• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఆవృత బీజాల వర్గీకరణ శాస్త్రం  

ప్రశ్న‌లు - జ‌వాబులు

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

1. మొక్కల సహజ వర్గీకరణ శాస్త్రం అంటే ఏమిటి? దీన్ని అనుసరించిన శాస్త్రవేత్తల పేర్లు తెలపండి.
జ: అన్ని ముఖ్యమైన, ఎక్కువగా స్వరూప లక్షణాలను (ముఖ్యంగా స్థిరమైన పుష్పలక్షణాల) ఆధారంగా తీసుకుని చిన్న సముదాయాలుగా (జాతి వరకు) చేరే వరకు విభజన, ఉప విభజన చేసే విధానాన్ని సహజ వర్గీకరణ శాస్త్రం అంటారు. బెంథామ్, హుకర్ (1862 - 1893) ఈ విధానాన్ని అనుసరించారు.

2. సాంఖ్యక వర్గీకరణ శాస్త్రం (Numerical Taxonomy) పరిధిని, ప్రాముఖ్యాన్ని వివరించండి.
జ: గణితశాస్త్ర పద్ధతులను ఉపయోగించి వర్గీకరణ సముదాయాల మధ్య ఉన్న విభేదాలు, పోలికలను లెక్కించడానికి ఉపయోగించే శాస్త్రాన్ని సాంఖ్యక వర్గీకరణశాస్త్రం అంటారు. ఈ పద్ధతిలో అన్ని లక్షణాలకు సంఖ్య, సంకేతాలను నిర్ణయించిన తర్వాతనే క్రమపద్ధతిలో సమాచారాన్ని విశ్లేషిస్తారు. ప్రతి లక్షణానికి సమ ప్రాధాన్యమిస్తూ అదే సమయంలో వందలాది లక్షణాలను పరిగణించవచ్చు.

3. సొలానమ్ మొక్క పుష్పసంకేతం రాయండి. 
జ:  

స్వల్ప సమాధాన ప్రశ్నలు

1. ఒక నమూనా పుష్పించే మొక్క పాక్షిక సాంకేతిక వర్ణనను క్లుప్తంగా రాయండి.
జ: పుష్పించే మొక్కను వర్ణించేటప్పుడు మొదట దాని ఆకృతి, ఆవాసం, శాకీయ లక్షణాలను (వేర్లు, కాండం, పత్రాలు) వర్ణిస్తారు. తర్వాత పుష్ప లక్షణాలను (పుష్పవిన్యాసం, పుష్పం, పుష్పభాగాలు) ఆ తర్వాత ఫలాన్ని వర్ణిస్తారు. మొక్క వివిధ భాగాలను వర్ణించిన తర్వాత పుష్పచిత్రం, పుష్ప సమీకరణం ఇవ్వాలి. పుష్ప భాగాలను కింది విధంగా కొన్ని సంకేతాల ద్వారా పుష్ప సమీకరణంలో చూపిస్తారు.

 

2. పుష్ప చిత్రాన్ని గురించి రాయండి.
జ: పుష్ప చిత్రం అనేది పుష్పంలో ఉండే భాగాల సంఖ్య, వాటి అమరిక, ఒక భాగానికి మరొక భాగానికి మధ్య సంబంధాలను చూపే పటం.
* పుష్ప విన్యాసాక్షం (ప్రధాన అక్షం) వైపు ఉండే పుష్పభాగాన్ని పుష్ప పరాంతభాగం అంటారు. ప్రధాన అక్షాన్ని ఒక చుక్క(.) లేదా చిన్న వలయంలో పుష్పచిత్రం పైభాగంలో సూచిస్తారు.
* రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి, కేసరావళి, అండకోశాలను ఏకకేంద్రక వలయాలుగా గీస్తారు.
* రక్షక పత్రావళిని పుష్పచిత్రం వెలుపలి వలయంలో, అండకోశాన్ని పుష్పచిత్రం మధ్య భాగంలో అండాశయం అడ్డుకోత పటం ద్వారా చూపుతారు.
* పుష్పపుచ్ఛం పుష్ప పూర్వాంత భాగాన్ని సూచిస్తుంది. దీన్ని పుష్పచిత్రానికి పీఠం (కింది) వైపు సూచిస్తారు.
*
  - ఊర్థ్వ అండాశయం;   - నిమ్న అండాశయం;   - అర్ధ నిమ్న/ ఊర్థ్వ అర్ధ అండాశయం

 

3. లిలియేసికి చెందిన మొక్కల పుష్పభాగాల్లోని ఆవశ్యక అంగాలను వివరించండి.
జ: ఒక పుష్పంలోని కేసరావళి, అండకోశాన్ని కలిపి ఆవశ్యక అంగాలు అంటారు. లిలియేసి మొక్కల పుష్పాల్లో ఆవశ్యక అంగాలు ఈ విధంగా ఉంటాయి.
కేసరావళి: 6 కేసరాలు, రెండు వలయాల్లో (3+3) ఉంటాయి. అసంయుక్తం, పరిపత్రోపరిస్థితం, పరాగకోశాలు ద్వికక్షికం, పీఠ సంయోజితం, అంతర్ముఖం, నిలువుస్ఫోటం.
అండకోశం: త్రిఫలదళ, సంయుక్తం; ఊర్థ్వ అండాశయం, త్రిబిలయుతం అనేక అండాలు స్తంభ అండన్యాసంపై అమరి ఉంటాయి. అగ్రకీలం, కీలాగ్రం త్రిభాగయుతం, శీర్షాకారం.

 


 

4. పుష్ప సమీకరణాన్ని విశదీకరించండి.
జ: ఒక ఆవృతబీజ పుష్పంలోని భాగాలను కొన్ని సంకేతాల ద్వారా చూపే విధానాన్నే పుష్ప సమీకరణం అంటారు. ఇందులో ప్రతి పుష్పవలయంలోని భాగాల సంఖ్య అసంయుక్తం లేదా సంయుక్తంగా ఉంటుంది (దీన్ని బ్రాకెట్స్‌లో చూపుతారు). ప్రతి పుష్పభాగాన్ని చిహ్నాల ద్వారా, వాటి సంఖ్యను ఆ చిహ్నం కింద రాయాలి. సంసంజనం (ఒకే రకమైన పుష్పభాగాలు సంయుక్తమవడం) లేదా అసంజనం (భిన్నభాగాలు సంయుక్తమవడం) కూడా పుష్పసమీకరణంలో సూచిస్తారు. ఉదాహరణకు ఆవాల మొక్క (బ్రాసికేసి కుటుంబం) పుష్ప సమీకరణం కింది విధంగా ఉంటుంది.

 
                              
ఇందులో Ebr (పుచ్ఛరహితం), Ebrl (లఘుపుచ్ఛరహితం),  
 (సౌష్ఠవయుతం),   (ద్విలైంగికం, K2+2 (అసంయుక్త రక్షక పత్రావళి, ఒక్కో వలయంలో రెండు చొప్పున రెండు వలయాలు) C4 (అసంయుక్త ఆకర్షణ పత్రావళి, 4 ఆకర్షణ పత్రాలు), A2+4(అసంయుక్త కేసరావళి, వెలుపలి వలయంలో రెండు, లోపలి వలయంలో నాలుగు కేసరాలు),    (ద్విఫలదళ సంయుక్త ఊర్థ్వ అండకోశం).
 

దీర్ఘ సమాధాన ప్రశ్న

1. వర్గీకరణ శాస్త్రం అంటే ఏమిటి? మొక్కల వివిధ వర్గీకరణ రకాల గురించి సంక్షిప్తంగా వివరించండి.
జ: మొక్కల మధ్య ఉండే నిర్మాణ సారూప్యాలు (పోలికలు), పరస్పర సంబంధాల (సహజ సంబంధాల) ఆధారంగా సమూహాలుగా చేసే విధానాన్నే వృక్ష వర్గీకరణ అంటారు.
Taxonomy అనే పదాన్ని ఎ.పి.డి. కండోల్ (1813) ప్రవేశపెట్టాడు. ఇది Taxis (అమరిక), nomous ( న్యాయబద్ధమైన) అనే రెండు గ్రీకు పదాల కలయిక వల్ల ఏర్పడింది. వర్గీకరణశాస్త్రంలో లక్షణాలను వర్ణించడం, గుర్తించడం, నామీకరణ, వర్గీకరణం అనే 4 ప్రధాన అంశాలు ఉంటాయి.

 

 కృత్రిమ వ్యవస్థ
* బాహ్య స్వరూప లక్షణాలైన ఆకృతి, రంగు, సంఖ్య, పత్రాకారం లాంటి అంశాల ఆధారంగా వర్గీకరణ చేస్తారు.
* ఈ విధానంలో హేతుబద్ధంగా లేని ఒకటి లేదా కొన్ని ఎంపిక చేసిన లక్షణాలను మాత్రమే ఆధారంగా చేసుకుని మొక్కలను సమూహాలుగా అమర్చారు.
* ఒక విశిష్ట లక్షణం ఉందా లేదా అన్న విషయంపై ఆధారపడి, దగ్గర సంబంధం ఉన్న మొక్కలను వివిధ సముదాయాల్లో, దగ్గర సంబంధంలేని మొక్కలను ఒకే సముదాయంలో చేరుస్తారు. 
* ఒక సముదాయంలోని మొక్కల మధ్య ఉండే సహజ సంబంధాలను సూచించలేదు. అయితే తెలియని మొక్కలను గుర్తించడానికి ఈ వ్యవస్థ సులభతరంగా ఉంటుంది.
ఉదా: * థియోఫ్రాస్టస్ (క్రీ.పూ. 370 - 284) తన హిస్టోరియా ప్లాంటారమ్ గ్రంథంలో ఆకృతిని బట్టి మొక్కలను 3 సముదాయాలుగా వర్గీకరించాడు. అవి: గుల్మాలు, పొదలు, వృక్షాలు.
* లిన్నేయస్ (1754) తన స్పీషిస్ ప్లాంటారమ్ గ్రంథంలో కేసరాలు, ఫలదళాల సంఖ్య, అవి సంయుక్తం కావడం (లైంగిక లక్షణాలు) బట్టి మొక్కలను 24 సముదాయాలుగా విభజించాడు.
లోపాలు: ఈ విధానాల్లో శాకీయ, లైంగిక లక్షణాలకు సమాన ప్రాధాన్యం ఇచ్చారు. శాకీయ లక్షణాలు వాతావరణ పరిస్థితులకు సులభంగా ప్రభావితమై స్థిరంగా ఉండవు. కాబట్టి వీటిని అంగీకరించడానికి వీల్లేదు.

సహజ వర్గీకరణ వ్యవస్థలు
* ముఖ్యమైన, ఎక్కువగా స్వరూప శాస్త్ర లక్షణాలను పరిగణలోనికి తీసుకుని మొక్కలను వర్గీకరణ చేశారు.
* మొక్కల మధ్య సహజ సంబంధాలకు ప్రాధాన్యమిస్తూ వాటిని మొదట కొన్ని పెద్ద సముదాయాలుగా వర్గీకరిస్తారు. ఆ తర్వాత వాటిని అతి చిన్న విభాగమైన జాతి చేరే వరకు చిన్న చిన్న సముదాయాలుగా విభజన, ఉప విభజన చేస్తారు.
* పుష్ప లక్షణాలు ఎక్కువగా స్థిరంగా ఉండటమే కాకుండా, వాతావరణ ప్రభావానికి లోనుకాకపోవడం వల్ల వాటికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు.
ఉదా: a) డీ కండోల్ వర్గీకరణ విధానం
        b) బెంథామ్, హుకర్ వర్గీకరణ విధానం

వర్గ వికాస వర్గీకరణ వ్యవస్థలు
* డార్విన్ కాలం తర్వాత వచ్చిన వర్గీకరణాల్లో మొక్కల్లోని పరిణామ క్రమ ప్రవృత్తులను పరిగణనలోకి తీసుకున్నారు. అందువల్ల వీటిని వర్గవికాస వ్యవస్థలు అంటారు.
* ఈ వర్గవికాస వ్యవస్థలో ఆదిమ లక్షణాలు, పరిణతి చెందిన లక్షణాలను గుర్తించారు. పరిణామం పురోగామి లేదా తిరోగామిగా ఉండవచ్చు.
* ఒక టాక్సన్ స్థాయిని పరిగిణించేటప్పుడు అన్ని లక్షణాలను విపులంగా పరిగణనలోకి తీసుకుంటారు.
ఉదా: a) ది నేచురలీ కెన్ ఫ్లాంజన్ ఫెమిలియన్
         b) ఫ్యామిలీస్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్
         c) APG (ఆంజియోస్పెర్మిక్ ఫైలోజెనిటిక్ గ్రూపు)

 ఇతర వర్గీకరణ విధానాలు
 

సాంఖ్యక వర్గీకరణ శాస్త్రం:  * గణిత శాస్త్ర పద్ధతులను ఉపయోగించి వర్గీకరణ సముదాయాల మధ్య ఉండే విభేదాలు, పోలికలను లెక్కించడానికి ఉపయోగిస్తారు.
కంప్యూటర్‌ను ఉపయోగించి వీలైనన్ని ముఖ్య లక్షణాలన్నింటి మీద ఆధారపడి సాంఖ్యక వర్గీకరణ శాస్త్రాన్ని సులభంగా అధ్యయనం చేయవచ్చు.
* ఈ పద్ధతిలో అన్ని లక్షణాలకు సంఖ్య, సంకేతాలను నిర్ణయించి, తర్వాత సమాచారాన్ని క్రమపద్ధతిలో విశ్లేషిస్తారు.
* ప్రతి లక్షణానికి సమాన ప్రాధాన్యమిస్తూ అదే సమయంలో వందలాది లక్షణాలను పరిగణించవచ్చు.

కణాధార వర్గీకరణ శాస్త్రం: వర్గీకరణ సమస్యలను పరిష్కరించడంలో క్రోమోజోమ్‌ల సంఖ్య, నిర్మాణం లాంటి కణ లక్షణాలను ఉపయోగించే వర్గీకరణ శాస్త్ర శాఖ. 
రసాయన వర్గీకరణ శాస్త్రం: వర్గీకరణ సమస్యలను పరిష్కరించడంలో మొక్కల్లో ఉండే రసాయన పదార్థాల సమాచారాన్ని ఉపయోగించే వర్గీకరణ శాస్త్ర శాఖ.

Posted Date : 13-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌