ఏర్పడుతుంది.
ఫలదీకరణం: సైకాస్‌లో జాయిడోగామస్ సైఫనోగమి, మిగతా వాటిలో నాళసంయోగం (సైఫనోగమి). సైకాస్‌లో పురుష బీజాలు బహుశైలికాయుతం ఇది ఫెర్న్ మొక్కల లక్షణం. సైకాస్‌లో అతిపెద్ద పురుష బీజాలు, స్త్రీబీజం ఉంటాయి.

అంకురచ్చదం: వివృత బీజాల్లో స్త్రీ సంయోగ బీజదం అంకురచ్చదంగా పనిచేస్తుంది. కాబట్టి, ఏకస్థితికం. ఫలదీకరణకు ముందే ఏర్పడుతుంది.
విత్తనాలు: ద్విదళ బీజాలు (సైకాస్), కొన్ని వివృత బీజాల్లో అనేక బీజదళాలు ఉంటాయి. బహుపిండత సాధారణ లక్షణం.
జీవితచక్రం : ద్వయ ఏకస్థితికం.

భిన్నరూప ఏకాంతర జీవిత దశలు: మొక్కలు ద్వయస్థితికాలు. భిన్నసిద్ధ బీజదాలు. అలైంగికోత్పత్తిలో పురుష, స్త్రీ సంయోగబీజదాలు ఏర్పడతాయి. సంయోగ బీజదాలు ఏకలింగాశ్రయులు. క్షీణించి ఉంటాయి. సిద్ధబీజదంపై పూర్తిగా ఆధారపడి ఉంటాయి. లైంగికోత్పత్తిలో పాల్గొని, సిద్ధబీజదాన్ని ఏర్పరుస్తాయి.

వివృత బీజాలను 3 తరగతులుగా విభజించారు.
             1) సైకడాప్సిడా (సైకాస్)
             2) కోనిఫెరాప్సిడా (పైనస్)
             3) నీటాప్సిడా (నీటం)


ఆవృత బీజాలు (Angiosperms)

ఫలకవచంతో కప్పి ఉన్న విత్తనాలను (ఫలాలను) ధరించే మొక్కలను ఆవృత బీజాలంటారు. ఇవి పరిణతి చెందిన పుష్పించే మొక్కలు.
ఆవాసం: అన్ని రకాల ఆవాసాల్లో పెరుగుతాయి. ఇవి నీటి మొక్కలు, సమోద్భీజాలు, ఎడారి మొక్కలు.
ఆకృతి: ఇవి అనేక వైవిధ్యాలను చూపుతాయి. గుల్మాలు, పొదలు, వృక్షాలు, లయేన్లు, ఎగబాకే మొక్కలు, వృక్షోపజీవులు.
ప్రధాన రకాలు: ఇవి ప్రధానంగా 2 రకాలు 1) ద్విదళ బీజాలు, 2) ఏకదళ బీజాలు.

ద్విదళ బీజాలు: తల్లి వేరు వ్యవస్థ, జాలాకార ఈనెల వ్యాపనం, చతుర్భాగయుత లేదా పంచభాగయుత పుష్పాలను కలిగి ఉంటాయి.
ఏకదళబీజాలు: అబ్బురపు వేరువ్యవస్థ, సమాంతర ఈనెల వ్యాపనం, త్రిభాగయుత పుష్పాలను కలిగి ఉంటాయి.
అంతర్నిర్మాణం : దారువులో దారు నాళాలుంటాయి. పోషక కణజాలంలో సహకణాలు, చాలనీ నాళాలుంటాయి.
పుష్పాలు : ఇవి వృంత సహితం లేదా వృంత రహితం. పరిపత్ర సహితం, ద్విలింగకం లేదా ఏకలింగకం. కొన్ని మొక్కల్లో పుష్ప విన్యాసాలను ఏర్పరుస్తాయి. ఫలదళాలు మూసుకొని అండకోశాన్ని ఏర్పరిస్తే, అందులో అండాశయం, కీలం, కీలాగ్రం ఉంటాయి. అండాశయం లోపల అండాలుంటాయి.
పరాగ సంపర్కం : వాయు, జంతు, జల పరాగ సంపర్కం. పరోక్ష పరాగ సంపర్కం, ఆత్మ పరాగ సంపర్కం లేదా పరపరాగ సంపర్కం.
ఫలదీకరణం: నాళసంయోగం, అండసంయోగం, సంయుక్త సంయోగం. ద్విఫలదీకరణ జరిగిన తర్వాత విత్తనం ఏర్పడుతుంది. అంకురచ్చదం త్రయస్థితికం.
విత్తనాలు: ఏకదళ బీజాలు లేదా ద్విదళ బీజాలు. అంకురచ్చద సహితం లేదా అంకురచ్చద రహితం. ఫలదీకరణ తర్వాత అండాశయం ఫలంగా మారుతుంది.

Posted Date : 29-07-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌