• facebook
  • twitter
  • whatsapp
  • telegram

పుష్పించే మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి

ప్రశ్న‌లు - జ‌వాబులు

 అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు 

1. బీజదళాలు, అండాంతః కణజాలం నిర్వహించే ఉమ్మడి విధులను పేర్కొనండి.

జ: ఆహార పదార్థాల నిల్వ: విత్తనంలో బీజదళాలు; అండంలో అండాంతః కణజాలం

పోషణ: బీజదళాలు పిండం పోషణ; అండాంతః కణజాలం; పిండకోశం పోషణ

2. అండకోశంలోని ఏ భాగాలు ఫలాలు, విత్తనాలుగా అభివృద్ధి చెందుతాయి?

జ: * ఫలదీకరణ తర్వాత అండకోశంలోని అండాశయం, ఫలంగా వృద్ధి చెందుతుంది. 

     * ఫలదీకరణ చెందిన తర్వాత అండాలు, విత్తనాలుగా అభివృద్ధి చెందుతాయి.

3. బహుపిండతలో, ఒక పిండం సహాయ కణాల నుంచి , మరొకటి అండాంతః కణజాలం నుంచి ఏర్పడితే, దీనిలో ఏది ఏకస్థితికం, ఏది ద్వయస్థితికం?

జ: సహాయ కణాలనుంచి ఏర్పడితే ఆ పిండం ఏకస్థితికం. అండాశయం నుంచి ఏర్పడే పిండం ద్వయస్థితికం.

4. మూడు కణాల దశలో విడుదలయ్యే పరాగరేణువులో కనిపించే మూడు కణాలు ఏవి?

జ: ఒక శాకీయ కణం, రెండు పురుష సంయోగబీజాలు.

5. స్వయం విరుద్ధత అంటే ఏమిటి?

జ: ఒక పుష్పంలోని పరాగరేణువులు, అదే పుష్పంలోని కీలాగ్రంపై మొలకెత్తలేని స్థితి లేదా కీలంలో పరాగనాళం పెరుగుదల నిరోధించబడే స్థితినే స్వయం విరుద్ధత అంటారు.
 

6. ఒక ఫలదీకరణం చెందిన అండంలో త్రయస్థితిక కణజాలంఏది? ఈ త్రయస్థితిక స్థితి అనేది ఏ విధంగా సాధ్యపడింది?

జ: అంకురచ్ఛదం (3n) . ఇది ఒక పురుషసంయోగబీజం (n), పిండకోశంలోని రెండు ధ్రువ కేంద్రాలున్న కేంద్రకణం (2n) లో త్రిసంయోగం చెందడంవల్ల ఏర్పడుతుంది.
 

7. ఆత్మ పరాగ సంపర్కం నివారణకు పుష్పాలు ఏర్పరచుకున్న రెండు ముఖ్యమైన అనుకూలన విధానాలు తెలపండి.

జ: 1. ఏకలింగత్వం: ఏకలింగక పుష్పాలు ఉత్పత్తి కావడం 

     2. భిన్నకాలిక పక్వత: కొన్ని ద్విలింగక పుష్పాలున్న జాతుల్లో పుప్పొడి విడుదల, కీలాగ్రం దాన్ని స్వీకరించడం వేర్వేరు కాలాల్లో జరుగుతుంది.
 

8. ఫలదీకరణ చెందిన అండంలో సంయుక్త బీజం ఎందువల్ల కొంతకాలం సుప్తావస్థ స్థితిలో ఉంటుంది?

జ: అభివృద్ధి చెందే పిండానికి పోషణ కోసం కొంత అంకురచ్ఛదం ఏర్పడేంత వరకు సంయుక్తబీజం, సుప్తావస్థ స్థితిలో ఉంటుంది. సంయుక్త బీజంలోని ఈ సుప్తావస్థ అభివృద్ధి చెందే పిండానికి పోషణ కోసం ఏర్పరచుకున్న ఒక అనుకూలనం.

9. వృద్ధికారక పదార్థాల్ని ఉపయోగించి ప్రేరిత అనిషేక ఫలనాన్ని ప్రోత్సహిస్తే, మీరు ఏ ఫలాలను ప్రేరిత అనిషేక ఫలనం కోసం ఎంచుకుంటారు? ఎందువల్ల?

జ: వృద్ధికారక పదార్థాలను ఉపయోగించి విత్తనరహిత ఫలాలను వాణిజ్యపరంగా అభివృద్ధి చేయవచ్చు. ఫలకవచం తినే భాగంగా ఉండి, విత్తనాలు లేనివిగా ఉండే కండగల ఫలాలను ఎంచుకుంటాను.

ఉదా: ద్రాక్ష, అరటి.

స్వల్ప సమాధాన ప్రశ్నలు 

1. ఆత్మపరాగ సంపర్కం (ఆత్మ ఫలదీకరణ) నిరోధించడానికి ఒక వికసించే ద్విలింగ పుష్పం ఏర్పరచుకున్న అనుకూలనాల్లో మూడింటిని రాయండి.

జ: 1. భిన్నకాలిక పక్వత: కొన్ని జాతుల్లో పుప్పొడి విడుదల, కీలాగ్రం దాన్ని స్వీకరించడం సమకాలికంగా

           ఉండదు. సూర్యకాంతం మొక్కలో కీలాగ్రం పక్వదశకు చేరకముందే పుప్పొడి విడుదలకావడం

           (పుంభాగ ప్రథమోత్పత్తి) లేదా దతూరలో కీలాగ్రం పక్వదశకు చేరినా పుప్పొడి విడుదల కాకపోవడం

           (స్త్రీభాగ ప్రథమోత్పత్తి) జరుగుతుంది. 

     2. హెర్కోగమి: ఒక పుష్పంలోని పరాగకోశాలు, కీలాగ్రం వేర్వేరు స్థానాల్లో (మందార) లేదా వేర్వేరు దిశల్లో

            (గ్లోరియోసా) ఉండటం వల్లఆత్మపరాగ సంపర్కం నిరోధించబడుతుంది. 

     3. ఆత్మవంధ్యత్వం: ఒక పుష్పంలోని పుప్పొడి అదే పుష్పంలోని కీలాగ్రంపై పడినప్పుడు అవి 

             మొలకెత్తకుండా లేదా పరాగ నాళాలు పెరగకుండా అండాల్లో ఫలదీకరణ నిరోధించబడుతుంది.

             (అబుటిలాన్, పాసిఫ్లోరా)
 

2. కృత్రిమ సంకరణ పద్ధతిలో కింది సంభవాలను పరిశీలించి సంకరణ పద్ధతిలో పాటించే విధంగా, వీటిని ఒక సరైన వరుసక్రమంలో అమర్చండి.
      ఎ) రీ-బ్యాగింగ్,       బి) జనకుల ఎంపిక, 
      సి) బ్యాగింగ్            డి) కీలాగ్రంపై పుప్పొడి చల్లడం, 
      ఇ) విపుంసీకరణ   ఎఫ్) పురుష మొక్క నుంచి పుప్పొడి సేకరించడం.
జ: ఎ) జనకుల ఎంపిక బి) విపుంసీకరణ సి) బ్యాగింగ్ డి) పురుషమొక్క నుంచి పుప్పొడిని స్వీకరించుట ఇ) కీలాగ్రంపై పుప్పొడి చల్లడం ఎఫ్) రీ-బ్యాగింగ్

 

3. బహుపిండత అంటే ఏమిటి? వాణిజ్యపరంగా ఈ పద్ధతిని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు? వివరించండి.
జ: ఒక విత్తనంలో ఒకటి కంటే ఎక్కువ పిండాలు వృద్ధి చెందే స్థితినే 'బహుపిండత' అంటారు. అనేక సిట్రస్, మామిడి జాతి మొక్కల్లో పిండకోశం చుట్టూ ఉన్న కొన్ని అండాంతః కణజాల కణాలు విభజన చెంది పిండకోశంలోనికి పెరిగి పిండాలుగా అభివృద్ధి చెందుతాయి. వృక్షప్రజననం, ఉద్యానవనశాస్త్రంలో బహుపిండత ముఖ్యపాత్ర వహిస్తుంది. బహుపిండతతో ఏర్పడిన పిండాల నుంచి వచ్చిన మొక్కలు వైరస్‌రహితంగా, ఎక్కువ తేజాన్ని చూపుతాయి. ఆ సంయోగ జనన పిండాలు వాణిజ్యపరంగా అధిక సంఖ్యలో సమరూప మొక్కలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడతాయి.

 

4. అండంలోకి పరాగనాళం ప్రవేశించే వివిధ పద్థతులను, పటాల సహాయంతో చర్చించండి.
జ: పరాగనాళం అండాశయం నుంచి అండంలోకి 3 రకాలుగా ప్రవేశిస్తుంది.
1) రంధ్రసంయోగం: పరాగనాళం అండంపై భాగంలో ఉన్న అండ ద్వారం ద్వారా అండంలోకి ప్రవేశించడాన్ని 'రంధ్ర సంయోగం' అంటారు. ఉదా: ఒట్టీలియ, హైబిస్కస్.
2) ఛలాజో సంయోగం: కొన్ని మొక్కల్లో పరాగనాళం ఛలాజా ద్వారా అండంలోకి ప్రవేశిస్తుంది.
ఉదా: కాజురైనా. 
3) మధ్యసంయోగం: ఒక్కొక్కసారి పరాగనాళం అండకవచం లేదా అండవృంతం లేదా అండకవచం ద్వారా అండంలోకి ప్రవేశిస్తుంది.
ఉదా: కుకుర్బిటా 


 

5. సూక్ష్మ, స్థూల సిద్ధబీజ జననాల మధ్య వ్యత్యాసాన్ని తెలపండి? వీటిలో ఏ రకమైన కణవిభజన జరుగుతుంది? ఈ రెండు సంఘటనలకు చివరగా ఏర్పడే నిర్మాణాలు ఏవి?
జ: 1) పరాగకోశంలోని సూక్ష్మ సిద్ధబీజాశయాల్లోని సూక్ష్మసిద్ధబీజ మాతృకణాల (2n) నుంచి పరాగరేణువులు
         (సూక్ష్మ సిద్ధబీజాలు) ఏర్పడటాన్నే సూక్ష్మ సిద్ధబీజ జననం అంటారు.
     2) అండాంతః కణజాలంలోని స్థూల సిద్ధ బీజమాతృకణం నుంచి స్థూల సిద్ధబీజాలు ఏర్పడటాన్నే స్థూల
          సిద్ధబీజననం అంటారు. 
     3) ఈ రెండు దశల్లోను ద్వయస్థితిక మాతృకణాలు క్షయకరణ విభజనల వల్ల ఏకస్థితిక సిద్ధబీజాలు
          ఏర్పడతాయి.
     4) సూక్ష్మ, స్థూల సిద్ధబీజాల జననం వల్ల చివరగా పరాగరేణువు, స్థూల సిద్ధబీజం ఏర్పడతాయి.

 

6. త్రిసంయోగం అంటే ఏమిటి? ఇది ఎక్కడ, ఎలా జరుగుతుంది. త్రి సంయోగంలో పాల్గొనే కేంద్రకాల పేర్లను పేర్కొనండి.
జ: పిండకోశంలోకి ప్రవేశించిన 2 పురుష బీజాల్లో, రెండో పురుష బీజం కేంద్రకణంతో (2 ధ్రువ కేంద్రకాల కలయిక) కలిసి ప్రాథమిక అంకురచ్ఛద కేంద్రకాన్ని ఏర్పరచడాన్ని 'త్రిసంయోగం' అంటారు. ఇది పిండకోశంలో జరుగుతుంది. దీనిలో పురుష కేంద్రకం, రెండు ధ్రువకేంద్రకాలు పాల్గొంటాయి.

 

7. కిందివాటి మధ్య వ్యత్యాసాన్ని తెలపండి. 
     a) అథో బీజదళం, ఉపరి బీజదళం 
     b) ప్రాంకుర కంచుకం, మూలాంకురకంచుకం 
     c) అండకవచం, బాహ్య బీజకవచం (టెస్టా) 
     d) పరిచ్ఛదం, ఫలకవచం

 జ: 

 

దీర్ఘ సమాధాన ప్రశ్న 

1. ఆవృత బీజమొక్కల్లో జరిగే ఫలదీకరణ విధానాన్ని వివరించండి.
జ: ఆవృత బీజాల్లో ఫలదీకరణ: స్త్రీ, పురుష సంయోగ బీజాల సంయోగాన్ని ఫలదీకరణ అంటారు. పరాగ సంపర్కం ద్వారా పరాగరేణువులు పరాగకోశం నుంచి కీలాగ్రాన్ని చేరతాయి. కీలాగ్రంపై స్రవించే స్రావాలను గ్రహించి పరాగరేణువులు మొలకెత్తుతాయి. ఉబ్బుతాయి. అంతర సిద్ధ బీజకవచం బీజరంధ్రం ద్వారా బయటకు చొచ్చుకువచ్చి పరాగనాళం ఏర్పరుస్తుంది. ఇది పెరిగి కీలాగ్రం నుంచి కీలంలోకి ప్రవేశిస్తుంది. కీలం కుల్యలు ద్వారా లేదా కణాంతరావకాశాల ద్వారా ప్రయాణించి అండాన్ని చేరుతుంది. పరాగనాళంలోనికి ముందు శాకీయ కేంద్రకం, వెనుక ఉత్పాదక కణం ప్రవేశిస్తుంది. ఉత్పాదక కణం రెండు పురుష సంయోగబీజాలుగా విభజన చెందుతుంది.
A. పరాగనాళం అండాశయం నుంచి అండంలోనికి ప్రవేశించడం: ఇది 3 రకాలుగా జరుగుతుంది.

 


1) రంధ్ర సంయోగం: పరాగనాళం అండ ద్వారం ద్వారా అండంలోనికి ప్రవేశించడం. ఉదా: ఒట్టీలియా
2) ఛలాజోగమి: పరాగనాళం ఛలాజా ద్వారా అండంలోనికి ప్రవేశించడం (ట్రూబ్) ఉదా: కాజురైనా
3) మధ్య సంయోగం: పరాగనాళం అండకవచాలు లేదా అండవృంతం లేదా అండంలోకి ప్రవేశించడం. ఉదా: కుకుర్బిటా
B. పరాగనాళం పిండకోశంలోకి ప్రవేశించడం:
     1) అండంలోకి ప్రవేశించిన పరాగనాళం అండాంతః కణజాలం ద్వారా పిండకోశంలోకి ప్రవేశిస్తుంది.
     2) పరాగనాళం అండద్వారం ద్వారా లేదా స్త్రీ బీజకణం, సహాయకణం మధ్య నుంచి లేదా ఒక సహాయ
          కణాన్ని ధ్వంసం చేసి పిండకోశంలోనికి ప్రవేశిస్తుంది.
C. పురుష సంయోగబీజాలు పిండకోశంలోకి విడుదల కావడం: పరాగనాళం పిండకోశంలోకి ప్రవేశించాక నాళం చివరభాగం విచ్ఛిన్నం కావడం లేదా దాని చివరిభాగం నశించడం లేదా నాళాగ్రంలో రంధ్రం ఏర్పడటం వల్ల నాళంలోని రెండు పురుష బీజాలు, శాఖీయ కేంద్రకం పిండకోశంలోనికి విడుదలవుతాయి.
D. సంయోగ బీజాల సంపర్కం: కొందరు శాస్త్రవేత్తల ప్రకారం పురుష సంయోగబీజాల కేంద్రకం మాత్రమే సంయోగంలో పాల్గొంటుంది. కానీ ఆధునిక పరిశోధనల ప్రకారం పురుష బీజాల కేంద్రకంతో పాటు వాటి కణద్రవ్యం కూడా ఫలదీకరణలో పాల్గొంటుంది. 
E. త్రి సంయోగం, ద్విఫలదీకరణం:
a) సంయుక్త సంయోగం: ఒక పురుష (మొదటి) సంయోగ బీజం స్త్రీ బీజకణంతో సంయోగం చెందుతుంది. ద్వయస్థితిక సంయుక్తబీజం ఏర్పడుతుంది. దీన్ని స్ట్రాస్‌బర్గర్ కనుక్కున్నాడు. దీన్నే నిజమైన ఫలదీకరణం అంటారు.
b) త్రి సంయోగం: రెండో పురుష సంయోగబీజం, ద్వయస్థితిక ద్వితీయ కేంద్రకంతో సంయోగం చెందుతుంది. దీనివల్ల ఏర్పడే త్రయస్థితిక కేంద్రకాన్ని ప్రాథమిక అంకురచ్ఛద కేంద్రకం అంటారు. దీన్ని నవాషిన్ (లిలియమ్, ప్రిటిల్లేరియాలో) కనుక్కున్నాడు.
c) సంయుక్త సంయోగం, త్రి సంయోగాలను కలిపి ద్విఫలదీకరణం అంటారు.

Posted Date : 03-09-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌