• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మొక్కల్లో  ప్రత్యుత్పత్తి విధానాలు

ప్రత్యుత్పత్తి అనేది జీవుల ముఖ్య లక్షణాల్లో ఒకటి. ఇది సూక్ష్మజీవుల నుంచి స్థూల జీవులదాకా కనిపిస్తుంది. జీవితకాలంలో సంతతిని ఉత్పత్తి చేయడాన్ని ప్రత్యుత్పత్తిగా చెప్పవచ్చు. ఈ భూమిపై జీవులు అస్థిత్వంలోకి వచ్చాక, తరతరాలుగా ఈ ప్రక్రియ కొనసాగుతుండటంవల్లే, నాటి జీవులను నేటికీ చూడగలుగుతున్నాం. ప్రత్యుత్పత్తి అలైంగిక, లైంగిక పద్ధతుల ద్వారా జరుగుతుంది. లైంగిక ప్రత్యుత్పత్తిలో కొత్త వైవిధ్యాల సృష్టి జరిగి, జీవి మనుగడ పోరాటంలో తోడ్పడుతుంది.
             జీవులు నిర్ధిష్టకాలం జీవించి ఆ తర్వాత మరణిస్తాయి. అంటే ప్రతి జీవికి మరణం తప్పదు. జన్మించిన నాటి నుంచి మరణించేవరకు ఉండే కాలాన్ని 'జీవితకాలం' అంటారు. ఇది కొన్ని రోజుల నుంచి కొన్ని వేల సంవత్సరాలు ఉండొచ్చు. అలాగే ఈ రెండింటి మధ్య ఉండే జీవితకాలం ఉన్న అనేక జీవులున్నాయి. ఇలా జీవుల్లో భిన్నమైన జీవితకాలం కనిపించడానికి, అవి ప్రత్యుత్పత్తికి అనుసరించే పద్ధతులు కారణంగా చెప్పవచ్చు. 'ఒక జీవి తనలా ఉండే సంతతిని పెంపొందించే పద్ధతినే ప్రత్యుత్పత్తి' అంటారు. జీవి పుట్టడం, పెరగడం, మరణించడం అనేవి ఒక వలయంలా ఉంటాయి. తరతరాలుగా జాతి మనుగడకు ప్రత్యుత్పత్తి తోడ్పడుతుంది.

పంచానన్ మహేశ్వరి (1904-1966) 
           వృక్షశాస్త్ర పురోగతికి తోడ్పడిన అనేకమంది శాస్త్రజ్ఞుల్లో భారతీయులూ ఉన్నారు. పిండోత్పత్తి శాస్త్రంలో కృషిచేసిన గొప్ప శాస్త్రవేత్తల్లో పంచానన్ మహేశ్వరి ఒకరు. ఈయన నవంబరు 9, 1904లో రాజస్థాన్‌లోని జైపూర్‌లో జన్మించారు. 1931లో అలహాబాద్ విశ్వవిద్యాలయం నుంచి D.Sc పట్టా పొందారు. కళాశాలలో మత గురువు Dr. W. Dudgeon మాటలతో తీవ్రంగా ప్రభావితమై గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగారు. వృక్షశాస్త్రం, స్వరూప శాస్త్రంపై ఆసక్తి పెంచుకున్నారు. పిండోత్పత్తి శాస్త్ర అంశాలపై అధ్యయనం చేసి, వర్గీకరణ శాస్త్రంలో పిండోత్పత్తి శాస్త్ర లక్షణాల ఉపయోగాన్ని వ్యాపింపజేశారు.పంచానన్ మహేశ్వరి ఢిల్లీ విశ్వవిద్యాలయ వృక్షశాస్త్ర విభాగాధిపతిగా (1949) పనిచేస్తూ, ఆ విశ్వ విద్యాలయాన్ని పిండోత్పత్తి శాస్త్రం, కణజాల వర్థనం పరిశోధనలకు ఒక ముఖ్య కేంద్రంగా అభివృద్ధిపరిచారు. పిండవర్థన పరిశోధనలో వీరి కృషి ఎనలేనిది. కృత్రిమ పద్ధతుల ద్వారా అపరిపక్వ పిండవర్థన ప్రాముఖ్యాన్ని తెలియజెప్పారు. ఆధునిక పిండోత్పత్తి శాస్త్ర పితామహుడిగా గుర్తింపు పొందారు. వీరి పరిశోధనల ఫలితంగా కణజాల వర్థనం విజ్ఞానశాస్త్రంలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. పరీక్షనాళికలో ఫలదీకరణ, అండాశయస్థ పరాగసంపర్కం వీరికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చాయి. మహేశ్వరి కృషికి గుర్తింపుగా శ్రేయోభిలాషులు, విద్యార్థులు కొత్తగా కనుక్కున్న మొక్కలకు ఈయన పేరుపెట్టారు. ఉదా: పంచాననియా జైపూరెన్సిస్ (శిలీంద్రం), ఓల్డెన్‌లాండియా మహేశ్వరి (ర్యూబియేసి మొక్క). ఇంకా వీరికి బీర్బల్ సాహనీ, సుందర్‌లాల్ హోరా పతకాలతోపాటు, లండన్ రాయల్ సొసైటీ (1965), ఇండన్ నేషనల్ సైన్స్ అకాడమీ సభ్యత్వం, మరెన్నో జాతీయ సంస్థలు పురస్కారాలను అందజేశాయి. ఈయన మే 18, 1966న మరణించారు.

 

ప్రత్యుత్పత్తి విధానాలు
            పాల్గొనే జీవుల సంఖ్య (ఒకటి లేదా రెండు) ఆధారంగా ప్రత్యుత్పత్తి రెండు రకాలు. సంయోగబీజాలు ఏర్పడి లేదా ఏర్పడకుండా ఒక జనకం నుంచి సంతతి ఉత్పత్తి అయితే అది అలైంగిక ప్రత్యుత్పత్తి. రెండు జనకాలు (విరుద్ధ లింగాలు) ప్రత్యుత్పత్తిలో పాల్గొని స్త్రీ, పురుష సంయోగ బీజాల కలయిక జరిగితే అది లైంగిక ప్రత్యుత్పత్తి.

 

అలైంగిక ప్రత్యుత్పత్తి

* అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఒకే ఒక జనకం సంతతిని ఉత్పత్తి చేయగలుగుతుంది.
* దీనిలో సంతతి ఒకదాంతో ఒకటి పోలి ఉండి, జనకానికి సరైన నకలుగా ఉంటాయి.
* అలైంగిక ప్రత్యుత్పత్తి ఏకకణ జీవుల్లోనూ, సాపేక్షంగా సరళ నిర్మాణంలో ఉన్న మొక్కల్లో కనిపిస్తుంది.
* ప్రోటిస్టా, మొనెరా జీవుల్లో జీవి లేదా జనక కణం రెండుగా విభజన చెంది కొత్త సంతతిని ఉత్పత్తి చేస్తుంది
      (ద్విధా విచ్ఛిత్తి). ఈ జీవుల్లో కణవిభజనే ఒక రకమైన ప్రత్యుత్పత్తి విధానం.
* ఈస్ట్‌లో అలైంగిక ప్రత్యుత్పత్తి ప్రరోహోత్పత్తి ద్వారా జరుగుతుంది. ఇందులో విభజన అసమానంగా జరిగి మొదట చిన్న ప్రరోహాలు ఏర్పడతాయి. అవి జనక కణాన్ని అంటిపెట్టుకుని ఉంటాయి. తర్వాత కణం నుంచి విడిపోయి, అభివృద్ధి చెంది, పక్వదశకు చేరుకుని కొత్త ఈస్ట్ కణాలు ఏర్పడతాయి.
* అనేక శిలీంద్ర జాతులు, శైవలాల్లాంటి సరళ మొక్కలు, 'సిద్ధబీజాలు' అనే ప్రత్యేకమైన 'అలైంగిక నిర్మాణాల' ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతాయి. ఇవి చాలా చిన్నవిగా ఉండి వ్యాప్తికి అనుకూలంగా ఉంటాయి. ప్రతికూల పరిస్థితులను తట్టుకుని దీర్ఘకాలం మనుగడ సాగిస్తాయి. క్లామిడోమోనాస్ లాంటి శైవలంలో సమవిభజన ద్వారా ఏర్పడే సిద్ధబీజాలు చలనాలను చూపుతాయి (గమన సిద్ధబీజాలు). సాధారణంగా రొట్టెబూజు (రైజోపస్) ఏర్పరిచే సిద్ధబీజాలు చలనరహితంగా ఉంటాయి (నిశ్చల సిద్ధబీజాలు). ఇవి సిద్ధబీజాశయంలో ఏర్పడతాయి. పెన్సిలియం లాంటి శిలీంద్రాల్లో ప్రత్యుత్పత్తి జరిపే సిద్ధబీజాలు ప్రత్యేకమైన సిద్ధబీజాశయ వృంతాలపై ఏర్పడతాయి (కొనిడియమ్‌లు). 

             

* బ్రయోఫైటా, టెరిడోఫైటా మొక్కల సిద్ధబీజాలు సహజంగా ఏకస్థితికాలు. ఇవి అంకురించి సంయోగబీజదాలు (గామిటోఫైట్‌లు)గా అభివృద్ధి చెంది జీవిత చక్రాన్ని పరిపూర్ణం చేస్తాయి. శాఖీయ ప్రత్యుత్పత్తిలో బహుకణ లేదా సహనివేశ శైవలాలు, బూజులు, పుట్టగొడుగుల్లోని శరీరం కొంతభాగం చెదిరి ముక్కలై చిన్నచిన్న ఖండితాలుగా విడిపోతుంది. ఈ ఖండితాలు ప్రౌఢ జీవిగా అభివృద్ధి చెందుతాయి (ముక్కలు కావడం).
* కొన్ని మొక్కలు ప్రత్యేకమైన నిర్మాణాలతో ఉండి, ముక్కలు కావడం ద్వారా ప్రత్యుత్పత్తికి తోడ్పతాయి (లివర్‌వర్ట్స్‌లోని జెమ్మాలు).
* పుష్పించే మొక్కల్లో రన్నర్‌లు, స్టోలన్లు, పిలక మొక్కలు, ఆఫ్‌సెట్‌లు, కొమ్ము, కందం, దుంప కాండం, లశునం, లఘు లశునాలు, ప్రత్యుత్పత్తి పత్రాల్లాంటి శాఖీయ నిర్మాణాలు శాఖీయ వ్యాప్తి ద్వారా కొత్త సంతతిని ఉత్పత్తి చేయగలవు. ఈ నిర్మాణ విభాగాలను 'శాఖీయ వ్యాప్తి కారకాలు' అంటారు.
* అలైంగిక పద్ధతి లేదా శాఖీయపరంగా ఏర్పడే మొక్కలను 'క్లోన్‌'లు అంటారు. 'బెంగాల్ భీతి'గా పిలుస్తున్న 'గుర్రపు డెక్క' నీటిలో అసాధారణ రీతిలో, అతివేగంగా పెరిగే కలుపు మొక్క.
* ఇది నీటిలోని ఆక్సిజన్‌ను తొలగించడంతో అందులోని చేపలు నశించిపోతాయి. అందమైన పుష్పాలు, ఆకుల ఆకారాన్ని చూసి ఈ మొక్కను భారతదేశంలోకి ప్రవేశపెట్టారు. దీని నిర్మూలన ఒక సమస్యగా మారింది.
* బంగాళాదుంప (కళ్లు), చెరకు, అరటి, అల్లం, డాలియా కొమ్ము భాగాల నుంచి చిన్న చిన్న మొక్కలు ఉద్భవించడం గమనించవచ్చు. పిల్లమొక్కలు ఏర్పడే ప్రదేశాలను జాగ్రత్తగా పరిశీలిస్తే, అవన్నీ కూడా కాండ రూపాంతర భాగాలైన 'కణుపుల' నుంచి ఏర్పడతాయని తెలుస్తుంది.
* బ్రయోఫిల్లం (రణపాల) పత్ర ఉపాంతంలోని నొక్కుల వద్ద అబ్బురపు మొగ్గలు ఉద్భవిస్తాయి. ఈ సామర్థ్యాన్ని ఉపయోగించుకుని తోటలు పెంచే రైతులు ఈ మొక్కలను వాణిజ్యపరంగా వ్యాప్తి చేస్తున్నారు. సిల్లా ఇండికా (కాచుగడ్డ)లో పత్రాల కొనల వద్ద, బెగోనియాలో పత్రాల గాయాల భాగాల నుంచి మొగ్గలు ఏర్పడి శాఖీయ ప్రత్యుత్పత్తిలో పాల్గొంటాయి. వీటిని ప్రత్యుత్పత్తి పత్రాలు అంటారు. శైవలాలు, శిలీంద్రాల లాంటి సరళ నిర్మాణం ఉన్న జీవులు సాధారణ పరిస్థితుల్లో అలైంగిక ప్రత్యుత్పత్తి, అసాధారణ పరిస్థితుల్లో లైంగికోత్పత్తి జరుపుతాయి. ఉన్నతశ్రేణి మొక్కల్లో అలైంగిక (శాఖీయ) ప్రత్యుత్పత్తితోపాటు, లైంగిక ప్రత్యుత్పత్తి కూడా కనిపిస్తుంది.

 

లైంగిక ప్రత్యుత్పత్తి: దీనిలో ఒకేజీవి లేదా విరుద్ధ లింగాలకు చెందిన భిన్నజీవుల్లో స్త్రీ, పురుష సంయోగబీజాలు ఏర్పడతాయి. వీటి కలయిక వల్ల సంయుక్త బీజం ఏర్పడి అది ఒక కొత్త జీవిగా అభివృద్ధి చెందుతుంది. అలైంగిక ప్రత్యుత్పత్తితో పోలిస్తే ఇది సుదీర్ఘ, సంక్లిష్టమైన, నెమ్మదిగా జరిగే ప్రక్రియ. ఏర్పడిన సంతతి అటు జనకుల మాదిరిగా లేదా ఇటు ఒకే విధంగా సమరూపంగా ఉండదు. మొక్కలు, జంతువులు, ప్రోటిస్ట్‌లు, కేంద్రక పూర్వజీవులు, శిలీంద్రాల లాంటి వైవిధ్యభరిత జీవుల బాహ్యస్వరూపం, అంతర్నిర్మాణం, శరీర ధర్మాల్లో ఎంతో భిన్నత్వం ఉన్నప్పటికీ, ఆశ్చర్యంగా లైంగిక ప్రత్యుత్పత్తిలో మాత్రం అన్నీ ఒకే విధానాన్ని అనుసరిస్తున్నాయి.
సారూప్య లక్షణాలు: జీవులు ఎదిగి పక్వస్థితిలో ప్రత్యుత్పత్తి దశ చేరుకునే ముందు దశను మొక్కల్లో 'శాఖీయ దశ' అంటారు. శాఖీయ దశ విభిన్న జీవుల్లో వివిధ కాలవ్యవధులతో కూడి ఉంటుంది. శైశవ దశ/ శాఖీయ దశ అంతం, 'ప్రత్యుత్పత్తి దశ', ప్రారంభంగా పేర్కొనవచ్చు. ఉన్నతశ్రేణి మొక్కల్లో పుష్పాలు ఏర్పడటం ద్వారా గుర్తించవచ్చు.
* పుష్పించడానికి తీసుకునే సమయం వేర్వేరుగా ఉంటుంది. కొన్ని మొక్కల్లో పుష్పోత్పత్తి ఒకసారి కంటే ఎక్కువసార్లు జరుగుతుంది.
* ఏకవార్షిక, ద్వివార్షిక మొక్కలు శాఖీయ, లైంగిక, జీర్ణత దశలను చక్కగా చూపిస్తాయి. కానీ బహువార్షిక మొక్కల్లో ఈ దశలను స్పష్టంగా నిర్వచించడం కష్టం. కాగా కొన్ని మొక్కలు అసాధారణ పుష్పోత్పత్తిని ప్రదర్శిస్తాయి.

ప్రత్యుత్పత్తి దశ వివిధ జీవుల్లో వివిధ కాల పరిమితులతో ఉంటుంది. మొక్కల్లో హార్మోన్లు లైంగిక ప్రత్యుత్పత్తికి కారణమవుతాయి. హార్మోన్లు కొన్ని వాతావరణ పరిస్థితుల మధ్య జరిగే పరస్పర చర్య ప్రత్యుత్పత్తి ప్రక్రియలను దానికి సంబంధించిన వైఖరులను నియంత్రిస్తాయి.
 

లైంగిక ప్రత్యుత్పత్తిలోని సంఘటనలు 

* స్త్రీ, పురుష సంయోగ బీజాల కలయిక (ఫలదీకరణ)  సంయుక్త బీజం  పిండోత్పత్తి అనుకూలత కోసం ఈ వరుస సంఘటనలను మూడు స్పష్టమైన దశలుగా విభజించారు. అవి ఫలదీకరణ పూర్వ, ఫలదీకరణ, ఫలదీకరణానంతర సంఘటనలు. 


ఫలదీకరణ పూర్వ సంఘటనలు 
సంయోగ బీజోత్పత్తి, సంయోగ బీజాల రవాణా.
సంయోగ బీజోత్పత్తి: స్త్రీ, పురుష సంయోగబీజాలు ఏర్పడటం. ఇవి ఏకస్థితిక కణాలు. కొన్ని శైవలాల్లో గుర్తించలేనంతగా ఒకేవిధంగా ఉంటాయి. (సమ సంయోగ బీజాలు) ఉదా: క్లాడోఫోరా. అనేక జీవుల్లో స్వరూపంలో భిన్నంగా ఉంటాయి. (భిన్న సంయోగ బీజాలు) ఉదా: ప్యూకస్. జీవుల్లో ఏర్పడే పురుష సంయోగ బీజాన్ని చలన పురుష బీజం లేదా పురుష బీజం అని, స్త్రీసంయోగ బీజాన్ని, స్త్రీబీజం అని పిలుస్తారు. ఉదా: ఫ్యునేరియా (బ్రయోఫైటా), టెరిస్ (టెరిడోఫైటా), సైకస్ (వివృత బీజం).


జీవుల్లో లైంగికత్వం: రెండు వేర్వేరు జీవుల నుంచి వచ్చే సంయోగ బీజాల కలయిక వల్ల లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. అయితే ఇది ఎల్లప్పుడు నిజంకాదు.  స్త్రీ, పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణాలు రెండు ఒకే మొక్కపై (ద్విలింగక) లేదా వేర్వేరు మొక్కలపై (ఏకలింగక) ఏర్పడవచ్చు.
* ద్విలింగాశ్రయ (శిలీంద్రాలు), ద్విలింగాశ్రయ స్థితి (మొక్కలు) అనే పదాలను ద్విలింగ స్థితిని, ఏకలింగాశ్రయ (శిలీంద్రాలు), ఏకలింగాశ్రయ స్థితి (మొక్కలు) అనే పదాలను ఏకలింగక స్థితిని వర్ణించడంలో ఉపయోగిస్తారు.
* కేసరావళి మాత్రమే ఉన్న ఏకలింగ పుష్పాన్ని 'పురుష పుష్పం' అని, అండకోశం మాత్రమే ఉంటే 'స్త్రీ పుష్పం' అని అంటారు. మరికొన్ని పుష్పించే మొక్కల్లో స్త్రీ, పురుష పుష్పాలు ఒకే మొక్కపై (ద్విలింగాశ్రయ స్థితి - కుకుర్బిటాలు, కొబ్బరి) లేదా వేర్వేరు మొక్కలపై (ఏకలింగాశ్రయ స్థితి - బొప్పాయి, ఖర్జూరం) ఏర్పడతాయి. 

 

సంయోగబీజాలు ఏర్పడే సమయంలో జరిగే కణవిభజన 

ఏకస్థితిక దేహం ఉండేవి:- మొనీరా, శిలీంద్రాలు, శైవలాలు, బ్రయోఫైట్లు. ఇవి సమవిభజన ద్వారా సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తాయి.
ద్వయ స్థితిక దేహం ఉండేవి: టెరిడోఫైట్లు, వివృతబీజాలు, ఆవృత బీజాలు. వీటిలో క్షయకరణ విభజన అంటే మియాసిస్ ద్వారా సంయోగబీజాలు ఉత్పత్తి అవుతాయి. మియోసైట్‌లలో (సంయోగబీజ మాతృకణాలు) క్షయకరణ విభజన జరుగుతుంది. ఫలితంగా ప్రతి సంయోగబీజంలోకి ఒక సమితి క్రోమోజోమ్‌లు మాత్రమే ప్రవేశిస్తాయి. భిన్న సంయోగబీజ జాతుల సంయోగబీజాలు స్త్రీ, పురుష సంయోగబీజాలు అనే రెండు రకాలుగా ఉంటాయి. మొక్కలు ఏకస్థితికాలు, ద్వయస్థితికాలైనప్పటికీ అవి ఉత్పత్తి చేసే సంయోగబీజాలు మాత్రం ఏకస్థితికంగా ఉంటాయి.

 

సంయోగ బీజాల రవాణా
* సంయోగ బీజాలు సంయోగం (ఫలదీకరణ) చెందడానికి అవి దగ్గరగా చేరాలి. చాలా జీవుల్లో పురుష సంయోగబీజం చలనయుతంగా, స్త్రీ సంయోగబీజం స్థిరంగా ఉంటాయి. కానీ కొన్ని శైవలాలు, శిలీంద్రాల్లో రెండు రకాల సంయోగబీజాలు చలనాన్ని చూపిస్తాయి. పురుష సంయోగబీజం రవాణాలో యానకం సహాయపడుతుంది. శైవలాలు, బ్రయోఫైట్లు, టెరిడోఫైట్లలో నీరు ఒక యానకంగా తోడ్పడుతుంది. రవాణాలో జరిగే నష్టాన్ని పూడ్చుకోవడం కోసం స్త్రీ సంయోగబీజాల కంటే, పురుష సంయోగబీజాలు కొన్ని వేల రెట్ల సంఖ్యలో ఉత్పత్తి అవుతాయి. 
* విత్తనయుత మొక్కల్లో పుప్పొడి రేణువులు పురుష బీజాలకు వాహకాలుగా పనిచేస్తాయి. అండం స్త్రీ     బీజకణాన్ని కలిగి ఉంటుంది. ఆత్మ ఫలదీకరణ చెందే మొక్కల్లో పరాగకోశాలు, కీలాగ్రం దగ్గర దగ్గరగా ఉండటం వల్ల (బఠానీ), పుప్పొడి రేణువులు కీలాగ్రాన్ని చాలా తేలికగా చేరతాయి. పరపరాగ సంపర్కం జరిగే మొక్కల్లో,  ఏకలింగాశ్రయ స్థితి చూపే మొక్కల్లో ప్రత్యేక పరిస్థితుల్లో పరాగరేణువులు కీలాగ్రానికి రవాణా అవుతాయి. కీలాగ్రంపై పరాగరేణువులు మొలకెత్తి పరాగ నాళాల ద్వారా అండాన్ని చేరి, స్త్రీబీజ కణం దగ్గర పురుష బీజాలను విడుదల చేస్తాయి.

 

ఫలదీకరణ
* సంయోగబీజాల కలయికనే సంయుక్త సంయోగం అంటారు. దీని ఫలితంగా సంయుక్త బీజం (ద్వయస్థితి 2n)  ఏర్పడుతుంది. ఈ ప్రక్రియనే 'ఫలదీకరణ' అంటారు. కొన్ని సందర్భాల్లో ఫలదీకరణ జరగకుండా పుష్పాల నుంచి ఫలాలు ఏర్పడతాయి. దీనిలో ఫలదీకరణ చెందని స్త్రీ సంయోగబీజం నుంచి పిండం ఏర్పడుతుంది (అనిషేక జననం). నీటిలో నివసించే జీవుల్లో (ఎక్కువగా శైవలాల్లో) సంయుక్త సంయోగం జీవి దేహం బయట, నీటిలో జరుగుతుంది (బాహ్య ఫలదీకరణ).
* అండాలు విత్తనాలుగా, అండాశయం ఫలంగా అభివృద్ధి చెందుతుంది. ఇది రక్షణ కోసం మందమైన కవచాన్ని (ఫలకవచం) ఏర్పరచుకుంటుంది.
* మాంగ్రూవ్ మొక్కల్లో విత్తనాల అంకురణ తల్లి మొక్కకు అంటిపెట్టుకుని ఉండగానే జరుగుతుంది. దీన్ని వివిపారి (శిశూత్పాదన) అంటారు. పరిసరాల ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి ఈ మొక్కలు అవలంభించే ఒక వ్యూహంగా చెప్పవచ్చు.

 

ఆవృత బీజ చక్ర సారాంశం
* పరాగ రేణువులు, అండాలు ప్రత్యేక నిర్మాణాలైన పుష్పాల్లో అభివృద్ధి చెందుతాయి.
* విత్తనాలను కప్పుతూ ఫలాలు ఏర్పడతాయి.
* ఆవృత బీజాల్లో అతి సూక్ష్మమైన ఉల్ఫియా మొక్క నుంచి, అతి పొడవైన యూకలిప్టస్ (100 మీటర్ల పైన) ఉంటాయి.
* కేసరం (పురుష లైంగిక అవయవం), అండకోశం (ఫలదళం) ఉంటాయి.
* అండాల లోపల క్షీణించిన స్త్రీ సంయోగ బీజదం (పిండకోశం) ఉంటుంది. దీనిలో ప్రతికణం ఏకస్థితిలో ఉంటుంది. పిండకోశంలో మూడు కణాలతో కూడిన స్త్రీ బీజ పరికరం, ఒక స్త్రీ బీజకణం, రెండు సహాయ కణాలు, మూడు ప్రతిపాద కణాలు, రెండు ధ్రువకేంద్రకాలు ఉంటాయి. ఈ రెండు ధ్రువ కేంద్రకాలు విలీనమై ఒక ద్వయస్థితిక కేంద్రకం ఏర్పడుతుంది.
* పరాగకోశాలు కీలాగ్రాన్ని చేరతాయి (పరాగ సంపర్కం). పరాగ నాళాలు మొలకెత్తి పరాగ నాళాల ద్వారా అండాన్ని చేరతాయి. పిండకోశంలోకి విడుదలైన రెండు పురుష సంయోగ బీజాల్లో ఒకటి స్త్రీ బీజకణంతో సంయోగం చెంది సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తుంది (సంయుక్త సంయోగం). వేరొక పురుష సంయోగబీజం పిండకోశంలోని ద్వయస్థితిక ద్వితీయ కేంద్రకంతో సంయోగం చెంది ఒక త్రయస్థితిక ప్రాథమిక అంకురచ్ఛద కేంద్రకాన్ని ఏర్పరుస్తుంది. ఇలా రెండు సంయోగాలు జరగడాన్ని 'ద్విఫలదీకరణ' అంటారు. ఇది ఆవృతబీజాల్లో మాత్రమే కనిపిస్తుంది. సంయుక్తబీజం ఒకటి లేదా రెండు బీజదళాలతో పిండంగా, ప్రాథమిక అంకురచ్ఛద కేంద్రకం నుంచి అంకురచ్ఛదం ఏర్పడుతుంది.
* బహుకణయుత, ద్వయ స్థితిక సిద్ధబీజదశ ఆవృత బీజాల జీవిత చక్రంలో ప్రధానమైన దశ. సంయోగ బీజదశ బహుకణయుతమైనప్పటికీ క్షీణించిన నిర్మాణంగా సిద్ధబీజదంపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది.
* ఫలదీకరణ ద్వారా బహుకణయుత సిద్ధబీజం ఏర్పడి, క్షయకరణ విభజన ద్వారా ఏకస్థితిక సిద్ధబీజాలను, తద్వారా కొన్ని కణాలున్న సంయోగబీజాలను ఉత్పత్తి చేస్తుంది (ద్వయ - ఏకస్థితిక జీవిత చక్రం).

Posted Date : 29-07-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌