• facebook
  • twitter
  • whatsapp
  • telegram

యూనిట్ - IV, అధ్యాయం - 8, ఆవృత బీజాల వర్గీకరణ శాస్త్రం

వృక్షరాజ్యం ఎంతో వైవిధ్యమైంది. ఆవాసం, ఆకారం, నిర్మాణం, జీవన విధానం, పోషణ, ప్రత్యుత్పత్తి, క్రోమోసోమ్‌ల సంఖ్య, రసాయన సంఘటనం ఇలా ఏ లక్షణం తీసుకున్నా వైవిధ్యమే కనిపిస్తుంది. లక్షలాది మొక్కల జీవితాంశాల్లోని వైవిధ్యమే 'వృక్ష వర్గీకరణకు' ముఖ్యమైన ఆధారం. వివిధ వృక్షశాఖల అధ్యయనం వృక్ష వర్గీకరణ శాస్త్ర అభివృద్ధికి తోడ్పడింది. వర్గ వికాస విషయానికి ప్రాముఖ్యం ఇచ్చే వర్గీకరణ అధ్యయనాన్ని 'మొక్కల సిస్టమాటిక్స్' అంటారు.

మొక్కలను గుర్తు పెట్టుకోవడానికి ఒక విశిష్ట పద్ధతి అవసరం. ఈ పద్ధతినే 'వర్గీకరణ శాస్త్రం' (టాక్సానమీ - Taxonomy) అంటారు. టాక్సానమీ అనే పదాన్ని ఎ.పి. డి కండోల్ 1813లో ప్రవేశపెట్టాడు. ప్రకృతిలోని మొక్కలు వాటి నిర్మాణాత్మక లక్షణాల్లో వైవిధ్యం చూపుతాయి. మొక్కలు, వాటి మధ్య ఉన్న సారూప్యతలు, సంబంధ బాంధవ్యాల ఆధారంగా వాటిని సముదాయాలుగా వర్గీకరించడాన్ని 'వర్గీకరణ శాస్త్రం' అంటారు.

స్వరూప లక్షణాల వర్ణన మీద మాత్రమే పూర్తిగా ఆధారపడి ఉండే వర్గీకరణ శాస్త్రాన్ని 'ఆల్ఫా వర్గీకరణ శాస్త్రం' (Alpha taxonomy) అంటారు.

స్వరూప లక్షణాల మీదనే కాకుండా పిండోత్పత్తి శాస్త్రం, కణశాస్త్రం, పరాగరేణు శాస్త్రం, వృక్ష రసాయన శాస్త్రం, సిరాలజి లాంటి అనేక వృక్షశాఖల నుంచి లభించే విషయాలపై ఆధారపడిచేసే వర్గీకరణ శాస్త్రాన్ని 'ఒమెగా టాక్సానమీ' (Omega taxonomy) అంటారు.

వర్గీకరణ శాస్త్రంలో నాలుగు ప్రధానాంశాలు ఉంటాయి.

అవి: వర్ణించడం, గుర్తించడం, నామీకరణ, వర్గీకరణ.

అధ్యాయం -1 లో మౌలికంగా గుర్తించడం, నామీకరణం గురించి; అధ్యాయం-5 లో పుష్పించే మొక్కల స్వరూప లక్షణాల గురించి వివరంగా తెలుసుకున్నారు. ఈ అధ్యాయంలో వర్గీకరణ, ఒక నమూనా పుష్పించే మొక్క పాక్షిక సాంకేతిక వర్ణన; ఎంపిక చేసిన ఫాబేసి, సోలనేసి, లిలియేసి కుటుంబాల గురించి తెలుసుకుంటారు.

వర్గీకరణ శాస్త్ర పితామహుడు

స్వీడిష్ మత గురువు, వైద్యుడు, వృక్ష శాస్త్రవేత్త అయిన కార్ల్ లిన్నేయస్‌ను 'వృక్షవర్గీకరణ శాస్త్ర పితామహుడు'గా కీర్తిస్తారు. ఆయన మే 23, 1707లో జన్మించాడు.

చిన్న వయసులోనే లిన్నేయస్ మత గురువుగా మారాడు. అయితే ఆయన దీనిపట్ల ఆసక్తి కనబరచలేదు. వృక్షశాస్త్రంలో అతడికున్న ఆసక్తిని గమనించిన ఒక డాక్టర్ లిన్నేయస్‌ను స్వీడన్‌లోని లుండ్ విశ్వవిద్యాలయానికి, తర్వాత ఉప్పసలా పట్టణానికి పంపించాడు. చదువుకునే కాలంలోనే అనేక పుష్పాల్లోని కేసరాలు, అండకోశాలు మొక్కల వర్గీకరణకు ఆధారాలని గట్టిగా నమ్మాడు.  ఈ విషయంపై ఒక వ్యాసాన్ని ప్రచురించాడు.

ఇది అతడికి 1732లో 'ఉప్పసలాలోని అకాడమీ ఆఫ్ సైన్సెస్‌'లో ఆచార్యుడి పదవి తెచ్చిపెట్టింది. అప్పటి వరకు ఎవరికీ తెలియని లాప్‌లాండ్‌ను అన్వేషించి 1737లో 'ఫ్లోరా లాపోనికా'ను ప్రచురించాడు.

ఆ తర్వాత నెదర్లాండ్‌కు మకాం మార్చిన లిన్నేయస్, అక్కడ జాన్ ఫెడ్రిక్ గ్రోనోవియస్‌కు తాను రాసిన వర్గీకరణ పుస్తకం 'సిస్టమా నాచురే'ను చూపించాడు. అప్పటివరకు వాక్యాల మాదిరిగా ఉన్న మొక్కల శాస్త్రీయ నామాలను, నేడు మనకు తెలిసిన 'ద్వినామ నామీకరణ' (జాతి - ప్రజాతి)గా కుదించాడు. అనేక విధాలుగా ప్రయత్నించిన తర్వాత 1753లో ద్వినామ నామీకరణ వ్యవస్థను మెరుగుపరచి ప్రామాణీకరించాడు. ఉన్నత స్థాయి మొక్కలను ఒక సరళమైన, క్రమ పద్ధతిలో ఉంచాడు.

మొక్కలను సులభంగా గుర్తించడం కోసం సరళ వర్గీకరణ వ్యవస్థను ప్రతిపాదించాడు. చాలా తక్కువ పుష్ప లక్షణాల మీద ఆధారపడటం వల్ల (కేసరాలు, ఫలదళాల సంఖ్య) దీన్ని 'కృత్రిమ వ్యవస్థ' అంటారు.

జంతు, ఖనిజ రాజ్యాల వర్గీకరణ చేశాడు. ఇలా ఏకంగా ప్రకృతినే వర్గీకరించే ప్రయత్నం చేశాడు.

ఇంతటి కృషి చేసిన లిన్నేయస్, ఉప్పసలా విశ్వవిద్యాలయంలో మొదట వైద్య, ఆ తర్వాత వృక్షశాస్త్ర శాఖ అత్యున్నత పదవిని చేపట్టాడు. 1755లో 'కార్ల్ వాన్ లిన్నే' పేరుతో రాజపురస్కారాన్ని పొందాడు. 'లిన్నేయస్ ఒరిజినల్ బొటానికల్ గార్డెన్' ఉప్పసలా పట్టణంలో ఇప్పటికీ ఉండటం ఆశ్చర్యకరం.

778 జనవరి 10న లిన్నేయస్ మరణించాడు.

వ్యవస్థలు, వర్గీకరణ రకాలు

వృక్షవర్గీకరణ అంటే మొక్కల నిర్మాణ సారూప్యాలు, వాటి మధ్య ఉండే పరస్పర సంబంధాల పరంగా సమూహాలుగా ఏర్పరచడం.

వర్గీకరణలో తీసుకున్న దృగ్విషయాల ఆధారంగా ప్రారంభం నుంచి ప్రతిపాదించిన అన్ని వ్యవస్థలను కృత్రిమ, సహజ, వర్గ వికాస అనే మూడు రకాలుగా విభజించారు.

పైకి కనిపించే బాహ్య స్వరూప లక్షణాలైన ఆకృతి, రంగు, సంఖ్య, పత్ర ఆకారం లాంటి వాటి ఆధారంగా మాత్రమే చేసిన వర్గీకరణలో 'కృత్రిమ వ్యవస్థ' మొదటిది.

థియో ఫ్రాస్టస్ (క్రీ.పూ. 370 - 285) తన 'హిస్టోరియా ప్లాంటారమ్' గ్రంథంలో మొక్కల ఆకృతిని బట్టి వాటిని మూడు రకాలుగా వర్గీకరించాడు.

అవి: (i) గుల్మాలు

       (ii) పొదలు

       (iii) వృక్షాలు

లిన్నేయస్ (1754) తన 'స్పీషీస్ ప్లాంటారమ్' గ్రంథంలో కేసరాలు, ఫలదళాల సంఖ్య, పొడవు అవి సంయుక్తం కావడం (లైంగిక లక్షణాలు) బట్టి మొక్కలను 24 సముదాయాలుగా విభజించాడు. ఇవి కృత్రిమ వర్గీకరణ వ్యవస్థలకు ఉదాహరణలు.

సహజ వ్యవస్థలో ముఖ్యమైన స్వరూప లక్షణాలను పరిగణనలోనికి తీసుకుని మొక్కలను వర్గీకరించాడు.

మొక్కలను పెద్ద సముదాయాలుగా వర్గీకరించాడు. వీటి అతి చిన్న విభాగం (ప్రమాణం) టాక్సన్ (జాతి) చేరే వరకు చిన్న చిన్న సముదాయాలుగా విభజన, ఉప విభజన చేశారు.

మొక్కలను సులభంగా గుర్తించడానికి సహజ వర్గీకరణ వ్యవస్థ తోడ్పడుతుంది. బెంథమ్, హుకర్ (1862 - 1893) 'జెనిరా ప్లాంటారమ్' గ్రంథంలో ప్రతిపాదించిన వృక్షవర్గీకరణ వ్యవస్థ ఒక సహజమైన వర్గీకరణ వ్యవస్థ.

ఇప్పుడు కుటుంబాలుగా వ్యవహరిస్తున్న పుష్పించే మొక్కలను అప్పట్లోనే వారు 202 సహజ క్రమాలుగా విభజించారు. వీటిలో 165 సహజ క్రమాలు ద్విదళ బీజాలు; 3 వివృత బీజాలు; 34 ఏకదళ బీజాలకు చెందుతాయి.

వర్గవికాస వ్యవస్థ

మొక్కల పరిణామ క్రమ ప్రవృత్తులను పరిగణనలోకి తీసుకుని చేసిన వర్గీకరణలు, వర్గవికాస వ్యవస్థలు. ఈ వ్యవస్థలో ఆదిమ, పరిణితి చెందిన లక్షణాలను గుర్తించారు. పరిణామం పురోగామి లేదా తిరోగామిగా ఉండొచ్చు. ఒక టాక్సాన్ స్థాయిని పరిగణించేటప్పుడు అన్ని లక్షణాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ వ్యవస్థను ఎంగ్లర్, ప్రాంటల్ అనే శాస్త్రవేత్తలు 'ది నేచురలీ కెన్ ఫ్లాంజన్ ఫెమిలియన్' గ్రంథంలో ప్రతిపాదించారు.

'ఫ్యామిలీస్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్' పుస్తకంలో హచిన్‌సన్ (1954) ప్రతిపాదించిన వ్యవస్థలు వర్గవికాస వ్యవస్థకు ఉదాహరణలు. APG - (Angiospermic phylogenetic group) వ్యవస్థను ఆధునిక వర్గవికాస వర్గీకరణగా చెప్పవచ్చు.

ఇతర రకాలు...

సాంఖ్యక వర్గీకరణ శాస్త్రం (Numerical Taxonomy): గణిత శాస్త్ర పద్ధతులను ఉపయోగించి వర్గీకరణ సముదాయాల మధ్య ఉండే గమనించదగిన విభేదాలు, పోలికలను లెక్కగట్టడానికి ఉపయోగిస్తారు.

కణాధార వర్గీకరణ శాస్త్రం (Cytotaxonomy): వర్గీకరణ సమస్యలను పరిష్కరించడంలో క్రోమోసోమ్‌ల సంఖ్య, నిర్మాణం లాంటి కణ లక్షణాలను ఉపయోగించే వర్గీకరణ శాస్త్ర శాఖ.

రసాయనిక వర్గీకరణ శాస్త్రం (Chemotaxonomy): వర్గీకరణ సమస్యలను పరిష్కరించడంలో మొక్కల్లో ఉండే రసాయన పదార్థాల సమాచారాన్ని ఉపయోగించే వర్గీకరణ శాస్త్ర శాఖ.

ఒక నమూనా పుష్పించే మొక్క పాక్షిక సాంకేతిక వర్ణన

మొదటగా మొక్క ఆకృతి, ఆవాసం, శాకీయ లక్షణాలను (వేర్లు, కాండం, పత్రాలు) వర్ణిస్తారు.

పుష్ప లక్షణాల (పుష్పవిన్యాసం, పుష్పం, పుష్ప భాగాలు) తర్వాత ఫలాన్ని వర్ణిస్తారు.

పుష్పచిత్రం, పుష్ప సమీకరణాన్ని సూచిస్తారు.

పుష్ప భాగాలను కొన్ని సంకేతాల ద్వారా పుష్పసమీకరణంలో చూపిస్తారు.

సంబంధిత వలయంలో ఉన్న పుష్పభాగాల సంఖ్య, అసంయుక్తం లేదా సంయుక్తమా (బ్రాకెట్టులో చూపించడం) అనేదాన్ని పుష్ప సమీకరణంతో చూపిస్తారు.

ప్రతి పుష్పభాగాన్ని చిహ్నాల ద్వారా, వాటి సంఖ్యను చిహ్నం కింద రాయాలి. సంసంజనం (ఒకే రకమైన పుష్పభాగాలు సంయుక్తమవడం ), అసంజనాలను (భిన్న పుష్పభాగాలు సంయుక్తమవడం) కూడా పుష్ప సమీకరణంలో సూచిస్తారు.

పుష్ప భాగాల సంఖ్య, అమరిక, ఒక భాగానికి మరో భాగానికి మధ్య ఉండే సంబంధాలను 'పుష్ప చిత్రం' తెలియజేస్తుంది.

ప్రధాన అక్షంవైపు ఉండే పుష్ప భాగాన్ని పరాంత భాగం అంటారు. ప్రధాన అక్షాన్ని చుక్క (.) లేదా చిన్న వలయంతో(o) పుష్పచిత్రం పైభాగంలో సూచిస్తారు.

రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి, కేసరావళి, అండకోశాలను ఏక కేంద్రక వలయాలుగా గీసి, రక్షక పత్రావళిని వెలుపలి వలయంలో చూపుతారు. అండకోశాన్ని పుష్ప చిత్రం మధ్యభాగంలో, అండాశయాన్ని అడ్డుకోత పటం ద్వారా చూపిస్తారు. పుష్పపుచ్ఛం పుష్ప పూర్వాంత భాగాన్ని సూచిస్తుంది. దీన్ని పుష్ప చిత్రానికి కిందివైపు సూచిస్తారు.

కుటుంబాల వర్ణన

సొలనేసి

దీన్ని బంగాళాదుంప కుటుంబం (Potato family) అంటారు.
85 ప్రజాతులకు చెందిన 2200 జాతులు ఉన్నాయి. ఉష్ణ, ఉప ఉష్ణ, సమశీతోష్ణ మండలాల్లో విస్తారంగా వ్యాపించి ఉన్నాయి.

ముఖ్యమైన మొక్కలు

అట్రోపా బెల్లడోనా (బెల్లడోనా - belladona), కాప్సికమ్ ప్రూటిసెన్స్ (మిరప - Chilli), సెస్ట్రమ్ నాక్టర్నమ్ (రాత్రిరాణి - night queen), సె.డయాగ్నమ్ (పగటిరాజు - day king), దతూర మెటల్ (ఉమ్మెత్త - thorn apple), లైకోపెర్సికాన్ ఎస్కులెంటమ్ (టొమాటో - tomoto), నికోటియానా టబాకమ్ (పొగాకు - tobocco), పెట్యూనియా ఆల్భా (పెట్యూనియా - Petunia), సోలానమ్ మెలాంజినా (వంగ - brinjal), సొ.ట్యూబరోసమ్ (బంగాళదుంప - Potato), సొ.నైగ్రమ్ (కామంచి), సొ.సూరతైన్స్ (వాకుడు, నేలములక), హైయోసయామస్ నైజర్ (కురషాని, దమమ్), ఫైసాలిస్ మినమ (సన్‌బెర్రీ), ఫై.పెరూవియాన (గూస్‌బెర్రీ). ఈ కుటుంబానికి చెందిన సొ. నైగ్రమ్ (కామంచి) మొక్క లక్షణాలను కింది పటంలో చూడొచ్చు.

 శాకీయ లక్షణాలు

ఆకృతి: ఏకవార్షిక లేదా బహువార్షిక గుల్మాలు; కొన్ని పొదలు (సెస్టమ్), అరుదుగా వృక్షాలు.

వేరు వ్యవస్థ: తల్లివేరు వ్యవస్థ

కాండం: వాయుగతం గుల్మాకారం లేదా అరుదుగా దారుయుతం బంగాళాదుంపలో భూగర్భ దుంపకాండం. ద్విసహపార్శ్వ నాళికాపుంజాలు (Bicollateral Vascular bundles) సర్వసాధారణంగా ఉంటాయి.

ద్విసహపార్శ్వ నాళికాపుంజాలు  : ద్విసహపార్శ నాళికాపుంజాల్లో దారువుకు ఇరువైపులా విభాజ్య కణావళితో వేరు చేసిన పోషక కణజాలం ఉంటుంది.

పత్రాలు: ప్రకాండ సంబంధం, ఏకాంతర పత్రవిన్యాసం, పత్ర పుచ్ఛరహితం, వృంతసహితం, పత్రవృంతం కాండంతో ఆశ్లేషితమవడం, సరళపత్రం లేదా అరుదుగా పిచ్ఛాకార సంయుక్తపత్రం, జాలాకార ఈనెల వ్యాపనం.

పుష్పలక్షణాలు

పుష్పవిన్యాసం: నిశ్చిత, సొలానమ్‌లో గ్రీవస్థం. దతూరలో శిఖరస్థ ఏకాంతం, పొగాకులో పానికల్.

పుష్పం: పుచ్ఛసహితం లేదా పుచ్ఛరహితం, లఘుపుచ్ఛరహితం, వృంతసహితం, సౌష్ఠవయుతం, సంపూర్ణం, ద్విలింగకం, పంచభాగయుతం, అండకోశాధిస్థితం (hypogynous).

రక్షక పత్రావళి: రక్షకపత్రాల సంఖ్య అయిదు. సంయుక్తం, సొలానమ్, కాప్సికమ్‌లలో దీర్ఘకాలికం, కవాటయుత పుష్పరచన.

ఆకర్షణ పత్రావళి: ఆకర్షణ పత్రాలు - 5. సంయుక్తం, కవాటయుత లేదా దతూరలో మెలి తిరిగిన పుష్పరచన.

కేసరావళి: కేసరాలు - 5. మకుట దళోపరిస్థితం, ఆకర్షణ పత్రాలతో ఏకాంతరంగా ఉంటాయి. పరాగకోశాలు ద్వికక్షికం, పీఠసంయోజితం, అంతర్ముఖం.

అండకోశం: ద్విఫలదళ, సంయుక్త, ద్విబిలయుతం. అరుదుగా ఏకబిలయుతం (మిరప). ఊర్థ్వఅండాశయం, ఉబ్బిన అండన్యాస స్థానంపై అనేక అండాలు స్తంభ అండన్యాసంలో అమరి ఉంటాయి. అగ్రకీలం, కీలాగ్రం శీర్షాకారం, ఫలదళాలు 45 డిగ్రీల కోణంలో ఏటవాలుగా అమరి ఉంటాయి.

పరాగసంపర్కం: పుంభాగ ప్రథమోత్పత్తి చూపిస్తాయి. కొన్ని సొలానమ్ జాతుల్లో స్త్రీభాగ ప్రథమోత్పత్తి కనిపిస్తుంది. కీటక పరాగసంపర్కం.

ఫలాలు: మృదుఫలం (కాప్సికమ్, సొలానమ్, లైకోపెర్సికాన్), గుళిక (దతూర, నికోటియానా).

విత్తనాలు: అనేకం, అంకురచ్ఛదయుతం

ఆర్థిక ప్రాముఖ్యం కూరగాయలు : టొమాటో, వంగ, బంగాళాదుంప.

సుగంధ ద్రవ్యం : మిరప                       

ఔషధ  మొక్కలు : బెల్లడోనా, అశ్వగంధ.

ఔషధ రసాయనాలు : మాకోయి లేదా కామంచి సొ.సూరతైన్స్, ఉమ్మెత్త

అలంకరణ మొక్కలు : పెట్యునియా, రాత్రిరాణి, పగటిరాజు

వాణిజ్య పంటలు: ఆల్కలాయిడ్ (క్షారాభం): పొగాకు (నికోటిన్) పత్రాలను సిగరెట్లు, చుట్టలు, బీడీల తయారీలో వాడతారు. మిరపకాయ (కాప్సిన్)లను కారం, పచ్చళ్ల తయారీ, వంటల్లో వాడతారు. ఆట్రోపిన్ (బెల్లడోనా)
   

లిలియేసి

 

లిల్లీ కుటుంబంగా (Lily family) పిలుస్తారు. ఏకదళ బీజ వృక్షాల వర్ణనకు నమూనా.

ప్రపంచవ్యాప్త విస్తరణ: సమోద్బీజాలు (ఆలియమ్, లిలియమ్), ఎడారి మొక్కలు (ఆస్పరాగస్, రస్కస్, ఆలో), 254 ప్రజాతులు, 4075 జాతులు ఈ కుటుంబంలో ఉన్నాయి.

ముఖ్యమైన మొక్కలు: ఆలియమ్ సెపా (నీరుల్లి - onion), ఆలియమ్ సటైవమ్ (వెల్లుల్లి - garlic), ఆలోవీర (కలబంద - aloe), ఆస్పరాగస్ రెసిమోసస్ (పిల్లితీగలు, శతమూలి - asparagus), కాల్చికమ్ ఆటమ్నేల్ (మెడోసాఫ్రన్ - medowsaffron), డ్రసీనా అంగుస్టిఫోలియా(రెడ్ డ్రాగన్), గ్లోరియోసో సుపర్భ (నాభి - glory lily), లిల్లియమ్ కాండిడమ్ (లిల్లి - lily), స్మైలాక్స్ జైలానికా (ఫిరంగి - sarasaparilla), యుక్కా గ్లోరియోసా- (స్పానిష్ డాగర్ - spanishdagger), రస్కస్ అక్యూలియేట (బుచేర్స్‌బ్రూమ్ - butchers broom), సిల్లా హయసింధియా (స్క్విల్ - squill).

శాకీయ లక్షణాలు

ఆకృతి: ఎక్కువగా బహువార్షికాలు. కొన్ని పొదలు లేదా వృక్షాలు (డ్రసీనా, యుక్కా, కొన్ని అలో జాతులు); లతలు (గ్లోరియోసా, స్మైలాక్స్).

వేరువ్యవస్థ: అబ్బురపువేర్లు. ఆస్పరాగస్‌లో దుంపవేర్లు గుత్తులుగా ఉంటాయి.

కాండం: భూగర్భం, బహువార్షికం, లశునం (ఆలియమ్, లిలియమ్), కందం (కాల్చికమ్), కొమ్ము (గ్లోరియోసా). కొన్ని వాయుగతం, బలహీనం, నులితీగల లతలు (గ్లోరియోసా, స్మైలాక్స్), శాఖలు క్లాడోఫిల్ (రస్కస్, ఆస్పరాగస్) గా రూపాంతరం చెందుతాయి.

పత్రాలు: మూలసంబంధం (ఆలియమ్, లిలియమ్) లేదా ప్రకాండ సంబంధం (స్మైలాక్స్, గ్లోరియోసా), సరళ పత్రాలు, ఏకాంతరం, రేఖాకారం (linear), పుచ్ఛరహితం, సమాంతర ఈనెల వ్యాపనం లేదా అసాధారణంగా స్మైలాక్స్‌లో జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది.

పుష్పలక్షణాలు

పుష్పవిన్యాసం : ఏకాంత నిశ్చితం (solitary cyme) లేదా గుచ్ఛం(umbel) లేదా అనిశ్చితం (raceme).

పుష్పం: పుచ్ఛసహితం, లఘుపుచ్ఛరహితం, వృంతసహితం, సంపూర్ణం, ద్విలింగకం లేదా స్మైలాక్, రస్కస్‌లలో అసాధారణంగా ఏకలింగకం; సౌష్ఠవయుతం, త్రిభాగయుతం, అండకోశాధిస్థితం, సమ పరిపత్రయుతం.

పరిపత్రావళి: పరిపత్రాలు (tepals) ఆరు. రెండు వలయాల్లో (3 + 3)గా అమరి ఉంటాయి. అసంయుక్తం (లిలియమ్), సంయుక్తం (ఆలో), వెలుపలి వలయంలోని బేసి పరిపత్రం పుష్పానికి పూర్వాంతంలో ఉంటుంది. లోపలి పత్రంలోని బేసి పరిపత్రం పరాంతంలో ఉంటుంది. కవాటయుత పుష్పరచన.

కేసరావళి: 6 కేసరాలు, రెండు వలయాల్లో (3 + 3) అమరి ఉంటాయి. అసంయుక్తం, పత్రోపరిస్థితం (epiphyllous), పరాగకోశాలు ద్వికక్షికం, పీఠ సంయోజితం, అంతర్ముఖం, నిలువుస్ఫోటం.

అండకోశం: త్రిఫలదళ, సంయుక్త ఊర్ధ్వ అండాశయం, త్రిబిలయుతం, అనేక అండాలు స్తంభ అండన్యాసంపై అమరి ఉంటాయి. అగ్రకీలం, కీలాగ్రం త్రిభాగయుతం (trifid), శీర్షాకారం.

పరాగ సంపర్కం: పుంభాగ ప్రథమోత్పత్తి (ఆలియమ్) లేదా స్త్రీభాగ ప్రథమోత్పత్తి (కాల్చికమ్). కీటక పరాగసంపర్కం. యుక్కాలో కీటక పరాగసంపర్కం, 'ప్రోన్యూబా యుక్కాసెల్లా' అనే ప్రత్యేక మాత్ ద్వారా సహజీవన విధానంలో జరుగుతుంది.

ఫలం: గుళిక, అరుదుగా మృదుఫలం (ఆస్పరాగస్)

విత్తనం: అంకురచ్ఛదయుతం, ఏక బీజయుతం, కొన్ని ఆలియమ్ జాతుల్లో బహుపిండత ఉంటుంది.

బహుపిండత : ఒక విత్తనంలో ఒకటి కంటే ఎక్కువ పిండాలు ఉండే స్థితిని బహుపిండత అంటారు.

ఆర్థిక ప్రాముఖ్యం:

అలంకరణ మొక్కలు: తులిప్, లిలియమ్ ఆస్పరాగస్, గ్లోరియోసా, డ్రసీన

మందులు: ఆలో, స్మైలాక్స్ (సరసపరిల్లా), గ్లోరియోసా, సిల్లా, కాల్చికమ్.

కూరగాయలు: ఆలియమ్‌సెపా, ఆస్పరాగస్

సుగంధ ద్రవ్యాలు: ఆలియమ్ సైటైవమ్

నార: యుక్కా, డ్రసీనా పత్రాల నుంచి.

క్షారాభం: కాల్చిసిన్ (కాల్చికమ్ ఆటోమ్మేల్) రసాయన ఉత్పరివర్తకంగా (chemical mutagen) విరివిగా వాడతారు.

ఔషధ ఉపయోగాలు: ఆలియమ్ సెపా-బ్యాక్టీరియా నాశకారి, ఆలియమ్ సటైవమ్ - జీర్ణకోశ వ్యాధుల్లో, గుండె జబ్బులకు మందు; కలబంద - మూలశంక (Piles) నివారణ.                                     

Posted Date : 04-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌