• facebook
  • twitter
  • whatsapp
  • telegram

పుష్పించే మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి

పరిణామరీత్యా ఆవృత బీజాలు మొక్కలన్నింటిలో అత్యున్నతస్థాయిలో ఉన్నాయి. వృక్షరాజ్యంలో వీటిది అగ్రస్థానం. అందువల్ల ఇది ఆవృత బీజాలయుగం. దేహనిర్మాణం, అభివృద్ధి, ప్రత్యుత్పత్తిలో సంక్లిష్టత చూపే ఈ రకమైన మొక్కల్లో సిద్ధ బీజద దశ, సంయోగ బీజద దశ అనే రెండు దశలు ఏకాంతరంగా ఏర్పడతాయి. పుష్పించే మొక్కల లైంగిక ప్రత్యుత్పత్తిలో సూక్ష్మ, స్థూల సిద్ధబీజ జననం నుంచి విత్తనం ఏర్పడి అంకురించే వరకు జరిగే మార్పులను గమనిస్తే... 
             పిండాన్ని ఏర్పరిచే, స్త్రీ బీజాశయం లేదా ఆర్కిగోనియాలు లేని నాళికా కణజాలయుతమైన, ఫలాలు ఉండే పుష్పించే (బీజయుత) మొక్కలుగా ఆవృత బీజాలను నిర్వచిస్తారు. మొక్కలకు, తద్వారా ప్రకృతికి అందాన్ని కలిగించేవి పుష్పాలు. ఇవి లైంగిక ప్రత్యుత్పత్తి స్థానాలు, పిండోత్పత్తికి శాస్త్రీయ విధానాల్లో తోడ్పడే భాగాలు. పూలరంగులు, అమరికల్లో వైవిధ్యం కనిపిస్తుంది. పూలమొక్కల పెంపకానికి (ఫ్లోరికల్చర్) ఎంతో ఆర్థిక ప్రాముఖ్యం ఉంది. ఆవృత బీజాల్లో జరిగే లైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించిన వాటి స్వభావం, నిర్మాణాలు, అభివృద్ధితోపాటు వాటిలో జరిగే ప్రక్రియల గురించి తెలిపే వృక్షశాస్త్ర శాఖనే 'పిండోత్పత్తి శాస్త్రం' అంటారు.

 

ఫలదీకరణ పూర్వ నిర్మాణాలు, సంఘటనలు
       పుష్పోత్పత్తికి ముందు మొక్కల్లో నిర్మాణాత్మకంగా, హార్మోన్‌ల పరంగా అనేక మార్పులు మొదలై విభేదనం, అభివృద్ధి జరిగి పుష్ప ఆద్యాలు ఏర్పడతాయి. ప్రత్యుత్పత్తి అవయవాలైన కేసరావళి (పురుష), అండకోశం (స్త్రీ) ఏర్పడతాయి.

కేసరం, సూక్ష్మసిద్ధ బీజాశయం, పరాగరేణువులు
 కేసరావళిలో ఒక వలయంగా ఉండే భాగాలను కేసరాలు అంటారు. కేసరంలో పొడవైన కాడలాంటి భాగాన్ని కేసర దండం, అగ్రంలో సాధారణంగా ద్విలంబికంగా ఉండే నిర్మాణాన్ని పరాగకోశం అని అంటారు. వివిధ జాతుల పుష్పాల్లో కేసరాలు వాటి సంఖ్య, పొడవులో వైవిధ్యం ఉంటుంది.

  
* ఒక నమూనా ఆవృతబీజ పరాగకోశం ద్విలంబికంగా ఉండి, ప్రతిలంబికలో రెండు తమ్మెలు (సంచులు) ఉంటాయి. వాటిని ద్వికక్షియుత పరాగకోశాలు అంటారు. ఉదా: హైబిస్కస్ (మందార)
ఒక తమ్మె మాత్రమే ఉండే పరాగకోశాన్ని ఏక కక్షియుత పరాగకోశం అంటారు.
* పరాగ కోశం నాలుగు పార్శ్వాల నిర్మాణంగా ఉంటుంది. దీని అంచుల వద్ద నాలుగు సూక్ష్మ సిద్ధబీజాశయాలు ఉంటాయి. ఇవి ప్రతి లంబికలో రెండు చొప్పున ఉంటాయి. సిద్ధబీజాశయాలు అభివృద్ధిచెంది పుప్పొడి కోశాలు (సంచులు/ గదులు)గా ఏర్పడతాయి. ఇవి పరాగకోశం తలంలో పరాగరేణువులతో నిండి ఉంటాయి. 

 

సూక్ష్మ సిద్ధబీజాశయ నిర్మాణం: సూక్ష్మసిద్ధ బీజాశయం అనేది బాహ్యచర్మం, ఎండోథీసియం, మధ్య వరుసలు, టపెటమ్ అనే నాలుగు పొరలతో కప్పి ఉంటుంది. మొదటి మూడు కుడ్యపొరలు రక్షణకు తోడ్పడతాయి. పుప్పొడి విడుదల కోసం జరిగే పరాగకోశ స్ఫోటానికి సహాయపడతాయి.
టపెటమ్ పొర అన్నింటి కంటే లోపల ఉంటుంది. ఇది అభివృద్ధి చెందుతున్న పరాగరేణువులకు పోషక పదార్థాలను సరాఫరా చేస్తుంది.
* లేత పరాగకోశంలో దగ్గరగా అమరి ఉండే సమజాతీయ కణాల సమూహాన్ని 'సిద్ధబీజ జనక కణజాలం' అంటారు.

 

సూక్ష్మసిద్ధబీజ జననం: (Microsporogenesis)
* సూక్ష్మ సిద్ధబీజ జనక కణజాలం క్షయకరణ విభజనల ద్వారా సూక్ష్మ సిద్ధబీజ చతుష్కాలను ఏర్పరిచే ప్రక్రియను 'సూక్ష్మసిద్ధబీజ జననం' అంటారు.
* పరాగకోశం పక్వదశకు చేరుకుని నీటిని కోల్పోయే సమయానికి ఈ సూక్ష్మ సిద్ధబీజాలు విడిపోయి పరాగరేణువులుగా అభివృద్ధి చెందుతాయి.
* ప్రతి సూక్ష్మ సిద్ధబీజాశయం లోపల కొన్ని వేల సూక్ష్మ సిద్ధబీజాలు (పరాగ రేణువులు) ఏర్పడతాయి. ఇవి పరాగకోశ స్ఫోటంతో విడుదలవుతాయి. 

 

పరాగరేణువు (Pollen grain) 
* పరాగరేణువులను పురుష సంయోగబీజదాలు అంటారు. ఇవి సాధారణంగా గోళాకారంలో ఉంటాయి. 
 పరాగరేణువు రెండు పొరల గోడతో ఉంటుంది. 'స్పోరోపొలెనిన్‌'తో ఏర్పడిన పొరను బాహ్యసిద్ధ బీజకవచమని, దీంట్లో అక్కడక్కడ ఉండే రంధ్రాలను బీజరంధ్రాలంటారు.
* స్పోరోపొలెనిన్ కారణంగా పరాగరేణువులు శిలాజాలుగా భద్రపరచబడతాయి

* పరాగరేణువుల గోడలోని లోపలి పొరను 'అంతర సిద్ధ బీజకవచం' అని అంటారు. ఇది పలచగా, అవిచ్ఛిన్నంగా ఉండి సెల్యులోజ్, పెక్టిన్‌లతో నిర్మితమవుతుంది.

                   
* పుప్పొడి రేణువులు కొన్ని నిమిషాల (ఉదా: వరి, గోధుమ-30 నిమిషాలు) నుంచి కొన్ని నెలల (ఉదా. రోజేసి, లెగ్యూమినేసి లోని కొన్ని మొక్కలు) వరకు మొలకెత్తే శక్తిని కలిగి ఉంటాయి.

పుప్పొడి ఆర్థిక ప్రాముఖ్యం: 
* అనేక మొక్కల పరాగరేణువులు తీవ్రమైన ఎలర్జీలు, శ్వాసకోశ బాధలు కలిగిస్తూ ఉబ్బసం, బ్రాన్‌కైటిస్‌కు కారణం అవుతాయి.
ఉదా: పార్థీనియమ్  
* పుప్పొడి రేణువుల్లో మంచి పోషకాలు ఉంటాయి. వీటి మాత్రలను ఆహార అనుబంధంగా ఉపయోగిస్తున్నారు. పుప్పొడి మార్కెట్‌లో మాత్రలు, సిరప్‌ల రూపంలో లభ్యమవుతుంది. 
* పుప్పొడిని ఉపయోగించడం వల్ల క్రీడాకారులు, రేసు గుర్రాల ప్రదర్శన శక్తి పెరుగుతున్నట్లు చెబుతున్నారు. 
* పుప్పొడి మొలకెత్తే శక్తి ఉప్ణోగ్రత, గాలిలో ఉండే తేమపై ఆధారపడి ఉంటుంది.
ఉదా: వరి, గోధుమ మొక్కల్లో 30 నిమిషాలు; రోజేసి, సోలనేసి, లెగ్యూమినేసి మొక్కల పరాగరేణువులు కొన్ని నెలల్లో మొలకెత్తే శక్తిని కలిగి ఉంటాయి. 
* పుప్పొడిని పుప్పొడి బ్యాంక్‌ల్లో ద్రవనత్రజని (-196ºC) లో కొన్ని సంవత్సరాల వరకు భద్రపరచి మొక్కల ప్రజనన కార్యక్రమాల్లో ఉపయోగించవచ్చు.

అండకోశం, స్థూల సిద్థబీజాశయం (అండం), పిండకోశం: అండకోశం, పుష్పంలోని స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం. ఒకటి లేదా ఎక్కువ ఫలదళాలతో ఉంటుంది. ఇందులో కీలాగ్రం, కీలం, అండాశయం అనే మూడు భాగాలు ఉంటాయి. అండాశయం లోపలి కుహరంలో (అండాశయ బిలం) అండన్యాసస్థానం నుంచి ఏర్పడే స్థూలసిద్ధ బీజాశయాలను 'అండాలు' అంటారు.

స్థూల సిద్ధబీజాశయం (అండం): స్థూల సిద్ధబీజాశయంలో అండవృంతం, విత్తుచార, అండ కవచాలు, అండద్వారం, ఛలాజా, అండాంతః కణజాలం, పిండకోశం ఉంటాయి. పాలీగోనమ్‌లో అండద్వారం, ఛలాజా, అండ వృంతం ఒకే నిలువురేఖపై నిటారుగా ఉండే అమరికను 'నిర్వక్ర అండం' అంటారు.
సూర్యకాంతం కుటుంబ (ఆస్టరేసి) మొక్కల్లో అండాలు తలకిందులుగా ఉంటాయి. ఈ అమరికను 'వక్ర అండం' అంటారు. చిక్కుడు కుటుంబం (ఫాబేసి)లో అండదేహం అండవృంతానికి లంబకోణంలో ఉంటుంది. అండదేహం వంపు తిరగడంతో అండద్వారం అండవృంతం వైపు వస్తుంది. దీంట్లో పిండకోశం కొద్దిగా వంపుతిరిగి ఉంటుంది.వీటిని 'కాంపైలోట్రోపస్ అండాలు' అంటారు.


 

స్థూల సిద్ధబీజ జననం (Megasporogenesis), స్త్రీ సంయోగబీజదం (Female gametophyte)
* ద్వయస్థితిక స్థూల సిద్ధబీజ మాతృకణం క్షయకరణ విభజన చెంది నాలుగు ఏకస్థితిక స్థూల సిద్ధబీజాలు ఏర్పడే ప్రక్రియను 'స్థూల సిద్ధబీజ జననం' అంటారు. స్థూల సిద్ధబీజంలోని కేంద్రకం, స్వేచ్ఛా విభజనలకు లోనై ఎనిమిది కేంద్రకాల దశలో నిలువుగా అభివృద్ధి చెందిన, క్రియావంతమైన స్థూలసిద్ధబీజాన్ని 'పిండకోశం' లేదా 'స్త్రీ సంయోగ బీజదం' అంటారు. పిండకోశంలో ప్రధానంగా మూడు భాగాలుంటాయి.
      అవి: 1) స్త్రీ బీజకణ పరికరం (3 కేంద్రకాలు)
              2) ప్రతిపాదకణాలు (3 కణాలు)     3) కేంద్రకణం (పెద్దకణం)

 

పరాగ సంపర్కం: పరాగకోశం నుంచి విడుదలైన పరాగ రేణువులు అండకోశంలో కీలాగ్రాన్ని చేరడాన్ని 
         'పరాగసంపర్కం' అంటారు. పరాగరేణువుల మూలం ఆధారంగా పరాగ సంపర్కం 3 రకాలు అవి:
         1) స్వయం సంయోగం (Autogamy) 
         2) ఏకవృక్ష పరాగసంపర్కం(Geitonogamy)
         3) భిన్నవృక్ష పరాగసంపర్కం (Genogamy)
1)  స్వయం సంయోగం (Autogamy): ఒక పుష్పంలోని పరాగ కోశాల్లో ఉండే పరాగరేణువులు అదే
         పుష్పంలోని కీలాగ్రం మీద పడటాన్ని స్వయం సంయోగం లేదా ఆత్మ ఫలదీకరణం అంటారు. 
* వివృత సంయోగ పుష్పాలు: పుష్పాలు వికసించి కేసరాలను, కీలాగ్రాన్ని బహిర్గతం చేస్తాయి.
*  సంవృత సంయోగ పుష్పాలు: ఎప్పుడూ వికసించని పుష్పాలు.

 

2)  ఏకవృక్ష పరాగసంపర్కం (Geitonogamy): ఒక పుష్పంలోని పరాగకోశాల్లో ఉండే పరాగరేణువులు అదే మొక్కపై ఉన్న వేరొక పుష్ప కీలాగ్రాన్ని చేరడాన్ని 'ఏకవృక్ష పరాగసంపర్కం' అంటారు.
 

3)  భిన్నవృక్ష పరాగసంపర్కం (Xenogamy): ఒక మొక్కలోని పరాగరేణువులు వేరొక మొక్కపై ఉండే పుష్ప కీలాగ్రాన్ని చేరడాన్ని భిన్నవృక్ష పరాగసంపర్కం అంటారు.
 

పరాగసంపర్కానికి తోడ్పడే సహకారులు (Agents of Pollination)
* మొక్కల్లో పరాగసంపర్కం జరగడానికి గాలి, నీరు, జంతువులు సహకరిస్తాయి.
* వాయు పరాగసంపర్కం అనేది సర్వసాధారణ ప్రక్రియ. ఈ విధానంపై ఆధారపడే మొక్కల్లో పుష్పనిర్మాణం అందుకు తగినట్లుగా ఉంటుంది. ఉదా: మొక్కజొన్న, గడ్డిమొక్కలు
* జల పరాగసంపర్కం అనేది చాలా అరుదుగా 30 ప్రజాతుల్లో ఎక్కువగా ఏకదళ బీజాల్లో కనిపిస్తుంది.
ఉదా: వాలిస్‌నేరియా, హైడ్రిల్లా, జోస్టరా
* పరాగసంపర్కం నీటి పైభాగంలో జరిగితే 'ఊర్ధ్వజల పరాగసంపర్కం(గుర్రపు డెక్క)', నీటిలోపల జరిగితే 'అధోఃజల పరాగసంపర్కం (జోస్టెరా)' అంటారు.
* పుష్పించే మొక్కలు ఎక్కువగా జంతువులను పరాగసంపర్క సహకారులుగా ఉపయోగించుకుంటాయి. ఈ ప్రక్రియను జంతు పరాగసంపర్కం అంటారు.
* కీటక పరాగసంపర్క ఉదాహరణలు: తేనెటీగలు, సీతాకోకచిలుకలు, కందిరీగలు, చీమలు, ఈగలు, బీటల్స్, పట్టుపురుగులు.

* పక్షి పరాగసంపర్కం: సన్‌బర్డ్స్, తీతువుపిట్టలు. 
* కీరోప్టిరీఫెలీ - గబ్బిలాలు; ఒఫియోఫెలీ - పాములు, తెరోఫెరీ - ఉడతలు, రోడెంట్లు, తొండలు లాంటివి పరాగ సంపర్కులుగా తోడ్పడతాయి.
* జంతు పరాగసంపర్కానికి చెందే మొక్కల్లోని పుష్పాలు, అందుకు ప్రత్యేకమైన అనుకూలనాలను, ముఖ్యంగా ఒకరకమైన జంతుజాతికి సంబంధించేట్లుగా చూపుతాయి. (పెద్దపుష్పాలు, ఆకర్షణీయమైన రంగులు , సువాసన, మకరందం, పుష్పవిన్యాసాలు, పుప్పొడి, గుడ్లుపెట్టడానికి అనుకూలంగా ఉండటం లాంటివి)

 

బాహ్య ప్రజనన యంత్రాంగాలు
* ఆత్మపరాగసంపర్కం అంతఃప్రజనన క్షీణతకు దారితీస్తుంది. అందువల్ల మొక్కలు అనేక యంత్రాంగాలు లేదా అనుకూల పద్ధతులను ఏర్పరచుకుని పరపరాగసంపర్కానికి వీలు కల్పిస్తాయి. అవి:
* భిన్నకాలిక పక్వత
       ఎ) పుంభాగ ప్రథమోత్పత్తి- సూర్యకాంతం 
      బి) స్త్రీభాగ ప్రథమోత్పత్తి - సొలానమ్, హెర్కోగమి - గ్లోరియోసా
* భిన్నకీలత 
     ఎ) ద్విభిన్నకీలత - ప్రిమ్యులా
     బి) త్రిభిన్నకీలత - లైథ్రమ్

ఆత్మ వంధ్యత్వం లేదా స్వయం విరుద్ధం - అబుటిలాన్
ఏకలింగత్వం - వాలిస్‌నేరియా, ద్విలింగాశ్రయస్థితి - ఆముదం, పుప్పొడి పూర్వశక్మత - డాలికస్, సూక్ష్మ గ్రాహ్యకీలాలు - మార్టీనియా. 
* బొప్పాయి లాంటి అనేక జాతుల్లో పురుష, స్త్రీ పుష్పాలు వేర్వేరు మొక్కలపై ఏర్పడతాయి (స్త్రీ మొక్క, పురుష మొక్క). దీన్ని ఏకలింగాశ్రయస్థితి అంటారు. ఇది ఆత్మ పరాగసంపర్కాన్ని, ఏకవృక్ష పరపరాగసంపర్కాన్ని నిరోధిస్తుంది.

 

పుప్పొడి - అండకోశాల పరస్పర చర్య (Pollen - Pistil interaction)
* కీలాగ్రానికి అవిరుద్ధ, విరుద్ధ పుప్పొడులను గుర్తించే లక్షణం ఉంటుంది.
* సరైన పుప్పొడి (ఒకేజాతికి చెందిన) అయితే అండకోశం పరాగరేణువును స్వీకరించి, పరాగసంపర్కం తర్వాత ఫలదీకరణానికి ముందు జరిగే ప్రక్రియలను ప్రోత్సహిస్తుంది.
* విరుద్ధ పుప్పొడి మొలకెత్తడాన్ని నిరోధిస్తుంది. పుప్పొడి స్వీకరణ లేదా తిరస్కరణ అనేది పరాగరేణువు - అండకోశాల మధ్య వరసగా జరిగే పరస్పర చర్య (రసాయనిక పదార్థాల మధ్య) ఫలితంపైనే ఆధారపడి ఉంటుంది.
* పరాగరేణువు మొలకెత్తి పరాగనాళాన్ని బీజరంధ్రం ద్వారా ఉత్పత్తి చేస్తుంది. అది కీలం ద్వారా చలిస్తూ అండాశయం చేరుతుంది. ఇది 3 రకాలు. అండద్వారం ద్వారా (రంధ్ర సంయోగం), ఛలాజా ద్వారా (ఛలజో సంయోగం), అండ కవచాల ద్వారా (మధ్య సంయోగం) ప్రవేశిస్తుంది.
* పరాగరేణువులు కీలాగ్రంపై చేరినప్పటి నుంచి పరాగనాళం అండంలోకి ప్రవేశించే వరకు జరిగే చర్యలన్నింటిని కలిపి 'పుప్పొడి-అండకోశాల పరస్పర చర్య'గా వ్యవహరిస్తారు.

 

కృత్రిమ సంకరణం (Artificial hybridisation)
* సస్యాభివృద్ధికి ఇది ఒక ప్రధాన ప్రక్రియా విధానం. సంకరణ ప్రయోగాల్లో, అవసరంలేని పరాగరేణువులు కీలాగ్రం చేరకుండా విపుంసీకరణ (తల్లి మొక్కలతో పరాగకోశాలను తొలగించడం), బాగింగ్ (బట్టర్ పేపర్ సంచులతో కప్పడం) సాంకేతిక విధానాన్ని పాటిస్తారు.
* ఆ తర్వాత ఎంపికచేసిన మొక్క నుంచి పరాగరేణువులు తీసుకుని, కీలాగ్రాన్ని చేర్చి తిరిగి సంచులతో కప్పి ఫలాల అభివృద్ధికి వదిలేస్తారు.

 

ద్విఫలదీకరణ (Double Fertilisation)

 

ద్విఫలదీకరణ (త్రిసంయోగం)

ఫలదీకరణ అనంతర నిర్మాణాలు - సంఘటనలు (Post Fertilisation Structures and Events)
ద్విఫలదీకరణం తర్వాత అంకురచ్ఛదం, పిండం అభివృద్ధి చెందడం, అండం - విత్తనంగా పరిపక్వం చెందడం, అండాశయం ఫలంగా మారడం అనే వాటిని ఫలదీకరణ అనంతరం జరిగే సంఘటనలుగా పేర్కొంటారు. దానివల్ల అనుబంధ అంగాలు, కేసరాలు, కీలం వడలిపోతాయి.

 

అంకురచ్ఛదం (Endosperm)
* అంకురచ్ఛదంలోని కణాలు ఆహార నిల్వలతో నిండి ఉండి అభివృద్ధి చెందుతున్న పిండపోషణకు ఉపయోగపడతాయి.
* విత్తనం పరిపక్వం చెందే ముందే అభివృద్ధి చెందుతున్న పిండం (బఠానీ, చిక్కుడు) అంకురచ్ఛదాన్ని పూర్తిగా వినియోగించుకోవచ్చు (అంకురచ్ఛద రహిత విత్తనాలు) లేదా కొంత అంకురచ్ఛదం (అంకురచ్ఛద సహిత విత్తనాలు) మిగిలి ఉండవచ్చు.
ఉదా: ఆముదం, కొబ్బరి
విత్తనాలు మొలకెత్తే సమయంలో మిగిలిన అంకురచ్ఛదాన్ని వినియోగించుకుంటాయి.

 

పిండం (Embryo)
* విత్తనాల్లో వైవిధ్యం ఉన్నప్పటికీ ప్రారంభ దశల్లోని పిండాభివృద్ధి ఏకదళ, ద్విదళ బీజాల్లో ఒకేవిధంగా ఉంటుంది.

* సంయుక్త బీజం ప్రథమ పిండంగామారి, క్రమంగా గోళాకార, హృదయాకార, పక్వపిండంగా అభివృద్ధి చెందుతుంది.
* ఒక నమూనా ద్విదళ బీజపిండంలో ఒక పిండాక్షం, రెండు బీజదళాలు ఉంటాయి. బీజదళాలు కండ కలిగి, పూర్తిగా ఆహారంతో నిల్వ ఉంటాయి.
* బీజ దళాలకు పైభాగాన ఉన్న పిండాక్షాన్ని ఉపరిబీజదళం అంటారు. ఇది ప్రథమకాండం లేదా కాండం కొనతో అంతమవుతుంది. బీజదళాలకు కిందగా ఉండే స్థూపాకార భాగాన్ని అధోబీజదళం అంటారు. దీని కింది భాగంలో ప్రథమ మూలం లేదా వేరుకొన ఉంటుంది. వేరుకొన వేరు తొడుగుతో కప్పి ఉంటుంది.
* ఏకదళ బీజ పిండం ఒకే బీజదళంతో ఉంటుంది. గడ్డిజాతి మొక్కల బీజదళాన్ని, 'స్కూటెల్లమ్' అంటారు. ఇది పిండాక్షానికి ఒక పక్కగా ఉంటుంది. దీని కింది భాగంలో ప్రథమ మూలం ఉంటుంది. వేరు తొడుగు కప్పుతూ ఉండే విభేదనం చూపని పొరను 'మూలంకుర కంచుకం' అంటారు. దీనిలోని ఒక ప్రకాండపు మొగ్గ కొన్ని పత్ర ఆద్యాలను కప్పుతూ బోలుగా ఉండే పత్రం లాంటి నిర్మాణ భాగాన్ని 'ప్రాంకుర కంచుకం' అంటారు. అంకురచ్ఛదం వెలుపలి పొర ప్రోటీన్లతో నిర్మితమై ఉండి, అంకురచ్ఛదాన్ని పిండం నుంచి వేరు చేస్తుంది (అల్యురాన్ పొర).
* మిరియాలు లాంటి వాటిలో కొంత అండాంతః కణజాలం మిగిలి ఉంటుంది. దీన్ని 'పరిచ్ఛదం' అంటారు.

 

ద్విదళ బీజవిత్తనం
          విత్తనాన్ని ఆవరించి బీజకవచం ఉంటుంది. దీనిలో రెండు పొరలు వెలుపలి టెస్టా (బాహ్య బీజ కవచం), లోపల టెగ్మన్ (అంతర బీజ కవచం) ఉంటాయి. దీనిపై విత్తుచార, దానిపైన బీజద్వారం ఉంటుంది. బీజకవచంలోపల పిండంతో పాటు పిండాక్షం, రెండు బీజదళాలు, ఆహార పదార్థాలతో నిండి ఉంటాయి. పిండాక్షం రెండు కొనల్లో ఒకవైపు ప్రథమ మూలం, మరోవైపు ప్రథమ కాండం ఉంటాయి. ఆముదంలో అంకురచ్ఛదం ఆహారాన్ని (అంకురచ్ఛద సహిత విత్తనం) నిల్వచేస్తుంది. చిక్కుడు, శనగ, బఠానీల్లో మొక్క పరిపక్వ విత్తనాల్లో అంకురచ్ఛదం ఉండదు. (అంకురచ్ఛద రహిత విత్తనాలు)

 

ఏకదళ బీజవిత్తనం
          ఇది సాధారణంగా అంకురచ్చదయుతం (ఆహారనిల్వ). కొన్ని ఆర్కిడ్‌లలో అంకురచ్ఛద రహితం. అంకురచ్ఛదాన్ని ఆవరించి ఉండే వెలుపలిపొర ప్రోటీన్లతో నిర్మితమై ఉంటుంది (అల్యురాన్ పొర). పిండం చిన్నదిగా, అంకురచ్ఛదానికి ఒకవైపు ఉండే గాడిలో ఇమిడి ఉంటుంది. పిండంలో పెద్దదిగా డాలు ఆకారంతో ఉండే ఒకే బీజదళం (స్కూటెల్లమ్) ఉంటుంది. దీంతోపాటు హ్రస్వఅక్షం- ప్రథమమూలం, ప్రథమం కాండంతో ఉంటుంది. ప్రథమం కాండాన్ని ఆవరించి ప్రాంకుర కంచుకం, ప్రథమ మూలాన్ని ఆవరించి మూలాంకుర కంచుకం అనే తొడుగులు ఉంటాయి.

 

ఫలం, విత్తనాల ప్రాముఖ్యం
* ఫలదీకరణ తర్వాత అండాశయం బాగా ఆహార పదార్థాలను సేకరించి 'ఫలం'గా మారుతుంది. ఫలదీకరణ చెందిన అండాలు 'విత్తనాలు'గా, అండకవచాలు బీజకవచాలుగా మారతాయి. బీజద్వారం చిన్న రంధ్రంగా ఉండి, విత్తన అంకురణ సమయంలో ఆక్సిజన్, నీరులోనికి ప్రవేశించేందుకు అనుకూలంగా ఉంటుంది. విత్తనంలో నీటిశాతం తగ్గి, సాధారణ జీవక్రియలు మందగిస్తాయి. దీంతో పిండం అచేతనావస్థ (సుప్తావస్థ)లోకి వెళుతుంది. తగిన అనుకూల పరిస్థితుల్లో (తేమ, ఆక్సిజన్, ఉష్ణోగ్రత) విత్తనాలు అంకురిస్తాయి.
* విత్తన వ్యాప్తికోసం అనేక ప్రత్యేక యాంత్రికాలు అనుసరిస్తాయి. విత్తనాల వ్యాప్తికి తోడ్పడే విధంగా ఫలం అనుకూలనాలను పొందుతుంది. 
ఉదా: నీటిపై తేలడం (కొబ్బరికాయ), జంతువుల శరీర రోమాలను అంటిపెట్టుకోవడం (తేలుకొండికాయ), పక్షులు తిన్నాక విత్తన కవచం మృదువుగా మారడం (జామ, మర్రి), ఫలాలు జంతువులను ఆకర్షించి వాటికి ఆహారాన్ని సమకూర్చడం ద్వారా విత్తన వ్యాప్తికి దోహదం చేస్తాయి.

* పరిపక్వ విత్తనాల పరిమాణంలో చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఆర్కిడ్ విత్తనాలు సూక్ష్మంగా ఉండి ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి అవుతాయి. ప్రతి విత్తనం 85 మై.మీ. ఉండి, 0.81 మై.గ్రా. బరువుంటుంది. లోడిసియా మాల్డీవికా (డబుల్ కోకోనట్)లో అతిపెద్ద విత్తనం ఉంటుంది. ఇది 30 సెం.మీ. పొడవు ఉండి, 90 సెం.మీ. చుట్టుకొలతతో 18 కిలోల బరువుంటుంది.
* విత్తనోత్పత్తి ఆవృతబీజాలకు ఎన్నో లాభాలను చేకూరుస్తుంది. 
* పరాగ సంపర్కం, ఫలదీకరణ నీటితో సంబంధం లేకుండా జరుగుతాయి. 
* విత్తనాల వ్యాప్తికి ప్రత్యేక అనుకూలనాలను మొక్కలు ఏర్పరచుకున్నాయి. 
* గట్టి బీజకవచం లేత పిండానికి రక్షణనిస్తుంది. 
* విత్తనాల్లో ఆహారం నిల్వలు ఉండటం వల్ల నారుమొక్కలకు పోషణ లభిస్తుంది.
* కొత్త జన్యు సంయోజనాలు ఉత్పత్తి అయి, వైవిధ్యాలు ఏర్పడతాయి.
* విత్తనాలపైనే మన వ్యవసాయం ఆధారపడి ఉంది. విత్తనాల నిల్వలో నిర్జలీకరణం, సుప్తావస్థ అనేవి చాలా ముఖ్యమైనవి.
* విత్తనాలకు మొలకెత్తేశక్తి కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాలు (వందల ఏళ్లు) ఉంటుంది.

 

అద్భుతమైన మొలకెత్తే శక్తి
ఆర్కిటిక్ టండ్రా తవ్వకాల్లో చాలా పురాతనమైన లుసినస్ ఆర్కాటికస్ (లూపైన్) మొక్క విత్తనం లభించింది. దాదాపుగా 10,000 ఏళ్ల సుప్తావస్థదశ తర్వాత ఈ విత్తనం మొలకెత్తి పుష్పాలను ఉత్పత్తి చేసింది. ఈ మధ్యకాలంలో మొలకెత్తే శక్తి ఉన్న 2000 సంవత్సరాల పూర్వపు ఖర్జూర మొక్క (ఫీనిక్స్ డాక్టిలిఫెరా) విత్తనాన్ని డెడ్‌సీ దగ్గరలోని కింగ్ హెరాడ్ భవనం వద్ద జరిపిన పురావస్తు శాస్త్ర తవ్వకాల్లో కనుక్కున్నారు.  

 

అసంయోగ జననం, అనిషేకఫలనం, బహుపిండత (Apomixis, Partheno Carpy and Polyembryony)
* ఫలదీకరణ లేకుండా విత్తనాలను ఏర్పరచడాన్ని 'అసంయోగ జననం' అంటారు.
 ఉదా: ఆస్టరేసిలోని కొన్ని జాతులు, గడ్డి జాతులు.
* ఫలదీకరణం జరగకుండా పుష్పంలోని అండాశయం నుంచి ఫలం ఏర్పడటాన్ని 'అనిషేకఫలనం' అంటారు. అనిషేక ఫలాల్లో విత్తనాలు ఉండవు.
ఉదా: ద్రాక్ష, అరటి
అనిషేక ఫలనం సహజ లేదా ప్రేరితమై ఉంటుంది.
* అసంయోగ జననం అనేది లైంగిక ప్రత్యుత్పత్తిని పోలిన అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం.
* సిట్రస్, మామిడిజాతి మొక్కల్లో పిండకోశం చుట్టూ ఉన్న కొన్ని అండాంతః కణజాల కణాలు విభజన చెంది, పిండకోశంలోనికి చొచ్చుకొనిపోయి, పిండాలుగా అభివృద్ధి చెందుతాయి. ఈ జాతుల్లో ప్రతి అండంలోనూ అనేక పిండాలు ఉంటాయి (బహుపిండత).
* సంకరాలు హరిత విప్లవంలో తోడ్పడ్డాయి. సంకరాలను అసంయోగ జననాలుగా మార్చడం వల్ల, సంతతిలో వృధక్కరణ జరగదు. సంకర విత్తనాలను ఉపయోగిస్తూ ప్రతి ఏడాది కొత్త పంట పొందవచ్చు. కొనాల్సిన అవసరం ఉండదు.

Posted Date : 29-07-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌